ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పర్యావరణం, కాప్-30, ప్రపంచ ఆరోగ్య అంశాలపై ఏర్పాటైన బ్రిక్స్ సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

Posted On: 07 JUL 2025 11:13PM by PIB Hyderabad

గౌరవ మిత్రులారా..

బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతాల్లో భాగంగా పర్యావరణ, ఆరోగ్య భద్రత అంశాలకు బ్రెజిల్ అత్యధిక ప్రాధాన్యతనివ్వడం నాకు సంతోషం కలిగిస్తోంది. ఇవి పరస్పర సంబంధం గల అంశాలే కాక మానవాళి సంక్షేమానికి, ఉజ్జ్వల భవిష్యత్తుకూ ఎంతో ముఖ్యమైనవి.

మిత్రులారా..

ఈ ఏడాది కాప్-30 సమావేశాలు బ్రెజిల్ లో ఏర్పాటవడం సముచిత నిర్ణయమని భావిస్తాను.  వాతావరణ మార్పులు, పర్యావరణ భద్రతకు మేం ఎప్పటినుంచో అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నాం. వీటిని కేవలం ఇంధనానికి సంబధించిన విషయాలుగానే కాక, మనిషి ఉనికికి, ప్రకృతికి మధ్య గల సున్నితమైన సంబంధం, సమతుల్యతకు సంబంధించిన అంశాలుగా పరిగణిస్తాం. కొందరికి వీటి గణాంకాలు ఎంతో ముఖ్యమైనవి కావచ్చు, భారతీయులైన మాకు మాత్రం మా ఆచార్య వ్యవహారాలు, నిత్యజీవితంతో పెనవేసుకుపోయిన అంశాలివి! మా సంస్కృతిలో ధరణిని తల్లిగా భావిస్తాం..  అమ్మకు అవసరం కలిగి మమ్మల్ని పిలిస్తే వెంటనే స్పందిస్తాం! మా దృక్పథాన్ని, వ్యవహారశైలిని, మా జీవన విధానాన్ని ఆ తల్లి పిలుపు మేరకు మార్చుకుంటున్నాం..

“మనిషి, పుడమి, ప్రగతి” అన్నది మార్గదర్శక సూత్రంగా భారత్ పలు ముఖ్యమైన కార్యక్రమాలను ప్రారంభించింది – మిషన్ లైఫ్ (పర్యావరణ అనుకూల జీవనం), 'ఏక్ పేడ్ మా కే నామ్' (తల్లి పేరు మీద ఒక మొక్కను నాటడం), అంతర్జాతీయ సౌరశక్తి కూటమి, సమర్థవంతమైన విపత్తు సన్నద్ధ కూటమి (కోయలిషన్ ఫర్ డిజాస్టర్ రేజీలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్), హరిత హైడ్రోజన్ మిషన్, ప్రపంచ జీవ ఇంధన వేదిక, పులుల సంరక్షణ కూటమి (బిగ్ క్యాట్స్ అలయన్స్) మేం చేపట్టిన పర్యావరణ హిత కార్యక్రమాల్లో కొన్ని..

ఇక మేం జీ-20 అధ్యక్షత నిర్వహించిన సమయంలో పర్యావరణ అనుకూల అభివృద్ధికి.. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల మధ్య అంతరాలు తగ్గించేందుకూ అత్యధిక ప్రాధాన్యతనిచ్చాం. ఇదే లక్ష్యంగా హరిత అభివృద్ధి ఒడంబడికపై సభ్యుల్లో ఏకాభిప్రాయాన్ని సాధించాం. పర్యావరణ హిత చర్యల దిశగా గ్రీన్ క్రెడిట్స్ పథకాన్ని సైతం ప్రారంభించాం.
ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన భారత్ అత్యంత వేగంగా ఎదుగుతున్నప్పటికీ, ప్యారిస్ లక్ష్యాలను అందరికన్నా ముందుగా, నిర్ణీత సమయానికన్నా ముందస్తు చేరుకోవడం గమనించదగ్గ అంశం. 2070 నాటికి నెట్ జీరో (సున్నా ఉద్గారల విడుదల) లక్ష్యం వైపు కూడా దూసుకుపోతున్నాం. ఇక.. గత దశాబ్ద కాలంలో, సౌర ఇంధన రంగంలో భారత్ 4000 శాతం వృద్ధి సాధించి అద్భుతాలను సృష్టించింది. ఇటువంటి పలు చర్యల ద్వారా పర్యావరణ అనుకూల హరిత భవిష్యత్తుకు భారత్ బలమైన పునాదులు నిర్మిస్తోంది.

మిత్రులారా..

వాతావరణ న్యాయం అనేది కేవలం మేం ఎంచుకునే వికల్పం కాదు, అది ఒక నైతిక బాధ్యతగా భావిస్తాం. సాంకేతిక బదిలీ సహా దేశాల అవసరాలను బట్టి  తగిన మేరకు ఆర్థికపరమైన అండదండలు అందించకుంటే, వాతావరణ చర్యలు మాటలకు, చర్చలకే పరిమితం అవుతాయని భారతదేశం గట్టిగా విశ్వసిస్తుంది. వాతావరణపరమైన ఆకాంక్షలు, వాటిని చేరుకునేందుకు అవసరమైన ఆర్థిక సహాయం మధ్య గల అంతరాన్ని తగ్గించడం, అభివృద్ధి చెందిన దేశాలు తప్పక చేపట్టవలసిన ముఖ్యమైన బాధ్యత అని మేం నమ్ముతాం. అంతర్జాతీయస్థాయి పరిస్థితుల వల్ల  ఆహారం, ఇంధనం, ఎరువులు, ఆర్థికపరమైన ఇక్కట్లను ఎదుర్కొంటున్న అన్ని దేశాలను మేం బాసటగా నిలుస్తాం.
తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడంలో అభివృద్ధి చెందిన దేశాలకు గల ఆత్మ విశ్వాసమే అభివృద్ధి చెందుతున్న ఈ దేశాలకూ ఉండాలని మేం భావిస్తాం. ద్వంద్వ వైఖరులు ఉన్నంత కాలం సమ్మిళిత, అనుకూల అభివృద్ధి మానవాళికి అందరాని ఫలమే అవుతుంది. ఈరోజు విడుదల చేస్తున్న “ఫ్రేమ్ వర్క్ డిక్లరేషన్ ఆన్ క్లైమేట్ ఫైనాన్స్”, ఈ దిశగా చేపడుతున్న మంచి ప్రయత్నం, భారత్ ఈ కార్యక్రమానికి సంపూర్ణ మద్దతునిస్తోంది.

మిత్రులారా..

భూగ్రహం ఆరోగ్యం, మానవాళి ఆరోగ్యం ఒకదానితో ఒకటి ముడివేసుకున్న అంశాలు. వైరస్‌లకు వీసాలు అవసరం లేదని, పాస్‌పోర్టుల ఆధారంగా పరిష్కారాలను ఎంచుకోలేమని కోవిడ్-19 మహమ్మారి మనకు నేర్పింది. ఉమ్మడి సవాళ్ళను సమిష్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే పరిష్కరించుకోగలుగుతాం.

‘వన్ ఎర్త్, వన్ హెల్త్ – సకల మానవాళి ఆరోగ్యం’ అనే మంత్రం మార్గదర్శక సూత్రంగా భారతదేశం అన్ని దేశాలతో సహకారాన్ని పెంచుకుంటోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం "ఆయుష్మాన్ భారత్". మేం ప్రారంభించిన ఈ భారీ ఆరోగ్య బీమా పథకం ఈరోజున 500 మిలియన్లకు పైగా ప్రజలకు ఆరోగ్య భద్రతను కల్పిస్తోంది. ఆయుర్వేదం, యోగా, యునాని, సిద్ధ వంటి సాంప్రదాయ వైద్య విధానాల కోసం ప్రత్యేకంగా ఒక  వ్యవస్థను స్థాపించాం. డిజిటల్ హెల్త్ కార్యక్రమాల ద్వారా దేశ మారుమూల ప్రాంతాల్లో నివసించే  లక్షలాది ప్రజలకు ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తున్నాం. ఈ రంగాల్లో మా అనుభవాలను పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నాం.

ఆరోగ్య రంగంలో సహకారాన్ని పెంపొందించుకోవడంపై బ్రిక్స్ ప్రత్యేక దృష్టి పెట్టడం సంతోషంగా ఉంది. 2022లో ప్రారంభించిన ‘బ్రిక్స్ వ్యాక్సిన్ పరిశోధన, అభివృద్ధి కేంద్రం’ ఈ దిశలో ఒక ముఖ్యమైన అడుగు. ఈ రోజు జారీ అవుతున్న "సామాజికపరంగా నిర్ధారిత వ్యాధుల నిర్మూలనకు బ్రిక్స్ భాగస్వామ్యం" పై నాయకుల ప్రకటన మన సహకారాన్ని బలోపేతం చేయడంలో కొత్త ప్రేరణగా నిలుస్తుంది.

మిత్రులారా..

ఈరోజు జరిగిన కీలకమైన, నిర్మాణాత్మక చర్చల్లో పాల్గొన్న అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. వచ్చే ఏడాది భారతదేశం బ్రిక్స్ అధ్యక్షతన అన్ని కీలక అంశాలపై సహకారాన్ని కొనసాగిద్దాం. బీఆర్ఐకేఎస్- బిల్డింగ్ రెజిలియన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ కోఆపరేషన్ అండ్ సస్టెయినబిలిటీ (సహకారం, స్థిరత్వం కోసం పర్యావరణ అనుకూల ఆవిష్కరణల నిర్మాణం) గా బ్రిక్స్‌ ను పునర్నిర్వచించుకుందామా! గత జీ-20 అధ్యక్ష కాలంలో మేము గ్లోబల్ సౌత్ ఆందోళనలకు ప్రాముఖ్యం ఇచ్చిన రీతిలోనే రాబోయే బ్రిక్స్ అధ్యక్షత సమయంలో, ఈ వేదికను ప్రజా-కేంద్రీకృత విధానాలు,  'మానవత్వానికే తొలి ప్రాధాన్యం' అనే స్ఫూర్తితో ముందుకు తీసుకువెళతాం.

బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు  అధ్యక్షుడు లూలాకు మరొక్కసారి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.

ధన్యవాదాలు మిత్రులారా..

గమనిక - ప్రధానమంత్రి హిందీలో చేసిన ప్రసంగానికి ఇది తెలుగు అనువాదం.

 

***


(Release ID: 2143083)