ప్రధాన మంత్రి కార్యాలయం
జీ7 అనుసంధాన సదస్సులో ప్రధాని ప్రసంగం
Posted On:
18 JUN 2025 11:13AM by PIB Hyderabad
కననాస్కిస్‌లో జరుగుతున్న జీ7 శిఖరాగ్ర సదస్సు అనుసంధాన సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొన్నారు. ‘ఇంధన భద్రత: మారుతున్న ప్రపంచంలో తక్కువ వ్యయంతో, అందరికీ అందుబాటులో ఉండేలా వైవిధ్యం, సాంకేతికత, మౌలిక సదుపాయాలు’ అంశంపై జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. తనను ఆహ్వానించిన గౌరవ కెనడా ప్రధానమంత్రి శ్రీ మార్క్ కార్నీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తిచేసుకున్న సందర్భంగా జీ7కు అభినందనలు తెలిపారు.
భావి తరాలు ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లలో ఇంధన భద్రత ఒకటని ప్రధానమంత్రి తన ప్రసంగంలో స్పష్టం చేశారు. సమ్మిళిత వృద్ధి దిశగా భారత నిబద్ధతను వివరిస్తూ.. లభ్యత, అందుబాటు, తక్కువ వ్యయం, ఆమోదయోగ్యత అనే సూత్రాలు భారత ఇంధన భద్రత విధానానికి ప్రాతిపదికలుగా నిలుస్తున్నాయని ఆయన తెలిపారు. భారత్ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థే అయినప్పటికీ, పారిస్ ఒడంబడికలోని అంశాలను నిర్ణీత సమయానికి ముందే విజయవంతంగా నెరవేర్చిందని ఆయన తెలిపారు. సుస్థిరమైన, పర్యావరణ హిత భవితకు భారత్ కట్టుబడి ఉందని స్పష్టం చేస్తూ.. అంతర్జాతీయ సౌర కూటమి, విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కూటమి, అంతర్జాతీయ జీవ ఇంధన కూటమి, మిషన్ లైఫ్ (ఎల్ఐఎఫ్ఈ), ఒక సూర్యుడు- ఒక ప్రపంచం – ఒకే గ్రిడ్ వంటి అనేక అంతర్జాతీయ కార్యక్రమాలను భారత్ చేపట్టిందని ఆయన తెలిపారు. వాటిని మరింత బలోపేతం చేయాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు.
ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో అనిశ్చితి, సంఘర్షణలు అభివృద్ధి చెందుతున్న దేశాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయని, అంతర్జాతీయ వేదికలపై ఆ దేశాల వాణిని వినిపించడాన్ని భారత్ బాధ్యతగా తీసుకుందని ప్రధానమంత్రి తెలిపారు. సుస్థిర భవితకు అంతర్జాతీయ సమాజం కట్టుబడి ఉంటే.. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రాధాన్యాలు, ఆందోళనను అర్థం చేసుకోవడం అత్యంత ముఖ్యమైన అంశమని స్పష్టం చేశారు. భద్రతా సవాళ్లను ప్రముఖంగా ప్రస్తావించిన శ్రీ మోదీ.. ఉగ్రవాదంపై ప్రపంచవ్యాప్తంగా పోరాటాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా నిలిచిన అంతర్జాతీయ సమాజానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పహల్గామ్ ఉగ్రదాడిని కేవలం భారత్‌పైనే కాదు, యావత్ మానవాళిపైనా జరిగిన దాడిగా పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలపై కఠిన చర్యలకు పిలుపునిచ్చారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ద్వంద్వ ప్రమాణాలు తగవని, ఉగ్రవాదానికి మద్దతిచ్చే వారిని ఎంతమాత్రమూ ఉపేక్షించొద్దనీ ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాదం మానవాళికి పెనుముప్పుగా పరిణమించిందని పేర్కొన్న ప్రధానమంత్రి.. అంతర్జాతీయ సమాజం ఆలోచించాలంటూ కింది ముఖ్య ప్రశ్నలను లేవనెత్తారు:
- తమదాకా వస్తేనే ఉగ్రవాదం వల్ల పొంచి ఉన్న పెనుముప్పును దేశాలు అర్థం చేసుకుంటాయా?
- ఉగ్రవాదానికి పాల్పడేవారిని, బాధితులను ఒకేగాటిన ఎలా కడతారు?
- అంతర్జాతీయ సంస్థలు ఉగ్రవాదం పట్ల మౌన ప్రేక్షకులుగా ఉంటాయా?
సాంకేతిక పరిజ్ఞానం, కృత్రిమ మేధ, ఇంధన రంగాల మధ్య అనుసంధానం గురించి కూడా ప్రధానమంత్రి మాట్లాడారు. ఓవైపు సామర్థ్యాన్ని, ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్లడంలో కృత్రిమ మేధ కీలక సాధనంగా మారుతుండగా.. మరోవైపు సాంకేతికతలో శక్తి వినియోగమూ బాగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పర్యావరణ హితమైన, హరిత కార్యక్రమాల ద్వారా సాంకేతికతలో సుస్థిర పద్ధతులను అవలంబించే దిశగా వ్యూహాలను రూపొందించడం అత్యావశ్యకం. సాంకేతికతను ప్రోత్సహించడంలో మానవుడే కేంద్రంగా భారత్ అవలంబిస్తున్న విధానాన్ని ఆయన వివరించారు. సామాన్యుడి జీవనానికి ఉపయోగపడినప్పుడే ఏ సాంకేతిక పరిజ్ఞానమైనా ప్రభావవంతమైనదిగా నిలుస్తుందన్నారు. కృత్రిమమేధ సంబంధిత ఆందోళనలను పరిష్కరించడంలో, ఈ రంగంలో ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్లడంలో అంతర్జాతీయంగా ఏఐ సంబంధిత నిర్వహణ సమస్యలను పరిష్కరించడం కీలకమైన అంశమని ఆయన సూచించారు. కృత్రిమమేధ యుగంలో కీలక ఖనిజాలకు సంబంధించి సురక్షితమైన, సమర్థమైన సరఫరా వ్యవస్థలు అత్యంత కీలకమైనవని ఆయన స్పష్టం చేశారు. భారత్‌లో పుష్కలంగా ఉన్న నాణ్యమైన, వైవిధ్యభరితమైన డేటా బాధ్యతాయుతమైన కృత్రిమమేధ దిశగా కీలకమనీ ప్రధానమంత్రి పేర్కొన్నారు.
సాంకేతిక ఆధారిత ప్రపంచంలో సుస్ధిరమైన భవిష్యత్తు కోసం దేశాల మధ్య సహకారం అవసరమనీ, ఈ లక్ష్యాన్ని అందుకోవడం కోసం ప్రజలకూ, భూమికీ ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలనీ ప్రధానమంత్రి స్పష్టం చేశారు. సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగాన్ని ఇక్కడ చూడొచ్చు: [లింక్]
***
(Release ID: 2139823)
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Nepali
,
Bengali-TR
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam