ప్రధాన మంత్రి కార్యాలయం
భారత్- బ్రిటన్ దార్శనికత 2035
Posted On:
24 JUL 2025 7:12PM by PIB Hyderabad
జూలై 24న జరిగిన సమావేశంలో “భారత్- బ్రిటన్ దార్శనికత 2035”ను ఇరు దేశాల ప్రధానమంత్రులు ఆమోదించారు. రెండు దేశాలు తమ పూర్తి సామర్థ్యాన్ని వాడుకునేలా చేసే వాణిజ్య ఒప్పందం కుదిరిన అనంతరం దీనికి ఆమోదం తెలపటం అనేది నాయకుల ఉమ్మడి నిబద్ధతను తెలియజేస్తోంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చేసుకున్న ఈ ప్రతిష్టాత్మక ఒప్పందంతో పరస్పర వృద్ధి, శ్రేయస్సు కోసం ఉభయ దేశాలు కలిసి చేయనున్నాయి. వేగంగా మారుతోన్న ప్రస్తుత సమయంలో సుసంపన్న, సురక్షిత, సుస్థిర ప్రపంచాన్ని రూపొందించేందుకు రెండు దేశాల సంకల్పాన్ని ఈ ఒప్పందం తెలియజేస్తోంది.
పెరిగిన ఆకాంక్ష: ఇరు దేశాల సంబంధం సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంగా మారినప్పటి నుంచి భారత్, బ్రిటన్ మంచి భాగస్వామ్యాలు ఏర్పరచుకొని వృద్ధికి ఊతం ఇచ్చాయి. ఇదే ఉత్తేజంతో ద్వైపాక్షిక సహకారాన్ని మరింతగా విస్తరించేందుకు, వైవిధ్యంగా మార్చేందుకు ఈ కొత్త దార్శనికత ప్రతిష్టాత్మక లక్ష్యాలను నిర్దేశించింది.
వ్యూహాత్మక దార్శనికత: ఇరు దేశాలకు భారీ అవకాశాలు, స్పష్టమైన ప్రయోజనాలు అందించే ప్రతిష్టాత్మక భాగస్వామ్యాలు.. 2035 నాటికి భారత్-బ్రిటన్ మధ్య సంబంధాలను నిర్ణయించనున్నాయి. భవిష్యత్తులో సుస్థిర సహకారం, ఆవిష్కరణల విషయంలో స్పష్టమైన వ్యూహాత్మక లక్ష్యాలను, మైలురాళ్లను భారత్-బ్రిటన్ దార్శనికత 2035 నిర్దేశించింది.
సమగ్ర ఫలితాలు: భారత్, యూకే దార్శనికత-2035 మూలస్తంభాలు ఒకదానినొకటి బలోపేతం చేసేవిధంగా రూపొందించారు. ఇది అందించే విస్తృత, ధృడ ఫలితాలతో ఇరు దేశాల భాగస్వామ్యం మరో స్థాయికి చేరుకోనుంది. ఈ ఒప్పందం వీటిపై పనిచేస్తుంది:
• యూకే, భారత్‌లో వృద్ధి, ఉద్యోగ కల్పన… ప్రతిష్టాత్మక వాణిజ్య ఒప్పందంతో రెండు దేశాల మార్కెట్లు అందుబాటులోకి వచ్చి కొత్త అవకాశాలు ఏర్పడతాయి.
• తదుపరి తరం ప్రపంచ స్థాయి ప్రతిభను పెంపొందించడానికి విద్య, నైపుణ్యాల భాగస్వామ్యం.. యూకే, భారత విశ్వవిద్యాలయాల మధ్య అంతర్జాతీయ విద్యా సహకారాలను మరింతగా పెంచడం.. ప్రముఖ విశ్వవిద్యాలయాల క్యాంపస్‌లను పరస్పరం ఆయా దేశాల్లో ఏర్పాటు చేయటం
• భవిష్యత్ టెలికాం, ఏఐ, కీలక ఖనిజాలపై దృష్టి సారిస్తూ సాంకేతికత ఆధారిత భద్రతపై పనిచేయటం ద్వారా అత్యాధునిక సాంకేతికతల అభివృద్ది, పరిశోధనలను చేపట్టటం.. సెమీ-కండక్టర్లు, క్వాంటమ్, జీవశాస్త్ర సాంకేతికత, అధునాతన అంశాలపై భవిష్యత్ సహకారాన్ని ప్రారంభించటం
• హరిత ఇంధన వినియోగాన్ని వేగవంతం చేయడం, వాతావరణం విషయంలో నిధులను భారీగా సమీకరించటం, ఈ విషయంలో ధృడత్వాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించే పరివర్తనాత్మక భాగస్వామ్యం
• ఇండో-పసిఫిక్, ఇతర ప్రాంతాల్లో శాంతి, భద్రత, శ్రేయస్సుకు సంబంధించి ఉమ్మడిగా పనిచేయటంతో పాటు రక్షణ, భద్రతా సహకారం
ఉన్నత స్థాయి నాయకుల మధ్య చర్చలతో భారత్ యూకే దార్శనికత- 2035 పనిచేస్తుంది. వ్యూహాత్మక దిశానిర్దేశం, పర్యవేక్షణను అందించేందుకు ఇద్దరు ప్రధానమంత్రులు క్రమం తప్పకుండా సమావేశమయ్యే విషయంలో ఇరు దేశాలు తమ నిబద్ధతను పునరుద్ఘాటించాయి. ఈ దార్శనికత అమలును రెండు దేశాల విదేశాంగ మంత్రులు సంవత్సరానికి ఒకసారి సమీక్షిస్తారు. సాంకేతికత, వాణిజ్యం, పెట్టుబడి, ఆర్థిక రంగ సహకారంతో సహా విభిన్న రంగాల సమస్యలను సంబంధిత మంత్రిత్వ శాఖల యంత్రాంగాలు పరిష్కరిస్తాయి. ఇవన్నీ ఈ ఒప్పందాన్ని.. పరిస్థితులను బట్టి మారుతూ, త్వరగా స్పందించేలా, ఉమ్మడి వ్యూహాత్మక ప్రయోజనాలకు అనుగుణంగా ఉండేలా చూసుకుంటాయి.
నియమ ఆధారిత అంతర్జాతీయ క్రమానికి, అర్థవంతమైన సంస్కరణల ద్వారా బహుపాక్షికతను బలోపేతం చేసేందుకు భారత్, యూకే తమ నిబద్ధతను మరోసారి తెలియజేశాయి. భద్రతా మండలితో సహా ఐక్యరాజ్యసమితి , కామన్వెల్త్, డబ్ల్యూటీఓ, డబ్ల్యూహెచ్ఓ, ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు వంటి బహుపాక్షిక సంస్థల్లో సంస్కరణలను ప్రోత్సహించడానికి రెండు దేశాలు కలిసి పనిచేస్తాయి. ఇది ఈ సంస్థలన్నీ సమకాలీన ప్రపంచ పరిస్థితులను ప్రతిబింబిస్తూ, ఉద్భవిస్తున్న సవాళ్లను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉండేలా చూసుకోనుంది.
ఇరు దేశాల మధ్య సంబంధాలను మానవ సంబంధాలు అన్ని విధాలా బలపరుస్తున్నాయి. రెండు దేశాలు తమ ప్రజల అవసరాలను మెరుగ్గా తీర్చేందుకు విద్య, సాంస్కృతిక మార్పిడి, విదేశాల్లో తమ ప్రజలకు అందే సహాయం విషయంలో సహకారాన్ని పెంపొందించుకోనున్నాయి.
2035 దార్శనికతలో పేర్కొన్న వివిధ అంశాలపై కాలపరిమితితో కూడిన చర్యలతో భారత్, బ్రిటన్‌ల ద్వైపాక్షిక సహకారాన్ని మరింత వైవిధ్యంగా మార్చేందుకు, పెంచుకునేందుకు కట్టుబడి ఉన్నాయి. వ్యాపారం, పరిశోధన, ఆవిష్కరణ, శాస్త్ర సాంకేతికత పరిజ్ఞానం, విజ్ఞానంతో కూడిన బ్రిస్క్ భాగస్వామ్యం కోసం ఈ ఒప్పందం ఇరు దేశాలను సిద్ధం చేస్తోంది.
వృద్ధి
గత దశాబ్దంలో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం గణనీయంగా పెరిగింది. భారత్-యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందంపై (సీఈటీఏ) సంతకం చేయడం, సామాజిక భద్రతకు సంబంధించిన డబుల్ కంట్రిబ్యూషన్ కన్వెన్షన్‌పై చర్చించేందుకు అంగీకారం కుదరటం ద్వైపాక్షిక సంబంధాలలో కీలక ఘట్టాలుగా నిలిచిపోతాయి. ఈ వాణిజ్య ఒప్పందం రెండు దేశాలలో ఆర్థిక వృద్ధిని వేగవంతం చేస్తూ ఉద్యోగ కల్పన, శ్రేయస్సుకు తోడ్పడుతుంది. ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందంపై (బీఐటీ) ముందస్తుగా అంగీకారానికి వచ్చి పనిచేసేందుకు రెండు దేశాలు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించాయి. ఇప్పుడు కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వృద్ధి విషయంలో ప్రతిష్టాత్మక ఉమ్మడి భాగస్వామ్యానికి ప్రారంభం మాత్రమే. రెండు దేశాల్లో స్థిరమైన దీర్ఘకాలిక వృద్ధి, ఉద్యోగ సృష్టి కల్పించేందుకు వివిధ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు భారత్, బ్రిటన్ అంగీకరించాయి. పునరుత్పాదక ఇంధనం, ఆరోగ్యం, జీవ శాస్త్రాలు, కీల వర్థమాన సాంకేతికతలు, వృత్తిపరమైన సేవలు, వ్యాపార సేవలు, ఆర్థిక సేవలు, సృజనాత్మక పరిశ్రమలు, రక్షణ వంటి ప్రాధాన్యతా వృద్ధి రంగాలలో ఆవిష్కరణ, పరిశోధన, చట్టపరమైన సహకారానికి రెండు దేశాలు సహాయం చేసుకోనున్నాయి. వీటితో పాటు ఇరు దేశాలు ఈ కింది అంశాలపై కలిసి పనిచేయనున్నాయి:
1. భారత్-యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (సీఈటీఏ) తరువాత రెండు వైపులా లావాదేవీలు జరిగేలా మరింత ప్రతిష్టాత్మకమైన లక్ష్యాలతో వస్తు సేవల విషయంలో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచుకోవటాన్ని కొనసాగించటం
2. సీఈటీఏ అమలయ్యేలా చూసేందుకు సంయుక్త ఆర్థిక, వాణిజ్య కమిటీలో (జెట్కో) పునురత్తేజం తీసుకురావటం ద్వారా వాణిజ్యం, పెట్టుబడుల విషయంలో ఇరు దేశాల మధ్య సంబంధాలను ముందుకు తీసుకెళ్లటం… ఈఎఫ్‌డీ(ఎకనామిక్ అండ్ ఫైనాన్సియల్ డైలాగ్), బలోపేతమైన ఎఫ్‌ఎండీలు (ఫైనాన్సియల్ మార్కెట్స్ డైలాగ్) స్థూల ఆర్థిక విధానం, ఆర్థిక నియంత్రణ, పెట్టుబడిపై సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కీలక వేదికలుగా పనిచేయటాన్ని కొనసాగిస్తూ ఉంటాయి. ఈ చర్యలన్నీ భారత్- యూకే మధ్య మరింత ధృడమైన, సమ్మళితత్వంతో కూడిన, వృద్ధి ఆధారిత భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు సహాయపడతాయి.
3. క్రమం తప్పకుండా వ్యాపారవేత్తలు సమావేశం అయ్యేందుకు కావాల్సిన వేదికలు, అవకాశాలను అందించడం ద్వారా ఇరు దేశాల వ్యాపార సమాజం మధ్య బలమైన భాగస్వామ్యాలను నిర్మించటం.
4. భారత్, యూకే క్యాపిటల్ మార్కెట్ల మధ్య సంబంధాలను మెరుగుపరచడం.. బీమా, పింఛన్లు, అసెట్ మేనేజ్మెంట్ రంగాలలో సహకారాన్ని మెరుగుపరచడం.
5. ఆర్థిక సేవల్లో ఆవిష్కరణ, కృత్రిమ మేధ(ఏఐ).. హరిత ఇంధన ఫైనాన్స్.. అసెంట్ మేనేజ్మెంట్, పెట్టుబడి వంటి కొత్త రంగాలను చేర్చటం ద్వారా భారత్-యూకే ఆర్థిక భాగస్వామ్యంపై (ఐయూకేఎఫ్‌పీ) పనిచేయటాన్ని కొనసాగించటం. ఎంపిక చేసిన రంగాలలో ద్వైపాక్షిక వ్యాపార సంబంధాలను మెరుగుపరిచేందుకు, భారత్‌లో మౌలిక సదుపాయాల పెట్టుబడుల విషయంలో సామర్థ్యాన్ని వెలికి తీసేందుకు యూకే-భారత్ మౌలిక సదుపాయాల ఫైనాన్సింగ్ బ్రిడ్జి (యూకేఐఐఎఫ్‌బీ) విషయంలో పనిని కొనసాగించటం.
6. ఇరు దేశాలు గుర్తించిన రంగాల్లో సరఫరా గొలుసు బలోపేతానికి సంబంధించి క్రమం తప్పకుండా చర్చలు జరపటం.. తద్వారా కీలక పారిశ్రామిక రంగాలలో సురక్షితమైన ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం.
7. ఇప్పటికే ఉన్న యూకే-భారత్ న్యాయ వృత్తి కమిటీ(యూకే-ఇండియా లీగల్ ప్రొఫెషన్ కమిటీ) ద్వారా సన్నిహిత ద్వైపాక్షిక సహకారానికి నిబద్ధతను పునరుద్ఘాటించటం.. తద్వారా భారత్-బ్రిటన్ న్యాయవృత్తి రంగాల మధ్య సంబంధాలను మరింతగా పెంపొందించటం.
8. యూకే-భారత్ మధ్య అనుసంధానతను మెరుగుపరచడం.. రెండు దేశాల మధ్య విమాన ప్రయాణం, మార్గాలను విస్తరించడం.. యూకే ఇండియా ఎయిర్ సర్వీసెస్ ఒప్పందాన్ని పునరుద్ధరించడం.. రవాణా మౌలిక సదుపాయాలపై సహకారాన్ని పెంపొందించడం.
9. అంతర్జాతీయ అక్రమ ఫైనాన్స్ సమస్యను పరిష్కరించేందుకు.. పన్నుల విషయంలో అంతర్జాతీయ సహకారం, పారదర్శకత ప్రమాణాలను బలోపేతం చేసే విషయంలో ఉత్తమ పద్ధతులను పంచుకోవటం, బహుళపక్ష వేదికల్లో నాయకత్వ స్థానాన్ని ఉపయోగించటం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను రక్షించటం, నడిపించటం… డబ్ల్యూటీఓ ప్రధాన అంశంగా నియమ ఆధారిత, వివక్షత లేని, న్యాయమైన, బహిరంగ, సమగ్ర, సమాన, పారదర్శకమైన బహుపాక్షిక వాణిజ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్న ఇరు దేశాలు.. అభివృద్ధి చెందుతోన్న దేశాలు, తక్కువ అభివృద్ధి చెందిన దేశాలకు ప్రత్యేకంగా పరిగణించటం అనేది డబ్ల్యూటీఓ, దానికి సంబంధించిన ఒప్పందాలలో అంతర్భాగమని ఇరు దేశాలు మరోసారి ప్రకటించాయి.
10. హరిత వృద్ధి వంటి పరస్పర ప్రయోజన మార్కెట్లు-రంగాలను తయారుచేసేందుకు, బ్రిటన్-భారత్ పెట్టుబడి కారిడార్‌కు ఊతమిచ్చేందుకు యూకేకు చెందిన డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇన్‌స్టిట్యూషన్, బ్రిటిష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ (బీఐఐ), యూకే-ఇండియా డెవలప్‌మెంట్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ పార్టనర్‌షిప్ ద్వారా సమ్మిళిత వృద్ధిని పెంచేందుకు కృషి చేయటం. ద్వైపాక్షిక పెట్టుబడి భాగస్వామ్య సామర్థ్యాన్ని గుర్తించిన ఇరుపక్షాలు.. హరిత ఇంధన సంస్థలు, వాతావరణంపై చర్యలు, సాంకేతిక అంకురాలు, వాతావరణ అనుకూల విధానాల అమలుకు సంబంధించి కొత్త పెట్టుబడులను సమీకరించడానికి కృషి.
11. వాతావరణం విషయంలో సుస్థిర స్మార్ట్ ఆవిష్కరణలు, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, డిజిటల్ గవర్నెన్స్ వంటి ఆధారంగా ద్వైపాక్షిక అభివృద్ధి సహకారంపై కట్టుబడి ఉన్నట్లు ప్రకటించిన రెండు దేశాలు.
12. సహకార పరిశోధన, ఉన్నత స్థాయి ద్వైపాక్షిక చర్చలు, సామర్థ్యాన్ని పెంచుకోవటం, ప్రముఖ సంస్థల మధ్య సహకారాలు, భారత్-యూకే 'సృజనాత్మక ఆర్థిక వారోత్సవాలు'(క్రియేటీవ్ ఎకనామిక్ వీక్స్) వంటి సమ్మిళిత వేదికల ద్వారా సృజనాత్మక, సాంస్కృతిక రంగాల్లో పరస్పర వృద్ధికి దోహదం చేయటం. ఆవిష్కరణ, వ్యవస్థాపకత, సాంస్కృతిక వస్తు సేవల్లో పెట్టుబడులు పెంచటం ద్వారా ఆర్థిక వృద్ధి, అవకాశాలను ప్రోత్సహించడానికి సాంస్కృతిక సహకార ఒప్పంద కార్యక్రమాన్ని అమలు చేయటం.
సాంకేతికత, ఆవిష్కరణ
ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ఆవిష్కరణ ఆధారిత వృద్ధిని వేగవంతం చేయటంతో పాటు భవిష్యత్ సాంకేతికతలను రూపొందించడంలో రెండు దేశాల పాత్రలను బలోపేతం చేస్తుంది. ఇరు దేశాలు సురక్షితమైన, సుస్థిర, సంపన్నమైన భవిష్యత్తును రూపొందించడానికి సాంకేతికత, శాస్త్ర విజ్ఞానం, పరిశోధన, ఆవిష్కరణలకు ఉన్న శక్తిని ఉపయోగించుకుంటాయి. యూకే-భారత్ సాంకేతిక భద్రత కార్యక్రమం(టెక్నాలజీ సెక్యూరిటీ ఇనిషియేటివ్).. శాస్త్ర, సాంకేతిక మండలి(ద సైన్స్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్).. ఆరోగ్య, జీవ శాస్త్ర విషయంలో భాగస్వామ్యం ఆధారంగా ఇరు దేశాలు కీలక వర్థమాన సాంకేతికతలు, ఆరోగ్యం, హరిత శక్తి సహకారాన్ని మరింతగా పెంచుకోనున్నాయి. ఇది దేశాల శక్తిని పెంచటమే కాకుండా వాణిజ్యం, పెట్టుబడి ద్వారాలను తెరిచి ఉన్నత స్థాయి ఉద్యోగాలను సృష్టించే విధంగా చేస్తాయి. ఈ సహకారాన్ని మరింతగా పెంచేందుకు ఇరు దేశాలు ఇవి చేయనున్నాయి:
1. యూకే-భారత్ పరిశోధన, ఆవిష్కరణ కారిడార్‌ను ఉపయోగించుకోవడం ద్వారా పరిశోధన, ఆవిష్కరణలను పెంచుతాయి. ఆవిష్కరణ, పరిశోధనను వేగంవతం చేసే కేంద్రాలు(కాటపుల్ట్).. ఆవిష్కరణ కేంద్రాలు, అంకురాలు, ఇంక్యుబేటర్‌లు.. పరిశోధన, ఆవిష్కరణ బృందాలు.. యాక్సిలరేటర్ వంటి కార్యక్రమాలు, సంబంధిత వ్యక్తుల మధ్య భాగస్వామ్యాలను ఏర్పాటు చేయటంతో పాటు ఇరు దేశాల వ్యవస్థలను ఏకీకృతం చేయటం వల్ల పరిశోధన, ఆవిష్కరణ ఉత్పాదకతను పెంచే పనిని కలిసి చేయటం.
2. ప్రపంచ ఏఐ విప్లవం ప్రయోజనాలను కలిపి ఉపయోగించుకుంటూ యూకే-భారత్ దేశాల ఉమ్మడి ఏఐ కేంద్రం ద్వారా ఆర్థిక వృద్ధిని పెంచటం. ఈ కేంద్రం నమ్మదగిన క్షేత్ర స్థాయిలో ఉపయోగపడే ఏఐ ఆవిష్కరణలను, వాటిని విస్తృతంగా ఉపయోగించటాన్ని ప్రోత్సహిస్తుంది. ప్రభావవంతమైన ఏఐ పరిష్కారాలను తయారుచేసేందుకు, అందరూ ఉపయోగించేలా వాటిని మార్చేలా ఇరు దేశాల వ్యాపారవేత్తలు ఉపయోగించుకునేలా ఓపెన్ సోర్స్ పరిష్కారాలను తయారుచేసేందుకు భాగస్వామ్యం కావటం.
3. ఉమ్మడి పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణల ద్వారా అధునాతన అనుసంధానతను, సైబర్ ధృడత్వానికి వ్యూహాత్మక సహకారం అందించే తదుపరి తరపు సురక్షితమైన డిజైన్ టెలికమ్యూనికేషన్‌లపై కలిసి పనిచేయటం. డిజిటల్ సమ్మిళితత్వాన్ని ప్రోత్సహించేందుకు, ఇరుదేశాల మధ్య అనుసంధానతను మెరుగుపరిచేందుకు భారత్-యూకే కనెక్టివిటీ ఇన్నోవేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయటం. 6జీ విషయంలో ఐటీయూ, 3జీపీపీ వంటి అంతర్జాతీయ సంస్థల్లో కలిసి పనిచేయటం.
4. నాలుగో పారిశ్రామిక విప్లవానికి ఊతమిచ్చే కీలకమైన ఖనిజ వనరుల ధృడ, సుస్థిత సరఫరా గొలుసులను సురక్షితంగా మార్చటం. ఫైనాన్సింగ్ ప్రమాణాలు, ఆవిష్కరణలను మార్చేందుకు కీలక ఖనిజాల విషయంలో యూకే-భారత సంయుక్త పారిశ్రామిక గిల్డ్‌ను ఏర్పాటు చేయడం. ఈ రెండు కలిసి ఖనిజ శుద్ధి, పరిశోధన, అభివృద్ధి, రీసైక్లింగ్, సరఫరా గొలుసులో నష్ట నిర్వహణ, మార్కెట్ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ.. వృత్తాకార ఆర్థిక సూత్రాలను, ట్రేసెబిలిటీపై పనిచేస్తుంది.
5. భారత్- బ్రిటన్ బయోటెక్నాలజీ భాగస్వామ్యాన్ని వినియోగించి బయోమాన్యుఫ్యాక్చరింగ్, జీవ ఆధారిత పదార్థాలు, ఆధునిక జీవశాస్త్రాలలో ఉన్న సామర్థ్యాన్ని వెలికితీయడం ద్వారా ఆరోగ్యం, పరిశుభ్రమైన ఇంధనం, సుస్థిర వ్యవసాయ రంగాలలో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించాలి. బయోఫౌండ్రీలు, బయో మాన్యుఫ్యాక్చరింగ్, బయోప్రింటింగ్, ఫెమ్టెక్, సెల్, జన్యు చికిత్సలతో సహా అత్యాధునిక ఆవిష్కరణలను ఉపయోగించడం ద్వారా ప్రపంచ ఆరోగ్య సవాళ్లను ఎదుర్కోవడంతో పాటు మన ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలి.
6. టెక్నాలజీ, సైన్స్ ఇనిషియేటివ్ (టీఎస్ఐ) ) ద్వారా సెమీకండక్టర్లు, క్వాంటమ్, అడ్వాన్స్ డ్ మెటీరియల్స్, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాలలో ఆవిష్కరణ ఆధారిత అభివృద్ధిని వేగవంతం చేయాలి.
7. అంతరిక్ష పరిశోధన, ఆవిష్కరణలు, వాణిజ్య అవకాశాల్లో సహకారాన్ని అన్వేషించడానికి రెండు దేశాల అంతరిక్ష శాస్త్రవేత్తలను ఏకతాటిపైకి తీసుకురావాలి.
8. భవిష్యత్తులో మహమ్మారులను నివారించేందుకు సుస్థిర వైద్య సేవల వ్యవస్థలను సంరక్షించడానికి ప్రపంచ ఆరోగ్య భద్రతలో భారత్- బ్రిటన్ నాయకత్వాన్ని బలోపేతం చేయాలి. మహమ్మారి సన్నద్ధత, డిజిటల్ ఆరోగ్యం, వన్ హెల్త్, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్, ఇంకా కొత్తగా వస్తున్న ఆరోగ్య ముప్పులకు స్పందించేందుకు సహకారాన్ని పెంపొందించడంపై ఆరోగ్య, జీవ శాస్త్రాల సంయుక్త అధ్యయన బృందం ద్వారా ఉమ్మడి కార్యాచరణను ముందుకు తీసుకు వెళ్ళాలి. ఇరు దేశాలు కలిసి బలమైన, త్వరితంగా ప్రతిస్పందించే సరఫరా వ్యవస్థలను అభివృద్ధి చేయడమే కాకుండా నియంత్రణ వ్యవస్థల మధ్య మరింత సమన్వయాన్ని సాధించి, టీకాలు, చికిత్సలు, మెడికల్ టెక్నాలజీల వేగవంతమైన అభివృద్ధి, ఉత్పత్తి, వినియోగాన్ని సాధ్యమయ్యేలా చేయాలి. ఇది ప్రాణాలను రక్షించడమే కాకుండా, ప్రపంచ స్థాయిలో ప్రతిస్పందన సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుంది.
9. భారత్, బ్రిటన్ మధ్య వ్యూహాత్మక వాణిజ్యం, ఆర్థిక సహకారాన్ని పెంపొందించడం ద్వారా ఉమ్మడి శ్రేయస్సు, సుస్థిర సరఫరా వ్యవస్థ, భద్రతను సాధించాలి. లైసెన్సింగ్, ఎగుమతి నియంత్రణ సమస్యలను పరిష్కరించడానికి, రక్షణ, భద్రత, ఏరోస్పేస్ రంగాలతో సహా కీలకమైన, అభివృద్ధి చెందుతున్న, ఇతర అత్యాధునిక సాంకేతికతలలో అధిక విలువైన వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి క్రమం తప్పకుండా వ్యూహాత్మక ఎగుమతి, సాంకేతిక సహకార సంభాషణలు నిర్వహించాలి.
రక్షణ-భద్రత
భారత్, బ్రిటన్ రక్షణ భాగస్వామ్యం బలోపేతం కావడం వల్ల అంతర్జాతీయ స్థాయిలో మరింత భద్రతాయుతమైన వాతావరణం ఏర్పడుతుంది. జాతీయ భద్రత మరింత దృఢంగా మారుతుంది. దీనికి తోడు రెండు దేశాల రక్షణ పరిశ్రమల సామర్ధ్యం భాగస్వామ్యానికి అత్యుత్తమ అవకాశాలను అందిస్తుంది. సాయుధ దళాల కార్యకలాపాలను విస్తరించాలని, రక్షణ సామర్థ్య సహకారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని రెండు దేశాలు నిర్ణయించాయి. ఈ క్రమంలో కింద పేర్కొన్న అంశాలపై అంగీకారం కుదిరింది.
1. పదేళ్ల రక్షణ పరిశ్రమ రోడ్‌మ్యాప్‌ను ఆమోదించడం ద్వారా వ్యూహాత్మక, రక్షణ పరిశ్రమల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడమేగాక, దాని అమలు, పురోగతిని పర్యవేక్షించేందుకు సీనియర్ అధికారుల స్థాయిలో ఉమ్మడి వ్యవస్థను ఏర్పరచాలని రెండు దేశాలు అంగీకరించాయి.
2. ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ కేపబిలిటీ పార్ట్‌నర్‌షిప్ (ఈపీసీపీ), జెట్ ఇంజిన్ అడ్వాన్స్డ్ కోర్ టెక్నాలజీస్ (జేఈఏసీటి) వంటి సహకార కార్యక్రమాల ద్వారా, ఆధునిక సాంకేతికతలు, సంక్లిష్ట ఆయుధాల రంగాలలో భాగస్వామ్యాన్ని మరింత పెంచాలని, కొత్త ఆవిష్కరణలకు, ఉమ్మడి అభివృద్ధి ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించాయి.
3. వ్యూహాత్మక, కార్యాచరణాత్మక రక్షణ అంశాలపై సమన్వయాన్ని పటిష్టం చేయడంలో భాగంగా, ఇప్పటికే ఉన్న విదేశాంగ, రక్షణ (2+2) సీనియర్ అధికారుల స్థాయి చర్చలను తదుపరి మెరుగైన స్థాయికి తీసుకువెళ్లాలని రెండు దేశాలు అంగీకరించాయి.
4. హిందూ మహాసముద్రంలో భద్రతకు సంబంధించిన కొత్త సవాళ్లకు వ్యతిరేకంగా సామర్థ్యాన్ని, ప్రతిఘటనా శక్తిని పెంచేందుకు ఇండో-పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్ (ఐపీఓఐ) కింద సహకారాన్ని పెంపొందించేందుకు ప్రాంతీయ నౌకా వాణిజ్య భద్రతా నైపుణ్య కేంద్రాన్ని (రీజినల్ మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ - ఆర్ఎంఎస్సీ) ఏర్పాటు చేయడానికి అంగీకారం కుదిరింది.
5. త్రివిధ దళాల మధ్య ఉమ్మడి విన్యాసాలను కొనసాగించడం ద్వారా పరస్పర సామర్థ్యాన్ని, సన్నద్ధతను మెరుగుపరచాలని, అలాగే శిక్షణ అవకాశాలను విస్తరించాలని రెండు దేశాలు అంగీకరించాయి. ఇందులో భాగంగా, రెండు దేశాల శిక్షణ సంస్థలలో పరస్పరం సైనిక బోధకులను నియమించాలని, హిందూ మహాసముద్ర ప్రాంతంలో బ్రిటన్ సాయుధ దళాలకు రవాణాపరంగా మద్దతు అందించే ప్రాంతీయ కేంద్రంగా భారత్ ను తిరిగి గుర్తించాలని నిర్ణయించారు.
6. అండర్ వాటర్ సిస్టమ్స్, డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్ వంటి కొత్త సామర్థ్యాల అభివృద్ధి కోసం పరిశోధన, అభివృద్ధిలో సహకారాన్ని బలోపేతం చేయడమే కాక, విద్యా సంస్థలతో కూడా సంబంధాలను అభివృద్ధి చేయాలని రెండు దేశాలూ అంగీకరించాయి.
7. అన్ని రూపాల్లోని ఉగ్రవాదాన్ని ఖండిస్తూ, ఐక్యరాజ్యసమితి సవరణలు, అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఉగ్రవాదాన్ని పూర్తిగా, స్థిరంగా ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయాలని అంగీకరించాయి. ఉగ్రవాదాన్ని, హింసాత్మక తీవ్రవాదాన్ని ఎదుర్కోవడం; ఉగ్రవాదానికి నిధులు అందకుండా నిరోధించడం,ఉగ్రవాదుల సీమాంతర కదలికలను అడ్డుకోవడం; ఉగ్రవాద ప్రయోజనాల కోసం కొత్త, ఇంకా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడాన్ని నిరోధించడం; ఉగ్రవాద నియామకాలను అరికట్టడం; సమాచార మార్పిడి, న్యాయ సహకారం, సామర్థ్య పెంపుతో సహా ఈ రంగాల్లో ద్వైపాక్షిక, బహుపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడంపై అంగీకారం కుదిరింది. అంతర్జాతీయంగా నిషేధానికి గురైన ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలు, వాటి మద్దతుదారులపై నిర్ణయాత్మక, సంఘటిత చర్యలు తీసుకునేందుకు సహకారాన్ని బలోపేతం చేయాలని, కూడా రెండు దేశాలూ అంగీకరించాయి.
8. ఉగ్రవాదం, సైబర్ నేరాలు, అక్రమ ఆర్థిక బదిలీలు వంటి అంతర్జాతీయ స్థాయి వ్యవస్థీకృత నేరాల నుంచి పౌరులను రక్షించాలని, ఇందుకోసం నేరపూరిత బెదిరింపులపై ఉమ్మడి అవగాహన, న్యాయ చట్టాల అమలులో సహకారం, నేరస్థులను అడ్డుకోవడానికి, చట్టబద్ధ పాలనను నిలబెట్టడానికి ఉత్తమ పద్ధతులను పంచుకోవాలని నిర్ణయించారు.
9. సైబర్ భద్రతా సవాళ్ళను ఎదుర్కోవడంలోనూ, పౌరులకు, కీలక సేవా రంగాలకు రక్షణ కల్పించడం లోనూ పరస్పర అవగాహన పెంచుకోవడం, ఉత్తమ పద్ధతులను పంచుకోవడం ద్వారా సైబర్ సుస్థిరతను పెంపొందించుకోవాలని రెండు దేశాలు అంగీకరించాయి. సైబర్ భద్రతా కంపెనీలకు మద్దతు, అవకాశాల ద్వారా వృద్ధిని, సైబర్, డిజిటల్ నిర్వహణలో సహకారాన్ని, నూతన సాంకేతికతల అభివృద్ధికి టీఎస్ఐ కింద భాగస్వామ్యాన్ని పెంపొందించుకో వాలని నిర్ణయించాయి.
10. వలసలు, చలనశీలత భాగస్వామ్యాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడం సహా భద్రత, అక్రమ వలసలను అరికట్టడంలో సహకారాన్ని రెండు దేశాలు పునరుద్ఘాటించాయి. నేర సంస్థల ద్వారా జరిగే దోపిడీని అరికట్టేందుకు కలసి పనిచేయడమే కాకుండా, రెండు దేశాల ప్రజల మధ్య ఉన్న శాశ్వత బంధాన్ని ప్రతిబింబించే యూకే - ఇండియా సజీవ వారధిని సంరక్షించాలని రెండు దేశాలూ నిర్ణయించాయి.
వాతావరణం, స్వచ్ఛ ఇంధనం
వాతావరణ చర్యలలో భాగస్వామ్యం సుస్థిర, అభివృద్ధికి భూగోళాన్ని రక్షించడానికి రెండు దేశాల భాగస్వామ్య నిబద్ధతకు నిదర్శనం.
వాతావరణ మార్పుల కార్యాచరణపై సహకారం రెండు దేశాల సంబంధిత ప్రతిష్టాత్మక నికర సున్నా లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది, ప్రపంచ వాతావరణ కార్యక్రమాలపై నాయకత్వాన్ని అందిస్తుంది. ఇది హరిత వస్తువులు, సేవల్లో వాణిజ్య, పెట్టుబడులకు మద్దతు ఇస్తుంది, గ్రీన్ మాన్యుఫ్యాక్చరింగ్ ను కూడా పెంచుతుంది. స్వచ్ఛ ఇంధనం, వాతావరణ భాగస్వామ్యం కింద లక్యాలను కలిగివుంది.
1. భారతదేశంలో వాతావరణ చర్యల కోసం సరైన సమయంలో, తగిన స్థాయిలో, తక్కువ ఖర్చుతో నిధుల సమీకరణ అవసరం. అభివృద్ధి చెందుతున్న దేశాలకు వాతావరణ చర్యల కోసం అధికంగా, సులభంగా అందుబాటులో ఉండే ఆర్థిక మద్దతును అందించేందుకు గ్లోబల్ ఫైనాన్షియల్ వ్యవస్థలను మెరుగ్గా, పెద్దగా, మరింత ప్రభావవంతమైన బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకులు (ఎండీబీలు) గా మార్చేందుకు రెండు దేశాలూ కలిసి పనిచేస్తాయి.
2. ఇంధన భద్రత, స్వచ్ఛ ఇంధన లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లే దిశగా ఇంధన నిల్వ, గ్రిడ్ మార్పిడి పై సహకారంతో పాటు గ్యాస్, విద్యుత్ మార్కెట్ల బ్రిటన్ కార్యాలయం (ఓఎఫ్జీఈఎం), భారతదేశ కేంద్ర విద్యుత్ నియంత్రణ కమిషన్ (సీఈఆర్సీ)ల మధ్య టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసేందుకు భారత్, బ్రిటన్ దేశాలు కలిసి పనిచేస్తాయి. భారత- బ్రిటన్ ఆఫ్‌షోర్ విండ్ టాస్క్‌ఫోర్స్ ను ఏర్పాటు చేయడంతో పాటు, పరిశ్రమల కోసం తక్కువ కార్బన్ మార్గాలను ప్రోత్సహించేందుకు కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్ (సీసీటీఎస్) ను అభివృద్ధి చేయడంలో కలిసి పనిచేయాలని అంగీకరించాయి. మరింత మెరుగు పరచిన భారత్, బ్రిటన్ అణు సహకార ఒప్పందం కింద చిన్న మాడ్యులర్ రియాక్టర్లు వంటి తదుపరి తరం అణు సాంకేతికతలపై పనిచేయడం సహా అణు భద్రత, వ్యర్థాల నిర్వహణ, అణు విద్యుత్ ప్లాంట్ల నిలిపివేత వంటి అంశాలపై పౌర అణు సహకారాన్ని ముందుకు తీసుకువెళ్లాలని కూడా నిర్ణయించారు. మొత్తంగా రెండు దేశాల ఇంధన భాగస్వామ్యం ప్రైవేట్, ప్రభుత్వ రంగాలలో అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. బలమైన సరఫరా వ్యవస్థల అభివృద్ధికి మద్దతు ఇస్తుంది.
3. కృత్రిమ మేధ, పునరుత్పాదక ఇంధనాలు, హైడ్రోజన్, ఇంధన నిల్వ, బ్యాటరీలు, కార్బన్ క్యాప్చర్ పై ఉమ్మడి కార్యాచరణను ముందుకు తీసుకువెళ్తూ, స్వచ్ఛ రవాణా, ఇంధనం, జీవ శాస్త్రాల్లో సహకారాన్ని విస్తృత పరచడం ద్వారా హరిత వృద్ధి, సుస్థిర, సంపన్న భవిష్యత్తు కోసం ఆవిష్కరణలను వేగవంతం చేస్తారు. వాతావరణ మార్పులకు లోతైన సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేసేందుకు, వృద్ధి కోసం కొత్త మార్కెట్లను నిర్మించడానికి ఫ్లాగ్షిప్ నెట్ జీరో ఇన్నోవేషన్ భాగస్వామ్యం ద్వారా పారిశ్రామికవేత్తలకు రెండు దేశాలూ ఉమ్మడిగా మద్దతు ఇస్తాయి.
4. వాతావరణ మార్పు వల్ల కలిగే ప్రమాదాలను తగ్గించేందుకు, సుస్థిర అభివృద్ధిని సాధించేందుకు రెండు దేశాలూ కలిసి పనిచేస్తాయి. ఇందులో భాగంగా కార్యాచరణ ప్రణాళికను పటిష్టం చేస్తారు. అవసరమైన నిధులను సమీకరించడంతో పాటు కొత్త సాంకేతికతలను ప్రోత్సహిస్తారు. ప్రకృతి విపత్తులకు ముందుగానే సిద్ధం కావడం వంటి చర్యల్లో పరస్పర సహకారం, ఉత్తమ అనుభవాలను రెండు దేశాలూ పంచుకుంటాయి. ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, సముద్ర పర్యావరణ వ్యవస్థలు, బ్లూ కార్బన్ పై దృష్టి సారించి వాతావరణ సుస్థిరత, జీవవైవిధ్యంపై ప్రపంచ స్థాయి శాస్త్రీయ చర్యలకు ఇరు దేశాలూ కలిసి నాయకత్వం వహిస్తాయి.
5. ఇండియా-యూకే ఫారెస్ట్ పార్టనర్‌షిప్ కింద అగ్రోఫారెస్ట్రీ (వ్యవసాయ అటవీ పద్ధతులు), అటవీ ఉత్పత్తుల గుర్తింపు వంటి వాటిపై సహకారం ద్వారా ప్రకృతి పునరుద్ధరణ, సుస్థిర భూ వినియోగంపై కలిసి చేస్తాయి.
6. అంతర్జాతీయ సౌర కూటమి (ఇంటర్నేషనల్ సోలార్అలయన్స్), విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కూటమి (కొయిలిషన్ ఫర్ డిజాస్టర్ రిసీలియెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్) ఒక సూర్యుడు- ఒక ప్రపంచం- ఒక గ్రిడ్ (వన్ సన్, వన్ వరల్డ్, వన్ గ్రిడ్ - ఓఎస్ఓడబ్ల్యుఓజీ), రోడ్డు రవాణా బ్రేక్‌త్రూ,జీరో ఎమిషన్ వెహికల్ ట్రాన్సిషన్ కౌన్సిల్ (జడ్ఈవీటీసీ) లపై లోతైన సహకారం ద్వారా వాతావరణ మార్పు, ఇంధన మార్పిడిలో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలని, గ్లోబల్ క్లీన్ పవర్ అలయన్స్ (గ్లోబల్ క్లీన్ పవర్ అలయెన్స్ - జీసీపీఏ) ద్వారా కలిసి పనిచేయడానికి గల అవకాశాలను అన్వేషించాలని నిర్ణయించారు.
విద్య
భారత్, బ్రిటన్ దేశాల విద్యా వ్యవస్థలు, ప్రజల మధ్య సుసంపన్నమైన సాంస్కృతిక మార్పిడులు మిగతా అన్ని రంగాలలో సహకారానికి పునాదిగా నిలుస్తున్నాయి. 2020లో ప్రవేశపెట్టిన భారత జాతీయ విద్యా విధానం ద్వారా, 2025 మే లో సంతకం చేసిన సాంస్కృతిక సహకార కార్యక్రమం ద్వారా పరస్పర వృద్ధి, ప్రభావాన్ని అందించడంలో బ్రిటన్ భారతదేశ అనుకూల భాగస్వాములలో ఒకటిగా ఉంది. భారత-బ్రిటన్ భాగస్వామ్యంలో ప్రజల మధ్య సంబంధాలు విలువైనవిగా ఉన్నాయి. గట్టి పునాదులతో బలపడిన రెండు దేశాల మేధో భాగస్వామ్యం కొత్త అవకాశాలను గుర్తించి స్పందించగలిగేలా, వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతకు అనుగుణంగా రూపాంతరం చెందగలిగేలా, విద్య, పరిశోధన రంగాలలో సహకారాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుతోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండేలా, నైపుణ్యం కలిగిన, దూరదృష్టి కలిగిన ప్రతిభావంతుల బృందాన్ని సృష్టించడంలో సహాయపడుతుంది. అలాగే అందరికీ సురక్షితమైన, సుస్థిరమైన భవిష్యత్తును నిర్మించడంలో ఈ ప్రతిభా బృందం ప్రధాన పాత్రను పోషిస్తుంది. ఇరు దేశాలు ఈ లక్ష్యాన్ని సాధించేందుకు కింద అంశాలపై కలిసి పనిచేస్తాయి:
1. భారత-బ్రిటన్ విద్యా సంబంధాలకు వ్యూహాత్మక దిశను నిర్ధారించేందుకు, ప్రతి సంవత్సరం మంత్రుల స్థాయిలో ఇండియా- బ్రిటన్ విద్యా సమావేశాలను నిర్వహిస్తారు. ఈ సమావేశాల ద్వారా విద్యా రంగంలో కొత్త సహకార అవకాశాలు ఉత్పన్నమవుతాయి. ప్రస్తుత భాగస్వామ్యం మరింతగా అభివృద్ధి చెందుతుంది. పరస్పరం గుర్తించే అర్హతలను పునఃపరిశీలించేందుకు ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయి. అలాగే, బ్రిటన్‌లో జరిగే ఎడ్యుకేషన్ వరల్డ్ ఫోరం, భారతదేశంలో నిర్వహించే జాతీయ విద్యా విధాన వేదికల వంటి కార్యక్రమాల్లో పాల్గొని, విజ్ఞానాన్ని పరస్పరం పంచుకుంటాయి.
2. ప్రముఖ యూకే విశ్వవిద్యాలయాలు, సంస్థలు అంతర్జాతీయ బ్రాంచ్ క్యాంపస్‌లను భారతదేశంలో ఏర్పాటు చేయడాన్ని ప్రోత్సహిస్తాయి. అలాగే, కీలకమైన సబ్జెక్టులలో ఉమ్మడి, ద్వంద్వ డిగ్రీ కోర్సులను అందించడానికి అంతర్జాతీయ విద్యా భాగస్వామ్యాలను ఏర్పరచుకుంటాయి. ఇది రెండు దేశాల భవిష్యత్ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేస్తుంది.
3. యువతపై పెట్టుబడి పెట్టి వారికి భవిష్యత్తుకు అవసరమైన నైపుణ్యాలను అందిస్తారు. ఇందుకోసం ఇండియా- బ్రిటన్ గ్రీన్ స్కిల్స్ భాగస్వామ్యం ఏర్పాటు చేస్తారు. ఇది రెండు దేశాల నైపుణ్యాన్ని ఏకం చేస్తుంది. రెండు దేశాలలో ఉన్న నైపుణ్య అంతరాలను గుర్తించి, వాటిని తొలగిస్తుంది. అలాగే, ఇరు దేశాలకు పరస్పరం ప్రయోజనకరంగా, సుస్థిర, వృద్ధి అవకాశాలను సృష్టించే, సానుకూల ప్రభావాలను చూపే ఉమ్మడి కార్యకలాపాలను నెలకొల్పుతుంది. అర్హతల పరస్పర గుర్తింపు పై రెండు దేశాల మధ్య ఉన్న ప్రస్తుత అవగాహన ఒప్పందం అమలును కొనసాగిస్తారు.
4. యువత, విద్యార్థుల మధ్య మార్పిడి, అవగాహనను ప్రోత్సహిస్తారు. యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్, స్టడీ ఇండియా ప్రోగ్రామ్ వంటి ప్రస్తుత పథకాల విజయాన్ని ప్రోత్సహించడానికి, సంపూర్ణం చేయడానికి అన్ని రంగాలలో భాగస్వామ్యంతో పని చేస్తారు.
****
(Release ID: 2148242)
Read this release in:
Odia
,
Malayalam
,
English
,
Urdu
,
Hindi
,
Nepali
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada