సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ఛోటా భీమ్ కామిక్ సిరీస్‌ను ఆవిష్కరించిన ప్రచురణల విభాగం..
భారతీయ కంటెంట్ రూపకల్పనతో పాటు స్వదేశీ కథలను వినిపించే సంప్రదాయాలను ప్రోత్సహించడమే లక్ష్యం
*పుస్తకాలు, యానిమేషన్, చలనచిత్రాలు, డిజిటల్ వేదికల్లో భారతీయ కంటెంట్ రూపకల్పనను బలపరచాలన్న ప్రభుత్వ దృష్టికోణానికి అనుగుణంగా ఉందీ కార్యక్రమం
Posted On:
08 AUG 2025 3:22PM by PIB Hyderabad
సరికొత్త ‘ఛోటా భీమ్ కామిక్ సిరీస్’ను సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ప్రచురణల విభాగం ఈ రోజు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఆవిష్కరించింది. భారతీయ కథలతో కంటెంటును రూపొందించడాన్ని ప్రోత్సహించడంతో పాటు సంస్కృతితో ముడిపడ్డ కథలను యువ పాఠకుల వద్దకు చేర్చాలన్న నిబద్ధతను పునరుద్ఘాటించడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మన దేశంలో అత్యంత ప్రజాదరణకు నోచుకున్న బాల పాత్రల్లో ఒకటైన ‘ఛోటా భీమ్’కు సంబంధించిన అంశాలపై ఈ కార్యక్రమంలో చర్చను కూడా చేపట్టారు.

ప్రచురణల విభాగం ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ శ్రీ భూపేంద్ర కైంథోలా ఈ సందర్భంగా ప్రసంగిస్తూ, ‘‘మనం చెప్పే కథలు.. మరీ ముఖ్యంగా పిల్లలకు వినిపించే కథలు, భారతీయతతో ముడిపడి ఉండాలి. మన అవ్వ, తాతలు ఇళ్లలో చిన్న పిల్లలు రాత్రి నిద్రపోయే ముందు వారికి భారతీయ పాత్రలతో కూడిన కథల్ని వినిపించే సంప్రదాయం ఉన్న మన దేశంలో, పబ్లికేషన్స్ డివిజన్ ఈ సంప్రదాయంపై దృష్టి సారించకుండా ఆగిపోలేదు. వాటి గురించి మనం మాతృభాషలో ఎంత ఎక్కువగా మాట్లాడుకొంటే, మన నవ తరం అభివృద్ధి గాథ అంత లోతైన పునాది ఉన్నదిగానూ మారగలుగుతుంది. భారతీయ కథల్లో విలువలు, ధైర్య సాహసాలు నిండి ఉంటాయి కాబట్టి వాటిని అన్ని ప్రాంతాలకూ చేరవేయాల్సిన అవసరం ఎంతయినా ఉంది’’ అన్నారు.
గ్రీన్ గోల్డ్ యానిమేషన్ సంస్థ సహకారంతో రూపొందించిన ఈ కామిక్ సిరీస్ ఢోలక్‌పూర్ అనే ఒక కల్పిత రాజ్యంలో ధైర్యవంతుడు, దయార్ద్ర హృదయమున్న ఓ బాలుడు ‘భీమ్’ చేసే సాహస కృత్యాలను కళ్లకు కడుతుంది. అసాధారణ శక్తికి మారుపేరైన భీమ్.. భారతీయ సంస్కృతి, జానపద కథలతో ప్రేరణను పొందుతాడు.. స్నేహం, సాహసం, జట్టు స్ఫూర్తితో పాటు నైతిక విలువలకు ప్రతీకగా నిలబడతాడు.
గ్రీన్ గోల్డ్ యానిమేషన్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీ రాజీవ్ చిలకా మాట్లాడుతూ, ‘‘వేవ్స్-2025 వంటి కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తూ.. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ రంగాల్లో భారతీయ కంటెంటును ప్రోత్సహిస్తోంది. ఈ మద్దతును ఇలాగే అందిస్తూ ఉంటే, ఈ రంగాల్లో ప్రపంచంలో అగ్రగామిగా ఎదగడానికి భారత్ సన్నద్ధురాలవడం ఖాయం’’ అన్నారు.
ఇటీవల ముంబయిలో నిర్వహించిన వేవ్స్ శిఖరాగ్ర సదస్సులో వ్యక్తమైన స్ఫూర్తిని ఈనాటి కార్యక్రమం ప్రతిఫలిస్తోంది. మన దేశ ప్రేక్షకవర్గాల ఆదరణకు నోచుకొనే, భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే కంటెంటును రూపొందిస్తూ, భారత సృజనాధార ఆర్థిక వ్యవస్థను బలపరుద్దామంటూ వేవ్స్ శిఖరాగ్ర సదస్సులో పిలుపునిచ్చారు. అన్ని వయసుల వారిని కూడా ఆకట్టుకునే విధంగా రూపొందిన ఈ సిరీస్ పుస్తకాలు.. యానిమేషన్, చలనచిత్రాలు, డిజిటల్ వేదికలలో భారతీయ కథనాలను ప్రోత్సహించాలన్న విశాల జాతీయ లక్ష్యసాధనకు తోడ్పాటును అందిస్తూ బాలల సాహిత్యం పెద్దఎత్తున వచ్చేందుకు తగిన వాతావరణాన్ని ఏర్పరచనుంది.
***
(Release ID: 2154508)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam