లోక్‌సభ సచివాలయం
సభలో ఉద్దేశపూర్వక అంతరాయాలపై లోక్ సభ స్పీకర్ తీవ్ర ఆగ్రహం
నినాదాలు చేయడం, ప్లకార్డులను ప్రదర్శించడం, సభా కార్యక్రమాలను పదేపదే అడ్డుకోవడం
పార్లమెంటు ఔన్నత్యాన్ని దెబ్బతీయడమే: లోక్‌సభ స్పీకర్
అన్ని రాజకీయ పార్టీల సభ్యులకు సభలో మాట్లాడటానికి తగినంత అవకాశాలు ఇచ్చాం.
ముఖ్యమైన, అర్థవంతమైన చర్చలు ముందుకు సాగాలి: లోక్ సభ స్పీకర్
‘ఆపరేషన్ సిందూర్’, భారత అంతరిక్ష యాత్ర విజయంపై ప్రత్యేక చర్చలు
సభ , పార్లమెంటు ప్రాంగణంలో సభ్యుల భాష ఎప్పుడూ గౌరవప్రదంగా ఉండాలి: లోక్ సభ స్పీకర్
18వ లోక్ సభ అయిదో సభ నిర్వహణకు మొత్తం 120 గంటలు కేటాయిస్తే 37 గంటలు మాత్రమే కొనసాగింది: లోక్ సభ స్పీకర్
అంతరాయల కారణంగా జాబితాలోని 419 మౌఖిక ప్రశ్నల్లో కేవలం 55 ప్రశ్నలకు మాత్రమే సమాధానం లభించింది: లోక్ సభ స్పీకర్వ
లోక్ సభలో 14 ప్రభుత్వ బిల్లులు ప్రవేశపెట్టగా,12 బిల్లులకు ఆమోదం: లోక్ సభ స్పీకర్
తదుపరి సమావేశాల తేదీలు లేకుండానే వాయిదపడిన పద్దెనిమిదో లోక్ సభ అయిదో సమావేశం
Posted On:
21 AUG 2025 4:08PM by PIB Hyderabad
జూలై 21న ప్రారంభమైన 18వ లోక్‌సభ అయిదో సమావేశాలు నేటితో ముగిశాయి.
సమావేశాల చివరి రోజు తన ముగింపు ప్రసంగంలో లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా సభలో నిరంతర, ఉద్దేశపూర్వక అంతరాయాలపై విచారం వ్యక్తం చేశారు. లోక్‌సభ, పార్లమెంటు ప్రాంగణంలో నినాదాలు చేయడం, ప్లకార్డులను ప్రదర్శించడం, ఉద్దేశపూర్వకంగా అంతరాయం కల్పించడం పార్లమెంటు కార్యకలాపాల గౌరవానికి భంగం కలిగిస్తాయని అన్నారు. ప్రజలు ప్రతినిధులపై ఎన్నో అంచనాలు పెట్టుకుంటారని.. ప్రజా సమస్యలు, ముఖ్యమైన చట్టాలపై అర్థవంతమైన చర్చల కోసం సభలో తమ సమయాన్ని ఉపయోగించుకోవాలని సభ్యులకు సూచించారు.
ఈ సమావేశాల్లో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన సభ్యులకు సభలో మాట్లాడటానికి, ముఖ్యమైన చట్టాలు, ప్రజా ప్రయోజనాల అంశాలపై చర్చించడానికి తగినంత సమయం కల్పించినట్లు స్పీకర్ పేర్కొన్నారు. అయితే సభలో నిరంతర ప్రతిష్టంభన దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. సభలో నినాదాలు చేయడం, అంతరాయాలు కలిగించడం వంటి చర్యలను నివారిస్తూ.. అర్థవంతమైన చర్చలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
వర్షాకాల సమావేశాల్లో... సభ్యుల భాష, ప్రవర్తన పార్లమెంటు మర్యాదకు దీటుగా లేదని చెప్పారు. సభ లోపల, వెలుపల ఎంపీలు ఉపయోగించే భాష ఎప్పుడూ సంయమనంతో, గౌరవప్రదంగా ఉండాలని పేర్కొన్నారు. సభ్యుల పనితీరు, వారి ప్రవర్తన దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు.
సమావేశాల అజెండాలో 419 మౌఖిక ప్రశ్నలను జాబితాలో పేర్కొనగా, సభలో తీవ్ర అంతరాల కారణంగా కేవలం 55 ప్రశ్నలను మాత్రమే సమాధానానికి స్వీకరించగలిగామని శ్రీ బిర్లా తెలిపారు. తొలుత ఈ సమావేశాల్లో 120 గంటలు చర్చించాలని అన్ని పార్టీలు నిర్ణయించగా.. సభా నిర్వహణ సలహా కమిటీ కూడా దీనికి అంగీకరించింది. కానీ పదే పదే సభా కార్యక్రమాలను అడ్డుకోవడం, గందరగోళం, నిరంతర అంతరాయాల కారణంగా ఈ సమావేశాల్లో కేవలం 37 గంటలు మాత్రమే సభ పనిచేయగలదని తెలిపారు. ఈసారి పద్నాలుగు ప్రభుత్వ బిల్లులు ప్రవేశపెట్టగా.. పన్నెండు బిల్లులకు ఆమోదం లభించిందని స్పీకర్ చెప్పారు.
‘ఆపరేషన్ సిందూర్’పై చర్చ జూలై 28, 2025న ప్రారంభమై జూలై 29, 2025న ప్రధానమంత్రి సమాధానంతో ముగిసిందని శ్రీ బిర్లా తెలిపారు. ఆగస్టు 18, 2025న, భారతదేశ అంతరిక్ష కార్యక్రమం సాధించిన విజయంపై ప్రత్యేక చర్చ జరిగిందని శ్రీ బిర్లా పేర్కొన్నారు.
***
(Release ID: 2159554)