ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కర్ణాటకలోని బెంగళూరు లో సుమారు రూ.22,800 కోట్ల విలువైన మెట్రో ప్రాజెక్టుల ప్రారంభం...శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ


సరిహద్దు దాటి తీవ్రవాద స్థావరాలను ధ్వంసం చేసే శక్తి, తీవ్రవాదులను కాపాడిన పాకిస్థాన్ ను గంటల వ్యవధిలో మోకాళ్లపై కూర్చోబెట్టిన సామర్థ్యం, ‘ఆపరేషన్ సిందూర్’ విజయంతో పాటు, భారత్ కొత్త రూపాన్ని ప్రపంచం మొత్తం చూసింది: ప్రధాని

భారత్ నేడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ: ప్రధాని

గత 11 సంవత్సరాల్లో మన ఆర్థిక వ్యవస్థ 10వ స్థానం నుంచి తొలి 5 స్థానాల్లోకి వచ్చింది.. ఇప్పుడు మూడు అగ్రగామి ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా మారే దిశగా వేగంగా పయనిస్తున్నాం: ప్రధాని

వికసిత భారత్ ప్రయాణం, డిజిటల్ ఇండియాతో చేయి చేయి కలిపి ముందుకు సాగుతుంది: ప్రధాని

మన తదుపరి ప్రధాన లక్ష్యం సాంకేతిక రంగంలో స్వావలంబన సాధించడమే: ప్రధాని

Posted On: 10 AUG 2025 3:31PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు కర్ణాటకలోని బెంగళూరులో సుమారు రూ.7,160 కోట్లతో చేపట్టిన బెంగళూరు మెట్రో యెల్లో లైన్‌ను ప్రారంభించారు. మరోపక్క రూ.15,610 కోట్లకు పైగా విలువైన బెంగళూరు మెట్రో 3వ దశ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే బెంగళూరులోని కేఎస్ఆర్ రైల్వే స్టేషన్‌ నుంచి మూడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు పచ్చజెండా ఊపారు. ఈ సందర్భంగా ఆయన సభను ఉద్దేశించి మాట్లాడుతూ.. కర్ణాటక నేలపై కాలుపెట్టగానే ఒక అనిర్వచనీయ అనుభూతి కలిగిందని పేర్కొన్నారు. కర్ణాటక సంస్కృతి వైభవం, ప్రజల స్నేహపూర్వకత, హృదయాన్ని హత్తుకునే కన్నడ భాష మాధుర్యాన్ని ప్రస్తావిస్తూ... శ్రీ మోదీ ముందుగా బెంగళూరుకు అధిష్ఠాన దేవత అన్నమ్మ తాయికి నమస్కరించారు. శతాబ్దాల క్రితం నాదప్రభు కెంపెగౌడ బెంగళూరు నగరానికి పునాది రాయి వేశారని గుర్తుచేసిన ప్రధానమంత్రి, సంప్రదాయాలతో మమేకమై అభివృద్ధి శిఖరాలను అధిరోహించే నగరాన్ని కెంపెగౌడ ఆనాడే ఊహించారని అన్నారు. “బెంగళూరు ఎల్లప్పుడూ ఆ భావాన్ని కొనసాగిస్తూ దాన్ని కాపాడుతూ వచ్చింది. ఈ రోజు ఆ కలను సాకారం చేసుకుంటోంది” అని ప్రధాని అన్నారు. 

 

“ఈ రోజు, బెంగళూరు నవ భారత పురోగమనానికి ప్రతీకగా నిలిచిన నగరంగా వెలుగొందుతోంది” అని శ్రీ మోదీ తెలిపారు. తాత్విక జ్ఞానాన్ని చెక్కుచెదర నీయక సాంకేతిక నైపుణ్యాన్ని కార్యాచరణలో ప్రతిబింబించే నగరంగా ఆయన బెంగళూరును వర్ణించారు. భారతదేశాన్ని సగర్వంగా ప్రపంచ ఐటీ పటంలో నిలిపిన నగరంగా బెంగళూరును అభివర్ణిస్తూ, ఈ విజయగాథకు ఇక్కడి  ప్రజల కష్టపడి పనిచేసే స్వభావం, ప్రతిభే కారణమని ఆయన పేర్కొన్నారు. 

 

“21వ శతాబ్దంలో నగరాల అభివృద్ధి ప్రణాళికలు, పట్టణ మౌలిక వసతులు అత్యంత కీలకమైన అవసరాలు” అని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. బెంగళూరు వంటి నగరాలు భవిష్యత్తు పయనానికి సిద్ధంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఇటీవలి సంవత్సరాల్లో భారత ప్రభుత్వం బెంగళూరుకు వేల కోట్ల రూపాయల విలువైన అనేక ప్రాజెక్టులను అందించిందని, ఈ రోజు మరో ముందడుగు పడిందని అన్నారు. శ్రీ మోదీ బెంగళూరు మెట్రో యెల్లో లైన్‌ను ప్రారంభించడంతోపాటు  మెట్రో మూడో  దశకు పునాది రాయివేశారు. దేశంలోని విభిన్న ప్రాంతాలను అనుసంధానించే మూడు కొత్త వందే భారత్ రైళ్లకు పచ్చజెండా ఊపారు. బెంగళూరు–బెలగావి వందే భారత్ సర్వీస్ ప్రారంభం కావడంతో  బెలగావిలో వాణిజ్య, పర్యాటక రంగాలు గణనీయంగా అభివృద్ధి చెందుతాయని ఆయన పేర్కొన్నారు. అలాగే నాగ్‌పూర్–పూణే మధ్య, శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా –అమృతసర్ మధ్య కూడా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభమయ్యాయి. ఈ సర్వీసులు లక్షలాది భక్తులకు ప్రయోజనం చేకూర్చి పర్యాటకాన్ని ప్రోత్సహిస్తాయని ప్రధానమంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టులు, కొత్త వందే భారత్ రైళ్ల ప్రారంభం నేపథ్యంలో ఆయన బెంగళూరు, కర్ణాటకతో పాటు యావత్ దేశ ప్రజానీకానికి శుభాకాంక్షలు అందజేశారు.

 

ఆపరేషన్ సిందూర్ తర్వాత తాను బెంగళూరుకు రావడం ఇదే మొదటిసారని పేర్కొంటూ.. భారత దళాలు ఆపరేషన్ సిందూర్లో సాధించిన విజయాన్ని శ్రీ మోదీ ప్రస్తావించారు. సరిహద్దు దాటి తీవ్రవాద స్థావరాలను ధ్వంసం చేసే సామర్థ్యాన్ని వారు ప్రదర్శించారని ఆయన తెలిపారు. తీవ్రవాదుల కొమ్ముకాసిన పాకిస్థాన్ ను గంటల వ్యవధిలో మోకాళ్లపై కూర్చోబెట్టిన భారత శక్తిని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. “నవ భారతావని కొత్త రూపాన్ని ప్రపంచం మొత్తం చూసింది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ విజయానికి రక్షణ రంగంలో సాంకేతిక శక్తి, మేక్ ఇన్ ఇండియా బలం ప్రధాన కారణమని ఆయన వివరించారు. ఈ విజయానికి బెంగళూరు, కర్ణాటక యువత అందించిన విశిష్ట సహకారాన్ని గుర్తిస్తూ అందరికీ ఆయన అభినందనలు తెలిపారు.

 

ఇప్పుడు ప్రపంచంలోని ప్రధాన నగరాల సరసన బెంగళూరు గుర్తింపు పొందిందని పేర్కొంటూ, భారత్ ప్రపంచస్థాయిలో పోటీపడడమే కాకుండా ముందుండాలని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. మన నగరాలు స్మార్ట్‌గా, వేగంగా, సమర్థవంతంగా మారినప్పుడే పురోగతి సాధ్యమవుతుందని, ఆధునిక మౌలిక ప్రాజెక్టులను పూర్తి చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ఆయన తెలిపారు. ఆర్వీ రోడ్ నుంచి బొమ్మసంద్ర వరకు బెంగళూరు మెట్రో యెల్లో లైన్ ను ప్రారంభిస్తున్నట్లు శ్రీ మోదీ ప్రకటించారు. ఇది బెంగళూరులోని అనేక ముఖ్య ప్రాంతాలను అనుసంధానిస్తుందని చెప్పారు. బసవనగుడి, ఎలక్ట్రానిక్ సిటీ మధ్య ప్రయాణ సమయం ఇప్పుడు గణనీయంగా తగ్గుతుందని, ఇది లక్షలాది మందికి జీవన సౌలభ్యం, పని సౌకర్యాన్ని పెంచుతుందని ఆయన పేర్కొన్నారు. 

 

యెల్లో లైన్ ప్రారంభంతో పాటు బెంగళూరు మెట్రో మూడో దశ -అంటే ఆరెంజ్ లైన్- కు కూడా పునాది రాయివేసినట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. ఆరెంజ్ లైన్ కూడా అందుబాటులోకి వస్తే రెండింటితో కలిపి రోజుకు 25 లక్షల మంది ప్రయాణికుల రాకపోకలకు వీలవుతుందని ఆయన తెలిపారు. ఇది బెంగళూరు రవాణా వ్యవస్థను మరింత శక్తిమంతం చేసి కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని అన్నారు. బెంగళూరు మెట్రో దేశంలో ప్రజా మౌలిక వసతుల అభివృద్ధికి ఒక కొత్త మోడల్‌ను పరిచయం చేసిందని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్, బయోకాన్, డెల్టా ఎలక్ట్రానిక్స్ వంటి సంస్థలు పలు కీలక మెట్రో స్టేషన్లకు కొంతమేర నిధులు సమకూర్చాయని ఆయన ప్రస్తావించారు. ఈ వినూత్న సీఎస్‌ఆర్‌ ప్రయత్నం ఒక ప్రేరణగా నిలుస్తుందని  ప్రశంసిస్తూ, సహకారమందించిన  కార్పొరేట్ రంగానికి ఆయన అభినందనలు తెలిపారు. 

 

“భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ. గత పదకొండు సంవత్సరాల్లో, భారత ఆర్థిక వ్యవస్థ 10వ స్థానం నుంచి ప్రపంచంలో ఐదు అగ్రస్థాయి దేశాల్లో ఒకటిగా ఎదిగి ఇప్పుడు తొలి మూడు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా మారే దిశగా వేగంగా పయనిస్తోంది” అని శ్రీ మోదీ పేర్కొన్నారు. కచ్చితమైన సంకల్పం, నిజాయితీ తో కూడిన కృషి ప్రధానాంశాలుగా  “రిఫార్మ్, పర్ఫార్మ్ అండ్ ట్రాన్స్‌ఫార్మ్” భావన ఈ పురోగతికి ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. మౌలిక వసతుల అభివృద్ధిని ప్రస్తావిస్తూ, 2014లో మెట్రో సేవలు కేవలం ఐదు నగరాలకే పరిమితమై ఉన్నాయని ప్రధాని గుర్తుచేశారు. ఈ రోజు, 24 నగరాల్లో 1,000 కి.మీ.కుపైగా విస్తరించిన మెట్రో నెట్‌వర్క్‌తో, భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌ కలిగిన దేశంగా నిలిచిందని ఆయన తెలిపారు. 2014కు ముందు రైల్వే మార్గాల్లో కేవలం 20,000 కి.మీ. రైల్వే మార్గాలను మాత్రమే విద్యుదీకరించగా, గత పదకొండు సంవత్సరాల్లోనే 40,000 కి.మీ.కుపైగా రైల్వే మార్గాలు విద్యుదీకరించామని, ఇది సుస్థిర రవాణా అభివృద్ధిలో ఒక విశేషమైన ముందడుగని ఆయన పేర్కొన్నారు.

 

భారత్ విజయాలు పుడమికే పరిమితం కాలేదని, నింగిని సైతం తాకాయని పేర్కొంటూ.. 2014లో దేశంలో కేవలం 74 విమానాశ్రయాలే ఉండగా, ఈ రోజు ఆ సంఖ్య 160 దాటిందని  ప్రధానమంత్రి వెల్లడించారు. అలాగే, జలమార్గాల అభివృద్ధిలో సాధించిన విశేష పురోగతిని ప్రస్తావిస్తూ, 2014లో కేవలం మూడు జాతీయ జలమార్గాలే కార్యకలాపాలు నిర్వహిస్తూండగా ఇప్పుడా సంఖ్య ముప్పైకి పెరిగిందని ఆయన పేర్కొన్నారు.

 

ఆరోగ్య, విద్యా రంగాల్లో భారత్ సాధించిన విశేష ప్రగతిని ప్రస్తావిస్తూ 2014 వరకు దేశంలో కేవలం 7 ఎయిమ్స్, 387 వైద్య కళాశాలలే ఉండగా ఈ రోజు 22 ఎయిమ్స్, 704 వైద్య కళాశాలలు ప్రజలకు సేవలందిస్తున్నాయని శ్రీ మోదీ తెలిపారు. గత 11 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా లక్షకు పైగా కొత్త వైద్య సీట్లు పెరిగాయని ఆయన పేర్కొన్నారు. ఫలితంగా  మధ్యతరగతి పిల్లలు విస్తృత అవకాశాలను పొందారని ఆయన హైలైట్ చేశారు. గత 11 సంవత్సరాల్లో ఐఐటీల సంఖ్య 16 నుంచి 23కు, ఐఐఐటీల సంఖ్య 9 నుంచి 25కు, ఐఐఎంల సంఖ్య 13 నుంచి 21కు పెరిగిందని శ్రీ మోదీ తెలిపారు. ఈ రోజు విద్యార్థులకు ఉన్నత విద్యలో మరిన్ని అవకాశాలు అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

 

ఈ రోజు దేశం వేగంగా పురోగమిస్తున్నవేళ  పేదలు, అణగారిన వర్గాల జీవితాలు కూడా అదే స్థాయిలో మారుతున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 4 కోట్లకు పైగా పక్కా ఇళ్లు అందించామని తెలిపారు. ప్రభుత్వం ఇప్పుడు మరో 3 కోట్లు ఇళ్లు నిర్మించడానికి సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. కేవలం 11 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా 12 కోట్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించామని శ్రీ మోదీ తెలిపారు. ఈ కార్యక్రమం కోట్లాది తల్లులు, అక్కాచెల్లెమ్మలకు గౌరవం, శుభ్రత, భద్రతను అందించిందని ఆయన పేర్కొన్నారు. 

 

“దేశంలో జరుగుతున్న వేగవంతమైన అభివృద్ధి కార్యక్రమాలన్నీ భారత ఆర్థిక వృద్ధి కి అనుగుణంగా ముందుకు సాగుతున్నవే" అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు. 2014కు ముందు భారత మొత్తం ఎగుమతులు 468 బిలియన్ డాలర్లు ఉండగా, ఈ రోజు ఆ సంఖ్య 824 బిలియన్ డాలర్లకు పెరిగిందని ఆయన పేర్కొన్నారు. గతంలో భారత్ మొబైల్ ఫోన్లను దిగుమతి చేసుకునేదని, కానీ ఇప్పుడు మొబైల్ హ్యాండ్‌సెట్లను ఎగుమతి చేసే అయిదు అగ్రగామి దేశాల్లో ఒకటిగా మారిందని ప్రధాని తెలిపారు. ఈ మార్పులో బెంగళూరు కీలక పాత్ర పోషించిందని ఆయన పేర్కొన్నారు. అలాగే 2014కు ముందు భారత ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు సుమారు 6 బిలియన్ డాలర్లు ఉండగా, ఇప్పుడవి దాదాపు 38 బిలియన్ డాలర్లకు పెరిగినట్లు ఆయన వెల్లడించారు.

 

పదకొండు సంవత్సరాల క్రితం భారత ఆటోమొబైల్ ఎగుమతులు సుమారు 16 బిలియన్ డాలర్లు ఉండగా, ఈ రోజు ఆ సంఖ్య రెండింతలకు పైగా పెరిగి, భారత్‌ను ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆటోమొబైల్ ఎగుమతిదారుగా నిలిపిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ విజయాలు ఆత్మనిర్భర్ భారత్ సంకల్పాన్ని మరింత బలపరుస్తాయని, దేశం కలిసి ముందుకు సాగి వికసిత భారతాన్ని నిర్మిస్తుందని ఆయన పేర్కొన్నారు. 

 

“వికసిత భారత్‌ ప్రయాణం డిజిటల్ ఇండియాతో చేయి చేయి కలుపుకొని ముందుకు సాగుతుంది” అని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఇండియా ఏఐ మిషన్ వంటి కార్యక్రమాల ద్వారా భారత్‌ ప్రపంచ స్థాయి ఏఐ నాయకత్వం వైపు దూసుకెళ్తోందని తెలిపారు. సెమీకండక్టర్ మిషన్ కూడా ఊపందుకుంటోందని, త్వరలోనే భారత్‌ తన సొంత  మేడ్‌-ఇన్‌-ఇండియా చిప్‌ను కలిగి ఉంటుందని ఆయన అన్నారు. తక్కువ వ్యయంతో హైటెక్‌ అంతరిక్ష మిషన్లలో భారత్‌ ప్రపంచానికి ఒక ఆదర్శంగా మారిందని ప్రధాని పేర్కొన్నారు. భవిష్యత్‌ సాంకేతిక రంగాలన్నింటిలోనూ భారత్‌ పురోగమిస్తోందని, ఈ అభివృద్ధిలో అత్యంత విశేషమైన అంశం పేదల సాధికారత అని ఆయన పేర్కొన్నారు. డిజిటలైజేషన్ ఇప్పుడు దేశంలోని ప్రతి గ్రామానికి చేరుకుందని, యూపీఐ ద్వారా ప్రపంచంలోని రియల్ టైమ్ లావాదేవీలలో 50% కంటే ఎక్కువ భారత్‌ ఖాతాలోనే ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం, ప్రజల మధ్య దూరాన్ని సాంకేతికత తగ్గిస్తోందని, ప్రస్తుతం 2,200కుపైగా ప్రభుత్వ సేవలు మొబైల్ ప్లాట్‌ఫామ్‌లపై అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఉమాంగ్‌ యాప్ ద్వారా ప్రజలు ఇళ్ల నుంచే ప్రభుత్వ పనులు పూర్తిచేసుకోవచ్చని, డిజిలాకర్ ద్వారా ప్రభుత్వ సర్టిఫికేట్ల నిర్వహణలోని ఇబ్బందులు తొలగిపోయాయని ఆయన అన్నారు. భారత్ ఇప్పుడు ఏఐ ఆధారిత ముప్పు గుర్తింపు వంటి సాంకేతికతల్లో పెట్టుబడులు పెడుతోందని, డిజిటల్ విప్లవ ప్రయోజనాలు సమాజంలోని చివరి వ్యక్తి వరకు చేరేలా చేయడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ యత్నంలో బెంగళూరు చురుగ్గా  సహకరిస్తోందని ప్రధాని గుర్తించారు. 

 

“మన తదుపరి ప్రధాన లక్ష్యం సాంకేతిక రంగంలో స్వావలంబన సాధించడమే” అని ప్రధానమంత్రి ప్రకటించారు. భారతీయ టెక్ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతూ, మొత్తం ప్రపంచానికి సాఫ్ట్‌వేర్, ఉత్పత్తులను అభివృద్ధి చేశాయని ఆయన వెల్లడించారు. ఇప్పుడు భారత్ సొంత అవసరాలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిన సమయం వచ్చిందని, ముఖ్యంగా సాఫ్ట్‌వేర్, యాప్‌లను ప్రతి రంగంలోనూ ఉపయోగిస్తున్న ఈ కాలంలో కొత్త ఉత్పత్తుల అభివృద్ధిని వేగవంతం చేయాలని ఆయన సూచించారు. ఈ రంగంలో భారత్ కొత్త శిఖరాలను చేరుకోవడం అవసరమని ప్రధాని పేర్కొన్నారు. వికసిస్తున్న రంగాల్లో ముందంజలో ఉండేందుకు కేంద్రీకృత కృషి చేయాలని పిలుపునిస్తూ, మేక్ ఇన్ ఇండియా, తయారీ రంగాల్లో బెంగళూరు, కర్ణాటక ప్రాధాన్యతను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. భారత ఉత్పత్తులు “జీరో డిఫెక్ట్, జీరో ఎఫెక్ట్” ప్రమాణాలను అనుసరించాలి... అంటే అవి నాణ్యతా లోపంలేకుండా, పర్యావరణ హితంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ భారత్ దృష్టిని కర్ణాటక ప్రతిభ ముందుండి నడిపిస్తుందన్న నమ్మకాన్ని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.

 

కేంద్ర ప్రభుత్వమైనా, రాష్ట్ర ప్రభుత్వాలైనా ప్రజాసేవకే కట్టుబడి ఉన్నాయని, పౌరుల జీవితాలను మెరుగుపర్చడానికి సమష్టి కృషి అవసరమని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఈ దిశలో కొత్త సంస్కరణలను అమలు చేయడం ఒక కీలక బాధ్యత అని ఆయన అన్నారు. గత దశాబ్దంలో కేంద్ర ప్రభుత్వం నిరంతరం సంస్కరణల పథంలో పయనించిందని ప్రధాని తెలిపారు. ఉదాహరణకు, చట్టాలను డీక్రిమినలైజ్ చేయడానికి జన విశ్వాస్ బిల్లును ఆమోదించామని, జన విశ్వాస్ 2.0 కూడా ప్రవేశపెడుతున్నామని ప్రకటించారు. అవసరం లేని క్రిమినల్ నిబంధనలతో ఉన్న చట్టాలను గుర్తించి, వాటిని తొలగించే దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులకు నైపుణ్య ఆధారిత శిక్షణ ఇవ్వడం లక్ష్యంగా మిషన్ కర్మయోగి కార్యక్రమాన్ని ప్రస్తావించిన ఆయన, రాష్ట్రాలు కూడా తమ అధికారుల కోసం ఈ లెర్నింగ్ ఫ్రేమ్‌వర్క్‌ను చేపట్టవచ్చని సూచించారు. ఆశావహ జిల్లాల కార్యక్రమం, ఆశావహ బ్లాక్ కార్యక్రమంపై దృష్టి సారిస్తూ, ప్రత్యేక శ్రద్ధ అవసరమైన ప్రాంతాలను రాష్ట్రాలు కూడా గుర్తించాలన్నారు. రాష్ట్ర స్థాయిలో నిరంతర సంస్కరణలను కొనసాగించాలనీ, ఈ సంయుక్త ప్రయత్నాలు కర్ణాటకను అభివృద్ధిలో కొత్త స్థాయిలకు తీసుకెళ్తాయని, ఫలితంగా వికసిత భారత్ దృష్టి సాకారమవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

 

కర్ణాటక గవర్నర్ శ్రీ థావర్ చంద్ గెహ్లోత్, కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ సిద్దరామయ్య, కేంద్ర మంత్రులు శ్రీ మనోహర్ లాల్, శ్రీ హెచ్.డి. కుమారస్వామి, శ్రీ అశ్విని వైష్ణవ్, శ్రీ వి. సోమన్న, సుష్రీ శోభా కరంద్లాజే తదితర విశిష్ట అతిథులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

నేపథ్యం 

 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, రూ. 7,160 కోట్ల వ్యయంతో 19 కి.మీ.కు పైగా పొడవు, 16 స్టేషన్లు కలిగిన బెంగళూరు మెట్రో ఫేజ్-2 ప్రాజెక్ట్‌లోని ఆర్వీ రోడ్ (రగిగుట్ట) నుంచి  బొమ్మసంద్ర వరకు ఉన్న యెల్లో లైన్‌ను ప్రారంభించారు. దీంతో బెంగళూరులో మెట్రో నెట్‌వర్క్ 96 కి.మీ.కు పైగా పెరిగి, ఈ ప్రాంతంలోని అధిక జనాభాకు సేవలు అందిస్తుంది.

 

రూ.15,610 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించనున్న బెంగళూరు మెట్రో ఫేజ్-3 ప్రాజెక్ట్‌కు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్ట్ మొత్తం మార్గ పొడవు 44 కి.మీ.పైగా ఉండి, 31 ఎలివేటెడ్ స్టేషన్లు కలిగి ఉంటుంది. ఈ మౌలిక వసతుల ప్రాజెక్ట్ నగరంలో పెరుగుతున్న రవాణా అవసరాలను తీర్చడమే కాకుండా, నివాస, పారిశ్రామిక, వాణిజ్య, విద్యా ప్రాంతాలకు అనుకూలంగా ఉంటుంది.

 

బెంగళూరు నుంచి మూడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను కూడా ప్రధాన మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. వీటిలో బెంగళూరు–బెలగావి, అమృతసర్–శ్రీమాత వైష్ణో దేవి కత్రా,  నాగ్‌పూర్ (అజ్ని)–పూణే రైళ్లు ఉన్నాయి. ఈ హైస్పీడ్ రైళ్లు ప్రాంతీయ అనుసంధానాన్ని గణనీయంగా పెంచి, ప్రయాణ సమయాన్ని తగ్గించడంతో పాటు ప్రయాణికులకు ప్రపంచస్థాయి ప్రయాణ అనుభవాన్ని అందిస్తాయి.


(Release ID: 2154932)