కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
హానికరమైన లింకులూ, మెసేజుల ఆటకట్టు: బీఎస్ఎన్ ఎల్
వినియోగదారులకు సురక్షితమైన, భద్రమైన, నిరంతర అనుసంధానం
Posted On:
14 AUG 2025 1:49PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న తన నెట్వర్కు ద్వారా మొబైల్ వినియోగదారులకు ఎలాంటి యాప్ అవసరం లేకుండా, ఫోన్లో ఎలాంటి మార్పులూ చేయాల్సిన అవసరం లేకుండా యాంటీ-స్పామ్, యాంటీ-స్మిషింగ్ రక్షణను అమలు చేస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ ఈ రోజు ప్రకటించింది. ఎస్ఎంఎస్లో అనుమానాస్పద, మోసపూరిత యూఆర్ఎల్స్ ఉంటే వాటిని ముందుగానే గుర్తించి నెట్వర్కు స్థాయిలోనే అడ్డుకొని బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు నకిలీ లింకులు చేరకుండా ఆపుతాయి. అయితే ట్రాయ్ డీఎల్‌టీ/యూసీసీ నిబంధనల ప్రకారం చట్టబద్ధమైన ఓటీపీలు, బ్యాంకింగ్, ప్రభుత్వ సందేశాలు వస్తాయి. ఈ పరిష్కారాన్ని ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2024లో పరీక్షించారు. కొనసాగుతున్న కార్యకలాపాల్లో భాగంగా బీఎస్ఎన్ఎల్ సర్కిళ్లలో దీన్ని అమలు చేస్తారు.
భారత్ కేంద్రంగా పనిచేసే ప్రముఖ క్లౌడ్ కమ్యూనికేషన్ల కంపెనీ- తాన్లా సాయంతో దీనిని అమలు చేస్తున్నారు. ఈ వ్యవస్థ ఏఐ/ఎంల్, ఎన్ఎల్‌పీ, రెప్యుటేషన్ ఇంటిలిజెన్స్, లింక్ ఎక్స్‌టెన్షన్లను మిళితం చేసి, సందేశాలను లైన్-రేటు వద్ద లెక్కిస్తుంది. అలాగే అవాంఛిత వాణిజ్య సమాచారాన్ని నిలువరించేందుకు భారతీయ టెలికాం సంస్థలు ఇప్పటికే వినియోగిస్తున్న ఇండస్ట్రీ బ్లాక్ చెయిన్ డీఎల్‌టీ స్టాక్‌తో కలసి పనిచేస్తుంది. కొత్త ప్రచారాలను వేగంగా తటస్థీకరించడానికి వ్యవస్థల ఏకీకరణతో (ఉదాహరణకు ప్రధాన వెబ్, మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లు) స్మిషింగ్ను గుర్తించడంలో, జాతీయ స్థాయి నిర్వహణలో ఈ సాంకేతికతకు 99 శాతానికి పైగా సామర్థ్యం ఉందని గుర్తించారు.
నో-స్పామ్... పరిష్కారంలో ప్రధానాంశాలు:
రోజుకి 1.5 మిలియన్ల మోసాలను గుర్తిస్తుంది.
నెలకు 35,000 ప్రత్యేకమైన మోసపూరిత లింకులు, మోసాలకు పాల్పడే 60,000 వాట్సాప్, మొబైల్ నంబర్లను గుర్తిస్తుంది.
నాలుగు ఏఐ/ఎంఎల్ ఇంజిన్లు, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (ఎన్ఎల్‌పీ), డీప్ లెర్నింగ్‌తో ఇది శక్తిమంతమైంది.
మీరు బీఎస్ఎన్ఎల్ వినియోగుదారులైతే.. మోసపూరిత లింకులున్న ఎస్ఎంఎస్‌లు డెలివరీ సమయంలో వాటికవే బ్లాక్ అవుతాయి. వినియోగదారుల వివరాల దొంగతనం, చెల్లింపు మోసాలు జరిగే అవకాశాలను తగ్గిస్తుంది.
లభ్యత: అన్ని సర్కిళ్లలోని బీఎస్ఎన్ఎల్ మొబైల్ వినియోగారులకు ఈ రక్షణ లభిస్తుంది.
మరింత సమాచారం కోసం: 1800-180-1503 లేదా www.bsnl.co.in.
బీఎస్ఎన్ఎల్ - భారత్‌ను సురక్షితంగా అనుసంధానిస్తుంది.
***
(Release ID: 2156423)