వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
‘భారత్ బిల్డ్‌కాన్- 2026’ సన్నాహక కార్యక్రమాన్ని ప్రారంభించిన వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్
ఏకపక్ష చర్యల నుంచి పరిశ్రమల రక్షణకు కట్టుబడి ఉన్న ప్రభుత్వం
గతేడాదిని మించి ఈ యేడు మన ఎగుమతులు: శ్రీ పీయూష్ గోయల్
‘లోపాల్లేని, ఉద్గార రహిత (జీరో డిఫెక్ట్, జీరో ఎఫెక్ట్)’, ‘తక్కువ వ్యయం, అధిక విలువ (దామ్ కమ్, దమ్ జ్యాదా)’ అన్న ప్రధాని పిలుపును చాటిన శ్రీ గోయల్
వికసిత భారత్ వాణిజ్యం వల్లనే అభివృద్ధి చెందిన దేశాలతో ఇటీవలి ఎఫ్‌టీఏలు, పలు దేశాల గ్రూపులతో చర్చల్లో వేగం: శ్రీ గోయల్
భారత్ సామర్థ్యాన్ని కొందరు నిపుణులు, మీడియా సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు: శ్రీ గోయల్
ఆస్ట్రేలియా మార్కెట్టును ఉపయోగించుకోవాలని భారత పరిశ్రమలకు పిలుపునిచ్చిన శ్రీ గోయల్: ఇది గేమ్ చేంజర్‌గా నిలుస్తుందన్న కేంద్ర మంత్రి
Posted On:
29 AUG 2025 1:00PM by PIB Hyderabad
భారత్ బిల్డ్‌కాన్- 2026 సన్నాహక కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక ప్రముఖుల సమక్షంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్ ఈ రోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా శ్రీ పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. కొన్ని దేశాల ఏకపక్ష చర్యల వల్ల పరిశ్రమలు అనవసరమైన ఒత్తిడులు, ఇబ్బందులను ఎదుర్కోకుండా చూసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రత్యామ్నాయ మార్కెట్లు అవసరమయ్యే రంగాలను వివరించాలని పారిశ్రామిక ప్రతినిధులను ఆయన కోరారు. కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రపంచవ్యాప్తంగా భాగస్వాములను సంప్రదిస్తుందన్నారు. ప్రపంచవ్యాప్త భాగస్వాములను సంప్రదించి... కొత్త అవకాశాలను వాణిజ్య మంత్రిత్వ శాఖ అందిస్తుందని హామీ ఇచ్చారు.
ప్రపంచవ్యాప్త విస్తరణతోపాటు దేశీయ వినియోగాన్ని పెంచడం ప్రధానమైన అంశమన్నారు. డిమాండును సత్వరమే పెంచడంతోపాటు దేశీయ తయారీకి బలమైన ప్రోత్సాహాన్నిచ్చే చర్యలకు వచ్చే జీఎస్టీ మండలి సమావేశం వేదికవుతుందని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు.
అంతర్జాతీయ మార్కెట్లను చేరుకోవడంలో లేదా దేశీయ అవకాశాలను బలోపేతం చేసుకోవడంలో ఏ రంగం వెనుకబడిపోకుండా.. పరిశ్రమలకు చేయూతను ఇవ్వడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి చెప్పారు. క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్ (క్యూసీవో)లో క్రియాశీల భాగస్వామ్యం ద్వారా.. అత్యంత నాణ్యమైన ఉత్పత్తుల విశ్వసనీయ సరఫరాదారుగా భారత్ ఆవిర్భవిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.
అంతర్జాతీయంగా భారత్ స్థాయి ఎదుగుతున్న తీరును వివరిస్తూ.. ఈ ఏడాది ఎగుమతులు గతేడాది కన్నా అధికంగా ఉంటాయని, పెరుగుతున్న భారత పరిశ్రమల పోటీతత్వానికీ చైతన్యానికీ ఇది నిదర్శనమని శ్రీ గోయల్ ధీమా వ్యక్తం చేశారు.
‘లోపాల్లేని, ఉద్గార రహిత (జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్)’ తయారీ కోసం 2014 నుంచి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిస్తున్న విషయాన్ని ఉటంకిస్తూ.. భారత ఉత్పత్తులు తక్కువ వ్యయం, అధిక విలువ (దామ్ కమ్, దమ్ జ్యాదా)తో ఉండాలన్న ప్రధానమంత్రి స్వాతంత్ర్య దినోత్సవ సందేశాన్ని ఆయన గుర్తు చేశారు. మౌలిక సదుపాయాలు దేశాభివృద్ధికి కేంద్ర బిందువుగా కొనసాగుతున్నాయని గోయల్ పేర్కొన్నారు.
భారత్ సామర్థ్యాన్ని కొందరు నిపుణులు, మీడియా సరిగ్గా అర్థం చేసుకోవడం లేదని శ్రీ గోయల్ పేర్కొన్నారు. కొందరు విశ్లేషకులు దేశ సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేస్తున్నారనీ.. అదే సమయంలో భారతీయ పరిశ్రమల క్రియాశీలత, అంకుర సంస్థల బలం, ప్రజల విశ్వాసం దానికి భిన్నమైన కథనాన్ని ఆవిష్కరిస్తున్నాయని శ్రీ గోయల్ అభిప్రాయపడ్డారు. కోవిడ్-19, అణు ఆంక్షల వంటి సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొన్న భారత్.. నేడు అంతర్జాతీయ వాణిజ్యంలో తన వాటాను విస్తరించేందుకు సిద్ధంగా ఉంది.
ఆస్ట్రేలియాలో ఇళ్లకు కొరత విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. అక్కడ దాదాపు 10 లక్షల ఇళ్లు అవసరమవుతాయి. భారత్ నుంచి ఆర్థిక సహకారం, సాంకేతిక నైపుణ్యం, శ్రామిక శక్తిపరంగా సహకారాన్ని అందుకోవడానికి ఆస్ట్రేలియా సిద్ధంగా ఉందని పేర్కొంటూ.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా భారతీయ వ్యాపారవేత్తలు, కార్మికులు, నిపుణులను ఆయన ఆహ్వానించారు. భారతీయ నిపుణులు ఆస్ట్రేలియా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా శిక్షణ, ధ్రువీకరణ అవకాశాలను కూడా అందిస్తున్నారు. “ఈ అవకాశాన్ని చేజార్చుకుంటే మనల్ని మనమే నిందించుకోవాల్సి వస్తుంది” అని వ్యాఖ్యానించారు. భారతీయ నిర్మాణ, రంగాల్లో ఇది గేమ్ చేంజర్‌గా నిలిచే అవకాశం ఉందన్నారు.
ఆస్ట్రేలియా, యూఏఈ, స్విట్జర్లాండ్, నార్వే, లీచ్టెన్స్టెయిన్, ఐస్లాండ్, బ్రిటన్ వంటి అభివృద్ధి చెందిన దేశాలతో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (ఎఫ్‌టీఏ) వ్యవస్థను విస్తరించుకుంటున్నదీ, అలాగే ఐరోపా యూనియన్, తదితర దేశాలతో చర్చలు కొనసాగుతున్నాయని శ్రీ గోయల్ వెల్లడించారు. ఈ ఒప్పందాలు నిర్మాణ, ఉక్కు, అనుబంధ రంగాల వంటి భారతీయ పరిశ్రమలకు మరింత అంతర్జాతీయ అవకాశాలను అందిస్తాయని ఆయన పేర్కొన్నారు.
భారత్‌తో వాణిజ్య సంబంధాల విస్తరణకు అభివృద్ధి చెందిన దేశాలు ఎంతో ఆసక్తితో ఉన్నాయని శ్రీ గోయల్ పేర్కొన్నారు. ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వంటి దేశాలు మన దేశంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏ) కుదుర్చుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలిపారు. ఈ భాగస్వామ్యాలు భారత ఎగుమతి అవకాశాలు, అంతర్జాతీయ మార్కెట్ ఏకీకరణకు ప్రోత్సాహాన్నివ్వడమే కాకుండా.. పర్యావరణ హిత ఇంధనం, తయారీ సామర్థ్యాలను పెంచడంలో దేశం చేస్తున్న కృషికి తోడ్పాటునిస్తాయని వ్యాఖ్యానించారు.
గతేడాది భారత్ బిల్డ్‌కాన్‌ను విజయవంతంగా పూర్తిచేసిన నిర్వాహకులను అభినందించారు. అతి తక్కువ ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం ఇంతటి విజయాన్ని సాధించడం విశేషమని శ్రీ గోయల్ అన్నారు. అవసరమైతే ప్రభుత్వ సహకారం తీసుకుని భారత్ బిల్డ్‌కాన్- 2026ను స్వయం సమృద్ధ, పరిశ్రమ నేతృత్వ కార్యక్రమంగా నిలపాలని పారిశ్రామిక పెద్దలను ఆయన కోరారు.
2026 ఎడిషన్‌ను రాజధానికే పరిమితం చేయకుండా, దేశంలోని ఇతర ప్రాంతాలకూ తీసుకెళ్లి ఈ రంగం సామర్థ్యంపై అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. అన్ని అనుబంధ రంగాల నుంచి విస్తృత భాగస్వామ్యం ఉండేలా చూడాలని, గత భాగస్వాముల కోసం అభిప్రాయ సేకరణ యంత్రాంగాన్ని రూపొందించాలని, అంతర్జాతీయ భాగస్వాములు ఇందులో పాలుపంచుకునేలా చూస్తూ దీనిని నిజమైన ప్రపంచ వేదికగా నిలపాలని నిర్వాహకులను ఆయన కోరారు.
ఉక్కు, ఇనుప రంగాల్లో విస్తారమైన ఎగుమతి అవకాశాలున్నాయని కూడా ఆయన పేర్కొన్నారు. భారత్ ఏటా 15 మిలియన్ టన్నుల ఉక్కును ఎగుమతి చేయగలదనీ, అధిక నాణ్యతతోపాటు తక్కువ ధరల ఉత్పత్తులతో ఎగుమతులు బలోపేతమవుతాయని చెప్పారు.
“భారతదేశాన్ని కలిపే మౌలిక సదుపాయాలను నిర్మిద్దాం” అని శ్రీ గోయల్ అన్నారు. వికసిత భారత్@ 2047 దిశగా దేశం పయనిస్తున్న వేళ.. భారత్ బిల్డ్‌కాన్- 2026 భారత బలాన్ని, సృజనాత్మకతను, చైతన్యాన్ని, పోటీతత్వాన్ని చాటుతుందని పేర్కొంటూ ఆయన ప్రసంగాన్ని ముగించారు.
2026 ఏప్రిల్ 29 నుంచి మే 2 వరకు న్యూఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్‌లో జరగనున్న భారత్ బిల్డ్‌కాన్.. భవన నిర్మాణ, నిర్మాణ సామగ్రి పరిశ్రమలో భారత ప్రధాన అంతర్జాతీయ వేదికగా నిలుస్తోంది. 1 ట్రిలియన్ డాలర్లకు పైగా విలువ కలిగిన, లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న భారత భవన నిర్మాణ మార్కెట్ కోసం.. 37 రంగాల్లో దేశ సామర్థ్యాన్ని చాటేలా అన్నింటికీ ఒకే వేదికను ఈ కార్యక్రమం అందిస్తోంది. సిమెంటు, పింగాణి, పెంకులు, శానిటరీ పరికరాలు, పెయింట్స్, ఎలక్ట్రిక్, తదితర ఉత్పత్తులు ఇందులో భాగంగా ఉంటాయి.
అంతర్జాతీయ మార్కెట్లలో భారతీయ ఉత్పత్తులను ప్రోత్సహించడంలో, ఎగుమతులను పెంచడంలో, పెట్టుబడులను ఆకర్షించడంలో, భారత్‌ను విశ్వసనీయ అంతర్జాతీయ సరఫరాదారుగా నిలబెట్టడంలో ఈ ప్రదర్శన కీలక పాత్ర పోషిస్తుంది.
ఈ సన్నాహక కార్యక్రమం భారత్ బిల్డ్‌కాన్- 2026 వేగం ఊపందుకుంది. ఓ ప్రదర్శనగా మాత్రమే కాకుండా.. ఇది నిర్మాణ రంగంలో భారత అంతర్జాతీయ ఉనికిని బలోపేతం చేయడంలో వ్యూహాత్మక విజయ ప్రస్థానంగా నిలుస్తుందని, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందని భావిస్తున్నారు.
***
(Release ID: 2162855)
Visitor Counter : 2