నౌకారవాణా మంత్రిత్వ శాఖ
వర్షాకాల సమావేశాల తొలిరోజే ‘బిల్స్ ఆఫ్ ల్యాండింగ్-2025’ బిల్లుకు పార్లమెంటు ఆమోదం
169 ఏళ్లనాటి కాలం చెల్లిన నౌకాయాన చట్టం స్థానంలో కొత్త చట్టం
చారిత్రాత్మక నౌకాయాన సంస్కరణలకు రాజ్యసభ ఆమోదం తెలిపిన సందర్భంలో ‘బిల్స్ ఆఫ్ ల్యాండింగ్-2025’ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి సర్బానంద సోనోవాల్
2025 మార్చి నెలలో ‘బిల్స్ ఆఫ్ ల్యాండింగ్-2025’ బిల్లుకు లోక్ సభ ఆమోదంతో రాష్ట్రపతి ఆమోదానికి మార్గం సుగమం
రాజ్యాంగ విలువలను ప్రతిబింబించే “ద బిల్స్ ఆఫ్ ల్యాండింగ్-2025” బిల్లు
కాలం చెల్లిన వలస చట్టాల స్థానంలో ఆధునిక చట్టాలు తేవడం కీలక ముందడుగు: కేంద్రమంత్రి సర్బానంద సోనోవాల్
Posted On:
21 JUL 2025 6:47PM by PIB Hyderabad
వర్షాకాల సమావేశాల తొలి రోజునే ‘బిల్స్ ఆఫ్ ల్యాండింగ్-2025’ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్రపతి ఆమోదానికి మార్గం సుగమం అయింది. కేంద్ర నౌకాశ్రయాలు, నౌకాయానం, జలరవాణా మంత్రి (ఎమ్ఓపీఎస్డబ్ల్యూ) సర్బానంద సోనోవాల్ ఈరోజు ఎగువ సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఇది భారత సముద్ర రంగంలో ఒక కీలక ఘట్టాన్ని సూచిస్తుంది.
లోక్‌సభ ఇప్పటికే ఆమోదించిన ఈ బిల్లు చట్టంగా మారడానికి రాష్ట్రపతి ఆమోదం కోసం వేచి ఉంది. 169 ఏళ్లనాటి వలసచట్టమైన ఇండియన్ ల్యాండింగ్ యాక్ట్-1856 స్థానంలో భారత సముద్ర షిప్పింగ్ డాక్యుమెంటేషన్ కోసం ఆధునికమైన, సరళీకృతమైన, ప్రపంచానికి అనుగుణంగా ఉండే ఈ చట్టపరమైన విధానం అమలులోకి రానుంది.
బిల్లును సభలో ప్రవేశపెడుతున్న సందర్భంగా కేంద్రమంత్రి సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ.. “మన దేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన అంటే వికసిత్ భారత్‌గా మార్చాలనే అత్యున్నత దార్శనికతను రూపొందించిన మన దార్శనికులు, చైతన్యవంతులైన గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిని ఈనాటి మన సమావేశం సందర్భంగా మనం గుర్తుచేసుకుంటున్నాం. ఈ దార్శనికత కేవలం ఆకాంక్షాత్మకమైనది మాత్రమే కాదు. ఇది కొత్త, సుసంపన్న భారత్ వాగ్దానంతో మన ప్రయత్నాలను, ఆకాంక్షలను అనుసంధానించాలని పిలుపునిస్తుంది. గౌరవనీయ ప్రధానమంత్రి మాటల్లో.. 'భారత్ తన వ్యవస్థలను సంస్కరించడానికి, దాని భవిష్యత్తును మార్చడానికి వేగంగా, గొప్ప స్థాయితో ముందుకుసాగాలి” అని వ్యాఖ్యానించారు.
ఈ కొత్త చట్టం పురాతన నిబంధనల స్థానంలో స్పష్టమైన, వ్యాపార అనుకూలమైన భాషను కలిగి ఉంటుంది. క్యారియర్లు, షిప్పర్లు, చట్టబద్ధత గల హోల్డర్ల హక్కులు, బాధ్యతలను క్రమబద్ధీకరిస్తుంది. షిప్పింగ్ డాక్యుమెంటేషన్‌లో అస్పష్టతను తగ్గించడం ద్వారా వ్యాజ్యాల ముప్పును తగ్గిస్తుంది. అలాగే అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా ప్రపంచ వాణిజ్యంలో భారత్ స్థానాన్ని బలోపేతం చేస్తుంది.
“భారత రాజ్యాంగం ఆమోదం పొంది 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో, మన పురోగతికి ఆటంకం కలిగించే వలసవాద, రాజ్యాంగ పూర్వ వారసత్వాల అవశేషాలను వదిలించుకునేందుకు ఇది సరైన సమయం. ‘స్వర్ణిమ్ భారత్’ సాకారం కోసం సమకాలీనమైన, మన దేశ పౌరులు రూపొందించిన, ఆధునిక యుగ సవాళ్లను పరిష్కరించగల ఒక చట్టం అవసరం” అని సర్బానంద సోనోవాల్ పేర్కొన్నారు.
కాలం చెల్లిన గత చట్టం స్థానంలో ఈ కొత్త చట్టం అమలులోకి రానుంది. ఇది భారత వలస పాలన నాటి చేదు జ్ఞాపకాలను దూరం చేస్తుంది. ఇది చట్టపరమైన భాషను సులభతరం చేస్తుంది. సంక్లిష్టమైన నిబంధనలనూ సులభతరం చేస్తుంది. ప్రభావవంతంగా అమలు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసే అధికారం కల్పించే ఒక నిబంధనను ప్రవేశపెడుతుంది. ప్రామాణిక రిపీల్-సేవింగ్ నిబంధనను చేర్చడం ద్వారా ఈ చట్టం.. పాత చట్టం కింద గల గత చర్యల కొనసాగింపును, చట్టపరమైన చెల్లుబాటును నిర్ధారిస్తుంది. స్పష్టతను పెంచడం, అవగాహన సౌలభ్యాన్ని ప్రోత్సహించడం, దేశంలో వ్యాపార నిర్వహణను సులభతరం చేసే సమకాలీన వాణిజ్య, చట్టపరమైన ప్రమాణాలకు అనుగుణంగా చట్టాన్ని సాఫీగా అమలు చేయడం లక్ష్యంగా ఈ సంస్కరణలు రూపొందించారు.
"ద బిల్స్ ఆఫ్ ల్యాండింగ్-2025' బిల్లు మన రాజ్యాంగ విలువలను ప్రతిబింబిస్తుంది. కాలం చెల్లిన వలస చట్టాల స్థానంలో ఆధునికమైన, అందరికీ అందుబాటులో ఉండే విధానాలను అమలు చేయడంలో కీలకమైన ముందడుగును ఇది సూచిస్తుంది. మన సముద్ర రంగం వేగంగా విస్తరిస్తున్నందున, ఈ సంస్కరణ వ్యాపార సౌలభ్యాన్ని పెంచుతుంది.. వివాదాలను తగ్గిస్తుంది.. ప్రపంచ వాణిజ్యంలో భారత్ స్థానాన్ని బలోపేతం చేస్తుంది. 'అలలను పాలించేవారే ప్రపంచాన్ని పాలిస్తారు' అని ఒక సామెత చెప్పినట్లుగా భారత్... ప్రపంచాన్ని ముందుండి నడిపించే సమయం వచ్చింది" అని పేర్కొన్న సర్బానంద సోనోవాల్, ఈ బిల్లుకు మద్దతునివ్వాలని గౌరవ సభ్యులను కోరారు.
***
(Release ID: 2146636)