రక్షణ మంత్రిత్వ శాఖ
సమీకృత గగనతల రక్షణ ఆయుధ వ్యవస్థ తొలి వైమానిక పరీక్షలు విజయవంతంగా నిర్వహించిన డీఆర్‌డీవో
Posted On:
24 AUG 2025 10:19AM by PIB Hyderabad
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) నిన్న మధ్యాహ్నం 12.30 గంటలకు ఒడిశా తీరంలో సమీకృత గగనతల రక్షణ ఆయుధ వ్యవస్థ (ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్) తొలి వైమానిక పరీక్షలు విజయవంతంగా నిర్వహించింది. ఈ ఐఏడీడబ్ల్యూఎస్ స్వదేశీ క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణులు (క్యూఆర్ఎస్ఏఎమ్), అడ్వాన్స్‌డ్ వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ (వీఎస్హెచ్ఓఆర్ఏడీఎస్) క్షిపణులు, హై-పవర్ లేజర్-ఆధారిత ఎనర్జీ వెపన్ (డీఈడబ్ల్యూ)లు గల బహుళ-అంచెల వైమానిక రక్షణ వ్యవస్థ.
రక్షణ రంగ పరిశోధన-అభివృద్ధి లాబొరేటరీ అభివృద్ధి చేసిన కేంద్రీకృత కమాండ్ - కంట్రోల్ సెంటర్ ఈ కార్యక్రమానికి నోడల్ లాబొరేటరీగా ఆయుధ వ్యవస్థకు చెందిన అన్ని విభాగాల సమగ్ర ఆపరేషన్‌ను నియంత్రిస్తుంది. వీఎస్హెచ్ఓఆర్ఏడీఎస్ను రీసెర్చ్ సెంటర్- ఇమారత్ పరిశోధనా కేంద్రం రూపొందించగా డీఈడబ్ల్యూను సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్సెస్ అభివృద్ధి చేసింది.
వైమానిక పరీక్షల సమయంలో క్యూఆర్ఎస్ఏఎమ్, వీఎస్హెచ్ఓఆర్ఏడీఎస్, హై ఎనర్జీ లేజర్ ఆయుధ వ్యవస్థలు వివిధ పరిధులు, ఎత్తుల వద్ద రెండు హై-స్పీడ్ ఫిక్స్‌డ్ వింగ్ మానవరహిత వైమానిక వాహన లక్ష్యాలు, మల్టీ-కాప్టర్ డ్రోన్ సహా మూడు వేర్వేరు లక్ష్యాలను ఒకే సమయంలో పూర్తిగా ధ్వంసం చేశాయి. క్షిపణి వ్యవస్థలు, డ్రోన్ గుర్తింపు - విధ్వంస వ్యవస్థ, కమ్యూనికేషన్, రాడార్లతో పాటు ఆయుధ వ్యవస్థ కమాండ్ - కంట్రోల్ సహా అన్ని ఆయుధ వ్యవస్థ విభాగాలు ఎలాంటి లోపం లేకుండా చక్కగా పనిచేశాయి. విమాన డేటాను సంగ్రహించేందుకు చండీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ రూపొందించిన రేంజ్ సాధనాల ద్వారా దీనిని నిర్ధారించారు. డీఆర్‌డీవో సీనియర్ శాస్త్రవేత్తలు, సాయుధ దళాల ప్రతినిధులు ఈ పరీక్షలను ప్రత్యక్షంగా వీక్షించారు.
విజయవంతంగా ఐఏడీడబ్ల్యూఎస్‌ను అభివృద్ధి చేసిన డీఆర్‌డీవో, సాయుధ దళాలు, రక్షణ రంగ ప్రతినిధులను రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఈ సందర్భంగా అభినందించారు. ఈ ప్రత్యేక వైమానిక పరీక్షలు భారత బహుళ-అంచెల వైమానిక-రక్షణ సామర్థ్యాన్ని, శత్రువుల వైమానిక దాడుల నుంచి కీలక ప్రదేశాల రక్షణను మరింత బలోపేతం చేస్తాయని ఆయన పేర్కొన్నారు.
ఈ విజయవంతమైన వైమానిక పరీక్షల్లో పాలుపంచుకున్న అన్ని బృందాలను రక్షణ శాఖ పరిశోధన-అభివృద్ధి విభాగం కార్యదర్శి, డీఆర్‌డీవో చైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్ అభినందించారు.
***
(Release ID: 2160347)