రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
జాతీయ రహదారుల సుస్థిర నిర్మాణంలో వినూత్న విధానాల కోసం నిర్వహించిన వర్క్‌షాప్‌నకు అధ్యక్షత వహించిన నితిన్ గడ్కరీ
ఆటంకాల్లేని పట్టణ అనుసంధానం కోసం
రింగ్ రోడ్లు, బైపాస్‌ల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి: నితిన్ గడ్కరీ
Posted On:
03 SEP 2025 3:17PM by PIB Hyderabad
భారతదేశంలో మౌలిక సదుపాయాలను పెంచటం, పట్టణ రవాణాను మెరుగుపరిచే విషయంలో ముందడుగు పడింది. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ఈ రోజు ఢిల్లీలో నిర్వహించిన సంప్రదింపుల వర్క్‌షాప్‌కు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి శ్రీ అజయ్ తమ్తా, శ్రీ హర్ష్ మల్హోత్రా, రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
వేగంగా అభివృద్ధి చెందుతోన్న పట్టణ ప్రాంతాల్లో రద్దీని తగ్గించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ప్రపంచ స్థాయి, సుస్థిర, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న రవాణా మౌలిక సదుపాయాలను సృష్టించడంపై ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను ఈ వర్క్‌షాప్ ప్రధానంగా తెలియజేసింది. నగరంలోని ప్రధాన ప్రాంతాల నుంచి ట్రాఫిక్‌ను మళ్లించేందుకు రింగ్ రోడ్లు, బైపాస్‌లను నిర్మించటం.. తద్వారా పట్టణాల్లోని జాతీయ రహదారులపై రద్దీని తగ్గించడం వంటి అనేక వినూత్నమైన విధానపర జోక్యాలపై ప్రముఖులు చర్చించారు.
నిధుల లభ్యత స్థిరంగా ఉండేలా చూసుకునేందుకు విలువాధారంగా నిధులను ఉపయోగించుకునే ఫైనాన్సింగ్ నమూనాలను అమలు చేయటం, ఆటంకం లేని ఏకీకరణ కోసం నగర మాస్టర్ ప్లాన్లకు అనుగుణంగా మౌలిక సదుపాయాల అభివృద్ధిని చేపట్టటంపై కూడా ఈ కీలక చర్చలు దృష్టి సారించాయి. ఈ చర్యలు పట్టణ రవాణాను మెరుగుపరచటమే కాకుండా రింగ్ రోడ్లు, బైపాస్‌ల వల్ల లబ్ధి పొందే ప్రాంతాల్లో ప్రణాళికాబద్ధమైన, నియంత్రిత అభివృద్ధిని ప్రోత్సహిస్తాయన్న అంచనా ఉంది.
ఈ కార్యక్రమాలతో ఆర్థిక వృద్ధిని పెంచటం, అనుసంధానతను మెరుగుపరచటం, పర్యావరణానికి సంబంధించి బాధ్యతతో కూడిన సమ్మిళితమైన పట్టణాభివృద్ధికి పునాది వేయడానికి రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ తన అంకితభావాన్ని పునరుద్ఘాటించింది.


***
(Release ID: 2163444)
Visitor Counter : 2