ఆర్థిక మంత్రిత్వ శాఖ
పన్ను తగ్గింపు.. మినహాయింపుల కోసం మోసపూరిత అభ్యర్థనలపై చర్యలు చేపట్టిన ఆదాయపు పన్ను శాఖ
బూటకపు పన్నుకోత.. మినహాయింపులు కోరుతూ రిటర్నులు దాఖలు చేసే కొందరు రిటర్ను తయారీదారులు.. మధ్యవర్తుల వ్యవస్థీకృత ముఠా గుట్టు రట్టుకు దర్యాప్తు
· చట్టంలోని ‘10(13ఎ), 80జీజీసీ, 80ఈ, 80డీ, 80ఈఈ, 80ఈఈబీ, 80జీ, 80జీజీఏ, 80డీడీబీ’ల కింద పన్ను తగ్గింపు సౌలభ్యాన్ని దుర్వినియోగం చేసినట్లు వెల్లడించిన డేటా విశ్లేషణ
Posted On:
14 JUL 2025 5:59PM by PIB Hyderabad
ఆదాయపు పన్ను శాఖ దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున తనిఖీ ప్రక్రియను ప్రారంభించింది. ఇందులో భాగంగా పన్ను తగ్గింపు, మినహాయింపుల కోసం ఆదాయపు పన్ను రిటర్ను (ఐటీఆర్)ల ద్వారా మోసపూరిత అభ్యర్థనల దాఖలుకు తోడ్పడే వృత్తి నిపుణులు, వ్యక్తులు, సంస్థలపై దాడులు చేపట్టింది. ఆదాయపు పన్ను చట్టం-1961 కింద పన్ను ప్రయోజనాలను వారు దుర్వినియోగం చేస్తున్నట్లు సమగ్ర విశ్లేషణలో తేలడంతో ఈ చర్యకు ఉపక్రమించింది.
ఈ సందర్భంగా బూటకపు తగ్గింపులు, మినహాయింపులు కోరుతూ రిటర్నులు దాఖలు చేసే కొందరు పన్ను రిటర్ను తయారీదారులు, మధ్యవర్తులతో కూడిన వ్యవస్థీకృత ముఠాల వ్యవహారం దర్యాప్తులో వెల్లడైంది. పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనకరమైన నిబంధనలను ఈ మోసపూరిత రిటర్నులతో దుర్వినియోగం చేస్తున్నట్లు తేలింది. అంతేకాకుండా కొందరు వ్యక్తులు అధిక మొత్తం వాపసు పొందడం కోసం తప్పుడు ‘టీడీఎస్’ రిటర్నులు కూడా సమర్పించినట్లు విచారణలో స్పష్టమైంది.
ఈ అనుమానాస్పద విధానాలను గుర్తించడం కోసం ఆదాయపు పన్ను శాఖ తృతీయ పక్ష వనరులు, క్షేత్రస్థాయి నిఘా, అత్యాధునిక కృత్రిమ మేధ ఉపకరణాల ద్వారా సేకరించిన ఆర్థిక సమాచారాన్ని ఉపయోగించుకుంది. ఈ మేరకు మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, పంజాబ్, మధ్యప్రదేశ్‌లలో ఇటీవలి తనిఖీ, పత్రాల స్వాధీనం కార్యకలాపాలతో ఈ వాస్తవాలు తేటతెల్లమయ్యాయి. తదనుగుణంగా వివిధ సమూహాలు, సంస్థలు ఈ మోసపూరిత అభ్యర్థనలకు పాల్పడటంపై సమాచార విశ్లేషణలో స్పష్టమైన ఆధారాలు లభించాయి.
ఈ మేరకు చట్టంలోని ‘10(13ఎ), 80జీజీసీ, 80ఈ, 80డీ, 80ఈఈ, 80ఈఈబీ, 80జీ, 80జీజీఏ, 80డీడీబీ’ల కింద పన్ను తగ్గింపు సౌలభ్యాన్ని దుర్వినియోగం చేసినట్లు తేలింది. ఏ మాత్రం హేతుబద్ధత లేకుండా మినహాయింపుల కోసం అభ్యర్ధనలు దాఖలయ్యాయి. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో బహుళ జాతి సంస్థలు, ప్రభుత్వ-ప్రభుత్వరంగ సంస్థలు, విద్యాసంస్థల ఉద్యోగులు సహా కొందరు పారిశ్రామికవేత్తలు కూడా ఉన్నారు. కొంత కమీషన్ ఇస్తే ఆదాయపు పన్ను రిటర్నులలో వాపసులు పెంచి చూపడం ద్వారా అధిక మొత్తం వచ్చేలా చూస్తామంటూ వీరు పన్ను చెల్లింపుదారులను ఆశపెట్టి తప్పుదోవ పట్టిస్తున్నారని స్పష్టమైంది. రిటర్నుల దాఖలుకు పూర్తిస్థాయి ఆన్‌లైన్ వ్యవస్థను అమలు చేస్తున్నప్పటికీ, పన్ను చెల్లింపుదారులకు తోడ్పాటులో సమాచార ప్రదాన లోపం ప్రధాన అవరోధంగా మారింది. దీన్ని అలుసుగా తీసుకుని ఆదాయపు పన్ను రిటర్నుల తయారీదారులు తరచూ తాత్కాలిక మెయిల్ ఐడీ సృష్టించి ఒకేసారి పెద్ద సంఖ్యలో రిటర్నుల దాఖలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ అక్రమానికి పాల్పడ్డాక సదరు మెయిల్ ఐడీలను నిరుపయోగంగా వదిలేయడం వల్ల రిటర్నులలో అక్రమాలను కనుగొన్న సందర్భంలో పంపే అధికారిక నోటీసులు పన్ను చెల్లింపుదారుల దృష్టికి రావు.
“పన్ను చెల్లింపుదారులను విశ్వసించాలి” అనే దార్శనిక సూత్రం మేరకు ఐటీ శాఖ స్వచ్ఛంద నిబంధనల అనుసరణకు ప్రాధాన్యమిచ్చింది. ఈ మేరకు నిరుడు ‘ఎస్సెమ్మెస్’ ఈ-మెయిల్ సలహాలు విస్తృత ప్రచారం నిర్వహించింది. ఏవైనా అనుమానాలుంటే పన్ను చెల్లింపుదారులు తమ రిటర్నులను సవరించి, తగువిధంగా పన్ను చెల్లించేలా వారిని ప్రోత్సహిస్తోంది. అంతేకాకుండా తమ కార్యాలయాల ప్రాంగణాల్లో, వెలుపల ప్రత్యక్ష అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించింది. దీనివల్ల గత 4 నెలల్లో సుమారు 40,000 మంది పన్ను చెల్లింపుదారులు తమ రిటర్నులను సవరించి దాఖలు చేశారు. తద్వారా రూ.1,045 కోట్ల విలువైన తప్పుడు అభ్యర్థనలను వెనక్కు తీసుకున్నారు. అయినప్పటికీ, పన్ను ఎగవేతకు తోడ్పడే సూత్రధారి ముఠాల ప్రభావం ఫలితంగా కొందరు నిబంధనలను పాటించడం లేదు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత మోసపూరిత అభ్యర్థనలు దాఖలు చేసినవారిపై ఆదాయపు పన్ను శాఖ కఠిన చర్యలకు సిద్ధమైంది. తదనుగుణంగా నిబంధనల మేరకు జరిమానా విధింపు, విచారణ సహా ఇతరత్రా చర్యలు చేపడుతోంది. దేశవ్యాప్తంగా 150 కార్యాలయాల పరిధిలో కొనసాగుతున్న తనిఖీ కసరత్తులో డిజిటల్ రికార్డులు సహా కీలక ఆధారాలు లభించగలవని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఈ మోసపూరిత ముఠాల వలయాన్ని ఛేదించే వీలుంటుందని, చట్టబద్ధ జవాబుదారీతనానికి భరోసా లభిస్తుందని పేర్కొంటున్నారు. తనిఖీ ప్రక్రియ అనంతర విచారణ కార్యకలాపాలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి.
పన్ను చెల్లింపుదారులు సరైన వివరాలతో తమ ఆదాయం, సమాచార వెల్లడి మధ్య సమన్వయానికి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు. పన్ను వాపసులపై అనధికార ఏజెంట్లు, మధ్యవర్తిత్వ ముఠాల సలహాలతో ప్రభావితం కారాదని పునరుద్ఘాటిస్తున్నారు.
****
(Release ID: 2144718)