సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ప్రజా సేవ ఆధారిత విధానంతో భారత భాషా-సాంస్కృతిక వైవిధ్యం పెంచుతున్న ‘వేవ్స్ ఓటీటీ’: పార్లమెంటులో ప్రభుత్వ ప్రకటన
· వాణిజ్య-వినోద కేంద్రీకృత ప్రైవేట్ పద్ధతులకు పూర్తి భిన్నంగా ‘వేవ్స్ ఓటీటీ’ ద్వారా ఎంపిక చేసిన వినోద.. భారతీయ వారసత్వ.. ప్రజా సేవా కార్యక్రమాలతోపాటు వార్తలు ప్రసారం: ‘ఐ అండ్ బి’ సహాయమంత్రి
· ఆకాశవాణి... దూరదర్శన్ ద్వారా విశ్వసనీయ.. సుసంపన్న సాంస్కృతిక కార్యక్రమాలను ‘వేవ్స్ ఓటీటీ’ అందిస్తుంది... దీంతోపాటు భారతీయ వారసత్వం, ప్రాంతీయ వైవిధ్యం, ప్రజా సేవా కార్యక్రమాలు, వార్తలను ఉచితంగా ప్రసారం చేస్తుంది
· కంటెంట్ సృష్టికర్తలు, ప్రాంతీయ ప్రసారకర్తలు, సాంస్కృతిక సంస్థల సహకారంతో బహుభాషా... మాండలిక సహిత సారాంశాన్ని ‘వేవ్స్’ ప్రసారం చేస్తుంది... అంతేకాకుండా స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ ఆధారిత పరికరాల ద్వారా చందా రుసుము లేకుండా కూడా వీటిని వీక్షించవచ్చు
Posted On:
08 AUG 2025 5:22PM by PIB Hyderabad
దేశంలో భాషా-సాంస్కృతిక వైవిధ్యం పెంపొందించడం లక్ష్యంగా ‘వేవ్స్ ఓటీటీ’ వేదిక వివిధ సంస్థలతో భాగస్వామ్యం ఏర్పరచుకుంది. ఈ మేరకు బహుళ భారతీయ భాషలు, మాండలికాల సహిత సారాంశ ప్రసారం కోసం కంటెంట్ సృష్టికర్తలు, ప్రాంతీయ ప్రసారకర్తలు, సాంస్కృతిక సంస్థల విస్తృత నెట్‌వర్క్‌తో సంయుక్తంగా పనిచేస్తుంది. విభిన్న సారాంశ అన్వేషణతోపాటు దాన్ని విస్తృత ప్రాంతీయ వీక్షకులకు అందుబాటులో ఉంచేవిధంగా ఆయా భాషల్లో ఉపశీర్షికలు, లభ్యతలోగల సమాచార సుసంపన్నతకు ఈ వేదిక మద్దతిస్తుంది.
ఈ వేదిక ఆకాశవాణి, దూరదర్శన్ ప్రాంతీయ ప్రసార సామర్థ్యాన్ని కూడా వాడుకుంటుంది. ఆకాశవాణి పరిధిలోని 35 ఉపగ్రహ చానెళ్లు, వివిధ ప్రాంతీయ చానెళ్లు కూడా ‘వేవ్స్ ఓటీటీ’ వేదికపై అందుబాటులో ఉంటాయి. దీంతోపాటు ప్రాంతీయ సారాంశ ప్రసారం, వివిధ ఉచిత ప్రసార సంస్థలు ప్రసారం చేసే భిన్న సంస్కృతుల సహిత కార్యక్రమాలు కూడా ‘వేవ్స్’ ద్వారా లభ్యమవుతాయి.
‘వేవ్స్ ఓటీటీ’ ఉచితంగా లభ్యమయ్యే వేదిక. స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ ఆధారిత పరికరాల ద్వారా ఇది అందుబాటులో ఉంటూ విస్తృత డిజిటల్ సౌలభ్యానికి భరోసా ఇస్తుంది. ఆకాశవాణి, దూరదర్శన్ వద్దగల విస్తృత సారాంశ నిధి నుంచే కాకుండా ప్రత్యక్ష ప్రసారాల ద్వారా విశ్వసనీయ, సుసంపన్న సాంస్కృతిక సారాంశాన్ని అందిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటుంది. లో ఎలాంటి చందా, రుసుము లేకుండా భారతీయ వారసత్వం, ప్రాంతీయ వైవిధ్యం, ప్రజా సేవా కార్యక్రమాలు, వార్తలు సహా ఎంపిక చేసిన వినోద సారాంశ ప్రదర్శించడం ఈ వేదిక ప్రధాన వ్యూహం.
ప్రజా సేవ ఆధారిత విధానంతో వాణిజ్య-వినోద కేంద్రీకృత ప్రైవేట్ ఓటీటీ వేదికలకు పూర్తి భిన్నంగా ‘వేవ్స్ ఓటీటీ’ వేదిక ప్రసారాలు చేస్తుంది. వీక్షకులకు అందుబాటులో ఉండటమేగాక వారిని కార్యక్రమాలతో నిమగ్నం చేసే దిశగా ప్రేక్షక ప్రాధాన్య విశిష్టతలను ప్రసారాల్లో పొందుపరుస్తుంది.
గ్రామీణ, పాక్షిక పట్టణ ప్రాంతాల్లో ‘వేవ్స్ ఓటీటీ’ వేదికకు ప్రాచుర్యం కల్పించేందుకు వివిధ ప్రచార, అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఈ మేరకు ఆకాశవాణి, దూరదర్శన్ చానెళ్ల ద్వారా ప్రచారం సహా ‘మైగవ్’ (MyGov) వేదికను కూడా వినియోగించుకుంటున్నారు. అంతేకాకుండా ఆయా ప్రాంతాల ప్రేక్షకులకు చేరువ కావడం కోసం ప్రాంతీయ భాషలలో అందుబాటులోగల సామాజిక మాధ్యమాల ద్వారా ప్రసార భారతి ప్రచారం నిర్వహిస్తోంది. గ్రామీణ ఔత్సాహికుల ద్వారా క్షేత్రస్థాయిలో సార్వత్రిక సేవా కేంద్రాల సహకారం కూడా తీసుకుంటోంది.
కేంద్ర సమాచార-ప్రసారశాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్.మురుగన్ ఇవాళ ఈ సమాచారాన్ని రాజ్యసభలో వెల్లడించారు.
***
(Release ID: 2154507)