రాష్ట్రపతి సచివాలయం
స్కోప్ ఎమినెన్స్ పురస్కారాలను ప్రదానం చేసిన రాష్ట్రపతి
• అభివృద్ధి చెందిన భారత్‌ను 2047 కల్లా తీర్చిదిద్దాలన్న జాతీయ లక్ష్య సాధనలో సీపీఎస్ఈలది ముఖ్య పాత్ర: రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము
प्रविष्टि तिथि:
29 AUG 2025 2:03PM by PIB Hyderabad
భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఈ రోజు న్యూఢిల్లీలో 2022-23 సంవత్సర స్కోప్ ఎమినెన్స్ పురస్కారాలను ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ... దేశాన్ని అభివృద్ధి చేయడంలో ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రధాన పాత్రను గుర్తించి గౌరవించడమే స్కోప్ ఎమినెన్స్ అవార్డుల ఉద్దేశమన్నారు. ఒక మంచి పరిశ్రమగా పేరు రావాలంటే సామాజిక, ఆర్థిక, పర్యావరణ పరిరక్షణ, సాంకేతిక, నైతిక ప్రమాణాలకు అనుగుణంగా చక్కని పనితీరును కనబరచాలని ఆమె సూచించారు. నిలకడైన అభివృద్ధి, కార్పొరేట్ పరిపాలన, కార్పొరేట్ సామాజిక బాధ్యతలతో పాటు నవకల్పన వంటి అనేక కోణాల్లో మంచి పనితీరును చాటిన సంస్థలను సత్కరిస్తున్నందుకు ‘స్కోప్’ను రాష్ట్రపతి ప్రశంసించారు. ఇది ప్రగతి సాధన దిశగా అనుసరిస్తున్న సమగ్ర వైఖరికి సూచికగా ఆమె వ్యాఖ్యానించారు.

స్వాతంత్ర్యం తరువాతి కాలంలో ఆర్థిక అభివృద్ధికీ, సమాజంలోని అన్ని వర్గాలవారినీ కలుపుకొని ముందుకు పోవడానికీ ప్రభుత్వ రంగం ఒక బలమైన వేదికగా నిలుస్తోందని రాష్ట్రపతి ఉద్ఘాటించారు. పారిశ్రామికీకరణకూ, మౌలిక సదుపాయాల కల్పనకూ, సామాజిక అభ్యున్నతితో పాటు దేశంలోని ప్రాంతాలన్నీ సమానంగా అభివృద్ధిపథంలో సాగడానికీ పునాది వేసింది ప్రభుత్వ రంగ పరిశ్రమలేనని ఆమె అన్నారు. మారే కాలంతో ఈ పరిశ్రమలు కూడా మారుతున్నాయని శ్రీమతి ముర్ము చెప్పారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలపై ప్రభుత్వం, సమాజం పెట్టుకున్న ఆశలు కూడా కాలానుగుణంగా మారాయని తెలిపారు. ఈ మార్పుల మధ్య, ప్రభుత్వ రంగ పరిశ్రమలు తమ పనితీరుతో ఆర్థిక, జాతీయ లక్ష్యాలను సాధించడంలో ముఖ్య పాత్రను పోషిస్తుండడం చూస్తే తనకు సంతోషంగా ఉందని రాష్ట్రపతి అన్నారు.
ఆర్థికంగాను, ద్రవ్యపరంగాను సేవలను అందించడంతో పాటు సమతౌల్య, సమ్మిళిత వృద్ధికి ప్రభుత్వ రంగ పరిశ్రమలు పెద్ద పీట వేశాయని, జాతీయ లక్ష్యాలను సాధించడానికే మిగతా అన్నింటి కన్నా అత్యధిక ప్రాధాన్యాన్ని కట్టబెట్టాయని రాష్ట్రపతి స్పష్టం చేశారు. అవి పోషించిన పాత్ర, అందించిన సేవలను గమనిస్తే, దేశ సమృద్ధికి మూలస్తంభాలుగా, వృద్ధికి ఉత్ప్రేరకంగా నిలిచాయని చెప్పడం సముచితంగా ఉంటుందని ఆమె కితాబిచ్చారు. పరిపాలనకు, పారదర్శకత్వానికీ ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉదాహరణలుగా ఉంటూ, అనేక మంచి నమూనాలను ఆవిష్కరించాయని రాష్ట్రపతి అన్నారు.

‘స్వయంసమృద్ధ భారత్’, ‘భారత్‌లో తయారీ’ వంటి జాతీయ ప్రచార కార్యక్రమాల్లో కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమలు (సీపీఎస్ఈలు) దీటైన పాత్రను పోషిస్తున్నాయని రాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు. ‘ఆపరేషన్ సిందూర్’ను చేపట్టినప్పుడు, దేశీయంగా రూపొందించిన ఎయిర్ డిఫెన్స్ కంట్రోల్ అండ్ రిపోర్టింగ్ వ్యవస్థ.. ‘ఆకాశ్‌తీర్’.. తన అమోఘమైన సామర్థ్యాన్ని నిరూపించిందని ప్రశంసించారు. ఈ వ్యవస్థను రూపొందించడంలో ప్రభుత్వ రంగ పరిశ్రమల పాత్ర ఎంతయినా ఉందని ఆమె కొనియాడారు. ఇది ప్రత్యేకించి ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటికీ గర్వకారణమని ఆమె అన్నారు.
స్వావలంబనతో కూడిన నవకల్పన, సాంకేతికత పరంగా స్వయంసమృద్ధి సాధన అనేవి ఊతంగా తీసుకొని ప్రభుత్వ రంగ పరిశ్రమలు అందించిన తోడ్పాటు దేశ భద్రతా పరిరక్షణలో రుజువైందని రాష్ట్రపతి అన్నారు. వ్యవసాయం, గనుల తవ్వకం, నిక్షేపాల అన్వేషణ, తయారీ, ప్రాసెసింగ్, జనరేషన్, సేవలు వంటి ప్రధాన రంగాల్లో పబ్లిక్ సెక్టర్ ఎంటర్‌ప్రైజెస్ పోషించిన పాత్ర చాలా ముఖ్యమైంది. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడంలోనూ ఈ పరిశ్రమలు దారి చూపే పాత్రను పోషిస్తున్నాయని ఆమె వివరించారు. 2047 కల్లా అభివృద్ధి చెందిన భారత్‌ను ఆవిష్కరించాలన్న జాతీయ లక్ష్యాన్ని సాధించడంలో సీపీఎస్ఈలు కీలక పాత్ర పోషిస్తాయని ఆమె స్పష్టం చేశారు. సీపీఎస్ఈలు దేశ నిర్మాణానికే అంకితమై తమ అన్ని నిర్ణయాలనూ తీసుకొంటాయని, ఈ నిర్ణయాలకు నైతిక పునాది ఉంటుందనీ, వీటి ఆలోచనల్లో సమాజ సేవ, వివేచనల స్ఫూర్తి తొణికిసలాడుతుందని ఆశిస్తున్నట్లు రాష్ట్రపతి వ్యాఖ్యానించారు.

ప్రభుత్వ రంగ పరిశ్రమల అసాధారణ విజయాలను, అవి అందిస్తున్న సేవలను గుర్తించేందుకు స్టాండింగ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ (ఎస్‌సీఓపీఈ..‘స్కోప్’) ఏర్పాటు చేసినవే స్కోప్ ఎమినెన్స్ పురస్కారాలు.
Please click here to see the President's Speech -
***
(रिलीज़ आईडी: 2162034)
आगंतुक पटल : 228