హోం మంత్రిత్వ శాఖ
ఈ-వీసా విధానం
Posted On:
05 AUG 2025 3:35PM by PIB Hyderabad
విదేశీ పర్యాటకులు, వృత్తినిపుణులు, నైపుణ్యం కలిగిన కార్మికులు, వ్యాపారులు, విద్యార్థులు సహా విదేశీయులను మన దేశంలోకి చట్టబద్ధంగా అనుమతించడానికి పటిష్ఠ వీసా విధానాన్ని భారత్ అమలు చేస్తోంది. విదేశీ ప్రయాణికులు చట్టబద్ధంగా ఇండియాకు రావడానికి మార్గాన్ని సుగమం చేసే ఉద్దేశంతో వీసా వ్యవస్థను సరళంగా, క్రమబద్ధంగా, సులభతరంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం గత కొన్నేళ్లలో అనేక చర్యలు చేపట్టింది. అదే సమయంలో, దేశ ఆంతరంగిక భద్రతను పెంపొందించడానికి సాంకేతిక మౌలిక సదుపాయాలను కూడా పటిష్ఠపరుస్తోంది.
భారతీయ వీసా విధానాన్ని.. ప్రత్యేకించి పర్యాటక వీసా విధానాన్ని.. సరళతరంగాను, సులభమైందిగాను తీర్చిదిద్దడానికి ఈ-వీసా సదుపాయాన్ని ప్రవేశపెట్టారు. 43 దేశాల పౌరుల కోసం 2014 నవంబరులో తీసుకువచ్చిన ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ (ఈటీఏ)తో పాటు ఈ సదుపాయం ప్రస్తుతం 172 దేశాల వారికి అందుబాటులో ఉంది. దీని సాయంతో నిర్దేశించిన 32 అంతర్జాతీయ విమానాశ్రయాలతో పాటు 6 ప్రధాన రేవుల నుంచి కూడా విదేశీయులు భారత్‌లోకి రావొచ్చు. ఈ-వీసా ప్రస్తుతం 13 సబ్-కేటగిరీలలో లభ్యమవుతోంది. ఆ సబ్-కేటగిరీలు: ఈ-టూరిస్ట్ వీసా, ఈ-బిజినెస్ వీసా, ఈ-మెడికల్ వీసా, ఈ-మెడికల్ అసిస్టెంట్ వీసా, ఈ-కాన్ఫరెన్స్ వీసా, ఈ-ఆయుష్ వీసా, ఈ-ఆయుష్ అటెండెంట్ వీసా, ఈ-స్టూడెంట్ వీసా, ఈ-స్టూడెంట్ ఎక్స్ వీసా (e-Student X Visa), ఈ-ట్రాన్జిట్ వీసా, ఈ-మౌంటెనీరింగ్ వీసా, ఈ-ఫిలిం వీసా, ఈ-ఎంట్రీ ఎక్స్ -1 (X-1) వీసా.
ఈ-వీసాను పూర్తిగా ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలో పరిశీలిస్తారు. విదేశీయులు ఈ-వీసా కోసం ఎక్కడి నుంచైనా దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఈ-వీసా విధానాన్ని ప్రవేశపెట్టడంతో పర్యటన, వాణిజ్యం, వైద్య సంబంధ పనుల వంటి చట్టబద్ధ ప్రయోజనాలను నెరవేర్చుకోవడం కోసం విదేశీయులు ఎలాంటి ఇబ్బందులూ ఎదుర్కోకుండా భారత్ రావడానికి అనుకూల స్థితి ఏర్పడింది.
30 రోజుల డబల్ ఎంట్రీ ఈ-టూరిస్ట్ వీసాను 25 అమెరికా డాలర్ల వీసా రుసుంతో 2019 లో ప్రవేశపెట్టారు. రద్దీ అంతగా ఉండని ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో పర్యాటకుల రాకను ప్రోత్సహించడానికి ఈ వీసా రుసుమును 10 అమెరికా డాలర్లకు తగ్గించారు.
వీసా రుసుమును రద్దు చేయడం గాని, లేదా ప్రత్యేక పర్యాటక బృందాలను దృష్టిలో పెట్టుకొని స్పెషల్ వీసా కేటగిరీలను ఏర్పాటు చేయడం సహా ఈ-వీసా విధానాన్ని సులభతరంగాను, సరళతరంగాను చేయడం నిరంతరంగా సాగుతూవస్తున్న ప్రక్రియ. భద్రత, మన దేశ సందర్శనకు తరలివచ్చే పర్యటక బృందాలు, పెట్టుబడులు, ద్వైపాక్షిక సంబంధాలు, ఇచ్చి పుచ్చుకొనే పద్ధతి.. ఇలా వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ ప్రక్రియను చేపడుతుంటారు.
ఈ సమాచారాన్ని లోక్‌సభలో ఒక ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలిపారు.
***
(Release ID: 2152831)