ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధాని జపాన్ పర్యటన: కుదిరిన ఒప్పందాలు, ముఖ్యాంశాలు
Posted On:
29 AUG 2025 6:23PM by PIB Hyderabad
1. రాబోయే దశాబ్దా కాలానికి భారత్ - జపాన్ ఉమ్మడి లక్ష్యాలు
• ఆర్థిక భాగస్వామ్యం, ఆర్థిక భద్రత, రవాణా, పర్యావరణ సుస్థిరత, సాంకేతికత, ఆవిష్కరణ, ఆరోగ్యం, ప్రజా సంబంధాలూ జాతీయ – స్థానిక ప్రభుత్వాల భాగస్వామ్యం... ఎనిమిది రంగాల్లో ఆర్థిక, క్రియాత్మక సహకారం కోసం పదేళ్ల వ్యూహాత్మక ప్రాధాన్యం.
2. భద్రతా సహకారంపై ఉమ్మడి ప్రకటన
• మన ప్రత్యేక వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యానికి అనుగుణంగా ప్రస్తుత భద్రతా సవాళ్లను ఎదుర్కొనేలా మన రక్షణ, భద్రతా సహకారాన్ని అభివృద్ధి చేసుకునేలా సమగ్ర వ్యవస్థాగత ఏర్పాటు.
3. భారత్ - జపాన్ మానవ వనరుల వినిమయం కోసం కార్యాచరణ ప్రణాళిక
• భారత్, జపాన్ మధ్య ఇరువైపులా 5,00,000 మంది నిపుణుల వినిమయాన్ని ప్రోత్సహించేలా కార్యాచరణ ప్రణాళిక. ముఖ్యంగా నైపుణ్యం కలిగిన, పాక్షికంగా నైపుణ్యం కలిగిన 50,000 సిబ్బందిని వచ్చే అయిదేళ్లలో భారత్ నుంచి జపాన్‌కు పంపించడం.
4. ఉమ్మడి పరపతి యంత్రాంగంపై సహకార ఒప్పందం
• అకర్బనీకరణ సాంకేతికతలు, ఉత్పత్తులు, వ్యవస్థలు, మౌలిక సదుపాయాలను విస్తరణను సులభతరం చేసే విధానాన్ని రూపొందించడం. తద్వారా భారత్‌లో హరితగృహ వాయు ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలకు దోహదపడడం, భారత్‌లో జపాన్ పెట్టుబడులనూ దేశంలో సుస్థిరాభివృద్ధినీ ప్రోత్సహించడం.
5. భారత్ - జపాన్ డిజిటల్ భాగస్వామ్యం 2.0పై అవగాహన ఒప్పందం
• డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, డిజిటల్ ప్రతిభను ప్రోత్సహించడంతోపాటు ఏఐ, ఐవోటీ, సెమీ కండక్టర్ల వంటి భవిష్యత్ సాంకేతిక రంగాల్లో ఉమ్మడి పరిశోధన - అభివృద్ధిలో ద్వైపాక్షిక సహకారాన్ని ముందుకు తీసుకెళ్లేలా విధాన పత్రం.
6. ఖనిజ వనరుల రంగంలో సహకార ఒప్పందం
• కీలక ఖనిజాలకు సంబంధించి, సరఫరా వ్యవస్థలో క్రియాశీల సహకారాన్ని ముందుకు తీసుకెళ్లే మార్గాలను రూపొందించడం. ఇందుకోసం శుద్ధి చేసే సాంకేతికతలను అభివృద్ధి చేయడం, అన్వేషణ - మైనింగ్ కోసం ఉమ్మడి పెట్టుబడులు, కీలక ఖనిజాలను భారీగా నిల్వ చేసేందుకు కృషి చేయడం.
7. చంద్రుడి ధ్రువ ప్రాంత అన్వేషణ కోసం ఉమ్మడి ప్రయత్నాలకు సంబంధించి.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ మధ్య ఒప్పందం అమలు.
• చంద్రయాన్-5 మిషన్‌పై భారత్, జపాన్ మధ్య సహకారం కోసం నిబంధనలు, షరతులను నిర్దేశించే విధాన పత్రాన్ని రూపొందించడం ద్వారా, ఓ కీలక సహకారానికి ఆచరణాత్మక రూపాన్నివ్వడం.
8. శుద్ధ హైడ్రోజన్, అమ్మోనియాపై ఉమ్మడి ఉద్దేశ ప్రకటన
• హైడ్రోజన్/అమ్మోనియాపై పరిశోధన, పెట్టుబడి, ప్రాజెక్టుల అమలును ప్రోత్సహించడానికి, అలాగే అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల్లో అత్యాధునిక పరిశోధన, ఆవిష్కరణలను బలోపేతం చేసేలా విధానపత్రం.
9. సాంస్కృతిక వినిమయంపై సహకార ఒప్పందం
• ప్రదర్శనలు, మ్యూజియం స్థాయిలో సహకారం, సాంస్కృతిక పరిరక్షణ రంగంలో అత్యుత్తమ విధానాలను పరస్పరం పంచుకోవడం ద్వారా కళ, సాంస్కృతిక రంగంలో సహకారాన్ని ప్రోత్సహించే మార్గాన్ని రూపొందించడం.
10. వికేంద్రీకృత గృహ వ్యర్థ జల నిర్వహణపై అవగాహన ఒప్పందం
• వ్యర్థ జలాలను ప్రభావవంతంగా పునర్వినియోగించుకోవడంతోపాటు వికేంద్రీకృత వ్యర్థ జల నిర్వహణలో సహకారాన్ని ప్రోత్సహించేలా విధానపత్రం. ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ, సుస్థిరాభివృద్ధి కోసం అత్యంత కీలకమైనది.
11. పర్యావరణ సహకార రంగంలో సహకార ఒప్పందం
• కాలుష్య నియంత్రణ, వాతావరణ మార్పు, వ్యర్థాల నిర్వహణ, జీవవైవిధ్యాన్ని సుస్థిరంగా వినియోగించుకోవడం, పర్యావరణ సాంకేతికతల వంటి పర్యావరణ పరిరక్షణ సంబంధిత రంగాల్లో సహకారానికి వీలు కల్పించే ఏర్పాట్లు.
12. సుష్మా స్వరాజ్ విదేశీ సేవల సంస్థ, జపాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మధ్య అవగాహన ఒప్పందం
• విదేశాంగ విధాన రంగంలో పరస్పర అవగాహనను పెంపొందించడానికి దౌత్యవేత్తలు, విద్యావేత్తలు, అధికారులు, నిపుణులు, పరిశోధకుల మధ్య చర్చలను ప్రోత్సహించేలా విధాన రూపకల్పన.
13. విజ్ఞాన శాస్త్ర, సాంకేతికత మంత్రిత్వ శాఖకూ – జపాన్ విద్యా, సాంస్కృతిక, క్రీడా, విజ్ఞాన శాస్త్ర, సాంకేతిక శాఖలకూ మధ్య ఉమ్మడి ఉద్దేశ ప్రకటన
• శాస్త్రవేత్తలు, పరిశోధకుల మధ్య పరస్పర సమన్వయంతో శాస్త్ర సాంకేతిక రంగంలో సహకారాన్ని పెంపొందించడం, అంకుర సంస్థలూ పరిశ్రమల భాగస్వామ్యంతో రెండు దేశాల పరిశోధననూ, అలాగే శాస్త్రీయ సంస్థల మధ్య సంస్థాగత సహకారాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా ప్రకటన.
ఇతర ముఖ్యాంశాలు
1. వచ్చే దశాబ్ద కాలంలో జపాన్ నుంచి భారత్‌కు 10 ట్రిలియన్ జపాన్ యెన్‌ల (జేపీవై) ప్రైవేటు పెట్టుబడి లక్ష్యం.
2. సెమీకండక్టర్లు, శుద్ధ ఇంధనం, టెలికాం, ఔషధాలు, కీలక ఖనిజాలు, కొత్త - అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల వంటి వ్యూహాత్మక రంగాల్లో సరఫరా వ్యవస్థ క్రియాశీలంగా కొనసాగేలా ప్రోత్సహించడానికి భారత్ - జపాన్ ఆర్థిక భద్రత కార్యక్రమాన్ని ప్రారంభించాయి.
• ఈ రంగాల్లో వాస్తవిక సహకారంపై వివరణాత్మక జాబితాగా ఆర్థిక భద్రతపై సమాచార పత్రాన్ని కూడా జారీ చేశారు.
3. భారత్ - జపాన్ ఏఐ కార్యక్రమం ప్రారంభం
• విస్తృత భాషా నమూనాల్లో సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం.. శిక్షణ, సామర్థ్యాభివృద్ధి, విశ్వసనీయ ఏఐ అనుకూల వ్యవస్థను పెంపొందించడం కోసం వాణిజ్య సంస్థలూ అంకుర సంస్థలకు చేయూత.
4. సమగ్ర రవాణా భాగస్వామ్యం ప్రారంభం
• మౌలిక సదుపాయాలతోపాటు లాజిస్టిక్స్ – రవాణా రంగాలు.. ముఖ్యంగా రైల్వేలు, విమానయానం, రోడ్లు, నౌకాయానం, ఓడరేవులకు సంబంధించి ప్రభుత్వాల మధ్య, వ్యాపార సంస్థల మధ్య భాగస్వామ్యాన్ని పెంపొందించడం. ఈ రంగానికి సంబంధించిన ఉత్పత్తులు, సాధనాలను భారత్‌లో తయారు చేయడంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు.
5. భారత్, జపాన్ ఎస్ఎంఈల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా భారత్ - జపాన్ చిన్న, మధ్య తరహా సంస్థల ఫోరం ప్రారంభం - మన ఆర్థిక వ్యవస్థలకు ఇవే చోదకాలు.
6. ఇంధన భద్రత, రైతుల జీవనోపాధిని ప్రోత్సహించడం కోసం సుస్థిర ఇంధన కార్యక్రమమం ప్రారంభం. అలాగే బయోగ్యాస్, బయో ఇంధనాల వంటి సుస్థిర ఇంధనాలకు సంబంధించిన సాంకేతికతల్లో పరిశోధన - అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడం.
7. ప్రభుత్వాలూ, స్థానిక ప్రభుత్వాల మధ్య ఉన్నత స్థాయి చర్చలు - ఇందులో భాగంగా విదేశాంగ కార్యాలయాలు అన్ని దిశల్లోనూ మూడు సందర్శనలు చేపడతాయి.
8. కాన్సాయ్, క్యుషు రెండు ప్రాంతాలతో భారత్‌కు వాణిజ్య, ప్రజా సంబంధాలు, సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడం కోసం వాణిజ్య వేదికల ఏర్పాటు.
***
(Release ID: 2162143)
Visitor Counter : 29
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam