రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గోవాలో నిర్మించనున్న ప్రతిష్ఠాత్మక అబ్జర్వేటరీ టవర్లకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన

Posted On: 21 MAY 2025 4:48PM by PIB Hyderabad

గోవాలో జువారీ వంతెనపై నిర్మించనున్న ప్రతిష్ఠాత్మక అబ్జర్వేటరీ టవర్లకు శుక్రవారం (2025, మే 23) కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ భూమిపూజ చేస్తారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వం, శ్రీ నితిన్ గడ్కరీ మార్గదర్శక చొరవ, గోవా ముఖ్యమంత్రి శ్రీ ప్రమోద్ సావంత్ అంకితభావంతో చేసిన కృషి కారణంగా ఇది సాధ్యమైంది.

ఈ ప్రాజెక్టు విలువను రూ. 270.07 కోట్లగా అంచనా వేశారు. ఐదేళ్ల కాల వ్యవధిలో దీని నిర్మాణం పూర్తి చేస్తారు. ప్యారిస్‌లోని ఈఫిల్ టవర్ స్పూర్తితో ఈ అబ్జర్వేటరీ టవర్లను నిర్మిస్తున్నారు.  రివోల్వింగ్ రెస్టారెంట్, ఆర్ట్ గ్యాలరీతో ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా వీటిని రూపొందించనున్నారు. గోవాలోని పర్యాటక ప్రదేశాల్లో ఇది ప్రముఖంగా నిలుస్తుంది.

ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా డీబీఎఫ్‌ఓటీ (నమూనా, నిర్మాణం, నిధులు, నిర్వహణ, బదిలీ) విధానంలో ఈ టవర్లను నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణం పూర్తి చేయడంలోనూ, నిర్వహణలోనూ గుత్తేదారుదే పూర్తి బాధ్యత. 50 ఏళ్ల రాయితీ కాలానికి గుత్తేదారు ఈ టవర్లను నిర్వహిస్తారు. రెండు పైల్ క్యాప్ పునాదులపై 125 మీటర్ల ఎత్తులో ఈ టవర్ల నిర్మాణం చేపడతారు. స్థంభాల కొలతలు 8.50 మీ X 5.50 మీ. గా ఉంటాయి.

పై భాగాన 22.50మీ. X 17.80 మీ. కొలతల్లో రెండు విశాలమైన అంతస్థులు ఉంటాయి. వీటిని చేరుకోవడానికి క్యాప్సూల్ లిఫ్టులు ఏర్పాటు చేశారు. గ్యాలరీలు, కెఫెటేరియాలు, అత్యాధునిక పర్యాటక సౌకర్యాలతో కూడిన ఈ టవర్లు పర్యాటకులకు మరచిపోలేని అనుభవాన్ని ఇస్తాయి. పర్యాటకుల రాకపోకలు సాగించడానికి వీలుగా నదికి ఇరువైపులా 7.50 మీటర్ల వెడల్పుతో నడక వంతెనను నిర్మిస్తారు. సందర్శకుల సౌకర్యార్థం బ్రిడ్జికి ఇరువైపులా పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు.

ఈ ప్రాజెక్టు గోవాలో పర్యాటకాన్ని, ఆర్థిక కార్యకలాపాలను పెంచుతుందని అంచనా వేస్తున్నారు. అలాగే ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగావకాశాలను సృష్టించి, దేశంలో అంతర్జాతీయ స్థాయి మౌలికవసతులను మెరుగుపరుస్తుంది. స్థానికంగా ఆతిథ్యం, రవాణా, రీటైల్ రంగాల్లో ఔత్సాహిక పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా, ఆర్కిటెక్చరల్ టూరిజం, అనుభవపూర్వక ప్రయాణానికి ప్రధాన గమ్యస్థానంగా గోవాను మారుస్తుంది.

 

***


(Release ID: 2130393)