ప్రధాన మంత్రి కార్యాలయం
బీహార్ రాష్ట్ర జీవనోపాధి నిధి సహకార రుణ పరపతి సమాఖ్య లిమిటెడ్ ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Posted On:
02 SEP 2025 3:52PM by PIB Hyderabad
బీహార్ ప్రజలకు అభిమానపాత్రులైన ముఖ్యమంత్రి శ్రీ నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రులు శ్రీ సామ్రాట్ చౌదరి, శ్రీ విజయ్ కుమార్ సిన్హా, ఇతర ప్రముఖులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న లక్షలాది సోదరీమణులారా... మీకందరికీ హృదయపూర్వక వందనం!
ఈ ప్రసంగం సందర్భంగా నా ముందున్న టీవీ తెరపై లక్షల సంఖ్యలో సోదరీమణులు కనిపిస్తున్నారు. ఈ భారీ కార్యక్రమం వేడుక రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో సాగుతుండటమే ఇందుకు కారణం కావచ్చు. నిజంగా ఇదొక అద్భుత దృశ్యం... ఇంత పెద్ద సంఖ్యలో తల్లులు, సోదరీమణుల ఆశీస్సులు లభించడంకన్నా జీవితంలో గొప్ప అదృష్టం మరేముంటుంది.
మిత్రులారా!
ఇవాళ మంగళవారం... ఇలాంటి రోజున ఓ శుభ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఆనందదాయకం. బీహార్‌లోని అమ్మలు.. చెల్లెమ్మలకు ‘రాష్ట్ర జీవనోపాధి నిధి సహకార రుణ పరపతి సమాఖ్య’ రూపంలో ఓ కొత్త పథకం అందుబాటులోకి వస్తోంది. ప్రతి గ్రామంలో ఈ సహకార సంస్థతో అనుసంధానమయ్యే చెల్లెమ్మల జీవనోపాధికి ఇకపై సులువుగా ఆర్థిక సహాయం లభిస్తుంది. వారు ఇప్పటికే చేస్తున్న పని లేదా వ్యాపారం మరింత విస్తరించడానికి ఇది తోడ్పడతుంది. ఈ జీవనోపాధి నిధి వ్యవస్థ పూర్తిగా డిజిటల్ రూపంలో అమలు కానుండటం నాకెంతో సంతోషం కలిగిస్తోంది. మీరు ఎవరి దగ్గరకూ వెళ్లాల్సిన అవసరం ఉండదు. మీ ఫోన్ సాయంతోనే అన్ని పనులూ పూర్తవుతాయి. జీవనోపాధి సహకార సంస్థలో సభ్యులు కాబోతున్న అమ్మలు.. చెల్లెమ్మలకు నా అభినందనలు. ఈ అద్భుతమైన పథకం రూపొందించిన శ్రీ నితీష్ కుమార్‌తోపాటు రాష్ట్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తున్నాను.
మిత్రులారా!
దేశంలోని మహిళలందరికీ సాధికారత లభిస్తేనే వికసిత భారత్ రూపొందుతుంది. ఆ దిశగా వారి జీవిత గమనంలో ఎదురయ్యే అన్నిరకాల అవరోధాలను తొలగించడం చాలా ముఖ్యం. ఈ క్రమంలో అమ్మలు.. చెల్లెమ్మల జీవన సౌలభ్యం లక్ష్యంగా మేం అనేక కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తున్నాం. ఇందులో భాగంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కోట్లాది పక్కా ఇళ్లు నిర్మించడంతోపాటు యజమాన్య హక్కును సాధ్యమైనంత వరకూ వారి పేరిటే నమోదు చేయించాం. ఒక మహిళ ఇంటి యజమాని అయితే, కుటుంబంలో ఆమె మాటకు మరింత విలువ ఉంటుంది. అలాగే బహిరంగ విసర్జన నుంచి విముక్తి కల్పిస్తూ కోట్లాది మరుగుదొడ్లను నిర్మించడం ద్వారా వారి ఆత్మగౌరవాన్ని నిలిపాం.
అమ్మలు… చెల్లెమ్మల్లారా!
సురక్షిత తాగునీటి లభ్యత సమస్యను పరిష్కరించేందుకు మేం ‘ఇంటింటికీ నీరు’ (హర్ ఘర్ జల్) పథకం అమలు చేశాం. అమ్మలు.. చెల్లెమ్మల ఆరోగ్య పరిరక్షణ కోసం ఏటా రూ.5 లక్షల విలువైన ఉచిత చికిత్స సదుపాయంతో ‘ఆయుష్మాన్ యోజన’ను అమలు చేస్తున్నాం. వీటన్నిటితోపాటు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఆహారధాన్యాలు సరఫరా చేసే పథకాన్ని కూడా నిర్వహిస్తోంది. దీనివల్ల బిడ్డల ఆకలి బాధను చల్లార్చడం కోసం ఆవేదన పడే తల్లులకు ఊరట లభించింది. మహిళల ఆదాయం పెంపు దిశగా “లక్షాధికారి సోదరి, డ్రోన్ సోదరి, బ్యాంకు సఖి” వంటి పథకాల్లో భాగస్వాములను చేశాం. అమ్మలు.. చెల్లెమ్మల సేవకు మేం తలపెట్టిన మహా యజ్ఞంలో వీటన్నిటితోపాటు ఇవాళ ప్రకటించిన పథకం కూడా ఒక భాగం. రాష్ట్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం వేగంగా అమలు చేస్తుందని ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాను.
మిత్రులారా!
బీహార్ అంటే మాతృశక్తిని పూజించే నేల... తల్లిని గౌరవించే సంప్రదాయానికి సదా అత్యంత ప్రాధాన్యమిచ్చే నేల. గంగామాత, కోసీమాత, గండకీమాత, పున్పున్ మాత... ఇలా నదీమ తల్లులంతా ఇక్కడ పూజలందుకుంటారు. జానకీ మాత ఈ భూమి పుత్రికేనని మనమంతా సగర్వంగా చెబుతుంటాం. బీహార్ సంస్కృతిలో పుట్టి పెరిగిన ఆమె, ఈ ప్రాంతానికి సీతాపుత్రిక అయితే, ప్రపంచానికి సీతామాత. అలాగే ఉషాదేవి (ఛటీ మాత)కి వందనమాచరిస్తూ మనమంతా ధన్యులమవుతాం. కొన్ని రోజుల తర్వాత పవిత్ర నవరాత్రి పర్వం ప్రారంభం అవుతుంది. ఈ పర్వదినాల్లో దేశవ్యాప్తంగా నవ దుర్గలను పూజిస్తారు. దుర్గామాత రూపాలు తొమ్మిది... కానీ, బీహార్‌తోపాటు పుర్బియా ప్రాంతంలో ఏడుగురు సోదరీమణుల పూజా సంప్రదాయం తరతరాలుగా కొనసాగుతోంది. ఈ సంప్రదాయం వారిని తల్లిగా భావించి పూజిస్తుంది. ఈ విధంగా తల్లిపై భక్తి, విశ్వాసాలకు బీహార్ ఒక ప్రతీక. తల్లి సుఖదుఃఖాలను తనకే పరిమితం చేసుకుంటూ అందరినీ సురక్షితంగా ఉంచుతుంది. మనం వారి కన్నీళ్ల విస్మరిస్తే, అది ఎంతమాత్రం మంచిది కాదు.. ఈ ప్రపంచంలో తల్లిని మించి మనకు ప్రియమైన వారెవరూ ఉండరు!
మిత్రులారా!
తల్లి ఆత్మగౌరవం, ఆమె మర్యాద మా ప్రభుత్వానికి అత్యంత ప్రధానం. అమ్మే మన ప్రపంచం.. అమ్మే మన ఆత్మగౌరవం. ఇంత గొప్ప సంప్రదాయంగల బీహార్‌లో కొన్ని రోజుల కిందటి సంఘటనను నేనెన్నడూ ఊహించలేదు. ఇక్కడి నా సోదరీసోదరులు కూడా ఊహించి ఉండరు. ఆ మాటకొస్తే- ఈ దేశంలో ఎవరూ కలలోనైనా ఊహించి ఉండరు. బీహార్‌లో ఆర్జేడీ-కాంగ్రెస్ వేదిక మీదినుంచి నా తల్లిని దూషించారు. ఈ దూషణలతో కలిగిన అవమానం నా తల్లికి మాత్రమే పరిమితం కాదు... దేశంలోని తల్లులు, సోదరీమణులు, కుమార్తెలందరినీ చుట్టుముట్టింది. ఈ దూషణలు చూసిన, విన్న మీరందరూ- బీహార్‌లోని ప్రతి తల్లి, ప్రతి కుమార్తె, ప్రతి సోదరుడు... ఎంత బాధపడి ఉంటారో నేను ఊహించగలను! నా హృదయం ఎంత గాయపడిందో అంతగా నా బీహార్ ప్రజలు కూడా బాధపడుతున్నారని నాకు తెలుసు. ఈ నేపథ్యంలో నేనివాళ బీహార్‌లోని లక్షలాది అమ్మలు.. చెల్లెమ్మలను చూస్తున్న ఈ సమయంలో మీరు-నేను ఎక్కడెక్కడో ఉన్నా నేను ఒక కొడుకునే. ఇంతమంది తల్లులు, సోదరీమణుల సమక్షంలో నా మనసులోని బాధను మీతో పంచుకుంటున్నాను. మీ అందరి ఆశీర్వాదంతో నేనెంతటి బాధనైనా భరించగలను.
అమ్మలు… చెల్లెమ్మల్లారా!
నేను దాదాపు 50-55 ఏళ్లుగా సమాజానికి, దేశానికి సేవ చేస్తున్నానే వాస్తవం మీకందరికీ తెలిసిందే! రాజకీయాల్లోకి చాలా ఆలస్యంగా వచ్చినా, సమాజం కోసం చేయగలిగినదంతా చేయడానికి ప్రయత్నించాను. అనునిత్యం.. అనుక్షణం నా దేశం కోసం, నా ప్రజల కోసం శక్తివంచన లేకుండా ఎక్కడెక్కడ.. ఏమేమి చేయగలనో పూర్తి అంకితభావంతో, శ్రద్ధతో… ముఖ్యంగా నా తల్లి ఆశీస్సులతో కృషి చేశాను. ఒక్కమాటలో చెబితే- నేను చేసిన కృషిలో నా తల్లిదే కీలకపాత్ర. భరతమాతకు సేవ చేయాలన్న నా కర్తవ్యాన్ని గుర్తించి, నాకు జన్మనిచ్చిన నా తల్లి నన్ను అన్ని బాధ్యతల నుంచి విముక్తుణ్ని చేసింది.
ఆ విధంగా దేశంలోని లక్షలాది తల్లుల, కోట్లాది పేదల సేవ కోసం వెళ్లమని నన్ను ఆశీర్వదించింది. ఆ తల్లి దీవెనలతో కర్తవ్య దీక్షతో బయల్దేరాను… దేశ సేవ చేస్తానంటే ఆశీర్వదించిన అటువంటి తల్లికి అవమానం కలిగిన బాధను నేనిప్పుడు భరిస్తున్నాను. ప్రతి తల్లి తన కొడుకు పెద్దవాడై వృద్ధాప్యంలో తనకు అండగా నిలవాలని కోరుకుంటుంది. కానీ, నా తల్లి నాతో ఆత్మీయ బంధాన్ని వదులుకుని, దేశ సేవకు అనుమతించింది. ఇది ఆమె కోసం కాదు… మీలాంటి లక్షలాది మంది తల్లులకు సేవ చేయడం కోసమే. ఇప్పుడా తల్లి భౌతికంగా ఈ లోకంలో లేదన్న నిజం మీకందరికీ తెలుసు. ఆమెకు 100 సంవత్సరాలు పూర్తయ్యాక ఇహలోకాన్ని వీడి పరలోకానికి వెళ్లిపోయింది. ఆమెకు రాజకీయాలతో సంబంధం లేదు.. భౌతికంగానూ ఆమె ఈ భూమ్మీద లేదు.. అయినప్పటికీ ఆర్జేడీ-కాంగ్రెస్ వేదిక పైనుంచి ఆమె దుర్భాషలకు గురైంది. నేను అనుభవిస్తున్న ఆ బాధను మీ వదనాల్లో ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను. మీరు కూడా ఎంతో బాధపడ్డారు.. కొందరి కళ్ళలో నీళ్లు తిరగడం కూడా నాకు కనిపిస్తోంది. ఇది చాలా బాధాకరం… ఎంతో వేదన కలిగించే ఉదంతం… ఇంతకూ నా తల్లి ఏం తప్పు చేసిందని ఆమెను అంతగా దూషించారు?
మిత్రులారా!
ప్రతి తల్లీ తన బిడ్డలను ప్రయోజకులను చేయడం కోసం ఎన్నెన్నో త్యాగాలు చేస్తుంది. ఇవాళ నేను చూస్తున్న ప్రతి తల్లి కూడా అదే అంకితభావంతో, తపస్సుతో బిడ్డలను పెంచిపెద్ద చేసి ఉంటారు. అందుకే, తల్లిని మించిన అమూల్య సంపద బిడ్డలకు మరొకటి ఉండదు. నా చిన్నతనం నుంచీ నా తల్లిని ఇదే రూపంలో చూస్తూ వచ్చాను. తీవ్ర పేదరికంలో అనేక కష్టాలు భరిస్తూ- మా కుటుంబంలో అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు.. అందర్నీ పెంచింది. వర్షాకాలంలో పైకప్పు నుంచి పడే నీటిచుక్కలతో రాత్రివేళ పిల్లల నిద్రకు భంగం కలగకుండా ఎంతో తాపత్రయ పడేది. అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ ఎవరికీ తెలియనిచ్చేది కాదు… ఒకవైపు పనిపాటలకు వెళ్తూ కూడా ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉండేది. తాను ఒక్క రోజు విశ్రాంతి తీసుకుంటే- పిల్లలందరికీ ఇబ్బంది తప్పదని ఆమెకు తెలుసు. చివరకు తన కష్టమేమిటో నాన్నకు కూడా తెలియనీయలేదు. పిల్లలకు ఓ జత దుస్తులు కొనాలని పైసాపైసా కూడబెట్టడమే తప్ప, తన కోసం ఓ కొత్త చీర కొనుక్కోవడం నేనెప్పుడూ చూడలేదు. నేనిప్పుడు నా తల్లి గురించి మాట్లాడుతున్నాను గానీ, నా దేశంలోని కోట్లాది తల్లులు ఇలాగే తపస్సు చేస్తుంటారు. ఇప్పుడు నా ముందు కనిపిస్తున్న అమ్మలు.. చెల్లెమ్మలంతా కూడా ఇదేవిధంగా శ్రమిస్తుంటారని నాకు తెలుసు. ఒక పేద తల్లి జీవితాంతం ఇలాగే ఎన్ని కష్టాలు పడినా, పిల్లలకు చదువుసంధ్యలతోపాటు ఉన్నత విలువలు నేర్పుతుంది. అందుకే, తల్లి స్థానం దేవుడికన్నా ఉన్నతమైనదిగా మనం పరిగణిస్తాం. ఆ మేరకు బీహార్ విలువలు, ప్రతి బిహారీ తల్లి స్థానం దేవుళ్లకన్నా, పూర్వీకులకన్నా ఉన్నతమని సంప్రదాయం చెబుతుంది. ఎందుకంటే- మాతృదేవత ఎప్పుడూ తన పిల్లల వెంట నీడలా ఉండి వారిని పెద్దవారిని చేస్తుంది. తానెన్ని బాధలు పడినా ప్రపంచానికి తెలియనివ్వలేదు. తల్లి లేనిదే జీవితం ముందుకు నడవదు… అందుకే తల్లులు గొప్పవారు!
అందుకే మిత్రులారా!
కాంగ్రెస్-ఆర్జేడీ వేదిక పైనుంచి నా తల్లిపై వినిపించిన దూషణలు, దుర్భాషలు ఆమెకు మాత్రమే పరిమితం కాదు… దేశంలోని కోట్లాది తల్లులు, సోదరీమణులకూ అవమానకరం!
మిత్రులారా!
రాచకుటుంబాల్లో జన్మించిన ఈ యువరాజులకు పేద తల్లి త్యాగాలు, ఆమె కొడుకు బాధ అర్థం కావు. నోటిలో వెండి చెంచాతో జన్మించిన ఈ సంపన్నులు దేశంలో, బీహార్ రాష్ట్రంలో అధికారం తమ కుటుంబ వారసత్వమని నమ్ముతారు. అధికార పీఠమే వారి లక్ష్యం! కానీ, మీతోపాటు దేశ ప్రజలంతా ఒక పేద తల్లి బిడ్డను ఆశీర్వదించి, తమ ప్రధాన సేవకుడుగా ఎంచుకున్నారన్న నిజాన్ని వీళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక వెనుకబడిన లేదా అత్యంత వెనుకబడిన వ్యక్తి ఎదగడాన్ని కాంగ్రెస్ ఎప్పుడూ సహించలేదు! పనిచేసే వాళ్లను నిందించడం తమ హక్కుగా వారు భావిస్తారు. కాబట్టి, నిత్యం వారు ఇదే పని చేస్తుంటారు.
అమ్మలు… చెల్లెమ్మల్లారా!
ఆ విధంగా వాళ్లు నన్ను ఎన్నో రకాలుగా దూషించడం మీరంతా వినే ఉంటారు. దుర్భాషలాడే వారి జాబితా ఎంత పొడవుగా ఉంటుందంటే- వారిలో ఏ పెద్ద నాయకుడూ దూషణల్లో ఎన్నడూ వెనుకబడరు. ఈ ద్వేషం, ఈ పెద్దింటి అహంకారం ఒక కార్మికుడిపై దూషణ రూపంలో ఎప్పుడూ బయటపడుతూనే ఉంటుంది. కొన్నిసార్లు వాళ్లు చాలా నీచంగా సంబోధిస్తారు. మురుగు కాలువలో పురుగుతో పోలుస్తారు... నన్ను విషసర్పం అంటారు… అదే క్రమంలో బీహార్ ఎన్నికల సందర్భంగా నన్ను దూషించడం ద్వారా వారి ఆలోచన ధోరణి ఏమిటో మళ్లీమళ్లీ మీరు గ్రహిస్తూనే ఉన్నారు. ఇటువంటి వైఖరిగల వారు ఇప్పుడు కీర్తిశేషురాలైన నా తల్లిని దూషించడం ప్రారంభించారు. ఆమె ఈ లోకంలో లేకపోయినా, రాజకీయాలతో ఆమెకు ఏ సంబంధం లేకపోయినా తమ వేదికల పైనుంచి దుర్భాషల్ని కొనసాగిస్తున్నారు.
మిత్రులారా!
తల్లులను, సోదరీమణులను దూషించే మనస్తత్వం గలవారు మహిళలను బలహీనులుగా భావిస్తారు. వారిని దోపిడీకి, అణచివేతకు గురిచేస్తారు. అందుకే, ఇలాంటివారు అధికారంలోకి వచ్చినప్పుడల్లా- తల్లులు, సోదరీమణులు, కుమార్తెలు ఎక్కువగా బాధలు పడాల్సి వచ్చింది. బీహార్‌లోని నా తల్లులు, సోదరీమణులకన్నా ఈ వాస్తవాన్ని ఎవరు చక్కగా అర్థం చేసుగలరు! ఆర్జేడీ ప్రభుత్వ పాలన సమయాన బీహార్‌లో నేరాలు, నేరస్థుల ఆధిపత్యం కొనసాగినపుడు హత్యలు, అపహరణలు, అత్యాచారాలు నిత్యసత్యాలు. దుష్కృత్యాలకు బలైనవారిని కాకుండా నాటి ప్రభుత్వం హంతకులను, అత్యాచారాలకు పాల్పడే దుండగులను రక్షించేది. నా బీహార్ తల్లులు, కుమార్తెలు, సోదరీమణులు… మొత్తంగా మహిళా లోకం ఎన్నో వేధింపులు భరించాల్సి వచ్చింది. మహిళలు తమ ఇంటినుంచి బయటకొస్తే రక్షణ లేదు. బయటికెళ్లిన భర్తలు, కుమారులు సాయంత్రానికి క్షేమంగా తిరిగి వస్తారన్న నమ్మకం ఆ తల్లులకు ఉండేది కాదు! ఎప్పుడు తమ కుటుంబం నాశనమైపోతుందో… అపహరణకు పాల్పడే దుండగుల నుంచి తమవారిని విడిపించడానికి నగానట్రా అమ్ముకోవాల్సి వస్తుందోనన్న ఆందోళనతో సతమతం అయ్యేవారు. ఏదో దుండగుల గుంపు.. ఏ ఇంటినుంచి.. ఎవరిని కిడ్నాప్ చేస్తుందో, వైవాహిక జీవితం నాశనమైపోతుందేమో… అనే భయం ప్రతి మహిళనూ అనుక్షణం వెంటాడే దుస్థితి ఉండేది! సుదీర్ఘ పోరాటం తర్వాత బీహార్ ఆ చీకటి రోజుల నుంచి విముక్తమైంది. అటువంటి ఆటవిక ఆర్జేడీ సర్కారును మట్టి కరిపించడంలో బీహార్‌లోని మహిళలందరూ చాలా కీలకపాత్ర పోషించారు. అందుకే, అటు ఆర్జేడీ.. ఇటు కాంగ్రెస్ ఇవాళ బీహార్ మహిళలను చూసి ఉలిక్కిపడుతున్నారు. రాష్ట్రంలోని ప్రతి మహిళ వారి ఉద్దేశాలను అర్థం చేసుకోవాలి. వీరంతా మీపై ప్రతీకారానికి సిద్ధంగా ఉన్నారు. తమకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినందుకు మిమ్మల్ని శిక్షించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు.
మిత్రులారా!
మహిళలు ముందంజ వేయడాన్ని ఆర్జేడీ వంటి పార్టీలు ఎన్నడూ సహించవు. అందుకే వారు మహిళా రిజర్వేషన్లను కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన మహిళ ముందడుగు వేస్తే వారిలో నిరాశా నిస్పృహలు స్పష్టమయ్యాయి. అందుకే, శ్రీమతి ద్రౌపది ముర్ము వంటి గిరిజన పేదింటి బిడ్డ రాష్ట్రపతి కావడాన్ని జీర్ణించుకోలేని కాంగ్రెసు పార్టీ నిరంతరం ఆమెను అవమానిస్తూనే ఉంది.
మిత్రులారా!
మహిళలపై ద్వేషం వెళ్లగక్కే, ధిక్కార రాజకీయాలకు పాల్పడే శక్తులను అరికట్టడం అవసరం. వారెలాంటి భాష మాట్లాడుతున్నారో దేశ ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి!
అమ్మలు.. చెల్లెమ్మల్లారా!
నేటినుంచి 20 రోజుల తర్వాత నవరాత్రి పర్వదినాలు ప్రారంభమవుతాయి. అటుపైన 50 రోజుల తర్వాత, ఛటీమాతను పూజిస్తూ. ఛాఠ్ పండుగ చేసుకుంటారు. ఈ సందర్భంగా బీహార్ ప్రజలకు నాదొక విజ్ఞప్తి. తన తల్లిని దూషించిన వాళ్లను మోదీ ఒక్కసారి క్షమిస్తాడు. కానీ, తల్లిని అవమానించడాన్ని భారతదేశం ఎన్నడూ సహించదు. కాబట్టి, మాతృదూషణకు పాల్పడిన ఆర్జేడీ, కాంగ్రెసు.. సప్తవాహిని మాతలకు, ఛటీ మాతకు క్షమాపణ చెప్పితీరాలి!
మిత్రులారా!
ఈ అవమానానికి బాధ్యత వహించాల్సింది ఎవరో నిర్ధారించుకోవడం బీహార్‌లోని ప్రతి బిడ్డ బాధ్యతని నేను బీహార్ ప్రజలకు చెబుతున్నాను. ఆర్జేడీ, కాంగ్రెస్ నాయకులు ఎక్కడికి వెళ్ళినా, ఏదైనా నగరానికి లేదా వీధిలోకి వచ్చినా అన్ని వైపుల నుంచీ ఒకేవిధమైన నిరసన గళం వినిపించాలి. ప్రతి తల్లి, సోదరి రంగంలో దిగి, వారి సంజాయిషీ కోరాలి. ప్రతి వీధి, ఇరుగుపొరుగు ప్రాంతాల నుంచి నిరసన గళం వినిపించాలి. తల్లిని దూషించడాన్ని మేం సహించం… ఎంతమాత్రం భరించం… ఏమాత్రం అనుమతించం… మహిళల ఆత్మగౌరవంపై దాడిని అంగీకరించం అని స్పష్టం చేయాలి. ఆర్జేడీ దురాగతాలను సహించేది లేదని ఎలుగెత్తి చాటాలి. తల్లిపై కాంగ్రెస్ దాడిని ఎంతమాత్రం సహించ… భరించబోమని తెలియజెప్పాలి. తల్లిని అవమానించడాన్ని సహించేది లేదని కుండబద్దలు కొట్టాలి.
మిత్రులారా!
దేశ మహిళల సాధికారతే మా ప్రభుత్వ అగ్ర ప్రాథమ్యం. వారి జీవితాల్లో ఇబ్బందులను తగ్గించడానికి ఎన్‌డీఏ ప్రభుత్వం నిర్విరామంగా కృషి చేస్తోంది. తల్లులు.. సోదరీమణులారా, నేనిదే మీకు హామీ ఇస్తున్నాను.. మేము ఒక క్షణమైనా విశ్రాంతి లేకుండా, నిత్యం మీకు సేవ చేస్తూనే ఉంటాం. దేశంలోని ప్రతి తల్లికీ నా వందనం… రాష్ట్రంలో మీరందరూ ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. ఇవాళ నా విజ్ఞప్తి ఒకటి మళ్లీ గుర్తుకొస్తోంది. ఆగస్టు 15న ‘ఇంటింటా… వీధివీధినా త్రివర్ణ పతాకం’ (ఘర్-ఘర్ తిరంగా, హర్ ఘర్ తిరంగా) అనే మంత్రం వినిపించాం. ఈ నేపథ్యంలో ఇంటింటా స్వదేశీ… ప్రతి ఇంటా స్వదేశీ’ (హర్ ఘర్ స్వదేశీ.. ఘర్-ఘర్ స్వదేశీ) నేటి నినాదం. ఈ మంత్రంతో దేశాన్ని స్వయం సమృద్ధం చేయడానికి మీ ఆశీస్సులివ్వాలని తల్లులు, సోదరీమణులకు నా వినతి. అలాగే ప్రతి దుకాణదారుకూ నా విజ్ఞప్తి ఏమిటంటే- ‘ఇక్కడ స్వదేశీ వస్తువులు లభించును’ అని ఒక బోర్డు పెట్టండి. ఈ వస్తువు స్వదేశీ అని సగర్వంగా చెబుతూ విక్రయించాలి. స్వయంసమృద్ధ భారత్ దిశగా మనం బలమైన రీతిలో ముందంజ వేయాలి. తల్లులు, సోదరీమణుల ఆశీస్సులు లేనిదే ఈ దిశగా నా కృషి ఫలించదు. మీ ఆశీర్వాదం లేకుండా భరతమాత ఉజ్వల భవిష్యత్తు అసాధ్యం. అయితే, ఘనమైన ఇంటిపేరున్న ప్రముఖులు ఏమంటున్నారో తెలుసా? వారూ అడుగుతూనే ఉన్నారు.. కాకపోతే, భరతమాత అంటే ఏమిటి? అన్నదే వారి ప్రశ్న. భరతమాతనే దూషించేవారికి మోదీ తల్లిని దుర్భాషలాడటం పెద్ద కష్టమేమీ కాదు. అందుకే అలాంటి వారి గురించి అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యం.
అమ్మలు.. చెల్లెమ్మల్లారా!
నా ముందున్న లక్షలాది తల్లులు.. సోదరీమణుల ఆశీర్వాదం నాకు సదా లభించాలి. ఇవాళ ఇంతమంది ముందు నిలుచున్న నేపథ్యంలో నా మనసులోని బాధను, ఆవేదనను మీ ముందుంచాను. నాకు ఎంతటి దుఃఖాన్నైనా భరించగల శక్తినిచ్చేది తల్లులు.. సోదరీమణుల ఆశీస్సులే. ఏదేమైనా, భౌతికంగా మన మధ్యలేని, ఎవరి నుంచీ ఏమీ ఆశించని, రాజకీయాలతో సంబంధం లేని తల్లి చేసిన తప్పేమిటి? అలాంటి తల్లిని దూషిస్తే భరించలేనంత బాధ, ఆవేదన కలగవా? అందుకే, తల్లులు.. సోదరీమణులారా! ఒక కొడుకుగా, ఒక సోదరుడుగా మీ ముందుకు వచ్చిన నాకు మీ దీవెనలతో ఆ బాధ కాస్త ఉపశమించింది. మీ ఆశీర్వాదాలు ఎలాంటి అణచివేతనైనా భరించగల కొత్త శక్తినిస్తాయనే విశ్వాసం నాకుంది. అటువంటి ప్రతి అణచివేతను దీటుగా ఎదుర్కొంటూ తల్లులు.. సోదరీమణులకు సేవ చేయగల కొత్త శక్తిని, ప్రేరణను మీ ఆశీస్సులు ప్రసాదిస్తాయని నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఇక నా ప్రసంగాన్ని ముగిస్తూ- మీ కందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.
***
(Release ID: 2163251)
|