సహకార మంత్రిత్వ శాఖ
ఈనెల 30న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సహకార మంత్రుల మంథన్ బైఠక్
నాడు పోస్టు చేయడమైనది:
28 JUN 2025 11:15AM by PIB Hyderabad
భారత సహకార మంత్రిత్వ శాఖ జూన్ 30న న్యూఢిల్లీలోని భారత్ మండపంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సహకార మంత్రుల మంథన్ బైఠక్ నిర్వహించనుంది. కేంద్ర హోం, సహకార శాఖా మంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షతన ఈ మంథన్ బైఠక్ ను నిర్వహిస్తున్నారు. రాష్ట్రాలు, యూటీల సహకార శాఖ మంత్రులు, అదనపు ప్రధాన కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు ఈ ముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొంటారు. సహకార రంగాన్ని బలోపేతం చేసే సమష్టి లక్ష్యాన్ని సాధించడంలో పురోగతిని సమీక్షించడానికి, అభిప్రాయాలను పంచుకోవడానికి, ఈ విషయంగా ముందుకు సాగేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించే వేదికగా ఇది పనిచేస్తుంది.
సహకార మంత్రిత్వ శాఖ కార్యక్రమాలు, పథకాలను సమగ్రంగా సమీక్షించడం, సాధించిన పురోగతిని అంచనా వేయడం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అనుభవాలు, ఉత్తమ పద్ధతులు, నిర్మాణాత్మక సూచనలను పంచుకునే ప్రక్రియను సులభతరం చేయడం మంథన్ బైఠక్ ప్రాథమిక లక్ష్యం. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత 'సహకార్ సే సమృద్ధి' (సహకారం ద్వారా శ్రేయస్సు)ను పరస్పర సహకారం ద్వారా ముందుకు తీసుకెళ్లడం కోసం ఉమ్మడి అవగాహనను, సమన్వయంతో కూడిన ప్రయత్నాన్ని పెంపొందించడం లక్ష్యంగా మంథన్ బైఠక్ నిర్వహిస్తున్నారు.
దేశవ్యాప్తంగా గ్రామీణ సేవలను బలోపేతం చేయడానికి కొత్తగా 2 లక్షల మల్టీ-పర్పస్ ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీలు (పీఏసీఎస్), పాడి, మత్స్య సహకార సంఘాల ఏర్పాటు సహా అన్ని ప్రధాన కార్యక్రమాలను గురించి మంథన్ బైఠక్ చర్చిస్తుంది. ఆహార భద్రత, రైతుల సాధికారతను పెంపొందించే లక్ష్యంతో సహకార రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్యం నిల్వ పథకం గురించి ప్రధానంగా చర్చించనున్నారు. "సహకార సంస్థల మధ్య సహకారం" ప్రచారం, కొనసాగుతున్న "అంతర్జాతీయ సహకార సంవత్సరం 2025" విషయంలో సాధించిన పురోగతిని, విస్తృత భాగస్వామ్యం విషయంగా తమ అంచనాలను రాష్ట్రాలు వివరిస్తాయి.
కొత్తగా మూడు జాతీయ బహుళ-రాష్ట్ర సహకార సంఘాలు, నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్‌పోర్ట్ లిమిటెడ్ (ఎన్‌సీఈఎల్), నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ (ఎన్‌సీఓఎల్), భారతీయ బీజ్ సహకారీ సమితి లిమిటెడ్ (బీబీఎస్ఎస్ఎల్) కార్యకలాపాల్లో రాష్ట్రాల పాత్రను సమీక్షించనున్నారు. ఆత్మనిర్భరతా అభియాన్ కింద పప్పుధాన్యాలు, మొక్కజొన్న రైతులకు సేకరణ మద్దతు ధరతో పాటు, శ్వేత విప్లవం 2.0 కార్యక్రమం, భారత పాడి పరిశ్రమలో వ్యర్థాలను తగ్గించి, సుస్థిరతను సాధించడం గురించి చర్చిస్తారు. జాతీయ సహకార డేటాబేస్.. విధాన ప్రణాళిక విషయంలో దాని ప్రయోజనంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ పీఏసీఎస్ కంప్యూటరీకరణ, రాష్ట్రాలు, యూటీల రిజిస్ట్రార్ కోఆపరేటివ్ సొసైటీ (ఆర్సీఎస్) కార్యాలయాల కంప్యూటరీకరణ వంటి కీలకమైన డిజిటల్ పరివర్తన కార్యక్రమాలనూ సమీక్షిస్తారు.
త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయం ఏర్పాటు నేపథ్యంలో సహకార రంగంలో మానవ వనరుల అభివృద్ధి, శిక్షణ, సామర్థ్యాలను పెంపొందించడంపైనా మంథన్ బైఠక్‌లో చర్చించనున్నారు. ఈ రంగాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి.. సహకార బ్యాంకులకు సంబంధించిన సమస్యల పరిష్కారం, రాష్ట్ర సహకార బ్యాంకులు (ఎస్‌టీసీబీలు), జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల (డీసీసీబీలు) కోసం భాగస్వామ్య సేవల సంస్థ (ఎస్ఎస్ఈ) నిర్వహణ, అర్బన్ సహకార బ్యాంకుల కోసం అంబ్రెల్లా ఆర్గనైజేషన్ (యూసీబీలు) నిర్వహణ వంటి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించీ చర్చించనున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సన్నిహిత సహకారం ద్వారా సహకార సమాఖ్య స్ఫూర్తితో రాష్ట్ర స్థాయి సహకార సంస్థలను శక్తిమంతమైన ఆర్థిక సంస్థలుగా అభివృద్ధి చేయడంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కీలక పాత్రను స్పష్టం చేసే వేదికగా ఈ మంథన్ బైఠక్ పని చేస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2140510)
సందర్శకుల సూచీ సంఖ్య : : 22