ఆర్థిక మంత్రిత్వ శాఖ
బ్యాంకింగ్ చట్టాల (సవరణ) చట్టం-2025లోని కీలక నిబంధనలు రేపటి నుంచి అమలు
*బ్యాంకుల పరిపాలనను మెరుగుపరచడం, డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడడం, ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆడిట్‌లో మెరుగైన విధానాలు ప్రవేశపెట్టడం,
కోఆపరేటివ్ బ్యాంకులను రాజ్యాంగ ప్రమాణాలకు తగినట్లు తీర్చిదిద్దడం.. ఇవీ బ్యాంకింగ్ చట్టాల (సవరణ) చట్టం-2025 ముఖ్యోద్దేశాలు
Posted On:
30 JUL 2025 7:56PM by PIB Hyderabad
‘బ్యాంకింగ్ చట్టాల (సవరణ) చట్టం-2025’ను గత ఏప్రిల్ 15న నోటిఫై చేశారు. దీనిలో అయిదు చట్టాలు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం-1934, బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం-1949, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం-1955తో పాటు బ్యాంకింగ్ కంపెనీల (సంస్థల స్వాధీనం-బదలాయింపు) చట్టం-1970, 1980..వీటిని కలిపేస్తూ, మొత్తం 19 సవరణలకు స్థానం కల్పించారు.
బ్యాంకింగ్ రంగంలో పరిపాలన సంబంధిత ప్రమాణాలను మెరుగుపరచాలన్నదే బ్యాంకింగ్ చట్టాల (సవరణ) చట్టం-2025 ఉద్దేశం. ఇన్వెస్టర్లు, డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడడం, ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఆడిట్ ప్రమాణాలను మెరుగుపరచడం, కోఆపరేటివ్ బ్యాంకులలో డైరెక్టర్ల పదవీకాలాన్ని పెంచడం (చైర్‌పర్సన్, పూర్తి కాలపు డైరెక్టర్ మినహా) దీనిలో భాగంగా ఉన్నాయి.
గత జులై 29 నాటి గెజిట్ నోటిఫికేషన్ ఎస్.ఒ. 3494 (ఇ) లో పేర్కొన్న ప్రకారం, బ్యాంకింగ్ చట్టాల (సవరణ) చట్టం-2025 (2025కు చెందిన 16)లోని 3, 4, 5, 15, 16, 17, 18, 19వ సెక్షన్ల నిబంధనలు ఆగస్టు 1 నుంచి అమలులోకి రానున్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
i. పైన ప్రస్తావించిన నిబంధనలు ‘వాస్తవ వడ్డీ’ పరిధిని రూ.5లక్షల నుంచి రూ.2 కోట్లకు పెంచుతాయి. దీంతో, 1968 నుంచి మార్పు లేకుండా ఉన్న పరిమితిని సవరించినట్లయింది.
ii. దీనికి అదనంగా, ఈ నిబంధనలు కోఆపరేటివ్ బ్యాంకులలో డైరెక్టర్ల పదవీకాలాన్ని 97వ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా తీర్చిదిద్దుతాయి. గరిష్ఠ పదవీకాలాన్ని 8 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలకు (చైర్ పర్సన్, పూర్తి కాలపు డైరెక్టర్ మినహా) పెంచుతాయి.
iii. క్లెయిమ్ చేయని షేర్లను, వడ్డీని, గడువు తీరిన బాండ్ల సొమ్మును ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ (ఐఈపీఎఫ్)కు బదలాయించడానికి ఇకపై ప్రభుత్వ రంగ సంస్థలకు (పీఎస్‌బీస్) అనుమతిస్తారు. ఈ విధంగా పీఎస్‌బీలు కూడా కంపెనీల చట్టం పరిధిలో కంపెనీలు పాటిస్తున్న పద్ధతులను అనుసరించగలుగుతాయి. ఈ సవరణలు స్టాచ్యూటరీ ఆడిటర్లకు పారితోషికాన్ని ఇచ్చే, మంచి సామర్థ్యం కలిగిన ఆడిట్ వృత్తినిపుణులను నియమించుకొనే, ఆడిట్ ప్రమాణాలను మెరుగుపరిచే అధికారాలను పీఎస్‌బీలకు కల్పిస్తాయి.
ఈ నిబంధనలు అమలులోకి వస్తే భారతీయ బ్యాంకింగ్ రంగంలో చట్టపరమైన, నియంత్రణ సంబంధమైన, పరిపాలన స్వరూపాన్ని పటిష్ఠపరిచే దిశగా ఒక కీలక అడుగును వేస్తున్నట్లయింది.
***
(Release ID: 2150921)