ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ
4 లక్షల కోట్లకు పైగా పెట్టుబడి ప్రతిపాదనలతో విజయవంతంగా ముగిసిన రైజింగ్ నార్త్ ఈస్ట్ సదస్సు
రూ. 4.3 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలతో ఎన్ఈఆర్‌ను భారత తదుపరి ఆర్థిక శక్తి కేంద్రంగా మార్చే వేదికను సిద్ధం చేసిన రైజింగ్ నార్త్ ఈస్ట్ సదస్సు
Posted On:
25 MAY 2025 11:44AM by PIB Hyderabad
ఈనెల 23-24 తేదీల్లో జరిగిన రైజింగ్ నార్త్ ఈస్ట్ పెట్టుబడిదారుల సదస్సు 2025లో మొదటి రోజు ముఖ్యమైన పెట్టుబడి ప్రకటనల అనంతరం శనివారం (మే 24న) ముగిసింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈనెల 23న ఈ శిఖరాగ్ర సదస్సును ప్రారంభించారు. సదస్సు ముగింపు ప్రసంగంలో కేంద్ర కమ్యూనికేషన్లు, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖా మంత్రి (ఎమ్డీఓఎన్ఈఆర్) శ్రీ జ్యోతిరాదిత్య ఎమ్. సింధియా మాట్లాడుతూ, ఈశాన్య ప్రాంతం ప్రపంచ భాగస్వామ్యం, పరస్పర ప్రయోజన కేంద్రంగా ఆవిర్భవించిందన్నారు. రైజింగ్ నార్త్ ఈస్ట్ పెట్టుబడిదారుల సదస్సు 2025 అనూహ్యంగా రూ.4.3 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలను ఆకర్షించి, ఈశాన్య ప్రాంతాన్ని (ఎన్ఈఆర్) భారత తదుపరి ఆర్థిక శక్తి కేంద్రంగా మార్చడం కోసం చక్కని వేదికను సిద్ధం చేసిందని కేంద్ర మంత్రి తెలిపారు.
"జపాన్ నుంచి యూరప్, ఆసియాన్ వరకు 80కి పైగా దేశాల ప్రతినిధులను మేం స్వాగతించాం, అయితే ఇక్కడ “భారత భవిష్యత్తు ఈశాన్యంలోనే ఉంది" అనే ఐక్య భావనను ప్రదర్శించాం” అని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు.
ఈశాన్య ప్రాంత విస్తార సామర్థ్యాన్ని గుర్తించడమే కాకుండా ఈ ప్రాంత అభివృద్ధి పట్ల ప్రత్యేక దృష్టి సారించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృషిని శ్రీ జ్యోతిరాదిత్య ఎమ్. సింధియా కొనియాడారు. “ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వ నిబద్ధత, ఈ ప్రాంతం పట్ల ఆయనకున్న సన్నిహిత, హృదయపూర్వక సంబంధం వల్లే ఇది సాధ్యమైంది. స్వాతంత్య్రానంతరం ఆరు దశాబ్దాల పాటు, ప్రభుత్వాలు ఈ భూమికి గల విస్తార సామర్థ్యాలను గుర్తించడంలో పూర్తిగా విఫలమయ్యాయి. ఒకప్పుడు భారత జీడీపీలో దాదాపు 20 శాతం సమకూర్చిన భూమి ఇది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ సామర్థ్యాన్ని అర్థం చేసుకోవడమే కాకుండా, ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు” అని శ్రీ సింధియా వ్యాఖ్యానించారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, మేం "మొత్తం ప్రభుత్వ విభాగాలన్నీ కలిసి సమన్వయంతో పనిచేసే" విధానాన్ని అవలంబించామని కేంద్ర మంత్రి తెలిపారు. వ్యవసాయం, క్రీడలు, పెట్టుబడులకు ప్రోత్సాహం, పర్యాటకం, ఆర్థిక కారిడార్లు, మౌలిక సదుపాయాలు, వస్త్రాలు, హస్తకళలు, పశుసంవర్ధక రంగాల్లో ఎనిమిది ఉన్నత స్థాయి టాస్క్‌ఫోర్స్‌లను మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిందనీ, ప్రతి రాష్ట్రం వారి సొంత రోడ్‌మ్యాప్‌ను రూపొందించుకోవడానికి వీలు కల్పిస్తోందని ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ (డీఓఎన్ఈఆర్) మంత్రి వివరించారు.
ఈశాన్య రాష్ట్రాల్లో పెట్టుబడి అవకాశాలను అన్వేషించేలా ప్రోత్సహిస్తూ.. పెట్టుబడిదారులు, విదేశీ దౌత్యవేత్తలు, రాయబారుల వంటి వివిధ సంబంధిత వ్యక్తులతో డీఓఎన్ఈఆర్ మంత్రిత్వ శాఖ చర్చలు నిర్వహిస్తోంది. గత ఏడాది కాలంలో, ఈ దిశగా దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా విస్తృత భాగస్వామ్యాల కోసం జరిగిన ప్రయత్నాలకు మంత్రిత్వ శాఖ నేతృత్వం వహించింది. ఈ కీలక కార్యక్రమాల్లో భాగంగా దేశంలోని ప్రధాన నగరాల్లో 9 రోడ్ షోలు, 95కి పైగా దేశాల ప్రతినిధులతో రాయబారుల సమావేశాలు, ఆరు రాష్ట్రస్థాయి రౌండ్ టేబుల్ సమావేశాలు, ప్రత్యేకించి ఈ రంగానికి సంబంధించిన పారిశ్రామిక చర్చలు ఆరు, అలాగే పీఎస్యూలు, పరిశ్రమ చాంబర్లు, కార్పొరేట్లతో అనేక సంప్రదింపులు నిర్వహించారు.
"ఈ చర్చల ఫలితంగా రూ.4.30 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి" అని శ్రీ జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు.
రైజింగ్ నార్త్ ఈస్ట్ సదస్సు 2025 గురించి మంత్రి వ్యాఖ్యానిస్తూ, ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రారంభం తర్వాత ఈ స్థాయిలో పెట్టుబడి సదస్సు నిర్వహించడం ఇదే తొలిసారి అన్నారు. శుక్రవారం, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, వేదాంత చైర్మన్ అనిల్ అగర్వాల్ వంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఈ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని, ఈశాన్య ప్రాంతంలో అవకాశాలను అన్వేషించడానికి మొత్తం రూ. లక్షా యాబై-ఐదు వేల కోట్లకు పైగా పెట్టుబడులను ప్రకటించారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో శ్రీ జ్యోతిరాదిత్య సింధియాతో పాటు, ఆ శాఖ సహాయంమంత్రి శ్రీ సుకాంత మజుందార్, విదేశాంగ శాఖ సహాయ మంత్రి శ్రీ పబిత్రా మార్గరీటా, త్రిపుర ప్రభుత్వ పరిశ్రమలు, వాణిజ్య శాఖా మంత్రి శ్రీమతి సంతానా చక్మా పాల్గొన్నారు. ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ చంచల్ కుమార్, సంయుక్త కార్యదర్శి శ్రీ. అంగ్షుమాన్ డే, గణాంక సలహాదారు శ్రీ ధర్మవీర్ ఝా, ఇతర అధికారులు హాజరయ్యారు.
శుక్రవారం జరిగిన కార్యక్రమంలో, వ్యవసాయం, టెలికమ్యూనికేషన్స్, డిజిటల్ సేవలు, స్థానిక సంస్థల అభివృద్ధి లక్ష్యంగా రాబోయే ఐదేళ్లలో రూ. 75 వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ముఖేశ్ అంబానీ హామీ ఇచ్చారు. అదానీ గ్రూప్ చైర్‌పర్సన్ గౌతమ్ అదానీ సైతం రానున్న దశాబ్ద కాలంలో రూ. 50 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు. వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ ఈశాన్య ప్రాంతంలో రూ. 30 వేల కోట్లకు పైగా పెట్టుబడులను ప్రకటించారు.
"గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో గత దశాబ్దంలో ఈశాన్య ప్రాంతం సాధించిన అద్భుతమైన పరివర్తనను చూడటం నాకు అపారమైన గర్వం, ఆనందం కలిగిస్తోంది" అని విదేశాంగ శాఖ సహాయ మంత్రి శ్రీ పబిత్రా మార్గరీటా అన్నారు.
ప్రతి ఈశాన్య రాష్ట్రంలో పక్షం రోజులకోసారి కేంద్ర మంత్రులు పర్యటించాలన్న కేంద్ర మంత్రి శ్రీ సింధియా, ఇప్పటివరకు 700లకు పైగా పర్యటనలు జరిగాయన్నారు. ఇది మరింత చురుకైన, ఫలితాల ఆధారితమైన, ప్రజాకేంద్రితమైన మా పాలనా నమూనాను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.
ఈశాన్య ప్రాంత శిఖరాగ్ర సదస్సును విజయవంతం చేసినందుకు శ్రీ సుకాంత మజుందార్ కృతజ్ఞతలు తెలిపారు. "గత రెండు రోజులుగా, భారత్ మండపం జాతీయ వేదికగా రూపాంతరం చెంది, ఈశాన్య ప్రాంత గళాన్ని, దార్శనికతను, విస్తారమైన సామర్థ్యాన్ని ఘనంగా ప్రదర్శించింది" అని పేర్కొన్నారు.
"గువాహటి నుంచి ముంబయి వరకు, హైదరాబాద్ నుంచి కోల్‌కతా వరకు, తొమ్మిది పెట్టుబడిదారుల రోడ్ షోలు, రెండు రాయబారుల స్థాయి సమావేశాలు, 131 మందికి పైగా పెట్టుబడిదారులు, 24 మంది పరిశ్రమ ప్రముఖుల భాగస్వామ్యంతో ఈశాన్య ప్రాంత అభివృద్ధి ప్రయాణానికి సరికొత్త ఊపు లభించింది" అని ఆయన పేర్కొన్నారు. ఇటీవలి సంవత్సరాల్లో ఈశాన్య ప్రాంతంలో జరిగిన పురోగతిని వివరిస్తూ, "2014లో 10,905 కిలోమీటర్లుగా ఉన్న ఈ ప్రాంతంలోని జాతీయ రహదారులు 2024 నాటికి 16,207 కిలోమీటర్లకు పెరిగాయి. మొత్తం 694.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం, 10 వేల సర్క్యూట్ కిలోమీటర్లకు పైగా ప్రసార, పంపిణీ మార్గాలు అదనంగా తోడయ్యాయి. ముప్పై ఆరు ప్రధాన విమానయాన ప్రాజెక్టులు పూర్తయ్యాయి, 2014 - 2024 మధ్య విమానాశ్రయాల సంఖ్య 9 నుంచి 17కి పెరిగి దాదాపుగా రెట్టింపయ్యాయి." అని తెలిపారు.
ఈశాన్య రాష్ట్రాలు ప్రకృతి సౌందర్యానికి మాత్రమే కాకుండా సహజ వనరులు, పర్యాటకం, క్రీడలు, సంగీత రంగాల్లో కూడా అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని ఈశాన్య ప్రాంత మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ చంచల్ కుమార్ అన్నారు. “ఈ అంశాలన్నింటినీ పరిశీలిస్తే, భవిష్యత్తు ఈశాన్య రాష్ట్రాలదే అని చెప్పవచ్చు. ఎన్ఈఆర్లో పెట్టుబడులను ప్రోత్సహించడానికి మేం ఎనిమిది రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో రోడ్ షోలు, రాయబారి స్థాయి రౌండ్ టేబుల్, రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహించాం” అని శ్రీ చంచల్ కుమార్ వివరించారు. గత నెలలో నిర్వహించిన రాయబారుల సమావేశంలో దాదాపు 76 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారని, మంత్రిత్వ శాఖకు రూ.4 లక్షల కోట్లకు పైగా పెట్టుబడి ప్రతిపాదనలు అందాయని ఆయన తెలిపారు.
ఈశాన్య ప్రాంతంలో పెట్టుబడికి ఆసక్తి చూపిన పెట్టుబడిదారులకు ఈశాన్య ప్రాంత మంత్రిత్వ శాఖ గణాంక సలహాదారు శ్రీ ధర్మవీర్ ఝా కృతజ్ఞతలు తెలిపారు, "ఈ రోజు, రైజింగ్ నార్త్ ఈస్ట్ సదస్సు రూపంలో మనం చేసిన కృషికి మంచి ముగింపు లభించింది" అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు రూ. 4.30 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయని శ్రీ ధర్మవీర్ ఝా తెలిపారు.
ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఈ మార్గదర్శకమైన పెట్టుబడి సదస్సులో మంత్రుల సమావేశాలు, వ్యాపార-ప్రభుత్వ సమావేశాలు, వ్యాపార-వ్యాపార సమావేశాలు, అంకురసంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు పెట్టుబడులను ప్రోత్సాహించడం కోసం అనుసరిస్తున్న విధానాలు, సంబంధిత చొరవలను ప్రదర్శించాయి. ఈ శిఖరాగ్ర సదస్సుకు ముందు నిర్వహించిన వరుస రోడ్ షోలు, రాష్ట్రాల రౌండ్ టేబుల్ సమావేశాలు అలాగే ఈశాన్య ప్రాంత రాష్ట్ర ప్రభుత్వాల క్రియాశీల మద్దతుతో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన రాయబారుల సమావేశం, ద్వైపాక్షిక చాంబర్ల సమావేశం వంటి సన్నాహక కార్యక్రమాలన్నీ విజయవంతంగా ముగిశాయి.
శుక్రవారం జరిగిన ఈ శిఖరాగ్ర సమావేశ ప్రారంభోత్సవ సందర్భంగా ప్రసంగించిన ప్రధానమంత్రి, గత దశాబ్ద కాలంలో ఈశాన్య ప్రాంత విద్యా రంగంలో రూ.21 వేల కోట్లు పెట్టుబడి పెట్టిన విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. 800 లకు పైగా కొత్త పాఠశాలలు, ఈ ప్రాంతంలో మొదటి ఎయిమ్స్, తొమ్మిది కొత్త వైద్య కళాశాలలు, రెండు కొత్త ఐఐఐటీల స్థాపనతో పాటు ఇక్కడ చేపట్టిన కీలక అభివృద్ధి పనులను ఆయన వివరించారు. ఈశాన్య ప్రాంతం ఇప్పుడు వివిధ రంగాల్లో అగ్రశ్రేణి ప్రతిభను అందిస్తూ, పరిశ్రమలు, పెట్టుబడిదారులను ఈ ప్రాంత అపారమైన సామర్థ్యాన్ని ఉపయోగించుకునేలా ప్రోత్సహిస్తోందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.
"మేం బీ2జీ, బీ2బీ చర్చలు కొనసాగిస్తాం. ఆమోదం పొందిన ప్రతి ప్రాజెక్ట్ సాధ్యమైనంత త్వరగా వాస్తవ రూపం దాల్చేలా పెట్టుబడిదారులు-రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ వారధిగా పనిచేస్తుంది. ఈ రోజు ఇక్కడ నిలబడి, నేను మా వాగ్దానాన్ని పునరుద్ఘాటిస్తున్నాను. జరిగిన ప్రతి అవగాహన ఒప్పందం, చర్చించిన ప్రతి ప్రతిపాదన ఆగకుండా కొనసాగుతాయి. ఈశాన్య ప్రాంతం, మన ఎన్ఈఆర్, ఇప్పుడు కొత్త ఆర్థిక విప్లవం, కొత్త ఆర్థిక పునరుజ్జీవన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆగ్నేయాసియా కోసం భారత్‌లోకి ప్రవేశం కల్పించే అంతర్జాతీయ ముఖద్వారంగా ఇది రూపుదిద్దుకుంటోంది” అని ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా శనివారం తన ముగింపు ప్రసంగం సందర్భంగా వ్యాఖ్యానించారు.
***
(Release ID: 2131168)