యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
కాశీ డిక్లరేషన్ శుభారంభం.. వారణాసిలో ముగిసిన యువజన ఆధ్యాత్మిక శిఖరాగ్ర సదస్సు..
* యువత నాయకత్వంలో మాదకద్రవ్య వ్యసన రహిత ఉద్యమానికి
5 ఏళ్ల మార్గసూచీని నిర్దేశించిన కాశీ డిక్లరేషన్
* మాదక ద్రవ్యాలకు చోటు ఉండని భారత్ విజన్‌ను ఆవిష్కరించిన
120కి పైగా ఆధ్యాత్మిక సంస్థలకు చెందిన 600కు పైగా యువ నేతలు
* ‘వికసిత్ భారత్ సాధన లక్ష్యంగా నషా ముక్త్ యువత’ను తీర్చిదిద్దడంలో
భారత ఆధ్యాత్మిక శక్తి సారథ్యం వహించి తీరాలి..
* ఈ ఉద్యమంలో భారత ఆధ్యాత్మిక శక్తి వెన్నుదన్నుగా నిలవాలి: డాక్టర్ మాండవీయ
प्रविष्टि तिथि:
20 JUL 2025 4:32PM by PIB Hyderabad
‘కాశీ డిక్లరేషన్’కు ఆమోదం తెలపడంతో 'వికసిత్ భారత్ కోసం నషా ముక్త యువత' అనే ఇతివృత్తంతో ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో 'యువజన ఆధ్యాత్మిక శిఖరాగ్ర సదస్సు' ఆదివారం ముగిసింది. ఈ సదస్సును యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ వారణాసిలోని రుద్రాక్ష్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించింది. ఈ సదస్సులో 120 ఆధ్యాత్మిక, సామాజిక - సాంస్కృతిక సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 600 మందికి పైగా యువ నేతలు పాల్గొన్నారు. దేశాన్ని 2047 కల్లా మత్తుమందులను ఉపయోగించని దేశంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యం వైపు తీసుకుపోవడంలో ఈ కార్యక్రమం ఒక ముఖ్యఘట్టంగా మారింది.
సరికొత్త ఉత్సాహంతో ఉరకలెత్తే యువ శక్తి, ఆధ్యాత్మిక దృష్టికోణం.. వీటితో పాటు సంస్థాగత సంకల్పంతో కూడిన జాతీయ స్థాయి సంగమానికి ఈ సభ ప్రతీకగా నిలిచింది. మాదకద్రవ్యాల దురలవాటుకు సంబంధించిన కీలక కోణాలపై చర్చలు జరపడానికి నాలుగు ముఖ్య కార్యక్రమాలను ఈ శిఖరాగ్ర సదస్సులో భాగంగా నిర్వహించారు. మత్తుమందుల వ్యసనం, యువతపై దాని మానసిక ప్రభావంతో పాటు ఈ వ్యసనం సమాజంపై కలగజేస్తున్న ప్రభావం; మాదకద్రవ్యాల అక్రమ రవాణా నెట్‌వర్కులు, మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్న ముఠాలు; క్షేత్రస్థాయిలో అవగాహన కలిగించడానికి చేపట్టవలసిన ప్రచార ఉద్యమం, అమలు చేయాల్సిన వ్యూహాలు; మత్తుమందుల వాడకాన్ని అరికట్టడంలో, బాధితులకు పునరావాసాన్ని కల్పించడంలో ఆధ్యాత్మిక సంస్థలు, సాంస్కృతిక సంస్థలు పోషించాల్సిన పాత్ర.. ఈ అంశాలపై నాలుగు ముఖ్య కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో వ్యక్తమైన అభిప్రాయాలను ఆధారంగా చేసుకొని ‘కాశీ డిక్లరేషను’ను రూపొందించారు. భారత నాగరకత ప్రసాదించిన జ్ఞానం, యువజనుల నేతృత్వం.. ఈ రెండింటి మార్గదర్శనంలో మాదకద్రవ్యాల వ్యసనానికి వ్యతిరేకంగా సహకారపూర్వక కార్యాచరణను కొనసాగించాలన్న నిబద్ధతకు ‘కాశీ డిక్లరేషన్’ అద్దం పట్టింది.
కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ శిఖరాగ్ర సదస్సులో మాట్లాడుతూ, ‘‘గత మూడు రోజులుగా వివిధ విషయాలపై నిర్వహించిన కార్యక్రమాలలో పాల్గొని మన అభిప్రాయాలను తెలియజెప్పుకొన్నాం. ఈ ఆలోచనల నుంచే ‘కాశీ డిక్లరేషన్’ రూపుదిద్దుకొంది. ఇది ఒక డాక్యుమెంట్ మాత్రమే కాదు, ఇది దేశ యువ శక్తి కోసం ఉద్దేశించిన ఒక ఉమ్మడి సంకల్ప పత్రం’’ అని అభివర్ణించారు.
***
(रिलीज़ आईडी: 2146425)
आगंतुक पटल : 14