ప్రధాన మంత్రి కార్యాలయం
తమిళనాడు తూత్తుకుడిలో రూ. 4800 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
· ఏ రాష్ట్ర అభివృద్ధికైనా మౌలిక సదుపాయాలు, ఇంధన రంగాలే వెన్నెముక.. గత 11 ఏళ్లుగా వీటిపై ప్రధానంగా దృష్టి సారించాం
· తమిళనాడు అభివృద్ధి మా ప్రాధాన్యానికి అద్దం పడుతుంది
· నేడు ప్రపంచం భారత్ వికాసంలోనే తన అభివృద్ధిని చూసుకుంటోంది
· తమిళనాడు మౌలిక సదుపాయాల ఆధునికీకరణకు భారత ప్రభుత్వం కృషి చేస్తోంది
· రాష్ట్రంలో ఓడరేవులను సాంకేతికంగా ఉన్నతీకరిస్తున్నాం.. విమానాశ్రయాలు, హైవేలు, రహదారుల ఏకీకరణతో అనుసంధానంలో అవరోధాలను తొలగిస్తున్నాం
· దేశవ్యాప్తంగా బృహత్తరమైన, ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఓ భారీ కార్యక్రమాన్ని నేడు చేపడుతున్నాం: ప్రధాని
Posted On:
26 JUL 2025 9:54PM by PIB Hyderabad
తమిళనాడులోని తూత్తుకుడిలో రూ. 4800 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ప్రాంతీయంగా అనుసంధానాన్ని విశేషంగా మెరుగుపరచడంతోపాటు.. రవాణా రంగ సామర్థ్యాన్ని పెంచేలా, శుద్ధ ఇంధన మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేలా వివిధ రంగాల్లో వరుసగా చేపట్టిన పలు కీలక ప్రాజెక్టులు తమిళనాడు ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతాయి. కార్గిల్ విజయ దివస్ సందర్భంగా కార్గిల్ వీర సైనికులకు శ్రీ మోదీ నివాళి అర్పించారు. సాహసికులైన వీరయోధులకు ప్రణమిల్లారు. దేశం కోసం ప్రాణత్యాగానికీ వెనుకాడని అమరులకు మనఃపూర్వకంగా అంజలి ఘటించారు.
సభనుద్దేశించి ప్రసంగిస్తూ.. నాలుగు రోజుల విదేశీ పర్యటన ముగిసిన వెంటనే నేరుగా శ్రీ రామేశ్వర పుణ్యక్షేత్రానికి చేరుకోవడం తన భాగ్యమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. విదేశీ పర్యటన సందర్భంగా భారత్ – బ్రిటన్ మధ్య కుదిరిన చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఆయన ప్రముఖంగా పేర్కొన్నారు. ప్రపంచానికి భారత్ పట్ల పెరుగుతున్న నమ్మకానికి, దేశ పునరుత్తేజానికి ఇది నిదర్శనమన్నారు. ఈ ఆత్మవిశ్వాసమే అభివృద్ధి చెందిన భారత్‌ను, అలాగే అభివృద్ధి చెందిన తమిళనాడును సాకారం చేస్తుందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. భగవాన్ రామేశ్వరుడు, తిరుచెందూర్ మురుగన్ ఆశీస్సులతో అభివృద్ధిలో ఓ కొత్త అధ్యాయం నేడు తూత్తుకుడిలో మొదలవుతోందన్నారు. “తమిళనాడును అభివృద్ధిలో శిఖరాగ్రంలో నిలిపే దిశగా 2014లో ప్రారంభించిన కార్యక్రమం నేటికీ తూత్తుకుడిలో కొనసాగుతోంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
గతేడాది ఫిబ్రవరిలో వి.వొ. చిదంబరనార్ ఓడరేవులో ఔటర్ హార్బర్ కంటైనర్ టెర్మినల్ శంకుస్థాపనను గుర్తుచేసుకుంటూ.. ఆ పర్యటన సందర్భంగా రూ. వందల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను ప్రారంభించిన విషయాన్ని శ్రీ మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. అదే ఏడాది సెప్టెంబరులో కొత్తగా తూత్తుకుడి అంతర్జాతీయ కంటైనర్ టెర్మినల్‌ను కూడా ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. నేడు మరోసారి తూత్తుకుడిలో రూ. 4,800 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. విమానాశ్రయాలు, రహదారులు, ఓడరేవులు, రైల్వేలు, విద్యుత్ రంగంలో పురోగతి సహా పలు కీలక రంగాల్లో ఈ కార్యక్రమాలు చేపట్టినట్టు ప్రధానమంత్రి వివరించారు. విశేష అభివృద్ధిని సాధించిన తమిళనాడు ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
“మౌలిక సదుపాయాలు, ఇంధన రంగాలు ఏ రాష్ట్ర అభివృద్ధికైనా వెన్నెముకగా నిలుస్తాయి. గత పదకొండేళ్లుగా ఈ రంగాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నాం. తమిళనాడు పురోగతిపట్ల మా ప్రాధాన్యానికి ఇది అద్దం పడుతుంది’’ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. నేడు ప్రారంభించిన ప్రాజెక్టులు తూత్తుకుడినీ తమిళనాడునూ అత్యుత్తమ రవాణా, పర్యావరణ హిత ఇంధన, నూతన అవకాశాల నిలయంగా తీర్చిదిద్దుతాయని ఆయన పేర్కొన్నారు.
సుసంపన్నమైన తమిళనాడు, తూత్తుకుడి సాంస్కృతిక, చారిత్రక వారసత్వాన్ని శ్రీ మోదీ శ్లాఘించారు. బలమైన, సుసంపన్నమైన భారత్ నిర్మాణంలో ఈ ప్రాంతం చిరస్మరణీయమైన పాత్ర పోషించిందని కొనియాడారు. వలస పాలన కాలంలో సముద్ర వాణిజ్య సామర్థ్యాన్ని ముందుగానే గుర్తించి.. దేశీయంగా నౌకా రవాణా వెంచర్లను ప్రారంభించి బ్రిటిష్ ఆధిపత్యాన్ని సవాలు చేసిన దార్శనికుడైన స్వాతంత్య్ర సమరయోధుడు శ్రీ వి.వొ. చిదంబరం పిళ్లైని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. వీరత్వమూ దేశభక్తీ కలిగిన స్వతంత్రమైన, శక్తిమంతమైన భారత్‌ను స్వప్నించి, పోరాడిన వీరపాండ్య కట్టబ్రహ్మన, అళగు ముత్తు కోన్ వంటి యోధుల కృషినీ ప్రధానమంత్రి కీర్తించారు. జాతీయ కవి సుబ్రమణియ భారతి జన్మస్థలమూ తూత్తుకుడి సమీపంలోనే ఉందన్న శ్రీ మోదీ.. తూత్తుకుడికీ తన సొంత నియోజకవర్గం కాశీకీ మధ్య బలమైన భావోద్వేగ సంబంధముందని వివరించారు. కాశీ-తమిళ సంగమం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు భారత ఉమ్మడి వారసత్వాన్నీ ఐక్యతనూ నిరంతరం బలోపేతం చేస్తాయని వ్యాఖ్యానించారు.
ప్రసిద్ధ తూత్తుకుడి ముత్యాలను గతేడాది తాను శ్రీ బిల్ గేట్స్‌కు బహూకరించానని, ఆయన వాటినెంతో అభినందించారని ప్రధానమంత్రి గుర్తుచేసుకున్నారు. ఈ ప్రాంతంలోని పాండ్య ముత్యాలు ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారత ఆర్థిక శక్తిని చాటాయన్నారు.
“నిరంతర కృషితో అభివృద్ధి చెందిన తమిళనాడు, అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యం దిశగా భారత్ పురోగమిస్తోంది” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. భారత్ – బ్రిటన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) ఈ లక్ష్యాన్ని మరింత వేగవంతం చేస్తుందన్నారు. ఎఫ్‌టీఏ భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా దేశ ప్రయాణాన్ని వేగవంతం చేస్తుందని శ్రీ మోదీ పేర్కొన్నారు. “నేడు ప్రపంచం భారత పురోగతిలో తన అభివృద్ధిని చూస్తోంది” అన్నారు.
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం తర్వాత బ్రిటన్‌లో విక్రయించే 99శాతం భారతీయ ఉత్పత్తులపై పన్ను ఉండబోదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. బ్రిటన్‌లో భారతీయ వస్తువులు మరింత అందుబాటు ధరలకే లభించడంతో వాటికి డిమాండ్ పెరుగుతుందని, ఇది దేశంలో తయారీ అవకాశాలను పెంచుతుందని ఆయన వివరించారు. భారత్ - బ్రిటన్ ఎఫ్‌టీఏ తమిళనాడు యువత, చిన్న పరిశ్రమలు, ఎంఎస్‌ఎంఈలు, అంకుర సంస్థలకు కూడా ఎంతగానో ప్రయోజనం చేకూరుస్తుందని శ్రీ మోదీ చెప్పారు. పరిశ్రమలు, మత్స్యకారులు, పరిశోధన - ఆవిష్కరణ వంటి రంగాలకు ఈ ఒప్పందం ఎంతగానో సహకరిస్తుందని, విస్తృతంగా లాభాలను అందిస్తుందని తెలిపారు.
మేకిన్ ఇండియా, మిషన్ మాన్యుఫ్యాక్చరింగ్‌కు ప్రభుత్వం విస్తృత ప్రాధాన్యమిస్తోందని ప్రధానమంత్రి చెప్పారు. మేకిన్ ఇండియా శక్తిని ఆపరేషన్ సిందూర్ స్పష్టంగా చాటిందన్నారు. ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టడంలో దేశీయంగా తయారు చేసిన ఆయుధాలు కీలక పాత్ర పోషించాయని తెలిపారు. భారత్‌లో తయారైన ఆయుధాలు ఉగ్రవాద సూత్రధారుల్లో ఎప్పటికప్పుడు అలజడి రేపుతూనే ఉన్నాయని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
తమిళనాడులో మౌలిక సదుపాయాలను ఆధునికీకరించడం ద్వారా రాష్ట్ర పూర్తి సామర్థ్యాన్ని ఆవిష్కరించే దిశగా.. కేంద్ర ప్రభుత్వం పూర్తి అంకితభావంతో ఉందని శ్రీ మోదీ స్పష్టం చేశారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలతో ఓడరేవులను ఉన్నతీకరిస్తూ గణనీయమైన పురోగతి సాధిస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు విమానాశ్రయాలు, రహదారులు, రైల్వేలను అనుసంధానిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా అంతరాయం లేకుండా అనుసంధానాన్ని మెరుగుపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. తూత్తుకుడి విమానాశ్రయంలో సరికొత్త అధునాతన టెర్మినల్ ప్రారంభం ఈ దిశగా మరో ప్రధాన ముందడుగు అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. రూ. 450 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ టెర్మినల్ ఇప్పుడు ఏటా 20 లక్షల ప్రయాణికులకు ఆతిథ్యమిచ్చేలా సన్నద్ధమైందన్నారు (గతంలో ఇందులో ప్రయాణికుల సామర్థ్యం 3 లక్షలుగా ఉండేది).
కొత్తగా ప్రారంభించిన టెర్మినల్ దేశంలోని వివిధ గమ్యస్థానాలతో తూత్తుకుడిని విశేషంగా అనుసంధానిస్తుందన్న శ్రీ మోదీ.. ఇది తమిళనాడు వ్యాప్తంగా కార్పొరేట్ ప్రయాణ, విద్యా కేంద్రాలు, ఆరోగ్య రక్షణ కేంద్రాలకు అమితంగా ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొన్నారు. అంతేకాకుండా రవాణా సదుపాయాలు మెరుగుపడడంతో ఈ ప్రాంత పర్యాటక సామర్థ్యంలో నవోత్తేజం నిండుతుందన్నారు.
తమిళనాడులో రెండు ప్రధాన రహదారి ప్రాజెక్టులను ప్రజలకు అంకితం చేస్తున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. రెండు కీలకమైన అభివృద్ధి జోన్లను చెన్నైతో అనుసంధానించేలా దాదాపు రూ. 2,500 కోట్ల పెట్టుబడితో ఈ రహదారులను అభివృద్ధి చేశారు. రోడ్లు మెరుగుపడడంతో డెల్టా జిల్లాలకు రాష్ట్ర రాజధానికీ మధ్య అనుసంధానం విశేషంగా పెరిగిందని, దాంతో ఆర్థిక ఏకీకరణతోపాటు ప్రజలకు నగరం మరింత చేరువయిందని అన్నారు.
ఈ రోడ్డు ప్రాజెక్టులు తూత్తుకుడి ఓడరేవుతో కనెక్టివిటీని విశేషంగా పెంచాయని శ్రీ మోదీ తెలిపారు. దీంతో ఈ ప్రాంత ప్రజలకు జీవన సౌలభ్యం పెరుగుతుందన్నారు. వాణిజ్యం, ఉపాధిలో కొత్త అవకాశాలూ లభిస్తాయని ఆశాభావం వ్యక్తపరిచారు.
పారిశ్రామిక వృద్ధికి, ఆత్మనిర్భర భారత్‌కు రైల్వే వ్యవస్థను జీవనాడిగా కేంద్ర ప్రభుత్వం పరిగణిస్తోందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. గత పదకొండేళ్లుగా దేశ రైల్వే మౌలిక సదుపాయాలు ఆధునికీకరణ దశకు చేరాయని, తమిళనాడు ఇందుకు కేంద్రంగా ఎదిగిందని చెప్తూ... అమృత భారత్ స్టేషన్ పథకం కింద తమిళనాడులో 77 స్టేషన్లను సమగ్రంగా పునరుద్ధరిస్తున్నామని శ్రీ మోదీ తెలిపారు. ఆధునిక వందే భారత్ రైళ్లు నేడు తమిళనాడు ప్రజలకు సరికొత్త ప్రయాణ అనుభవాన్ని అందిస్తున్నాయి. దేశంలో తొలి వర్టికల్ లిఫ్ట్ రైలు వంతెన పంబన్ బ్రిడ్జిని కూడా తమిళనాడులో నిర్మించామని శ్రీ మోదీ చెప్పారు. ఈ ప్రాంతంలో వాణిజ్య సౌలభ్యాన్ని, ప్రయాణ సౌలభ్యాన్ని మెరుగుపరిచిన విశిష్టమైన ఇంజినీరింగ్ అద్భుతంగా దీన్ని వర్ణించారు.
“దేశవ్యాప్తంగా బృహత్తరమైన, ఆధునిక మౌలిక సదుపాయాల నిర్మాణం దిశగా ఓ విప్లవాత్మకమైన కార్యక్రమాన్ని భారత్ చేపడుతోంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్‌లో ఇటీవల ప్రారంభించిన చీనాబ్ వంతెనను ఓ ఇంజినీరింగ్ అద్భుతంగా ఆయన అభివర్ణించారు. ఇది మొదటిసారిగా జమ్మూ - శ్రీనగర్‌లను రైలు ద్వారా అనుసంధానించిందని తెలిపారు. దీనితోపాటు దేశంలో అతి పొడవైన సముద్ర వంతెన - అటల్ సేతు, అస్సాంలోని బోగిబీల్ వంతెన, ఆరు కిలోమీటర్లకు పైగా పొడవైన సోనామార్గ్ సొరంగం... ఇలా అనేక మైలురాయి వంటి పథకాలను భారత్ పూర్తి చేసిందని శ్రీ మోదీ వివరించారు. సమగ్రాభివృద్ధి దిశగా కేంద్ర ప్రభుత్వ అంకితభావాన్ని ఈ కార్యక్రమాలు ప్రతిబింబిస్తాయని, దేశవ్యాప్తంగా వేలాదిగా ఉద్యోగావకాశాలను అందించాయని ఆయన పేర్కొన్నారు.
తమిళనాడులో కొత్తగా ప్రారంభించిన రైల్వే ప్రాజెక్టులు రాష్ట్ర దక్షిణ ప్రాంతంలోని లక్షలాది ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. మధురై - బోడినాయకనూర్ రైల్వే లైన్ విద్యుదీకరణతో ఈ ప్రాంతంలో వందే భారత్ వంటి అధునాతన రైళ్లను నడపడానికి మార్గం సుగమమైందన్నారు. “ఈ రైల్వే కార్యక్రమాలతో తమిళనాడు పురోగతి వేగం పుంజుకుంటుంది, రాష్ట్ర అభివృద్ధి పునరుత్తేజంతో విస్తరిస్తుంది’’ అని శ్రీ మోదీ చెప్పారు.
తమిళనాడులోని 2,000 మెగావాట్ల కూడంకుళం అణు విద్యుత్ ప్రాజెక్టుకు అనుసంధానంగా కీలకమైన ట్రాన్స్మిషన్ ప్రాజెక్టుకు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. రూ. 550 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ఈ వ్యవస్థ మున్ముందు సుస్థిర పద్ధతుల్లో విద్యుత్ సరఫరాలో కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. ఇది భారత అంతర్జాతీయ ఇంధన లక్ష్యాలు, పర్యావరణ నిబద్ధతలకు అర్థవంతంగా దోహదపడుతుందని శ్రీ మోదీ పేర్కొన్నారు. విద్యుదుత్పత్తి పెరిగి.. దానితో తమిళనాడులోని పారిశ్రామిక రంగాలు, గృహ వినియోగదారులు విశేష ప్రయోజనాలను పొందే అవకాశముంది.
తమిళనాడులో ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన వేగంగా పురోగమించడంపై శ్రీ మోదీ సంతృప్తి వ్యక్తంచేశారు. ఈ పథకం కింద ప్రభుత్వానికి ఇప్పటికే దాదాపు లక్ష దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఇప్పటివరకు నలభై వేలకు పైగా గృహాల్లో సోలార్ రూఫ్ టాప్‌లను నెలకొల్పామని వెల్లడించారు. ఈ పథకం ఉచిత, పర్యావరణ హిత విద్యుత్తును అందించడమే కాకుండా, ఆ పద్ధతిలో వేలాదిగా ఉద్యోగాలను కూడా కల్పిస్తోందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.
తమిళనాడు అభివృద్ధి, అభివృద్ధి చెందిన తమిళనాడు అన్నవి కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయని పునరుద్ఘాటించిన ప్రధానమంత్రి.. తమిళనాడు పురోగతికి సంబంధించిన విధానాలకు ఎప్పుడూ అగ్ర ప్రాధాన్యమిస్తున్నామని స్పష్టం చేశారు. గత దశాబ్ద కాలంలో కేంద్ర ప్రభుత్వం వికేంద్రీకరణ ద్వారా తమిళనాడుకు రూ. 3 లక్షల కోట్లు బదిలీ చేసిందని ఆయన ప్రముఖంగా పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో విడుదలైన మొత్తంతో పోలిస్తే ఇది మూడింతల కన్నా ఎక్కువ. ఈ పదకొండు సంవత్సరాల్లో తమిళనాడుకు పదకొండు కొత్త వైద్య కళాశాలలు మంజూరయ్యాయని శ్రీ మోదీ తెలిపారు. తీరప్రాంతాల్లోని మత్స్యకార వర్గాలపట్ల ప్రభుత్వం ఇంత అంకితభావంతో వ్యవహరించడం ఇదే తొలిసారి అని ఆయన వ్యాఖ్యానించారు. నీలి విప్లవంతో తీరప్రాంత ఆర్థిక వ్యవస్థను ప్రభుత్వం విస్తరిస్తోందని, ఇది సమ్మిళిత అభివృద్ధిని సాకారం చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
“తూత్తుకుడి అభివృద్ధిలో ఇది ఓ కొత్త పొద్దుపొడుపు” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. అనుసంధానం, విద్యుత్ ప్రసారం, మౌలిక సదుపాయాల్లో చేపట్టిన కార్యక్రమాలు అభివృద్ధి చెందిన తమిళనాడు, అభివృద్ధి చెందిన భారత్‌కు బలమైన పునాదులు వేస్తున్నాయన్నారు. ఈ విప్లవాత్మక ప్రాజెక్టుల పట్ల తమిళనాడు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.
ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ శ్రీ ఆర్. ఎన్. రవి, కేంద్ర మంత్రులు శ్రీ రామ్మోహన్ నాయుడు కింజారపు, డాక్టర్ ఎల్. మురుగన్, ఇతర ముఖ్య అతిథులు పాల్గొన్నారు.
నేపథ్యం
తూత్తుకుడి విమానాశ్రయంలో దాదాపు రూ. 450 కోట్ల వ్యయంతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రధానమంత్రి ప్రారంభించారు. ప్రపంచస్థాయి వైమానిక మౌలిక సదుపాయాల అభివృద్ధి, మెరుగైన అనుసంధానం లక్ష్యాలకు అనుగుణంగా.. దక్షిణ ప్రాంతంలో పెరుగుతున్న విమానయాన డిమాండ్ దృష్ట్యా దీనిని నిర్మించారు. ఈ కొత్త నిర్మాణాన్ని ప్రధానమంత్రి పరిశీలించారు.
17,340 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ టెర్మినల్‌లో రద్దీ సమయాల్లో 1,350, ఏటా 20 లక్షల ప్రయాణికులకు అనువుగా ఉంటుంది. భవిష్యత్తులో రద్దీ సమయాల్లో 1,800, ఏటా 25 లక్షల ప్రయాణికులకు దీని సామర్థ్యాన్ని విస్తరించవచ్చు. 100 శాతం ఎల్ఈడీ లైటింగ్, తక్కువ ఇంధనంతో నడిచే విద్యుత్, యాంత్రిక వ్యవస్థలు, అందులోనే ఉన్న మురుగునీటి శుద్ధి కర్మాగారం ద్వారా శుద్ధి చేసిన నీటి పునర్వినియోగం... ఇలాంటి సదుపాయాతో గృహ-4 సుస్థిరతా రేటింగ్ సాధించేలా ఈ టెర్మినల్‌ను నిర్మించారు. ఈ ఆధునిక మౌలిక సదుపాయాలు దక్షిణ తమిళనాడులో ప్రాంతీయ వైమానిక అనుసంధానాన్ని విశేషంగా పెంచడంతోపాటు పర్యాటకం, వాణిజ్యం, పెట్టుబడులను ప్రోత్సహిస్తాయని భావిస్తున్నారు.
రోడ్డు మౌలిక సదుపాయాల రంగంలో.. రెండు వ్యూహాత్మకంగా ముఖ్యమైన హైవే ప్రాజెక్టులను ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు. మొదటిది జాతీయ రహదారి- 36లో ఉన్న 50 కి.మీ సేథియాతోప్- చోళపురం మార్గాన్ని నాలుగు వరుసల రహదారిగా విస్తరించడం. విక్రవాండి-తంజావూర్ కారిడార్ కింద రూ. 2,350 కోట్లకు పైగా వ్యయంతో దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో మూడు బైపాస్‌లు, కొల్లిడమ్ నదిపై 1 కి.మీ నాలుగు వరుసల వంతెన, నాలుగు ప్రధాన వంతెనలు, ఏడు ఫ్లైఓవర్లు, అనేక అండర్‌పాస్‌లు ఉన్నాయి. దీంతో సేథియాతోప్-చోళపురం మధ్య ప్రయాణ సమయం 45 నిమిషాలు తగ్గుతుంది. డెల్టా ప్రాంతంలోని సాంస్కృతిక, వ్యవసాయ కేంద్రాలతో అనుసంధానాన్ని పెంచుతుంది. రెండోది జాతీయ రహదారి-138లో ఉన్న 5.16 కి.మీ తూత్తుకుడి పోర్ట్ రోడ్డును 6 వరుసల రహదారిగా విస్తరించడం. దాదాపు రూ. 200 కోట్లతో దీనిని నిర్మిస్తున్నారు. అండర్‌పాస్‌లు, వంతెనలు ఉన్న ఈ ప్రాజెక్టుతో వస్తు సరఫరా సులభతరమవుతుంది, రవాణా ఖర్చులు తగ్గుతాయి. అంతేకాకుండా వి.ఒ. చిదంబరనార్ ఓడరేవు చుట్టుపక్కల ఓడరేవు ఆధారిత పరిశ్రమల అభివృద్ధికి ఇది తోడ్పడుతుంది.
ఓడరేవు మౌలిక సదుపాయాలను, పర్యావరణ హిత ఇంధన కార్యక్రమాలకు ఊతమిచ్చేలా.. నార్త్ కార్గో బెర్త్–IIIని ప్రధానమంత్రి ప్రారంభించారు. వి.ఒ. చిదంబరనార్ ఓడరేవులో దాదాపు రూ. 285 కోట్లు విలువైన 6.96 మిలియన్ మెట్రిక్ టన్నుల వార్షిక కార్గో నిర్వహణ సామర్థ్యంతో దీన్ని నిర్మించారు. ఆ ప్రాంతంలో భారీగ పెరుగుతున్న కార్గో అవసరాలను నెరవేర్చడంలో ఇది ఎంతగానో దోహదపడుతుంది. దీంతో మొత్తంగా పోర్టు సామర్థ్యం పెరగడంతోపాటు కార్గో నిర్వహణ రవాణా సానుకూలమవుతుంది.
దక్షిణ తమిళనాడులో సుస్థిరమైన, సమర్థమైన అనుసంధానాన్ని పెంచేలా మూడు కీలక రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు. 90 కి.మీ మధురై-బోడినాయకనూర్ లైన్ విద్యుదీకరణ పర్యావరణ హిత రవాణాను ప్రోత్సహించడంతోపాటు మధురై, తేనిలలో పర్యాటకానికీ రాకపోకలకూ ఉపయోగపడుతుంది. తిరువనంతపురం - కన్యాకుమారి ప్రాజెక్టులో భాగమైన 21 కి.మీ నాగర్‌కోయిల్ టౌన్ – కన్యాకుమారి సెక్షన్‌ను రూ. 650 కోట్లతో రెట్టింపు చేయడం వల్ల తమిళనాడు, కేరళ మధ్య సంబంధాలు బలోపేతమవుతాయి. దానితోపాటు అరల్వాయ్‌మోళి - నాగర్‌కోయిల్ జంక్షన్ (12.87 కి.మీ), తిరునెల్వేలి - మేలప్పలయం (3.6 కి.మీ) సెక్షన్లను డబుల్ ట్రాక్‌గా విస్తరించడం వల్ల చెన్నై-కన్యాకుమారి వంటి ప్రధాన దక్షిణ మార్గాల్లో ప్రయాణ సమయం తగ్గుతుంది. అలాగే ప్రయాణికులు, సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచి ఆ ప్రాంతంలో ఆర్థిక సమగ్రతను పెంపొందిస్తుంది.
రాష్ట్రంలో విద్యుత్ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసేలా.. ఓ ప్రధాన విద్యుత్ ప్రసార ప్రాజెక్టుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. కూడంకుళం అణు విద్యుత్ ప్లాంటు 3, 4 యూనిట్ల (2x1000 మెగావాట్లు) నుంచి విద్యుత్తును తరలించే అంతర్రాష్ట్ర ప్రసార వ్యవస్థ (ఐఎస్టీఎస్) ఇది. దాదాపు రూ. 550 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో కుడంకుళం నుంచి తూత్తుకుడి-II జీఐఎస్ ఉపకేంద్రం వరకు 400 కిలోవాట్ల (క్వాడ్) డబుల్ సర్క్యూట్ ప్రసార లైన్లు, అనుబంధ టెర్మినల్ పరికరాలు ఉంటాయి. జాతీయ గ్రిడ్‌ను బలోపేతం చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. సుస్థిరంగా విద్యుత్ పంపిణీతోపాటు తమిళనాడులో, లబ్ధిదారులుగా ఉన్న ఇతర రాష్ట్రాల్లో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్లను తీరుస్తుంది.
***
(Release ID: 2149155)
Read this release in:
Odia
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada