రక్షణ మంత్రిత్వ శాఖ
ఉగ్రవాద స్వరూప-స్వభావాలు ఎలాంటివైనా దాని నిర్మూలనే ప్రధాని మోదీ ప్రభుత్వ ధ్యేయం: రాజ్యసభలో రక్షణశాఖ మంత్రి
· “ఆపరేషన్ సిందూర్ ఒక సరళ దేశపు దుర్బల పౌరుణ్ని గర్వించదగిన ఓ బలమైన దేశపు పౌరుడిగా మార్చింది”
· “పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) మళ్ళీ భారత్‌లో అంతర్భాగమయ్యే రోజు ఎంతో దూరంలో లేదు”
· “ప్రపంచం దృష్టిలో భారత్ ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లయితే... పాకిస్థాన్ అంతర్జాతీయ ఉగ్రవాద నిలయం”
· “పాకిస్థాన్ సహా వక్రదృష్టి సారించే ఏ శక్తినైనా.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే శక్తిసామర్థ్యాలు భారత్‌కు ఉన్నాయని గుర్తుంచుకోవాలి”
· సమష్టి ప్రగతి... శ్రేయస్సు.. శాంతి కోసం ఉగ్రవాద నిర్మూలనకు శాశ్వత పరిష్కారం దిశగా శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పిలుపు
Posted On:
29 JUL 2025 5:15PM by PIB Hyderabad
ఉగ్రవాద స్వరూప-స్వభావాలు ఎలాంటివైనా దాని సమూల నిర్మూలనకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కట్టుబడి ఉందని రక్షణశాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. ఆయన ఇవాళ రాజ్యసభలో ప్రసంగిస్తూ- “ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలించగల శక్తిసామర్థ్యాలు భారత్‌కు ఉన్నాయి” అని స్పష్టం చేశారు. జాతీయ భద్రత బలోపేతం సహా ఉగ్రవాదాన్ని సమర్థంగా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సరికొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నదని మంత్రి వెల్లడించారు. భారత సైనిక సామర్థ్యం, జాతీయ సంకల్పం, నైతికత, రాజకీయ చాతుర్యానికి ‘ఆపరేషన్ సిందూర్’ తిరుగులేని నిదర్శనమని అభివర్ణించారు. సరళ దేశపు దుర్బల పౌరులను శక్తియుత భారత పౌరులుగా గర్వపడేలా చేసిందని ఆయన పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం దేశ సరిహద్దుల పరిరక్షణతోపాటు వ్యూహాత్మక, ఆర్థిక, సాంకేతిక దృక్కోణం నుంచి భారత్‌ను బలోపేతం చేయగల వ్యవస్థను కూడా సృష్టిస్తోందని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. “అణ్వస్త్ర ప్రయోగం పేరిట బెదిరింపులు లేదా ఇతరత్రా ఎలాంటి ఒత్తిళ్లకైనా ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని భారత్ ఇకపై సహించదు. ఏమాత్రం తలొగ్గదు.. దీటుగా బదులిచ్చి తీరుతుంది” అని నిర్ద్వంద్వంగా ప్రకటించారు.
‘ఆపరేషన్ సిందూర్’కు ఇది తాత్కాలిక విరామం మాత్రమేనని, ఇప్పటికీ అది ముగియలేదని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. పాకిస్థాన్ మళ్ళీ ఏదైనా దుశ్చర్యకు పాల్పడితే భారత్ మరింత కఠిన, నిర్ణయాత్మక చర్యకు సిద్ధంగా ఉందని పునరుద్ఘాటించారు. “పాకిస్థాన్ సహా వక్రదృష్టి సారించే ఏ శక్తినైనా, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే శక్తిసామర్థ్యాలు భారత్‌కు ఉన్నాయని దుష్టశక్తులు గుర్తుంచుకోవాలి” అని ఆయన హెచ్చరించారు.
అలాగే ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)ను భారత్ స్వాధీనం చేసుకునే ఉంటే బాగుండేదన్న కొన్ని వ్యాఖ్యలపై స్పందిస్తూ- “పీవోకే ప్రజలు మళ్లీ భారత్‌లో భాగమయ్యే రోజు ఎంతో దూరంలో లేదు” అని స్పష్టం చేశారు.
ఉగ్రవాద ముప్పు మహమ్మారి వంటిదని, అది తనంతట తానే నశించడం తథ్యమైనా, దానికి శాశ్వత పరిష్కారం అన్వేషించడం అవశ్యమని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. సమష్టి ప్రగతి, సౌభాగ్యం, శాంతికి సవాలుగా మారిన నేపథ్యంలో దానికి సునాయాస స్వీయ మరణం సంప్రాప్తించేదాకా ఎదురు చూడరాదని చెప్పారు. మతం, సిద్ధాంతం, రాజకీయ పరమైన కారణాలేవీ ఉగ్రవాదాన్ని సమర్థించడంలేదని, రక్తపాతం-హింసతో సాధించేది శూన్యమని ఆయన స్పష్టం చేశారు.
భారత్, పాకిస్థాన్ ఏకకాలంలో స్వాతంత్య్రం పొందినా, ప్రపంచం దృష్టిలో భారత్ నేడు “ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు” కాగా, దాయాది దేశం “అంతర్జాతీయ ఉగ్రవాద నిలయం”గా గుర్తింపు పొందిందని రక్షణశాఖ మంత్రి అభివర్ణించారు. ఆ దేశం సదా ఉగ్రవాదానికి ఆశ్రయమిస్తున్నదని, పాక్ మద్దతుగల ఉగ్రవాదుల అంతులేని దుశ్చర్యల జాబితాకు పహల్గామ్ ఊచకోత ఒక ఉదాహరణ మాత్రమేనని ఆయన వివరించారు.
“ఉగ్రవాదానికి తన మద్దతును పాకిస్థాన్ సదా సమర్థించుకునే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి, ఉగ్రవాదంపై పోరులో ఉగ్రవాదులను మాత్రమేగాక మొత్తంగా ఉగ్రవాద మౌలిక సదుపాయాల నిర్మూలన కూడా ముఖ్యం. అందుకే, ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని మన ప్రధానమంత్రి స్పష్టం చేశారు” అని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
పాకిస్థాన్‌ను ఉగ్రవాద నర్సరీగా అభివర్ణిస్తూ- దానికి విదేశీ నిధుల ప్రవాహాన్ని ఆపాలని అంతర్జాతీయ సమాజానికి ఆయన పిలుపునిచ్చారు. పాకిస్థాన్‌కు నిధులివ్వడమంటే ఉగ్రవాద మౌలిక సదుపాయాలకు ఆర్థిక దన్ను ఇవ్వడమేనన్నారు. ఐక్యరాజ్య సమితి భద్రత మండలి ఉగ్రవాద నిరోధక ప్యానెల్‌కు వైస్-చైర్‌పర్సన్‌గా పాకిస్థాన్ నియామకంపై మాట్లాడుతూ- 9/11 దాడుల తర్వాత ఇది ఏర్పాటు కాగా, అందులో సదరు దాడి సూత్రధారికి పాక్ ఆశ్రయం ఇచ్చిందనే వాస్తవం అందరికీ తెలుసునన్నారు. ఈ నిర్ణయం “పాలకు పిల్లిని కాపలా పెట్టడం” తప్ప మరేమీ కాదని ఆయన వ్యాఖ్యానించారు.
హఫీజ్ సయీద్, మసూద్ అజార్ వంటి ప్రకటిత అంతర్జాతీయ ఉగ్రవాదులు పాకిస్థాన్‌లో యథేచ్ఛగా తిరుగుతున్నారని, సైన్యంలోని సీనియర్ అధికారులు ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరవుతున్నారని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ గుర్తుచేశారు. ఉగ్రవాద నిరోధంలో అంతర్జాతీయ సమాజానికి పాక్ నాయకత్వం వహిస్తుందని ఆశించడం దానిపై ప్రపంచ పోరాటాన్ని అపహాస్యం చేయడమేనని ఆయన వ్యాఖ్యానించారు.
ఉగ్రవాద అంతం కోరుకునే తమ పౌరులను పాకిస్థాన్ పాలకులు, నాయకులు విధ్వంసం వైపు నెట్టారని రక్షణశాఖ మంత్రి అన్నారు. ఉగ్రవాదంపై సమర్థ చర్యలు తీసుకోలేని పక్షంలో భారత్ సాయం కోరాల్సిందిగా పాక్‌కు సూచించారు. “భారత సాయుధ దళాలు సరిహద్దుకు రెండువైపులా ఉగ్రవాదంపై పటిష్ఠ చర్యలు తీసుకోగలవు. ఆపరేషన్ సిందూర్ దెబ్బను పాకిస్థాన్ రుచి చూసింది.. కానీ, ఆ దేశం తన మొండితనం వీడటం లేదు. అందుకే, ఉగ్రవాద అంతం దిశగా ప్రపంచం పాకిస్థాన్‌పై అన్నిరకాల వ్యూహాత్మక, దౌత్య, ఆర్థికపరమైన ఒత్తిడి పెంచడం అవశ్యం” అని స్పష్టం చేశారు.
జమ్ముకశ్మీర్‌లో ముగ్గురు ‘టీఆర్‌ఎఫ్’ ఉగ్రవాదులను నిన్న మట్టుబెట్టడంపై సైనిక, ఇతర భద్రత దళాలను రక్షణశాఖ మంత్రి అభినందించారు. “ఈ ఏడాది ఏప్రిల్ 22న పహల్గామ్‌లో 26 మంది అమాయకులను ‘టీఆర్‌ఎఫ్’ ఉగ్రవాదులు దారుణంగా కాల్చి చంపారు. దాడి అనంతర దర్యాప్తులో అనేక కీలక ఆధారాలను మన భద్రత-నిఘా సంస్థలు సేకరించాయి. దాని ఆధారంగా ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ మొదలైంది. ఉగ్రవాదుల వద్దగల ఆయుధాల ఫోరెన్సిక్ విశ్లేషణను బట్టి, పహల్గామ్ దాడిలో వాటిని వాడినట్లు స్పష్టమవుతోంది. భారత జాతీయ-అంతర్జాతీయ భద్రతకు భరోసాలో మన సాయుధ-ఇతర భద్రత దళాల పాత్రకు తగిన ప్రశంసలు లభించడం సముచితం” అన్నారు.
“ఉగ్రవాదాన్ని ఉసిగొల్పి భారత్‌ను విచ్ఛిన్నం చేయడానికి సరిహద్దుల ఆవలి నుంచి సాగుతున్న దుశ్చర్యలను పహల్గామ్ ఉగ్రవాద దాడి నిరూపించింది. అందుకే మే 6, 7 తేదీల్లో మన సాయుధ దళాలు ఆపరేషన్ సిందూర్‌కు శ్రీకారం చుట్టాయి. ఇది కేవలం సైనిక చర్య మాత్రమే కాదు... ఉగ్రవాదంపై ప్రభుత్వ విధానం. అంతేకాదు- దేశ సార్వభౌమత్వ పరిరక్షణపై నిబద్ధతను రుజువు చేసుకునే ప్రభావశీల నిదర్శనం. మన సైనిక నాయకత్వం తన పరిణతిని ప్రదర్శించడమేగాక భారత్ వంటి బాధ్యతాయుత శక్తికిగల వ్యూహాత్మక వివేచనను కూడా ప్రతిబింబించిది" అని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
స్వయం సమృద్ధ భారత్ బలమైన మూలస్తంభాల్లో రక్షణ రంగం ఒకటని మంత్రి పేర్కొన్నారు. ఆ మేరకు విమాన వాహక నౌకలు, యుద్ధ విమానాలు, క్షిపణులు సహా వివిధ రక్షణ పరికరాలను దేశీయంగా తయారు చేస్తున్నట్లు తెలిపారు. “రక్షణ పరికరాల కోసం లోగడ మనం పూర్తిగా విదేశాలపై ఆధారపడ్డాం. కానీ, నేడు భారత్ ఈ రంగంలో శరవేగంగా స్వావలంబన సాధిస్తోంది. మన దళాలు ఆయుధాల దిగుమతికి బదులు దేశంలో తయారైన క్షిపణులు, ట్యాంకులు, ఇతర వ్యవస్థలు, వేదికలను సమకూర్చుకుంటున్నాయి. అగ్ని, పృథ్వి, బ్రహ్మోస్ వంటి మన క్షిపణులు శత్రువులకు దీటుగా బదులిచ్చేందుకు సదా సిద్ధంగా ఉన్నాయి. పైగా ఇవన్నీ మన దేశంలోనే తయారయ్యాయి” అని వివరించారు.
ప్రధానమంత్రి మోదీ నాయకత్వాన గత 11 ఏళ్లలో రక్షణ రంగం అద్భుత మార్పులకు లోనైందని మంత్రి తెలిపారు. ఈ మేరకు 2013-14లో రక్షణ రంగ బడ్జెట్ రూ.2,53,346 కోట్లు కాగా, 2024-25నాటికి దాదాపు మూడు రెట్లు పెరిగి రూ.6,21,941 కోట్లకు చేరిందని చెప్పారు. అలాగే “2014తో పోలిస్తే రక్షణ ఎగుమతులు దాదాపు 35 రెట్లు పెరిగాయన్నారు. ఈ మేరకు 2013-14లో ఎగుమతులు రూ.686 కోట్లు మాత్రమే కాగా, 2024-25లో రూ.23,622 కోట్లకు పెరిగాయి. భార రక్షణ ఉత్పత్తులు దాదాపు 100 దేశాలకు ఎగుమతి అవుతుండగా, ఈ ఏడాది రూ.30,000 కోట్లకు, 2029కల్లా రూ.50,000 కోట్లకు చేరుకోవాలన్నది లక్ష్యం. దీన్ని మనం కచ్చితంగా సాధించగలమని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను” అని ఆయన వ్యాఖ్యానించారు.
ఎలాంటి అనూహ్య పరిస్థితినైనా దీటుగా ఎదుర్కొనగలిగేలా సాయుధ దళాల బలోపేతం కోసం ఆయుధాల అత్యవసర కొనుగోళ్లకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు.
****
(Release ID: 2150003)