హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నేరస్థులను తక్కువ సమయంలో అదుపులోకి తీసుకొనేందుకు సరికొత్త ఇ-జీరో ఎఫ్ఐఆర్ ప్రారంభించిన ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ): కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా


· ఇది ‘సైబర్ సెక్యూర్ భారత్’ సాధించాలనే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతను నెరవేర్చే దిశగా వేసిన కీలకమైన అడుగు

· ఢిల్లీలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ కొత్త విధానం రూ. 10 లక్షలకు మించి జరిగిన ఆర్థిక నేరాలకు సంబంధించిన ఎన్‌సీఆర్‌పీ, 1930కి చేసిన ఫిర్యాదులను జీరో ఎఫ్ఐఆర్‌లుగా నమోదు చేస్తుంది

· ఈ కొత్త వ్యవస్థ దర్యాప్తును వేగవంతం చేసి, సైబర్ నేరస్థులపై కఠిన చర్యలు తీసుకొనేందుకు దోహదపడుతుంది: త్వరలో దేశవ్యాప్తంగా విస్తరణ

· సైబర్ సెక్యూర్ భారత్‌ను నిర్మించడానికి మోదీ ప్రభుత్వం సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలను బలోపేతం చేస్తోంది

· సైబర్ ఆర్థిక నేరాల వల్ల బాధితులు పోగొట్టుకున్న సొమ్మును రికవరీ చేయడంలో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని హోం మంత్రి ఆదేశాలు

· ఎన్‌సీఆర్‌పీ/1930 ఫిర్యాదులను ఎఫ్ఐఆర్‌లుగా మార్చే ప్రక్రియలను మెరుగుపరుస్తుంది, ఇది ఫిర్యాదుదారులు కోల్పోయిన డబ్బును సులభంగా తిరిగి పొందేందుకు, సైబర్ నేరస్థులపై చట్టపరమైన చర్యలు తీసుకొనే ప్రక్రియలను సులభతరం చేస్తు

Posted On: 19 MAY 2025 7:21PM by PIB Hyderabad

సైబర్ నేరస్థులను వేగంగా పట్టుకొనేందుకు హోం వ్యవహరాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్‌క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) నూతనంగా ఇ-జీరో ఎఫ్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రారంభించిందని కేంద్ర హోం వ్యవహారాలు, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా తెలిపారు. దీన్ని ఢిల్లీలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించామని ఎక్స్‌ లో చేసిన పోస్టులో తెలియజేశారు. ఈ కొత్త వ్యవస్థ రూ. 10 లక్షలు మించి జరిగిన సైబర్ ఆర్థిక నేరాలపై ఎన్‌సీఆర్‌పీ లేదా 1930కు వచ్చిన ఫిర్యాదులను దానంతట అదే ఎఫ్ఐఆర్‌లుగా మారుస్తుందని చెప్పారు. కొత్త వ్యవస్థ దర్యాప్తులను వేగవంతం చేసి, సైబర్ నేరస్థులపై కఠినచర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. త్వరలోనే ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుందని, సైబర్ సెక్యూర్ భారత్‌ను నిర్మించడానికి మోదీ ప్రభుత్వం సైబర్ భద్రత వ్యవస్థను బలోపేతం చేస్తుందని తెలియజేశారు.

 ‘సైబర్ సెక్యూర్ భారత్’ను సాధించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా ఈ కార్యక్రమం ఉంది. సైబర్ ఆర్థిక నేరాల బారిన పడిన బాధితులు తాము పోగొట్టుకుంటున్న సొమ్మును తిరిగిపొందడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఇటీవల జరిగిన ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) సమీక్షలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని కేంద్ర హోం వ్యవహారాలు, సహకార మంత్రి శ్రీ అమిత్ షా ఆదేశించారు.

సైబర్ ఆర్థిక నేరాలకు సంబంధించి సులభంగా ఫిర్యాదు చేయడానికి, సత్వర చర్య తీసుకొనే వీలును నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్‌సీఆర్‌పీ), జాతీయ సైబర్‌క్రైమ్ హెల్ప్ లైన్ 1930 కల్పించాయి. కొత్తగా పరిచయం చేసిన ఈ ప్రక్రియలో ఐ4సీ కి చెందిన ఎన్‌సీఆర్‌పీ వ్యవస్థను, ఢిల్లీ పోలీసుల ఈ-ఎఫ్ఐఆర్ వ్యవస్థను, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ)ను, క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ (సీసీటీఎన్ఎస్)ను ఏకీకృతం చేశారు.

ఇప్పుడు రూ. 10 లక్షలకు మించి జరిగిన ఆర్థిక సైబర్ నేరాలకు సంబంధించి ఎన్‌సీఆర్‌పీ, 1930కి చేసిన ఫిర్యాదులు వాటంతట అవే ఢిల్లీలోని ఈ-క్రైమ్ పోలీస్ స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్‌గా నమోదవుతాయి. ఈ సమాచారం వెంటనే ప్రాంతీయ సైబర్‌క్రైమ్ పోలీస్ స్టేషన్లకు చేరుతుంది. ఫిర్యాదారులు మూడు రోజుల్లోగా సైబర్‌క్రైమ్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి జీరో ఎఫ్ఐఆర్‌ను సాధారణ ఎఫ్ఐఆర్‌గా మార్చుకోవచ్చు.

భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్ఎస్ఎస్)లోని సెక్షన్ 173(1), 1(ii)లోని కొత్త నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేయడానికి అసరమైన నియమావళిని ఢిల్లీ పోలీస్, ఇండియన్ సైబర్‌క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ), హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) రూపొందించాయి. పోలీస్ స్టేషన్ ప్రాదేశిక పరిమితితో సంబంధం లేకుండా ఎలక్ట్రానిక్  ఎఫ్ఐఆర్‌లను జారీ చేసే ప్రక్రియను ఢిల్లీలో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. క్రమంగా దీన్ని ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు విస్తరిస్తారు. ఎన్‌సీఆర్‌పీలో నమోదైన నిర్ధిష్ట రకాల సైబర్ క్రైమ్ ఫిర్యాదులను ఇ-ఎఫ్ఐఆర్‌లుగా నమోదు చేసి ప్రాంతీయ పోలీస్ స్టేషన్లకు బదిలీ చేయాలని ఢిల్లీలోని ఈ-క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు.

ఈ కార్యక్రమం ఎన్‌సీఆర్‌పీ/1930కి వచ్చిన ఫిర్యాదులను ఎఫ్ఐఆర్‌లుగా మార్చే ప్రక్రియను మెరుగుపరిచి, కోల్పోయిన సొమ్మును బాధితులు తిరిగి పొందడానికి, సైబర్  నేరస్థులపై చట్టపరమైర చర్యలు తీసుకోవడాన్ని సులభతరం చేస్తుంది. ఇటీవలే అమల్లోకి వచ్చిన కొత్త నేర చట్టాల్లోని నిబంధనల ఆధారంగా పనిచేస్తుంది.


 

***


(Release ID: 2129782)