రక్షణ మంత్రిత్వ శాఖ
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన తొలి భారతీయ వ్యోమగామి
గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాను కలిసిన రక్షణ మంత్రి
కెప్టెన్ శుక్లా స్ఫూర్తిదాయక ప్రయాణం యువతరాన్ని శాస్త్ర, సాంకేతిక, అంతరిక్ష పరిశోధన రంగాల్లో ఉద్యోగ అవకాశాలను అన్వేషించేందుకు ప్రోత్సహిస్తుంది.: శ్రీ రాజ్‌నాథ్ సింగ్
Posted On:
21 AUG 2025 2:34PM by PIB Hyderabad
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ప్రయాణించిన తొలి భారతీయ వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాను 2025 ఆగస్టు 21న న్యూఢిల్లీలో రక్షణశాఖమంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ కలిశారు. శుభాంశు శుక్లా సాధించిన ఘనతకు కేంద్రమంత్రి అభినందనలు తెలుపుతూ.. మానవ సహిత అంతరిక్ష యాత్ర దిశగా భారత్ చేపట్టిన ప్రయాణంలో ఇదొక గొప్ప విజయమని పేర్కొన్నారు.
కక్ష్యలో నిర్వహించిన కీలక శాస్త్రీయ ప్రయోగాల ద్వారా శుక్లా చేసిన కృషిని గుర్తించి, భారత అంతరిక్ష పరిశోధన, అన్వేషణ సామర్థ్యాలను ముందుకు తీసుకువెళ్లడంలో ఆయన పాత్రను రాజ్ నాథ్ సింగ్ ప్రశంసించారు. శుభాంశు స్పూర్తిదాయకమైన ప్రయాణం యువతలో శాస్త్ర సాంకేతికత, అంతరిక్ష అన్వేషణ రంగాల్లో వృత్తిని ఎంచుకునే ఆసక్తిని పెంచుతుందని నమ్ముతున్నట్లు తెలిపారు.
భేటీ అనంతరం ఎక్స్ లో చేసిన పోస్టులో.. శుభాంశు శుక్లాతో జరిగిన సమావేశంలో ఆయన స్పూర్తిదాయకమైన అంతరిక్ష ప్రయాణం, కక్ష్యలో నిర్వహించిన ముఖ్యమైన ప్రయోగాలు, శాస్త్ర సాంకేతికతలో పురోగతి, భారత్ చేపట్టబోయే గగన్‌యాన్ మిషన్ గురించి చర్చించినట్లు తెలిపారు.
భారత అంతరిక్ష కార్యక్రమంలో ముఖ్యంగా ఇస్రోతో కలిసి అంతరిక్ష యాత్రికుల ఎంపిక, శిక్షణ, యాత్రకు మద్దతులో భారత వాయుసేన కీలక పాత్ర పోషిస్తోందని శ్రీ రాజనాథ్ సింగ్ తెలిపారు. మానవ సహిత అంతరిక్షయాన లక్ష్యాల సాధనకు వృత్తి నైపుణ్యాలు కీలకమని స్పష్టం చేశారు.
చంద్రుడు, అంగారక గ్రహ అన్వేషణలో ప్రపంచం గుర్తించే విజయాలను సాధించిన అనంతరం భారత్ ప్రస్తుతం మానవ సహిత అంతరిక్ష యానాల వైపు పయనిస్తూ, సొంత అంతరిక్ష కేంద్రం స్థాపన దిశగా అడుగులు వేస్తోంది. ఐఎస్ఎస్లో గ్రూప్ కెప్టెన్ శుక్లా విజయవంతమైన ప్రయాణం.. ఇస్రో, ఐఏఎఫ్, ఇతర జాతీయ భాగస్వాముల మధ్య గొప్ప సమన్వయాన్ని ప్రతిబింబిస్తోంది. ఇది భారత్‌ను అంతరిక్షయాన దేశంగా నిలబెట్టడంలో సహకరిస్తుంది.
***
(Release ID: 2159543)