నౌకారవాణా మంత్రిత్వ శాఖ
సముద్ర రంగ భవిష్యత్ నవశకానికి నాంది పలికే ‘భారత ఓడరేవుల బిల్లు-2025’కు లోక్‌సభ ఆమోదం
· ఓడరేవుల సమగ్రాభివృద్ధి దిశగా సహకారాత్మక సమాఖ్య తత్వాన్ని ప్రోత్సహించే ‘మారిటైమ్ స్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్’ (ఎంఎస్‌డీసీ) ఏర్పాటు: శ్రీ సర్బానంద సోనోవాల్
· భవిష్యత్ సంసిద్ధ భారత సముద్ర రంగానికి భరోసా ఇస్తూ ‘ఓడరేవులతో సౌభాగ్యం’పై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దృక్కోణాన్ని ఈ బిల్లు ప్రతిబింబిస్తోంది: మంత్రి
Posted On:
12 AUG 2025 4:17PM by PIB Hyderabad
ఒక చిరస్మరణీయ తరుణంలో భాగంగా దేశ సముద్ర రంగ భవిష్యత్ నవశకానికి నాంది పలికే ‘భారత ఓడరేవుల బిల్లు-2025’ను లోక్‌సభ ఈ రోజు ఆమోదించింది. దేశంలో ఓడరేవుల నిర్వహణ-నియంత్రణల విధానాలను ఈ చట్టం ఆధునికీకరిస్తుంది. వాణిజ్య సామర్థ్యాన్ని పెంచడంతోపాటు ప్రపంచ సముద్ర రంగ అగ్రగామిగా భారత్ స్థానాన్ని మరింత పటిష్ఠం చేస్తుంది. అంతకుముందు కేంద్ర ఓడరేవులు-నౌకారవాణా-జలమార్గాల శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ఈ బిల్లును ప్రవేశపెడుతూ- ‘వలస పాలన నాటి నియంత్రణలు-నిబంధనలను తుడిచిపెట్టిన ఈ బిల్లు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షిత స్వావలంబన, అంతర్జాతీయ స్థాయి సముద్ర రంగ దార్శనికతను ప్రతిబింబిస్తుంది’ అని వ్యాఖ్యానించారు.
ఈ బిల్లు సరకుల రవాణాను వేగిరం చేయడంతోపాటు అనుసంధానం పెంపు ద్వారా రవాణా సంబంధిత వ్యయాన్ని తగ్గిస్తుంది. రేవుల కార్యకలాపాలు, రవాణా సదుపాయాలు, గిడ్డంగులు సహా అనుబంధ పరిశ్రమలలో గణనీయ ఉపాధి అవకాశాలను సృష్టించగలదని అంచనా. దీంతోపాటు కఠిన కాలుష్య నిరోధక చర్యలు, పర్యావరణ హిత రేవు విధానాలను ఈ బిల్లు విశదీకరించడమే కాకుండా పరిశుభ్ర వాతావరణానికి దోహదపడుతుంది. ఈ బిల్లు చట్టరూపం దాల్చిన నేపథ్యంలో క్రమబద్ధీకరించిన విధానాలతో అడ్డంకులు తొలగిపోవడం సహా మెరుగైన మౌలిక సదుపాయాలతో కార్యకలాపాలు సజావుగా సాగుతూ ఎగుమతిదారులు, ‘ఎంఎస్‌ఎంఈ’లు ఎంతో ప్రయోజనం పొందే వీలుంటుంది.
“భారత ఓడరేవులు అంతర్జాతీయ పోటీతత్వంతో కార్యకలాపాలు నిర్వహించే దిశగా నిర్ణయాత్మక ముందడుగుకు ఈ బిల్లు ఒక సూచిక. అంతేకాకుండా పర్యావరణ పరిరక్షణ, తీరప్రాంత ప్రజానీకానికి సాధికారత కల్పిస్తుంది. ఒక్కమాటలో చెబితే ‘ఓడరేవులతో సౌభాగ్యం’పై గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దృక్కోణాన్ని ఇది ప్రతిబింబిస్తోంది. తదనుగుణంగా మన సముద్ర రంగాన్ని భవిష్యత్ సంసిద్ధం చేస్తుంది” అని శ్రీ సర్బానంద సోనోవాల్ వ్యాఖ్యానించారు.
ఈ బిల్లు ఓడరేవులకు జవాబుదారీతనంతో కూడిన అధిక స్వయంప్రతిపత్తినిస్తుంది. పారదర్శక చట్రంలో స్పర్థాత్మక సుంకాలను నిర్ణయించే వీలు కల్పిస్తుంది. రేవుల దీర్ఘకాలిక అభివృద్ధి దిశగా సమగ్ర ప్రణాళికను సమకూరుస్తుంది. సరకు రవాణాలో వృద్ధికి భరోసా ఇవ్వడంతోపాటు మెరుగైన అంతర్గత జలమార్గ అనుసంధానం కల్పిస్తుంది. మరోవైపు తీరప్రాంత నౌకా రవాణాను ప్రోత్సహిస్తుందని, అంతర్గత జలమార్గాలు, బహుళ రవాణా వ్యవస్థలతో నిరంతర సంధానంలో ఉంటుందని భావిస్తున్నారు. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలు (పీపీపీ), రేవు ప్రాజెక్టులలో విదేశీ పెట్టుబడులకు స్పష్టమైన నిబంధనలను రూపొందించడం ద్వారా నిధుల సమీకరణను సరళం చేస్తుంది.
నిర్దేశిత లక్ష్యాల సాధనకు మద్దతుగా బలమైన సంస్థాగత చట్రాన్ని ఈ బిల్లు ఏర్పాటు చేస్తుంది. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులతో ‘మారిటైమ్ స్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్’ (ఎంఎస్‌డీసీ) ఏర్పాటు సహా జాతీయ రేవుల అభివృద్ధి వ్యూహాలను సమన్వయం చేస్తుంది. చిన్న రేవుల సమర్థ నిర్వహణ దిశగా ‘రాష్ట్ర మారిటైమ్ బోర్డుల అధికారాలను మరింత బలోపేతం చేస్తుంది. దీనికితోడు రేవులు, వినియోగదారులు, సేవా ప్రదాతల మధ్య వివాదాలను తీర్చడాన్ని పరిష్కార కమిటీలు వేగవంతం చేస్తాయి.
ఈ సందర్భంగా శ్రీ సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ- ‘మారిటైమ్ స్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (ఎంఎస్‌డీసీ) మన ఓడరేవుల సమగ్రాభివృద్ధికిగల అడ్డంకులను తొలగిస్తుంది. రేవులన్నీ సజావుగా ముందంజ వేయడం లక్ష్యం కాబట్టి, సహకారాత్మక సమాఖ్య తత్వాన్ని ప్రోత్సహించడం కూడా ఈ బిల్లు లక్ష్యం. ఇది రాష్ట్రాల స్థాయిలోనూ సముద్ర రంగ బోర్డు ఏర్పాటుకు తోడ్పడుతుంది. చిన్న రేవుల సమర్థ నిర్వహణకు దోహదం చేస్తుంది. ఓడరేవుల అభివృద్ధి లక్ష్యంగా సమగ్ర చట్రం రూపకల్పనకు వీలు కల్పిస్తుంది.
ప్రధానమంత్రి శ్రీ మోదీ చురుకైన నాయకత్వాన వికసిత భారత్ సముద్ర నైపుణ్యాభివృద్ధి దిశగా మన వ్యవస్థను శక్తిమంతం చేయగల వాతావరణాన్ని మేం సృష్టిస్తున్నాం. తద్వారా భారత్ 2047 నాటికి సముద్ర రంగ దేశాల్లో అగ్రగామిగా అవతరిస్తుంది” అని వ్యాఖ్యానించారు.
స్థిరత్వం, భద్రత పరంగా అన్ని రేవులలో వ్యర్థాల స్వీకరణ-నిర్వహణ సదుపాయాల కల్పనను ఈ బిల్లు తప్పనిసరి చేస్తుంది. ఇది ‘మార్పోల్, బల్లాస్ట్ వాటర్ మేనేజ్‌మెంట్ వంటి అంశాలపై అంతర్జాతీయ సదస్సుల తీర్మానాలకు అనుగుణంగా కఠిన కాలుష్య నివారణ చర్యలను కూడా అమలు చేస్తుంది. ప్రతి ఓడరేవు వద్ద విపత్తులు, భద్రత ముప్పుల నివారణ కోసం అత్యవసర సంసిద్ధత ప్రణాళికలు అవసరం. అంతేగాక పునరుత్పాదక ఇంధనం, తీర విద్యుత్ వ్యవస్థల కార్యక్రమం ద్వారా ఉద్గారాల తగ్గింపు, పర్యావరణ స్థిరత్వం పెంపు వగైరాలకు తోడ్పడుతుంది.
“ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వాన భారత సముద్ర రంగం దేశ ఆర్థిక రూపాంతరీకరణకు కీలక చోదకశక్తిగా రూపొందింది. రేవుల ఆధారిత అభివృద్ధి, ప్రపంచ పోటీతత్వం, పర్యావరణ నిర్వహణపై సాగరమాల కార్యక్రమం, మారిటైమ్ ఇండియా విజన్-2030 వంటి ప్రభుత్వ కార్యక్రమాలు దృష్టి సారించాయి. వీటన్నిటినీ ప్రాతిపదికగా తీసుకుంటూ భారత ఓడరేవుల బిల్లు-2025 రూపొందింది. భారత ఓడరేవులు సుస్థిర ఆర్థిక వృద్ధికి, ప్రపంచ వాణిజ్యానికి చోదకాలుగా పరిణామం చెందగలవని ఇది భరోసా ఇస్తోంది” అని శ్రీ సర్బానంద సోనోవాల్ అన్నారు.
అంతర్జాతీయ వాణిజ్య విధానాలు, ఉత్తమాచరణలు, జాతీయ ప్రాథమ్యాలకు అనుగుణంగా భారత చట్టబద్ధ చట్రాన్ని రూపొందించే వినూత్న చట్టం ‘భారత రేవుల బిల్లు-2025. సామర్థ్యం, స్థిరత్వం, సమగ్రతలపై దృష్టి సారించిన ఈ బిల్లు- రాబోయే దశాబ్దాల్లో నిరంతర విజయాలు, వృద్ధికి ప్రతీకగా భారత సముద్ర రంగాన్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అగ్రభాగాన నిలుపుతుంది.
****
(Release ID: 2155936)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Odia
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam