ప్రధాన మంత్రి కార్యాలయం
పత్తి దిగుబడిపై చర్చ కోసం ఉన్నత స్థాయి సమావేశాన్ని
ఏర్పాటు చేస్తున్నట్లు వీడియో సందేశం ద్వారా ప్రకటించిన కేంద్ర వ్యవసాయ మంత్రి
“పత్తి దిగుబడిపై ఈనెల 11న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నాం”
“పత్తి దిగుబడినీ, నాణ్యతనీ పెంచే మార్గాలను చర్చిస్తాం”
పత్తి దిగుబడి పెంచడం కోసం రైతులంతా సూచనలు అందించాలి: శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్
Posted On:
09 JUL 2025 7:55PM by PIB Hyderabad
కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ పంటల వారీగా నిర్వహిస్తున్న ప్రత్యేక సమావేశాల్లో భాగంగా ఈనెల 11న కోయంబత్తూరులో పత్తి దిగుబడి అంశంపై కీలక సమావేశం నిర్వహిస్తున్నట్లు ఈ రోజు విడుదల చేసిన ఒక వీడియో సందేశంలో తెలిపారు. భారత రైతు సోదరసోదరీమణులంతా పత్తి దిగుబడి పెంపు గురించి సూచనలు ఇవ్వాలని ఆయన ఆహ్వానించారు.
కేంద్ర వ్యవసాయ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ తన సందేశంలో ఇలా పేర్కొన్నారు:
“పత్తి పంటను సాగు చేస్తున్న ప్రియమైన సోదరసోదరీమణులారా,
మన దేశంలో పత్తి దిగుబడి ప్రస్తుతం చాలా తక్కువగా ఉంది. ఇటీవలి కాలంలో బీటీ పత్తిని ఆశించిన టీఎస్‌వీ వైరస్ కారణంగా దిగుబడి మరింత తగ్గింది. వేగంగా తగ్గుతున్న పత్తి దిగుబడి మన రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. వాతావరణ మార్పులను, వైరల్ దాడులను తట్టుకోగల అధిక-నాణ్యత గల విత్తనాలను అభివృద్ధి చేసే లక్ష్యంతో.. సాగు ఖర్చులను తగ్గిస్తూనే పత్తి దిగుబడిని పెంచే దిశగా మా ప్రయత్నాలు చురుగ్గా సాగుతున్నాయి.
పత్తి దిగుబడి సమస్య పరిష్కారం కోసం ఈనెల 11న ఉదయం 10 గంటలకు కోయంబత్తూరులో ఒక సమావేశం ఏర్పాటు చేశాం. పత్తి సాగు చేస్తున్న రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ సహా) నుంచి ప్రఖ్యాత శాస్త్రవేత్తలు, పత్తి సాగు చేసే రాష్ట్రాల వ్యవసాయ మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పత్తి పరిశ్రమ ప్రతినిధులు, వ్యవసాయ విశ్వవిద్యాలయ నిపుణులు ఈ సమావేశంలో పాల్గొంటారు.
‘‘నా ప్రియమైన సోదరీమణులారా.. పత్తి దిగుబడి, నాణ్యతను మెరుగుపరచే మార్గాలను కనుగొనడం కోసం విశేష కృషి జరుగుతోంది. ఈ విషయంగా మీ సూచనలను దయచేసి మా టోల్-ఫ్రీ నంబర్: 18001801551 ద్వారా తెలియజేయండి. నేను మీ సూచనలను ప్రత్యేక శ్రద్ధతో పరిశీలిస్తాను. మనమంతా ఐక్యంగా దేశంలో పత్తి దిగుబడి పెంచే సమగ్ర ప్రణాళికను సిద్ధం చేద్దాం” అని మంత్రి పేర్కొన్నారు.
***
(Release ID: 2143535)
Read this release in:
Assamese
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam