ప్రధాన మంత్రి కార్యాలయం
మాల్దీవ్స్ అధ్యక్షుడితో సంయుక్త పాత్రికేయ సమావేశంలో ప్రధానమంత్రి ప్రకటన
Posted On:
25 JUL 2025 7:10PM by PIB Hyderabad
అధ్యక్ష మహోదయా,
భారత్-మాల్దీవ్స్ దేశాల గౌరవనీయ ప్రతినిధులు,
పత్రికా-ప్రసార మాధ్యమ మిత్రులు...
అందరికీ నమస్కారం!
మాల్దీవ్స్ 60వ స్వాతంత్ర్య వార్షికోత్సవం నేపథ్యంలో మున్ముందుగా మాల్దీవుల అధ్యక్షుడు సహా ఇక్కడి ప్రజానీకానికి భారతీయులందరి తరపున నా హృదయపూర్వక అభినందనలు.
ఈ చారిత్రక సందర్భంలో వేడుకలకు నన్ను గౌరవ అతిథిగా ఆహ్వానించిన మాననీయ అధ్యక్షుల వారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.
ఇది భారత్-మాల్దీవ్స్ దౌత్య సంబంధాల 60వ వార్షికోత్సవ ఏడాది కూడా కావడం విశేషం. వాస్తవానికి ఈ బంధానికిగల మూలాలు చరిత్రకన్నా ప్రాచీనమైనవేగాక, సముద్రమంతటి లోతైనవి కూడా. అనాదిగా కొనసాగుతున్న స్నేహబంధాన్ని పటిష్ఠం చేసుకోవడంలో భాగంగా ఈ రోజు స్మారక స్టాంపును ఆవిష్కరించాం. దీనిపై కనిపించే రెండు దేశాల సంప్రదాయ పడవల చిత్రం చూస్తే- చరిత్రలో మనం ఇరుగుపొరుగు మాత్రమే కాదని, సహ ప్రయాణికులమని స్పష్టమవుతుంది.
మిత్రులారా!
మాల్దీవ్స్ కు అత్యంత సన్నిహిత పొరుగు దేశం భారత్. మేం అనుసరించే “పొరుగుకు ప్రాధాన్యం” (నైబర్‌హుడ్ ఫస్ట్) విధానంలోనే కాకుండా ‘మహాసాగర్’ దృక్కోణంలోనూ మాల్దీవ్స్‌స్థానం కీలకం. ఈ ద్వీపదేశానికి అత్యంత విశ్వసనీయ మిత్ర దేశంగా ఉండటం భారత్‌కూ గర్వకారణం. ప్రకృతి వైపరీత్యాలు లేదా మహమ్మారి వ్యాప్తి వంటి విపత్తులేవైనా, తక్షణ ప్రతిస్పందనాత్మక దేశంగా భారత్ సదా మాల్దీవ్స్ కు అండగా నిలుస్తోంది. అత్యవసర వస్తు సామగ్రి సరఫరాకు భరోసా లేదా కోవిడ్ అనంతర ఆర్థిక పునరుత్థానానికి మద్దతు వంటి చర్యలలో భారత్ ఎల్లప్పుడూ సహకారాత్మకంగా కృషి చేస్తోంది. ఆ మేరకు-
స్నేహానికే మా అగ్ర ప్రాధాన్యం
మిత్రులారా!
మాల్దీవ్స్ అధ్యక్షులు నిరుడు అక్టోబరులో భారత్‌లో పర్యటించారు. ఆ సందర్భంగా సమగ్ర ఆర్థిక-సముద్ర భద్రత భాగస్వామ్యంపై మేమొక దృక్కోణంపై సమాలోచన చేశాం. అది నేడు సాకారమవుతున్న నేపథ్యంలో ద్వైపాక్షిక సంబంధాలు మరింత ఎత్తుకు చేరుతున్నాయి. దీంతోపాటు అనేక కీలక ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేశాం.
మాల్దీవ్స్ లో భారత్ తోడ్పాటుతో నిర్మించిన 4 వేల సామాజిక గృహాలు ‘ఇది మన ఇల్లు’ అనే ఆనందం నింపి, అనేకమంది జీవనంలో నవోదయం ఆరంభమవుతుంది. దీనికితోడు గ్రేటర్ మాలె అనుసంధాన ప్రాజెక్ట్, అడ్డూ రహదారి అభివృద్ధి పథకం, హనిమాధూ అంతర్జాతీయ విమానాశ్రయం పునర్నవీకరణ వంటివాటితో రవాణా-ఆర్థిక కార్యకలాపాలకు ఈ ప్రాంతం మొత్తం ప్రధాన కూడలిగా మారుతుంది.
అంతేకాకుండా ద్వీపాల మధ్య త్వరలో పడవ (ఫెర్రీ) ప్రయాణ వ్యవస్థ ప్రారంభంతో వివిధ ద్వీపాల మధ్య సంధానం సులువవుతుంది. అప్పుడు వీటి మధ్య దూరాన్ని ‘జీపీఎస్’తో కాకుండా కేవలం పడవ ప్రయాణ సమయంతో కొలుస్తారు!
రెండు దేశాల ప్రగతి భాగస్వామ్యానికి నవ్యోత్తేజం దిశగా మాల్దీవ్స్ కు 565 మిలియన్ డాలర్లు- దాదాపు రూ.5 వేల కోట్ల మేర దశలవారీ రుణం (లైన్ ఆఫ్ క్రెడిట్) మంజూరుకు మేం నిర్ణయించాం. ఈ నిధులను ఇక్కడి ప్రజల ప్రాధాన్యాలకు అనుగుణమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఉపయోగిస్తారు.
మిత్రులారా!
మా ఆర్థిక భాగస్వామ్యం మరింత పుంజుకునేలా అనేక చర్యలు తీసుకున్నాం. ఈ దిశగా పరస్పర పెట్టుబడుల పెంపు దిశగా త్వరలో ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం ఖరారుకు కృషి చేస్తాం. అలాగే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు కూడా మొదలయ్యాయి. ఇక- ‘ఒప్పందాలకు వాస్తవ రూపం’ మా సరికొత్త లక్ష్యం!
స్థానిక కరెన్సీతో వ్యవహారాల వ్యవస్థ ద్వారా ఇకపై వాణిజ్యం నేరుగా ‘రూపాయి-రుఫియా’ మారకద్రవ్యం రూపంలో కొనసాగుతాయి. మాల్దీవ్స్‌లో వేగంగా యూపీఐ వినియోగంలోకి వస్తే పర్యాటక, చిల్లర వర్తక రంగాలు మరింత బలోపేతం కాగలవు.
మిత్రులారా!
రక్షణ- భద్రత రంగాల్లో సహకారం పరస్పర నమ్మకానికి ప్రతీక. ఈ రోజు రక్షణ మంత్రిత్వశాఖ భవన ప్రారంభోత్సవం నిర్వహించడమే ఇందుకు తిరుగులేని రుజువు. ఈ సౌధం మా పటిష్ఠ భాగస్వామ్య స్వరూపం.
రెండు దేశాల మధ్య సహకారం నేడు వాతావరణ శాస్త్ర అంశాలకూ విస్తరించింది. వాతావరణం ఎలా ఉన్నా- మబ్బులు కమ్మని మా స్నేహబంధం సదా ఉజ్వలమై ప్రకాశిస్తుంది!
మాల్దీవ్స్ రక్షణ సామర్థ్య విస్తరణకు భారత్ తన మద్దతు కొనసాగిస్తుంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, సౌభాగ్యమే మా ఉమ్మడి లక్ష్యం. సముద్ర భద్రతపై కొలంబోలో సమావేశం నేపథ్యంలో ప్రాంతీయ సముద్ర భద్రత బలోపేతానికి కృషిచేస్తాం.
వాతావరణ మార్పు మన రెండు దేశాలకూ ప్రధాన సవాలు. పునరుత్పాదక విద్యుదుత్పాదనను ప్రోత్సహించడంపై మేం అంగీకారానికి వచ్చాం. ఈ రంగంలో తన అనుభవాన్ని మాల్దీవ్స్‌తో భారత్ పంచుకుంటుంది.
మహోదయా,
ఈ చారిత్రక సందర్భంలో మీతోపాటు మాల్దీవ్స్ ప్రజలకు మరోసారి నా హృదయపూర్వక అభినందనలు. నన్ను సాదరంగా స్వాగతించినందుకు ధన్యవాదాలు.
ప్రగతి, సౌభాగ్యాల వైపు అడుగడుగునా మాల్దీవ్స్‌కు భారత్ అండగా ఉంటుందని ఈ సందర్భంగా పునరుద్ఘాటిస్తున్నాను.
అనేకానేక ధన్యవాదాలు!
గమనిక: ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి ఇది స్వేచ్ఛానువాదం మాత్రమే.
****
(Release ID: 2148806)
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam