బొగ్గు మంత్రిత్వ శాఖ
గనుల మూసివేత, పునరుపయోగ ప్రాంతాల్లో ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి కార్యక్రమాలు:
‘రీక్లెయిమ్’ పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న బొగ్గుమంత్రిత్వ శాఖ
జూలై 4వ తేదీన ప్రారంభించనున్న కేంద్ర బొగ్గు గనుల శాఖా మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి
Posted On:
02 JUL 2025 1:16PM by PIB Hyderabad
స్థానిక ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధికి బాటలు వేసే సరికొత్త కార్యక్రమం... ‘రీక్లెయిమ్’ కు బొగ్గు మంత్రిత్వ శాఖ శ్రీకారం చుడుతోంది. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి వచ్చే శుక్రవారం అంటే ఈ నెల 4న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ సమగ్ర సమాజిక అభివృద్ధి విధానాన్ని బొగ్గు శాఖలో భాగమైన కోల్ కంట్రోల్ ఆర్గనైజేషన్ రూపకల్పన చేసింది. హార్ట్‌ఫుల్‌నెస్ ఇనిస్టిట్యూట్ ఇందుకు సహకారాన్ని అందించింది. మైనింగ్ అనంతరం గనులను మూసివేయడం వల్ల భూ ఉపరితలం ప్రభావితం అవుతుంది. స్థానిక జీవనోపాధికీ ఇబ్బందులు ఏర్పడతాయి. దశాబ్దాల తరబడీ గని పరిసరాల్లో నివాసం ఉంటున్న కుటుంబాల అభ్యున్నతికి కృషి చేయాలన్నది దీని లక్ష్యం.
‘రీక్లెయిమ్’గా వ్యవహరిస్తున్న ఈ విధానం.. గని మూసివేత దశలోనూ, గని మూసివేసిన తరువాతి దశలోనూ ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి పనులు చేపడతారు. ఈ కార్యక్రమాలకు ఇది సువ్యవస్థిత మార్గదర్శిలా పనిచేస్తుంది. అవసరమైన మార్పులూ చేర్పులూ చేయడానికి ఆయా ప్రాంతాల్లోని ప్రజలు తమ వంతు సహకారాన్ని అందించాల్సి ఉంటుంది.
పనులు సజావుగా సాగేందుకు వీలుగా ఆచరణాత్మక విధానాలను అనుసరిస్తారు. సత్ఫలితాలను అందించిన విధానాలను ఎంచుకుంటారు. ముఖ్యంగా భారతదేశంలోని పరిస్థితులకు అనుగుణంగా రూపొందించుకున్న క్షేత్రస్థాయిలో విజయవంతమైన వాటినే అమలు చేస్తారు. స్త్రీపురుష భేదం లేకుండా అందరూ ఇందులో పాల్గొనేందుకు ప్రాధాన్యం ఇస్తారు. బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం కల్పిస్తారు. సమానత్వానికి చోటిస్తూనే, స్థానిక అవసరాల దృష్ట్యా పంచాయితీరాజ్ వంటి స్థానిక సంస్థలతో కలిసి పనిచేస్తారు.
గని ప్రాంతాల్లో ఉన్న ప్రజల్లో నమ్మకాన్ని ప్రోది చేయడానికీ, పర్యావరణాన్ని కాపాడటానికీ, దీర్ఘకాలంలో సామాజిక-ఆర్థిక అభివృద్ధికీ ఈ రీక్లెయిమ్ కార్యక్రమాన్ని ఉద్దేశించారు.
***
(Release ID: 2141517)