ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఎం.ఎస్.స్వామినాథన్ శతాబ్ది అంతర్జాతీయ సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం


· “ఆహారోత్పత్తిలో భారత్‌ స్వావలంబన ఉద్యమానికి డాక్టర్ స్వామినాథన్ నేతృత్వం వహించారు”
· “జీవ వైవిధ్యాన్ని అధిగమిస్తూ జీవ-సౌఖ్యమనే దార్శనిక భావనను ప్రోదిచేశారు”

· “రైతు ప్రయోజనాల విషయంలో భారత్‌ ఏ నాటికీ రాజీపడదు”

· “దేశ ప్రగతికి రైతుల బలమే పునాదిగా మా ప్రభుత్వం గుర్తించింది”

· “ఆహార భద్రత వారసత్వం ప్రాతిపదికగా అందరికీ పోషకాహార భద్రతపై భరోసా ఇవ్వడమే మన వ్యవసాయ శాస్త్రవేత్తల తదుపరి కర్తవ్యం”

Posted On: 07 AUG 2025 11:22AM by PIB Hyderabad

 

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ న్యూఢిల్లీ పరిధిలోని పూసాలో గల భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్‌) ప్రాంగణంలో ఎం.ఎస్.స్వామినాథన్ శతాబ్ది అంతర్జాతీయ సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనకు నివాళి అర్పించిన అనంతరం ప్రసంగిస్తూ- ప్రొఫెసర్ ఎం.ఎస్.స్వామినాథన్ గొప్ప దార్శనికుడని, ఏ శకంలోనైనా ఆయన కృషి అద్వితీయమేనని అభివర్ణించారు. శాస్త్ర విజ్ఞానాన్ని ప్రజా సేవకు మాధ్యమంగా మలచిన శాస్త్రవేత్తగా ఆయనను కొనియాడారు. దేశానికి ఆహార భద్రత కల్పించే మహత్కార్యానికి ప్రొఫెసర్ స్వామినాథన్ తననుతాను అంకితం చేసుకున్నారని గుర్తుచేశారు. కొన్ని శతాబ్దాలపాటు భారత్‌ విధానాలు-ప్రాథమ్యాలను నిర్దేశించగల చైతన్యాన్ని రగిల్చారని పేర్కొన్నారు. స్వామినాథన్ శతజయంతి వేడుకల నేపథ్యంలో శ్రీ మోదీ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

జాతీయ చేనేత దినోత్సవాన్ని కూడా ఇదే రోజు నిర్వహించుకోవడాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు. గడచిన పదేళ్లలో చేనేత రంగం సరికొత్త గుర్తింపు, సాధికారతను సాధించిందని పేర్కొంటూ- ఈ సందర్భంగా ప్రజలందరితో పాటు చేనేత రంగంతో ముడిపడిన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు.

డాక్టర్ ఎం.ఎస్.స్వామినాథన్‌తో తనకు చిరకాల సాన్నిహిత్యం ఉందని ప్రధానమంత్రి చెప్పారు. గుజరాత్‌లో కరువులు, తుపానుల వంటి వైపరీత్యాల వల్ల వ్యవసాయం తీవ్ర సమస్యల్లో పడటాన్ని శ్రీ మోదీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆనాడు ముఖ్యమంత్రిగా తన పదవీకాలంలో భూసార కార్డు రూపకల్పనకు శ్రీకారం చుట్టగా, ప్రొఫెసర్ స్వామినాథన్ దీనిపై అమితాసక్తి ప్రదర్శించారని పేర్కొన్నారు. విశాల హృదయంతో సూచనలు, సలహాలు ఇవ్వడం ద్వారా ఆ కార్యక్రమ విజయంలో గణనీయ పాత్ర పోషించారని గుర్తుచేశారు. తమిళనాడులో ప్రొఫెసర్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ సెంటర్‌ను దాదాపు రెండు దశాబ్దాల కిందట తాను  సందర్శించడాన్ని శ్రీ మోదీ ప్రస్తావించారు.

ప్రొఫెసర్‌ స్వామినాథన్‌ రచించిన ‘ది క్వెస్ట్ ఫర్ ఎ వరల్డ్ వితౌట్ హంగర్’ (ఆకలి బాధ లేని ప్రపంచం కోసం పరిశోధన) పుస్తకాన్ని 2017లో ఆవిష్కరించే అవకాశం తనకు లభించిందని తెలిపారు. అలాగే వారణాసిలో ‘ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్’ ప్రాంతీయ కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా 2018లో ఆయనను కలిశానని చెప్పారు. ప్రొఫెసర్‌తో ప్రతి సంభాషణ తనకు ఒక పాఠమేనని, ఆయన మార్గదర్శకత్వం అమూల్యమైనదని ప్రధానమంత్రి చెప్పారు. ఒకసారి తనతో సంభాషణలో- “శాస్త్ర విజ్ఞానమంటే పరిశోధనకు పరిమితం కాదు... ఫలితాల ఆవిష్కరణకు సంబంధించినది” అని ప్రొఫెసర్ స్వామినాథన్ వ్యాఖ్యానించారని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ఆచరణాత్మక కృషిలో భాగంగా పరిశోధనలు కొనసాగిస్తూనే- రైతులు సాగు పద్ధతులను మార్చుకునేలా స్ఫూర్తినిచ్చారని శ్రీ మోదీ గుర్తుచేశారు. ప్రొఫెసర్ స్వామినాథన్ దృక్పథం, ఆలోచన విధానం దేశ వ్యవసాయ రంగంలో నేటికీ కనిపిస్తాయని పేర్కొన్నారు. ప్రొఫెసర్ స్వామినాథన్ను భరతమాతకు నిజమైన ‘పుత్రరత్నం’గా అభివర్ణిస్తూ, ‘భారతరత్న’ పురస్కారంతో ఆయనను సత్కరించడం తనకు దక్కిన గౌరవమని హర్షం వ్యక్తంచేశారు.
“ఆహారోత్పత్తిలో భారత్‌ స్వావలంబన ఉద్యమానికి డాక్టర్ ఎం.ఎస్.స్వామినాథన్ నాయకత్వం వహించారు” అని ప్రధానమంత్రి గుర్తుచేశారు. ఆయన పేరు ‘హరిత విప్లవం’ ప్రతీకగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందని పేర్కొన్నారు.
వ్యవసాయంలో రసాయన వినియోగం పెరగడంతో పాటు ఏళ్ల తరబడి ఒకే పంట సాగుతో కలిగే నష్టాలపై రైతులకు అవగాహన కల్పనలో స్వామినాథన్ నిరంతరం శ్రమించారని తెలిపారు. ధాన్యం దిగుబడి పెంచడానికి ఎంతగా కృషి చేశారో... పర్యావరణం, భూమాత క్షేమం కోసం అంతగా తపించారని శ్రీ మోదీ కొనియాడారు. ఈ రెండు లక్ష్యాల మధ్య సమతౌల్యంతోపాటు కొత్త సమస్యల  పరిష్కారం దిశగా ‘సతత హరిత విప్లవం’ భావనను స్వామినాథన్‌ పరిచయం చేశారని ప్రధానమంత్రి అన్నారు. అలాగే గ్రామీణ ప్రజానీకంతో పాటు రైతులకు సాధికారత దిశగా ‘బయో-విలేజెస్’ భావనను ప్రతిపాదించారని తెలిపారు. “సామాజిక విత్తన నిధి, కాలానుగుణ పంటలు” వంటి వినూత్న పరిష్కారాలను ప్రొఫెసర్ స్వామినాథన్ ప్రోత్సహించారని చెప్పారు.

“వాతావరణ మార్పు, పోషకాహార సవాళ్లకు పరిష్కారాలు మనం నిర్లక్ష్యం చేసిన పంటల సాగులోనే ఉన్నాయని డాక్టర్ ఎం.ఎస్.స్వామినాథన్ విశ్వసించారు” అని ప్రధానమంత్రి గుర్తుచేశారు. కరువును అధిగమించగల, ఉప్పు లక్షణాన్ని తట్టుకోగల వ్యవసాయంపై ఆయన దృష్టి సారించారని చెప్పారు. ఆ మేరకు చిరుధాన్యాల (శ్రీ అన్న) సాగు విస్మరణకు గురైన సమయంలో స్వామినాథన్ ఈ అంశంపై శ్రద్ధ చూపారని తెలిపారు. మడ అడవుల జన్యు లక్షణాలను వరి పంటలోకి ప్రవేశపెట్టే యోచనను చాలా ఏళ్ల కిందటే స్వామినాథన్ ప్రతిపాదించారని గుర్తుచేశారు. తద్వారా పంటలు వాతావరణాన్ని మరింత తట్టుకోగల శక్తిని పుంజుకుంటాయని చెప్పారు. వాతావరణ సానుకూలత ప్రపంచ ప్రాధాన్యంగా మారుతున్న నేటి పరిస్థితుల నడుమ ప్రొఫెసర్ స్వామినాథన్ దూరదృష్టి ఎంత విలువైనదో అర్థం చేసుకోవచ్చన్నారు.

జీవవైవిధ్యం నేటి అంతర్జాతీయ చర్చనీయాంశం కాగా, దాని పరిరక్షణకు ప్రభుత్వాలు వివిధ చర్యలు చేపట్టడాన్ని ప్రధానమంత్రి గుర్తుచేశారు. దీనికి భిన్నంగా ‘జీవ సౌఖ్యం’ (బయో-హ్యాపీనెస్) భావనను పరిచయం చేయడం ద్వారా డాక్టర్ ఎం.ఎస్. స్వామినాథన్ మరొక అడుగు ముందుకేశారని పేర్కొన్నారు. ఆయన దార్శనికతకు నేటి సదస్సు ఆచరణాత్మక రూపమని ఆయన వ్యాఖ్యానించారు. జీవవైవిధ్యం స్థానిక ప్రజానీకం జీవితాల్లో ప్రగతిశీల మార్పు తెస్తుందని డాక్టర్ స్వామినాథన్‌ విశ్వసించినట్లు పేర్కొన్నారు. తదనుగుణంగా స్థానిక వనరుల సద్వినియోగంతో ప్రజలకు కొత్త జీవనోపాధి అవకాశాలను సృష్టించవచ్చని శ్రీ మోదీ స్పష్టం చేశారు. ఆలోచనలను ఆచరణలోకి అనువదించగల సామర్థ్యం డాక్టర్ స్వామినాథన్ విశిష్ట స్వభావమని ప్రధానమంత్రి కొనియాడారు. అందుకు అనుగుణంగా తన పరిశోధన సంస్థ  ద్వారా సరికొత్త ఆవిష్కరణల ఫలితాలు అన్నదాతకు అదే విధంగా జీవితాంతం కృషి చేశారని చెప్పారు. దీనివల్ల చిన్న రైతులు, మత్స్యకారులు, గిరిజన వర్గాలు ఎంతో ప్రయోజనం పొందినట్లు ఆయన పేర్కొన్నారు.
ప్రొఫెసర్ స్వామినాథన్ వారసత్వానికి గౌరవ సూచకంగా “ఎం.ఎస్.స్వామినాథన్ అవార్డ్‌ ఫర్ ఫుడ్ అండ్ పీస్” ప్రదానానికి శ్రీకారం చుట్టడంపై ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఆహార భద్రత రంగంలో గణనీయంగా కృషి చేసిన వర్ధమాన దేశాల వ్యక్తులకు ఈ అంతర్జాతీయ అవార్డు ప్రదానం చేస్తారని ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఈ పురస్కార తొలి గ్రహీత ప్రొఫెసర్ అడెన్లే (నైజీరియా)ను ప్రధాని అభినందించారు. ప్రతిభావంతుడైన శాస్త్రవేత్తగా ఆయన కృషి ఈ అవార్డు స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ఆహారం-శాంతి మధ్య బంధం తాత్త్వికం మాత్రమేగాక అత్యంత ఆచరణాత్మకమని స్పష్టం చేశారు. ఈ మేరకు ఉపనిషత్‌ శ్లోకాన్ని ఉటంకిస్తూ ఆహార పవిత్రతను వివరించారు. ‘ఆహారమే జీవితం... దానిపట్ల అగౌరవం లేదా నిర్లక్ష్యం తగదు’ అని ఈ శ్లోకం ప్రబోధిస్తుందని శ్రీ మోదీ చెప్పారు. ఆహార సంక్షోభం ఎలాంటిదైనా అది జీవిత సంక్షోభానికి దారితీయడం తథ్యమన్నారు. లక్షలాదిగా మానవాళి జీవితాలు ప్రమాదంలో పడిన వేళ ప్రపంచంలో అశాంతి నెలకొంటుందని హెచ్చరించారు. నేటి ప్రపంచ పరిస్థితుల నడుమ ఎం.ఎస్.స్వామినాథన్ అవార్డు ప్రాముఖ్యం ఇదేనని శ్రీ మోదీ చెప్పారు.

ఈ నేపథ్యంలో “భారత వ్యవసాయ రంగం ఇవాళ ఉన్నత శిఖరాలకు చేరడం చూస్తే డాక్టర్ ఎం.ఎస్.స్వామినాథన్ ఏ లోకంలో ఉన్నా కచ్చితంగా గర్విస్తారు” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. భారత్‌ నేడు పాలు, పప్పుధాన్యాలు, జనపనార ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. అలాగే బియ్యం, గోధుమ, పత్తి, పండ్లు-కూరగాయలు సహా చేపల ఉత్పత్తిలోనూ రెండో స్థానంలో ఉందని ఆయన పేర్కొన్నారు. నిరుడు భారత్‌ అత్యధికంగా ఆహార ధాన్యాల దిగుబడి సాధించిందని ప్రధానమంత్రి చెప్పారు. సోయాబీన్స, ఆవాలు, వేరుశనగ పంటల దిగుబడి ఎన్నడూ లేనంత అధిక స్థాయికి చేరడంతో నూనెగింజల పరంగానూ భారత్‌ రికార్డులు సృష్టిస్తోందని ఆయన వెల్లడించారు.

“రైతుల సంక్షేమం దేశానికి అగ్ర ప్రాధాన్యం”... ఆ మేరకు భారత్‌ రైతులతోపాటు పశుపోషకులు, మత్స్యకారుల ప్రయోజనాల విషయంలో ఎన్నడూ రాజీపడబోదని ప్రధానమంత్రి నిర్ద్వంద్వంగా ప్రకటించారు. సాగు వ్యయం తగ్గింపు, రైతుల ఆదాయం పెంపు, కొత్త ఆదాయ వనరుల సృష్టి దిశగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని పునరుద్ఘాటించారు.

“దేశ ప్రగతికి రైతుల బలమే పునాదిగా మా ప్రభుత్వం గుర్తించింది” అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో రూపొందించిన విధానాలు రైతులకు చేయూతనిచ్చేవి మాత్రమేగాక వారిలో విశ్వాసం పెంచడానికి ఉద్దేశించినవని ఆయన చెప్పారు. ప్రధానమంత్రి-కిసాన్ సమ్మాన్ నిధి ప్రత్యక్ష ఆర్థిక సహాయంతో చిన్న రైతులకు సాధికారతనిచ్చిందని, ప్రధానమంత్రి పంటల బీమా పథకం వ్యవసాయ ప్రమాదాల నుంచి రక్షణ కల్పించిందని, ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన నీటిపారుదల సమస్యలను తీర్చిందని ఆయన గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా 10,000 రైతు ఉత్పత్తిదారు సంస్థల (ఎఫ్‌పీవో) ఏర్పాటుతో చిన్న రైతుల సామూహిక సామర్థ్యం ఇనుమడించిందని శ్రీ మోదీ పేర్కొన్నారు. సహకార సంస్థలు, స్వయం సహాయ సంఘాలకు ఆర్థిక సహాయంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు లభించిందని చెప్పారు. ‘ఈ-నామ్’ వేదిక ఏర్పాటుతోపాటు ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన కొత్త ఆహార తయారీ యూనిట్లు, నిల్వ మౌలిక సదుపాయాల కల్పనను వేగిరపరచిందని శ్రీ మోదీ అన్నారు. వ్యవసాయ రంగంలో వెనుకబడిన 100 జిల్లాల సముద్ధరణ లక్ష్యంతో ఇటీవల ‘ప్రధానమంత్రి ధన్-ధన్య యోజన’ను ప్రభుత్వం ఇటీవల ఆమోదించిందని గుర్తుచేశారు. “ఈ జిల్లాల్లో సౌకర్యాల కల్పన, ఆర్థిక సహాయం ద్వారా వ్యవసాయంపై నవ్యోత్సాహం నింపుతోంది” అని ప్రధానమంత్రి అన్నారు.

“ప్రస్తుత 21వ శతాబ్దపు వికసిత భారత్‌గా రూపొందానికి దేశం నిబద్ధతతో ముందడుగు వేస్తోంది. సమాజంలోని ప్రతి వర్గం, ప్రతి వృత్తి సహకారంతో ఈ లక్ష్య సాధన సులభమే” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు. డాక్టర్ ఎం.ఎస్.స్వామినాథన్ స్ఫూర్తితో దేశంలోని వ్యవసాయ శాస్త్రవేత్తలు కొత్త చరిత్ర సృష్టించగల మరొక అవకాశం ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు మునుపటి తరం ఆహార భద్రతకు భరోసా ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడిక పోషకాహార భద్రత వైపు దృష్టి మళ్లాలని ఆయన సూచించారు. ప్రజారోగ్యం మెరుగు లక్ష్యంగా జీవ-బలవర్ధకం, పోషకాలతో కూడిన పంటల సాగును భారీగా ప్రోత్సహించాలని శ్రీ మోదీ పిలుపునిచ్చారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అనుసరిస్తూ, రసాయనాల వాడకాన్ని గణనీయంగా తగ్గించాలని రైతులకు స్పష్టం చేశారు.
వాతావరణ మార్పు సవాళ్లు అందరికీ తెలిసినవేనని పేర్కొంటూ- ప్రతికూల వాతావరణాన్ని తట్టుకోగల వంగడాలను అధిక సంఖ్యలో రూపొందించాల్సిన అవసరాన్ని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. కరువును, అధిక ఉష్ణోగ్రతను తట్టుకోగల, వరదల నుంచి కోలుకునే సామర్థ్యంగల పంటలపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకతను గుర్తుచేశారు. పంట మార్పిడి, భూసార అనుకూల పంటల సాగుపై పరిశోధనలు పెంచాలని శ్రీ మోదీ పిలుపునిచ్చారు. అంతేకాకుండా రైతులకు అందుబాటులో ఉండేవిధంగా భూసార పరీక్ష ఉపకరణాలను రూపొందించాలన్నారు. అలాగే ప్రభావశీల పోషక నిర్వహణ పద్ధతుల రూపకల్పన కూడా ఎంతో అవసరమన్నారు.

సౌరశక్తితో పనిచేసే సూక్ష్మ నీటిపారుదల విధానాల దిశగా కృషిని ముమ్మరం చేయాల్సి ఉందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. బిందు సేద్యం వ్యవస్థలతోపాటు లక్షిత నీటిపారుదల పద్ధతిని మరింత విస్తృతంగా, ప్రభావవంతంగా రూపొందించాలని పిలుపునిచ్చారు. ఉపగ్రహ సమాచారం, కృత్రిమ మేధ, మెషీన్‌ లెర్నింగ్‌ వంటి అత్యాధునిక సాంకేతిక విజ్ఞానాన్ని వ్యవసాయ వ్యవస్థలలో అనుసంధానించడాన్ని ఆయన ప్రస్తావించారు. పంట దిగుబడిపై అంచనాలతో తెగుళ్లపై పర్యవేక్షణ, విత్తన పద్ధతులకు మార్గనిర్దేశం చేసే వ్యవస్థను రూపొందించలేమా? అని శ్రీ మోదీ ప్రశ్నించారు. అలాగే అలాంటి ప్రత్యక్ష సమాచార-నిర్ణయ మద్దతు వ్యవస్థను ప్రతి జిల్లాలో అందుబాటులో ఉంచే అవకాశాలు లేవా? అని వాకబు చేశారు. వ్యవసాయ-సాంకేతిక అంకుర సంస్థలకు నిపుణులు నిరంతరం మార్గనిర్దేశం చేయాలని ప్రధానమంత్రి కోరారు. వ్యవసాయ సవాళ్ల పరిష్కారం దిశగా పెద్ద సంఖ్యలో యువత ఆవిష్కరణాత్మక కృషి చేస్తున్నదని చెప్పారు. అనుభవజ్ఞులైన నిపుణుల మార్గదర్శకత్వంలో వీరు రూపొందించే ఉత్పత్తులు మరింత ప్రభావవంతంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

“భారత వ్యవసాయ సమాజానికి సుసంపన్న సంప్రదాయ జ్ఞాన భాండాగారం ఉంది. ఆ పద్ధతులను ఆధునిక శాస్త్రవిజ్ఞానంతో మేళవించి, సంపూర్ణ జ్ఞాన నిధిని సృష్టించవచ్చు” అని ప్రధానమంత్రి సూచించారు. నేటి పరిస్థితుల్లో పంటల వైవిధ్యం జాతీయ ప్రాథమ్యమని, దీనిపై రైతులకు అవగాహన కల్పించడం ఆవశ్యకమని శ్రీ మోదీ స్పష్టం చేశారు. వైవిధ్యంతో లభించే ప్రయోజనాలను, దాన్ని అనుసరించకపోతే వాటిల్లే దుష్పరిణామాలను రైతులకు విశదీకరించాలని కోరారు. ఈ దిశగా నిపుణులు అత్యంత ప్రభావశీల పాత్ర పోషించగలరని ఆయన వ్యాఖ్యానించారు.

వ్యవసాయ సాంకేతికతను ప్రయోగశాల నుంచి పొలాలకు తీసుకెళ్లే కృషి ముమ్మరం కావాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. తాను 2024 ఆగస్టు 11న ‘పూసా’ ప్రాంగణాన్ని సందర్శించానని, 2025 మే, జూన్ నెలల్లో “వికసిత కృషి సంకల్ప అభియాన్”ను ప్రారంభించానని గుర్తు చేసుకుంటూ ఆయన హర్షం ప్రకటించారు. ఈ కార్యక్రమం కింద తొలిసారి 700కుపైగా జిల్లాల్లో 2,200కుపైగా శాస్త్రవేత్తల బృందాలు ప్రచారం నిర్వహించాయని తెలిపారు. ఇందులో భాగంగా 60,000కుపైగా కార్యక్రమాలు నిర్వహించడంతో దాదాపు 1.25 కోట్ల మంది రైతులు శాస్త్రవేత్తలతో నేరుగా అనుసంధానమయ్యారని పేర్కొన్నారు. రైతులకు శాస్త్రీయ సమాచార సౌలభ్యాన్ని మరింత విస్తరింపజేయడంలో ఈ కార్యక్రమం ఒక ప్రశంసనీయ ప్రయత్నమని ఆయన వ్యాఖ్యానించారు.

“వ్యవసాయమంటే పంటల సాగుకు మాత్రమే పరిమితమైనది కాదు... అది మానవాళి  జీవితాలతో ముడిపడిన అంశమని డాక్టర్ ఎం.ఎస్.స్వామినాథన్ మనకు బోధించారు” అని శ్రీ మోదీ గుర్తుచేశారు. వ్యవసాయం ప్రజల జీవనోపాధి కాగా, పొలంతో అనుసంధానితమైన ప్రతి వ్యక్తి గౌరవం, ప్రతి సమాజ శ్రేయస్సు, ప్రకృతి పరిరక్షణ ప్రభుత్వ వ్యవసాయ విధానాలను బలోపేతం చేస్తాయని ఆయన వివరించారు. శాస్త్రవిజ్ఞానాన్ని, సమాజాన్ని ఒక ఉమ్మడి సూత్రంతో అనుసంధానించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే చిన్న రైతుల ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. పొలాల్లో శ్రమించే మహిళల సాధికారత ప్రాముఖ్యాన్ని ఆయన స్పష్టం చేశారు. ఈ దార్శనికతతో దేశం ముందుకు సాగాలని ఆకాంక్షించారు. చివరగా- లక్ష్యంవైపు సాగడంలో డాక్టర్ స్వామినాథన్ స్ఫూర్తి మార్గనిర్దేశం చేస్తుందని పేర్కొంటూ ప్రధానమంత్రి తన ప్రసంగం ముగించారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్, నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ రమేష్ చంద్, ఎం.ఎస్.స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ శ్రీమతి సౌమ్య స్వామినాథన్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

నేపథ్యం

న్యూఢిల్లీలోని ‘ఐసీఏఆర్, పూసాలో ఈరోజు ఎం.ఎస్. స్వామినాథన్ శతాబ్ది అంతర్జాతీయ సదస్సును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. “సతతహరిత విప్లవం-జీవ సౌఖ్యానికి మార్గం” ఇతివృత్తంగా నిర్వహించిన ఈ సదస్సు అందరికీ ఆహారంపై భరోసాలో ప్రొఫెసర్ స్వామినాథన్ అంకితభావాన్ని ప్రతిబింబించింది. శాస్త్రవేత్తలు, విధాన నిర్ణేతలు, అభివృద్ధి నిపుణులు, ఇతర భాగస్వాములు ‘సతతహరిత విప్లవం’ సూత్రాల విస్తరణపై లోతుగా చర్చించి, విశ్లేషించడానికి ఈ సదస్సు అవకాశం కల్పించింది. జీవవైవిధ్యం, సహజ వనరుల సుస్థిర నిర్వహణ, ఆహారం-పోషకాహార భద్రత దిశగా సుస్థిర వ్యవసాయం, వాతావరణ మార్పు అనుగుణ పునరుత్థాన శక్తి బలోపేతం, సుస్థిర-సమాన జీవనోపాధికి తగిన సాంకేతిక పరిజ్ఞానాల వినియోగం, యువత-మహిళలు-అణగారిన వర్గాలు అభివృద్ధి చర్చలలో పాల్గొనడం వంటివి ఇతరత్రా ముఖ్యమైన ఇతివృత్తాలుగా ఉన్నాయి.
ప్రొఫెసర్‌ స్వామినాథన్‌ వారసత్వాన్ని గౌరవిస్తూ- ఎం.ఎస్‌.స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్, ‘ది వరల్డ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’ సంయుక్తంగా “ఎం.ఎస్‌.స్వామినాథన్ ఫుడ్ అండ్ పీస్ అవార్డు”ను ప్రారంభించాయి. ఈ పురస్కారానికి ఎంపికైన నైజీరియా శాస్త్రవేత్తకు ప్రధానమంత్రి తొలి అవార్డును ప్రదానం చేశారు. వర్ధమాన దేశాల్లో శాస్త్ర పరిశోధన, విధానాల రూపకల్పన, అట్టడుగు స్థాయి భాగస్వామ్యం లేదా స్థానిక సామర్థ్య వికాసంతో ఆహార భద్రత మెరుగుదల, వాతావరణ న్యాయం, సమానత్వం, బలహీన-అణగారిన వర్గాలకు శాంతి చేకూర్చడం తదితరాల్లో అత్యుత్తమ కృషి చేసినవారిని గుర్తిస్తూ ఈ అంతర్జాతీయ అవార్డు ప్రదానం చేస్తారు.


(Release ID: 2157282) Visitor Counter : 6