కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశవ్యాప్తంగా ఇండియా పోస్ట్ అడ్వాన్స్డ్ పోస్టల్ టెక్నాలజీ (ఏపీటీ)

Posted On: 06 AUG 2025 12:15PM by PIB Hyderabad

ఐటీ 2.0 కింద డిజిటల్ పరివర్తనలో భాగంగా.. ఇండియా పోస్ట్ దేశవ్యాప్తంగా అడ్వాన్స్డ్ పోస్టల్ టెక్నాలజీ (ఏపీటీ) అప్లికేషన్‌ను విస్తృతంగా అమలు చేస్తోంది. సంప్రదాయ విధానాల నుంచి వేగవంతమైన, అంతరాయం లేని, వినియోగదారులకు మరింత కేంద్రీకృత పోస్టల్ సేవల దిశగా ఇదొక ప్రధాన ముందడుగు.

పట్టణ, గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో 1.64 లక్షలకు పైగా పోస్టాఫీసుల్లో ఈ కీలక మార్పులను ప్రవేశపెట్టారు. విస్తృత స్థాయి మార్పులు, సంక్లిష్టతల కారణంగా మొదటి రోజు, అంటే ఆగస్టు 4న కొంత ఒత్తిడి ఏర్పడింది. అయితే సాంకేతిక బృందం రోజంతా శ్రమించి ఆగస్టు 5 నాటికి ఆ సమస్యను పరిష్కరించింది.

ఈ సాంకేతికతలను పెద్దఎత్తున అమలు చేయడం, అందులోని సంక్లిష్టతల కారణంగా ఈ సవాళ్లను పోస్టల్ విభాగం ముందుగానే అంచనా వేసింది. నిర్వహణ సమస్యలను వెంటనే పరిష్కరించడానికి ప్రత్యేక సహాయక బృందాలు, నిరంతర పర్యవేక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేసింది. లావాదేవీల వేగం, డిజిటల్ చెల్లింపుల సమన్వయం, రియల్ టైమ్ ట్రాకింగ్‌తోపాటు మొత్తం వినియోగదారుల అనుభవాన్ని ఏపీటీ వ్యవస్థ గణనీయంగా మెరుగుపరుస్తోంది. ఆగస్టు 5న ఈ అప్లికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా 20 లక్షలకు పైగా వస్తువులు బుక్కవగా.. 25 లక్షలకు పైగా వస్తువులు పంపిణీ అయ్యాయి.

ప్రజా సేవలను అంతరాయం లేకుండా అందించేందుకు ఇండియా పోస్ట్ కృతనిశ్చయంతో ఉంది. అప్లికేషన్ పనితీరును నిశితంగా పర్యవేక్షించడంతోపాటు ఈ కొత్త విధానంలో అంతరాయం లేకుండా, సమర్థమైన సేవలను అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటోంది. ఈ కీలకమైన డిజిటల్ అప్‌గ్రేడ్ సమయంలో పౌరుల సహనం, అందించిన సహకారానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తోంది.


 

***


(Release ID: 2153004)