ప్రధాన మంత్రి కార్యాలయం
క్రొయేషియా రిపబ్లిక్ ప్రధానమంత్రితో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ
Posted On:
18 JUN 2025 11:40PM by PIB Hyderabad
క్రొయేషియా రిపబ్లిక్ ప్రధానమంత్రి శ్రీ ఆంద్రెజ్ ప్లెంకోవిచ్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జాగ్రెబ్‌లో సమావేశమయ్యారు. భారతదేశ ప్రధానమంత్రి క్రొయేషియాలో అధికారికంగా పర్యటించడం ఇదే ప్రథమం. ఈ కారణంగా, భారత్-క్రొయేషియా సంబంధాల చరిత్రలో ఈ పర్యటనకు గొప్ప చారిత్రక ప్రాముఖ్యం ఏర్పడింది. చరిత్రాత్మక బేన్‌స్కీ డవోరీ మహలుకు ప్రధానమంత్రి శ్రీ మోదీ చేరుకొన్న వేళ.. క్రొయేషియా ప్రధానమంత్రి శ్రీ ప్లెంకోవిచ్ ఆయనకు ఆహ్వానం పలకడంతో పాటుగా సాంప్రదాయక స్వాగత ఏర్పాట్లను కూడా చేశారు. దీని కన్నా ముందు, జాగ్రెబ్ విమానాశ్రయంలో ప్రధానమంత్రి శ్రీ మోదీని ప్రధానమంత్రి శ్రీ ప్లెంకోవిచ్ విశేషమైన, స్నేహపూర్వక రీతిన స్వాగతించారు.
నేతలు ఇరువురూ ప్రతినిధి వర్గం స్థాయి చర్చల్లో పాల్గొన్నారు. వారు వ్యాపారం, పెట్టుబడి, సైన్స్, టెక్నాలజీ, రక్షణ, భద్రత, అంతరిక్షం, సాంస్కృతిక సహకారంతో పాటు ఉభయ దేశాల మధ్య పరస్పర సంబంధాలు సహా ద్వైపాక్షిక భాగస్వామ్యం పరిధిలోని వేర్వేరు అంశాలపై విస్తృతంగా చర్చించారు. మౌలిక సదుపాయాల కల్పన, ఓడరేవులు-షిప్పింగ్, డిజిటలీకరణ, కృత్రిమ మేధ, పునరుత్పాదక ఇంధనం, ఔషధాల తయారీ, పర్యటనతో పాటు ఆతిథ్యం వంటి రంగాల్లో సహకారాన్ని ఇప్పటి కన్నా ఎక్కువగా పెంచుకోవడానికి అవకాశాలు ఉన్నాయని నేతలు అంగీకరించారు. భారతీయ సంస్కృతి, ఇండాలజీతో పాటు యోగా అంటే క్రొయేషియాలో ఆదరణ నానాటికీ పెరుగుతూ ఉండటం ఇరు దేశాల ప్రజల్లోనూ సాన్నిహిత్యాన్ని పెంచిన విషయాన్ని నేతలు గుర్తించారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం అయినందున, క్రొయేషియాలోని యోగా ఔత్సాహికులందరికీ ప్రధానమంత్రి శ్రీ మోదీ తన అభినందనలను తెలియజేశారు.
అంకుర సంస్థలు, నవకల్పన ప్రధానమైన భాగస్వామ్యాల్ని పెంపొందించుకొనే దిశగా ఇటీవల మొదలుపెట్టిన కార్యక్రమాలను నేతలు పరిగణనలోకి తీసుకున్నారు. రెండు దేశాల్లోనూ అభివృద్ధి ఫలాలు దీర్ఘకాల ప్రాతిపదికన అన్ని వర్గాలకూ అందేటట్లుగా చూడడానికి పెట్టుబడి భాగస్వామ్యాలతో పాటుగా సంయుక్త వాణిజ్య సంస్థలకు మార్గాన్ని సుగమం చేయాల్సిన, వాణిజ్య ప్రధాన సహకార విస్తరణను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని కూడా వారు గుర్తించారు. ఈ లక్ష్యాలను సాధించడం కోసం, భారత్‌లో నైపుణ్యవంతులైన సిబ్బంది సహకారాన్ని క్రొయేషియా పొందాలంటూ ప్రధానమంత్రి శ్రీ మోదీ సూచనను చేశారు. రాకపోకల రంగంలో సంస్థాగత సహకారానికి నాందీప్రస్తావన జరగాలని కూడా ఆయన కోరారు. కనెక్టివిటీని (సంధానాన్ని) మెరుగుపరచుకోవడానికి పెద్దపీట వేయాలని, దీనిలో ఓ భాగంగా ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ (ఐఎంఈసీ)ని చూడాలని అనుకున్నారు. భారత్ మధ్య ఐరోపాతోనూ, ఆగ్నేయ ఐరోపాతోనూ తన అనుబంధాన్ని విస్తరించుకోవడంలో క్రొయేషియా ఒక ప్రవేశద్వారంగా మారగలుగుతుంది.
పరస్పర ప్రయోజనాలతో ముడిపడిన ప్రాంతీయ అంశాలు, ప్రపంచ అంశాల్లో ప్రధానమైన వాటిని కూడా ఇద్దరు నేతలూ చర్చించారు. ఐక్యరాజ్యసమితితోపాటు ఇతర అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణల ఆవశ్యకత, వాతావరణ మార్పులకు సంబంధించిన కార్యాచరణ, ఉగ్రవాదం వంటివాటిపైన తమ అభిప్రాయాలను నేతలు పంచుకున్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేస్తున్న పోరాటానికి క్రొయేషియా బలమైన మద్దతు తెలపడంతో పాటు సంఘీభావాన్ని వ్యక్తం చేసినందుకు క్రొయేషియా ప్రధానమంత్రి శ్రీ ప్లెంకోవిచ్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు. భారత్-ఈయూ వ్యూహాత్మక సంబంధాలు విస్తరించినందుకు ఇరువురు నేతలు హర్షాన్ని వెలిబుచ్చారు. భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం త్వరగా కొలిక్కిరావాలనే అంశాన్ని వారు సమర్ధించారు.
చర్చలకు తరువాయిగా, వ్యవసాయం, సైన్సు-టెక్నాలజీ, సాంస్కృతిక రంగాల్లోనూ, హిందీ పీఠం పునరుద్ధరణ అంశంపై నాలుగు అవగాహన ఒప్పందాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సంయుక్త ప్రకటనను విడుదల చేశారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గౌరవార్థం క్రొయేషియా ప్రధానమంత్రి శ్రీ ప్లెంకోవిచ్ విందు ఇచ్చారు. భారత్‌కు రావలసిందిగా శ్రీ ప్లెంకోవిచ్‌ను శ్రీ మోదీ ఆహ్వానించారు.
***
(Release ID: 2137638)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam