Posted On:
18 JUL 2025 2:17PM by PIB Hyderabad
బీహార్లోని మోతీహారీలో రూ.7,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసి, పూర్తయిన ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. పవిత్ర శ్రావణ మాసం సందర్భంగా బాబా సోమేశ్వరనాథ్‌కు నమస్సులు అర్పిస్తూ.. బీహార్ ప్రజల జీవితాల్లో సంతోషం, సంక్షేమం నిండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సభను ఉద్దేశించి శ్రీ మోదీ ప్రసంగిస్తూ.. చరిత్ర గతిని మార్చిన భూమి... చంపారన్ అనీ, స్వాతంత్ర్యోద్యమ కాలంలో మహాత్మాగాంధీకి ఈ నేల కొత్త దిశను చూపించిందని చెప్పారు. ఈ నేల అందించిన స్ఫూర్తే ఇప్పుడు బీహార్ భవిష్యత్తును తీర్చిదిద్దుతోందని ప్రధాని పేర్కొన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలకు సమావేశానికి హాజరైన వారికి, బీహార్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
21వ శతాబ్దం వేగవంతమైన ప్రపంచాభివృద్ధిని చూస్తోందని శ్రీ మోదీ అన్నారు. ఒకప్పుడు పాశ్చాత్య దేశాల ఆధిపత్యమే ఉండేదని ఇప్పుడు తూర్పు దేశాల భాగస్వామ్యం, ప్రభావం పెరుగుతోందని వెల్లడించారు. అభివృద్ధిలో తూర్పు దేశాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయని స్పష్టం చేశారు. తూర్పు దేశాలు అంతర్జాతీయంగా అభివృద్ధి చెందుతున్నట్టే.. వాటికి సమాంతరంగా భారత్‌లో తూర్పు రాష్ట్రాల యుగం మొదలైందని అన్నారు. తూర్పున ఉన్న మోతీహారీని పశ్చిమాన ముంబయిలానే ప్రాధాన్య నగరంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పించుకుందని తెలియజేశారు. గురుగ్రామ్ మాదిరిగానే గయలోనూ సమాన అవకాశాలు, పుణే తరహాలో పాట్నాలో పారిశ్రామిక అభివృద్ధి, సూరత్‌తో సమానంగా సంతాల్ పరగణా అభివృద్ధి చెందుతుందని ప్రధానమంత్రి తెలిపారు. పర్యాటకంలో జల్పాయ్గురి, జాజ్‌పూర్ ప్రాంతాలు జైపూర్ తరహాలో కొత్త రికార్డులు సృష్టిస్తాయని ఆకాంక్షించారు. బీర్భూమ్ ప్రజలు బెంగళూరులో ఉన్నవారిలాగా ప్రగతిని సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
‘‘తూర్పు భారత్‌ను ముందుకు తీసుకెళ్లాలంటే.. అభివృద్ధి చెందిన రాష్ట్రంగా బీహార్‌ను మార్చాలి’’ అని శ్రీ మోదీ అన్నారు. బీహార్లో వేగంగా సాగుతున్న అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ఉండటమే కారణమని పేర్కొన్నారు. సహకారంలో భేదాన్ని వివరించడానికి ఆయన డేటాను ఉటంకించారు: కేంద్రంలో గత ప్రభుత్వాలు అధికారంలో ఉన్న పదేళ్లలో బీహార్‌కు కేవలం రూ. 2 లక్షల కోట్లే అందాయి. దీనిని నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వంపై రాజకీయంగా కక్ష్య సాధించే చర్యగా వర్ణించారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత తన ప్రభుత్వం బీహార్‌పై ఇలాంటి ద్వేషపూరిత రాజకీయాలకు స్వస్తి పలికిందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. తమ పదేళ్ల పాలనలో బీహార్ అభివృద్ధికి రూ.9 లక్షల కోట్లను కేటాయించినట్లు వెల్లడించారు. ఇది మునుపటి ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో పోలిస్తే నాలుగు రెట్ల కంటే ఎక్కువ అని పేర్కొన్నారు. ఈ నిధులు బీహార్ వ్యాప్తంగా ప్రజాసంక్షేమానికి, అభివృద్ధి ప్రాజెక్టులకు ఉపయోగిస్తున్నామని హామీ ఇచ్చారు.
రెండు దశాబ్దాల కిందట బీహార్ ఎదుర్కొన్న నిరాశను నేటి తరం అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. గత ప్రభుత్వాల పాలనలో అభివృద్ధి నిలిచిపోయిందని, పేదవారికి ఉద్దేశించిన నిధులు వారి వరకు చేరడం అసాధ్యమయ్యేదనీ, పేదల నుంచి ధనాన్ని దోచుకోవడంపైనే అప్పటి నాయకత్వం దృష్టి సారించిందని విమర్శించారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే భూమిగా బీహార్‌ను వర్ణిస్తూ.. ఆ రాష్ట్ర ప్రజల సామర్థ్యాన్ని ప్రశంసించారు. సంక్షేమ పథకాలు పేదలకు నేరుగా అందేలా గత పాలకుల సంకెళ్లను తెంచుకుని బీహార్ కు విముక్తి కల్పించిన ప్రజలను మెచ్చుకున్నారు. గడచిన 11 ఏళ్లలో దేశ వ్యాప్తంగా పీఎం ఆవాస యోజన కింద 4 కోట్లకు పైగా ఇళ్లు నిర్మించారని శ్రీ మోదీ తెలిపారు. వాటిలో 60 లక్షలు బీహార్‌లోనే నిర్మాణమయ్యాయనీ, ఈ సంఖ్య నార్వే, న్యూజిలాండ్, సింగపూర్ లాంటి దేశాల మొత్తం జనాభాను అధిగమించిందని అన్నారు. ‘‘మోతీహారీ జిల్లాలోనే దాదాపు 3 లక్షల కుటుంబాలకు పక్కా ఇళ్లు లభించాయి. ఈ సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ ప్రాంతంలోని 12,000కు పైగా కుటుంబాలు ఈ రోజు కొత్త ఇంటి తాళాలు అందుకుంటున్నాయి’’ అని శ్రీ మోదీ తెలిపారు. అదనంగా, మరో 40,000 పేద కుటుంబాలు పక్కా ఇళ్లను నిర్మించుకోవడానికి అవసరమైన నిధులను నేరుగా బ్యాంకు ఖాతాల ద్వారా పొందాయి. వీరిలో ఎక్కువ మంది దళితుల, మహాదళితులు, వెనకబడిన వర్గాల వారే ఉన్నారనీ, గత ప్రభుత్వ పాలనలో ఈ తరహా గృహాలను పేదలు పొందగలగడం ఊహకు అందని విషయమని అన్నారు. వారి పాలనలో ప్రజలు తమ ఇళ్లకు రంగులు వేసుకోవడానికి కూడా భయపడేవారని, భూస్వాములు తమను లక్ష్యంగా చేసుకుంటారని ఆందోళన చెందేవారని గుర్తు చేసుకున్నారు. అప్పటి పాలక పార్టీకి చెందిన నాయకులు ప్రజలకు పక్కా ఇళ్లు అందించలేకపోయారని ఆయన తెలియజేశారు.
బీహార్ పురోగతికి ఆ రాష్ట్రానికి చెందిన తల్లులు, సోదరీమణుల సామర్థ్యం, దృఢ సంకల్పమే కారణమని శ్రీ మోదీ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి చర్య ప్రాధాన్యాన్ని బీహార్‌లోని మహిళలు స్పష్టంగా అర్థం చేసుకుంటున్నారని అన్నారు. సమావేశానికి హాజరైన మహిళలను ఉద్దేశించి.. గతంలో బ్యాంకు ఖాతాలు, బ్యాంకుల్లోకి అనుమతి లేకపోవడం వల్ల రూ.10ని సైతం దాచుకోవాల్సి వచ్చిన రోజులను గుర్తు చేసుకున్నారు. పేదల గౌరవాన్ని తాను అర్థం చేసుకున్నానని ప్రధానమంత్రి తెలియజేశారు. అణగారిన వర్గాల వారికి బ్యాంకులు తమ తలుపులను ఎందుకు మూసి ఉంచుతున్నాయో తాను ప్రశ్నించిన విధానాన్ని గుర్తు చేశారు. జన ధన్ ఖాతాలను తెరిచేందుకు ప్రారంభించిన ప్రచారం ద్వారా మహిళలే ఎక్కువ లబ్ధి పొందారనీ, బీహార్లో ఇపుడు 3.5 కోట్ల మంది మహిళలకు జన్ ధన్ ఖాతాలు ఉన్నాయని వెల్లడించారు. ఇప్పుడు ప్రభుత్వ పథకాల నిధులు నేరుగా వారి ఖాతాల్లోకే బదిలీ అవుతున్నాయని శ్రీ మోదీ తెలియజేశారు. శ్రీ నితీష్ కుమార్ సారథ్యంలోని బీహార్ ప్రభుత్వం ఇటీవలే వయోధికులు, దివ్యాంగులు, వితంతువులకు అందించే నెలవారీ పెన్షన్ ను రూ. 400 నుంచి 1,100 కు పెంచారని ప్రస్తావించారు. ఈ మొత్తం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే జమ అవుతోందని అన్నారు. గడచిన నెలన్నర కాలంలోనే బీహార్లోని 24,000 స్వయం సహాయక బృందాలకు రూ.1,000 కోట్లకు పైగా లబ్ధి పొందాయని, ఇది జన్ ధన్ ఖాతాల ద్వారా తల్లులు, సోదరీమణులకు అందించిన ఆర్థిక సాధికారతే ఈ విజయానికి కారణమని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా, బీహార్‌లోనూ 'లఖ్‌పతి దీదీల' సంఖ్య పెరుగుతూ ఉందన్న ప్రధానమంత్రి.. మహిళా సాధికారత కార్యక్రమాలు సాధిస్తున్న శక్తిమంతమైన ఫలితాలకు ఇది నిదర్శనమన్నారు. 3 కోట్ల మంది మహిళలను లక్షాధికారులను చేసే ఈ జాతీయ లక్ష్యంలో భాగంగా ఇప్పటికే 1.5 కోట్ల మంది మహిళలు ఈ మైలురాయిని సాధించారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. బీహార్లో 20 లక్షలకు పైగా మహిళలు లఖ్‌పతి దీదీలుగా మారారని.. కేవలం చంపారన్‌లోనే 80,000 మందికి పైగా మహిళలు స్వయం సహాయక బృందాల్లో చేరి లక్షాధికారులయ్యాని ఆయన వివరించారు. నారీ శక్తిని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో కమ్యూనిటీ పెట్టుబడి నిధిగా రూ. 400 కోట్లు విడుదల చేస్తున్నట్లు శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు. శ్రీ నితీష్ కుమార్ ప్రారంభించిన "జీవిక దీదీ" పథకాన్ని ఆయన ప్రశంసించారు. బీహార్లోని లక్షలాది మంది మహిళలు స్వావలంబన సాధించేందుకు ఈ పథకం మార్గం సుగమం చేసిందని ప్రధానమంత్రి కొనియాడారు.
'భారత పురోగతి కోసం బీహార్ పురోగతి చాలా అవసరం' అనే తమ పార్టీ దార్శనికతను పునరుద్ఘాటిస్తూ.. బీహార్ యువత పురోగమించినప్పుడే రాష్ట్రం ముందుకు సాగుతుందని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. సంపన్న బీహార్.. యువతకు ఉపాధి కల్పించడం పట్ల ప్రభుత్వ నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారు. బీహార్‌లోనే ఉపాధి అవకాశాలను సృష్టించడానికి ఇటీవలి సంవత్సరాల్లో గణనీయమైన ప్రయత్నాలు జరిగాయన్న ప్రధానమంత్రి.. పూర్తి పారదర్శకతతో లక్షలాది మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు అందించిన శ్రీ నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. బీహార్ యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో బీహార్ ముఖ్యమంత్రి సరికొత్త ప్రణాళికతో ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రయత్నాలకు అండగా ఉంటుందని ప్రధానమంత్రి హామీ ఇచ్చారు.
ప్రైవేట్ రంగంలో తొలిసారిగా ఉద్యోగం పొందే వారికి మద్దతునిచ్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఒక ముఖ్యమైన పథకాన్ని ఆమోదించిందని ప్రధానమంత్రి తెలిపారు. ఈ పథకం కింద ప్రైవేట్ కంపెనీలో తొలిసారిగా నియామకం పొందే యువతకు కేంద్ర ప్రభుత్వం రూ. 15,000 మంజూరు చేస్తుందన్నారు. ఆగస్టు 1 నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం అమలు కోసం కేంద్రం రూ. 1 లక్ష కోట్ల ఖర్చు చేస్తుందన్న ప్రధానమంత్రి.. ఈ కార్యక్రమం బీహార్ యువతకు గణనీయ ప్రయోజనం చేకూరుస్తుందని స్పష్టం చేశారు. ముద్ర యోజన వంటి పథకాల ద్వారా బీహార్‌లో స్వయం ఉపాధిని ప్రోత్సహించిన ప్రయత్నాలను కూడా శ్రీ నరేంద్ర మోదీ ప్రధానంగా ప్రస్తావించారు. గత రెండు నెలల్లోనే బీహార్‌లో ముద్ర యోజన కింద లక్షలాది రుణాలు పంపిణీ అయ్యాయనీ, ప్రత్యేకించి చంపారన్‌లో 60,000 మంది యువత తమ స్వయం ఉపాధి ప్రణాళికల కోసం ముద్ర రుణాలు పొందినట్లు తెలిపారు.
ఇతర పార్టీల నాయకులు, ముఖ్యంగా ఉద్యోగాలు ఇస్తామంటూ ఆశజూపి ప్రజల భూమిని ఆక్రమించే నాయకులు ఎప్పటికీ ఉపాధి కల్పించలేరని శ్రీ నరేంద్ర మోదీ విమర్శించారు. లాంతర్ల యుగానికీ.. కొత్త ఆశలతో ప్రకాశించే నేటి బీహార్‌కు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తుంచుకోవాలని ప్రజలను కోరారు. ఈ పరివర్తన బీహార్ సంకీర్ణ ప్రభుత్వం సాధించిన ఘనతగా ఆయన అభివర్ణించారు. తమ సంకీర్ణ ప్రభుత్వానికి బీహార్ ప్రజలు బలమైన మద్దతునివ్వడంతో పాటు, మా ప్రభుత్వంపై అంచచలమైన విశ్వాసం ఉంచారని ప్రధానమంత్రి కొనియాడారు.
ఇటీవల నక్సలిజం నిర్మూలన కోసం చేపట్టిన నిర్ణయాత్మక చర్యలను ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. బీహార్ యువతకు దీని ద్వారా ఎంతో మేలు జరిగిందన్నారు. ఒకప్పుడు మావోయిస్టు ప్రభావంతో వెనకబడిన చంపారన్, ఔరంగాబాద్, గయ, జముయి వంటి జిల్లాల్లో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం కనిపిస్తోందన్నారు. మావోయిస్టు హింస కారణంగా అభివృద్ధికి దూరమైన ప్రాంతాల యువత ఇప్పుడు పెద్ద కలలు కంటున్నారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. నక్సలిజం నుంచి దేశానికి పూర్తిగా విముక్తి కల్పించడం పట్ల ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటించారు.
ఇది నవ భారత్… నేల నుంచీ, ఆకాశం నుంచీ మన సైనికులు విరుచుకుపడం ఖాయం. శత్రువులను శిక్షించే విషయంలో ఏ చిన్న ప్రయత్నాన్నీ వదిలేది లేదు’’ అని శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆపరేషన్ సింధూర్‌ను ప్రారంభించాలన్న నిర్ణయాన్ని తీసుకున్నది బీహార్ గడ్డమీద నుంచేనని గుర్తు చేశారు. ఈ రోజు ఆపరేషన్ సిందూర్ విజయాన్ని ప్రపంచమంతా చూస్తోందని ఆయన పేర్కొన్నారు.
సామర్థ్యం, వనరులు లేని రాష్ట్రంగా బీహార్ ఉండేదన్న ప్రధానమంత్రి.. నేడు ఇక్కడి వనరులే ఈ రాష్ట్ర పురోగతికి సాధనాలుగా మారుతున్నాయన్నారు. తమ ప్రభుత్వం చేసిన ప్రయత్నాల ఫలితంగా మఖానా ధరలు పెరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ... మఖానా రైతులను పెద్ద మార్కెట్లతో అనుసంధానించడమే దీనికి కారణమని పేర్కొన్నారు. ఈ రంగానికి మరింత ఊతమిచ్చే మఖానా బోర్డు ఏర్పాటునూ ప్రస్తావించారు. అరటి, లిచీ, మిర్చా బియ్యం, కతర్నీ బియ్యం, జర్దాలు మామిడి, మాఘాయ్ పాన్ వంటి పంటలు బీహార్ వ్యవసాయ సంపదకు చక్కని ఉదాహరణలని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ పంటలే కాకుండా అనేక ఇతర ఉత్పత్తులు బీహార్ రైతులను, స్థానిక యువతను ప్రపంచ మార్కెట్లతో అనుసంధానిస్తున్నాయని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.
రైతుల దిగుబడిని, ఆదాయాన్ని పెంచడం తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యాంశమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి-కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద దేశవ్యాప్తంగా రైతులకు సుమారు రూ. 3.5 లక్షల కోట్లు పంపిణీ చేశామన్నారు. మోతీహరిలోనే 5 లక్షలకు పైగా రైతులు ఈ పథకం ద్వారా రూ. 1,500 కోట్లకు పైగా మొత్తాన్ని అందుకున్నారని ప్రధానమంత్రి వివరించారు.
తమ ప్రభుత్వం కేవలం నినాదాలు.. వాగ్దానాలకే పరిమితం కాదనీ, కార్యాచరణ ద్వారా ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. వెనకబడిన, అత్యంత వెనకబడిన వర్గాల అభ్యున్నతి పట్ల తమ ప్రభుత్వ నిబద్ధత.. మా ప్రభుత్వ విధానాలు, నిర్ణయాల్లో ప్రతిబింబిస్తుందన్నారు. వెనకబడిన ప్రాంతాలు, వెనకబడిన తరగతుల అభివృద్ధి విషయంలో తమ లక్ష్యం సుస్పష్టంగా ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలన్నింటిలోనూ వారికి ప్రాధాన్యం ఉంటుందన్న ప్రధానమంత్రి.. వారి అభివృద్ధి ధ్యేయంగానే అనేక పథకాలు రూపొందిస్తున్నామన్నారు. దశాబ్దాలుగా 110కి పైగా జిల్లాలు వెనకబడి, నిర్లక్ష్యానికి గురయ్యాయని పేర్కొన్న ప్రధానమంత్రి.. తమ ప్రభుత్వం ఈ జిల్లాలను ఆకాంక్షాత్మక జిల్లాలుగా ప్రకటించి, అభివృద్ధి దిశగా నడిపించడం ద్వారా తగిన ప్రాధాన్యమిచ్చిందన్నారు. భారత సరిహద్దు గ్రామాలు కూడా చాలా కాలంగా "మారుమూల గ్రామాలు"గా పరిగణించడంతో వెనకబడ్డాయనీ, తమ ప్రభుత్వం వాటిని "మొదటి ప్రాధాన్య గ్రామాలు"గా గుర్తించి ఆయా గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఓబీసీ వర్గం చాలా కాలంగా ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కావాలని కోరుతోందనీ, తమ సంకీర్ణ ప్రభుత్వం వారి ఈ కోరికను నెరవేర్చిందన్నారు. గిరిజన వర్గాల్లో అత్యంత అణగారిన వర్గాల కోసం జన్‌మన్ యోజనను ప్రారంభించి, వారి అభివృద్ధి కోసం రూ. 25,000 కోట్లు కేటాయించినట్లు శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. ఈ దార్శనికతకు అనుగుణంగా ప్రధానమంత్రి ధన్-ధాన్య కృషి యోజననూ రూపొందించామనీ, ఇటీవలే కేంద్ర మంత్రివర్గం ఈ పథకం అమలుకు ఆమోదం తెలిపిందన్నారు. ఈ పథకం కింద మంచి వ్యవసాయ సామర్థ్యం ఉన్నప్పటికీ దిగుబడి, రైతుల ఆదాయం విషయంలో వెనుకబడిన 100 జిల్లాలను గుర్తించి ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఈ జిల్లాల్లోని రైతులకు ఈ పథకం కింద తగిన మద్దతు లభిస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దీని వల్ల దేశవ్యాప్తంగా దాదాపు 1.75 కోట్ల మంది రైతులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుతుందనీ, దీనిలో బీహార్ రైతుల వాటా చాలా ఎక్కువేనని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
వేల కోట్ల విలువైన రైల్వే, రహదారుల ప్రాజెక్టుల ప్రారంభోత్సవం.. శంకుస్థాపనలను ప్రస్తావిస్తూ ఈ ప్రాజెక్టులు బీహార్ ప్రజల సౌకర్యాలను గణనీయంగా మెరుగుపరస్తాయని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా నాలుగు వేర్వేరు మార్గాల్లో ప్రయాణించే అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఆయన ప్రారంభించారు. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ఇప్పుడు మోతీహరి-బాపూధామ్ నుంచి ఢిల్లీలోని ఆనంద్ విహార్ వరకు నేరుగా నడుస్తుందన్నారు. మోతీహరి రైల్వే స్టేషన్‌ను ఆధునిక సౌకర్యాలు, కొత్త హంగులతో పునరాభివృద్ధి చేస్తున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. దర్భాంగా-నర్కటియాగంజ్ రైలు మార్గం డబ్లింగ్ వల్ల ఈ మార్గంలో ప్రయాణ సౌలభ్యం బాగా మెరుగవుతుందన్నారు.
భారతదేశ సంస్కృతి, విశ్వాసాలతో చంపారన్‌కు ఉన్న లోతైన అనుబంధాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ.. రామ-జానకి మార్గం మోతీహారిలోని సత్తార్‌ఘాట్, కేసరియా, చకియా, మధుబన్ గుండా వెళ్తుందని మోదీ పేర్కొన్నారు. సీతామర్హి నుంచి అయోధ్య వరకు ఉన్న కొత్త రైల్వే మార్గం చంపారన్ నుంచి అయోధ్యకు వెళ్లే భక్తులకు ప్రయాణ సౌలభ్యాన్ని అందిస్తుందని అన్నారు. ఇవన్నీ బీహార్లో అనుసంధానతను గణనీయంగా పెంచుతాయని, ఇక్కడ కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయని తెలిపారు.
గత ప్రభుత్వాలు పేదలు, దళితులు, వెనుకబడిన తరగతులు, గిరిజన వర్గాల పేరుతో చాలా కాలం రాజకీయాలు చేశాయని అన్నారు. వారి సమానహక్కులను తిరస్కరించటమే కాకుండా కుటుంబేతరులకు గౌరవాన్ని ఇవ్వటంలో కూడా అవి విఫలమయ్యాయని విమర్శించారు. బీహార్ నేడు వారి అహంకారాన్ని స్పష్టంగా తెలుసుకుంటోందని పేర్కొన్నారు. దురుద్దేశంతో కూడిన వారి ఆలోచనల నుంచి బీహార్‌ను రక్షించాలని పిలుపునిచ్చిన ఆయన.. ప్రస్తుత బీహార్ ప్రభుత్వం అంకితభావంతో చేసిన పనులను ప్రశంసించారు. అందరూ సమష్టిగా బీహార్ అభివృద్ధిని వేగవంతం చేసి, మంచి భవిష్యత్తు వైపు పయనించాలని కోరారు. కొత్త బీహార్‌ను నిర్మించేందుకు ఉమ్మడి సంకల్పంతో ముందకెళ్లాలని పిలుపునిచ్చారు. ఇవాళ ప్రారంభించిన అభివృద్ధి ప్రాజెక్టుల విషయంలో ప్రజలకు మరోసారి అభినందనలు తెలియజేస్తూ ఆయన ప్రసంగాన్ని ముగించారు.
ఈ కార్యక్రమంలో బీహార్ గవర్నర్ శ్రీ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, బీహార్ ముఖ్యమంత్రి శ్రీ నితీష్ కుమార్.. కేంద్ర మంత్రులు శ్రీ జితన్ రామ్ మాంఝీ, శ్రీ గిరిరాజ్ సింగ్, శ్రీ రాజీవ్ రంజన్ సింగ్, శ్రీ చిరాగ్ పాశ్వాన్, శ్రీ రామ్‌నాథ్ ఠాకూర్, శ్రీ నిత్యానంద రాయ్, శ్రీ సతీష్ చంద్ర దూబే, డాక్టర్ రాజ్ భూషణ్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
నేపథ్యం
రైలు, రోడ్డు, గ్రామీణాభివృద్ధి, మత్స్య, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక రంగాలకు సంబంధించిన కొన్ని అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. మరికొన్నింటిని ప్రారంభించి జాతికి అంకితం చేశారు.
అనసంధానత, మౌలిక సదుపాయాలను పెంచే విషయంలో ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తూ పలు రైలు ప్రాజెక్టులను ప్రధానమంత్రి దేశానికి అంకితం చేశారు. సమస్తిపూర్, బచ్వారా మధ్య రైల్వే కార్యకలాపాలు సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలు కల్పించేలా సంబంధింత మార్గంలో ఆటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థను ప్రారంభించారు. దర్భంగా-సమస్తిపూర్ డబ్లింగ్ ప్రాజెక్ట్‌లో భాగంగా రూ. 580 కోట్లకు పైగా వ్యయంతో దర్భంగా-తల్వారా, సమస్తిపూర్-రాంభద్రపూర్ మార్గాల్లో చేపట్టిన రెండో మార్గానికి ప్రారంభోత్సవం చేశారు. ఈ డబ్లింగ్ పనులు వల్ల రైల్వే సామర్థ్యం పెరగటమే కాకుండా రైళ్ల రాకపోకల్లోని జాప్యం తగ్గుతుంది.
పలు రైలు ప్రాజెక్టులకు కూడా ప్రధాని శంకుస్థాపన చేసారు. పాటలీపుత్రలో వందే భారత్ రైళ్ల నిర్వహణ కోసం మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టు.. రైల్వే కార్యకలాపాలను క్రమబద్ధీకరించేందుకు భట్ని-చాప్రా గ్రామీణ రైలు మార్గంలో (114 కి.మీ) ఆటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థ… ట్రాక్షన్ సిస్టమ్ మౌలిక సదుపాయాలను పెంచటంతో పాటు ఇంధన సమర్థతను పెంపొందించటం ద్వారా అధిక వేగంతో నడిచే రైళ్లను ప్రారంభించేందుకు భట్ని-చాప్రా గ్రామీణ విభాగంలో ట్రాక్షన్ వ్యవస్థను మెరుగుపరచడం వంటి ప్రాజెక్టులు ఉన్నాయి. దీనితో పాటు సంబంధించి రైలు మార్గాల సామర్థ్యాన్ని పెంచేందుకు.. మరిన్ని ప్రయాణ, సరుకు రవాణా రైళ్లను రాకపోకలు సాగించేందుకు, ఉత్తర బీహార్‌తో దేశంలోని మిగిలిన ప్రాంతాల మధ్య అనుసంధానతను పెంచేందుకు రూ.4,080 కోట్ల వ్యయంతో కూడిన దర్భంగా-నర్కటియాగంజ్ రైలు మార్గం డబ్లింగ్ ప్రాజెక్టుకు కూడా పునాది రాయి వేశారు.
ఈ ప్రాంతంలో రోడ్డు రవాణాకు సంబంధించిన మౌలిక సదుపాయాలకు భారీ ఊతం ఇస్తూ ఎన్‌హెచ్-319లోని అరా బైపాస్ మార్గాన్ని 4 వరసలుగా విస్తరించే పనులకు కూడా శంకుస్థాపన చేశారు. ఇది అరా-మోహానియా ఎన్‌హెచ్-319, పాట్నా-బక్సర్ ఎన్‌హెచ్-922లను అనుసంధానిస్తూ ఆటంకం లేని అనుసంధానతను అందించటమే కాకుండా ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది.
ఎన్‌హెచ్-319లో పరారియా- మోహానియా మధ్య రూ. 820 కోట్లతో చేపట్టిన 4 వరుసల మార్గాన్ని ప్రధాని ప్రారంభించారు. ఇది అరా పట్టణాన్ని ఎన్‌హెచ్-02తో (స్వర్ణ చతుర్భజి) కలుపుతుంది. ఇది సరుకు రవాణా, ప్రయాణీకుల రాకపోకలను మెరుగుపరుస్తుంది. ఎన్‌హెచ్-333సీ లో సర్వాన్, చకై మధ్య పాదచారుల మార్గంతో చేపట్టిన 2 వరుసల రహదారిని కూడా ప్రారంభించారు. ఈ మార్గం సరకు రవాణాతో పాటు ప్రజల రాకపోకలను సులభతరం చేయటమే కాకుండా బీహార్, జార్ఖండ్ మధ్య కీలక మార్గంగా పనిచేస్తుంది.
దర్భంగాలో కొత్త సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియాను (ఎస్‌టీపీఐ), ఐటీ/ఐటీఈఎస్/ఈఎస్‌డీఎం పరిశ్రమలతో అంకురాలను ప్రోత్సహించేందుకు పాట్నాలో ఎస్‌టీపీఐకి చెందిన అత్యాధునిక ఇంక్యుబేషన్ కేంద్రాన్ని ప్రధానమంత్రి ప్రారంభించారు. ఈ సౌకర్యాలు ఐటీ, సాఫ్ట్‌వేర్, సేవా రంగ ఎగుమతులను పెంచేందుకు సహయపడతాయి. ఇది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కావాల్సిన సాంకేతిక అంకుర వ్యవస్థను రూపొందిస్తుంది. అంతేకాకుండా ఆవిష్కరణ, ఐపీఆర్, కొత్త వస్తువుల రూపకల్పననూ ప్రోత్సహిస్తుంది.
బీహార్లో మత్స్య, ఆక్వాకల్చర్ రంగాన్ని బలోపేతం చేసే దిశగా ఒక ప్రధాన కార్యక్రమం కూడా ప్రధాని పర్యటనలో జరిగింది. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్వై) కింద మంజూరైన మత్స్య అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాన మంత్రి ప్రారంభించారు. ఇందులో బీహార్‌లోని వివిధ జిల్లాల్లో కొత్త చేపల పిల్లల ఉత్పత్తి కేంద్రాలు, బయోఫ్లోక్ యూనిట్లు, అక్వేరియం చేపల పెంపకం, ఇంటిగ్రేటెడ్ ఆక్వాకల్చర్ కేంద్రాలు, చేపల ఆహారానికి సంబంధించిన మిల్లులతో సహా ఆధునిక మత్స్య రంగ మౌలిక సదుపాయాల ప్రారంభోత్సవం ఉన్నాయి. ఆక్వాకల్చర్ ప్రాజెక్టులు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించడం, చేపల ఉత్పత్తిని పెంచడం, పారిశ్రామికతను ప్రోత్సహించడం, రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో సామాజ