వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మే 29 నుంచి దేశ వ్యాప్తంగా మొదలు కానున్న ‘వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్’: కేంద్ర మంత్రి శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్


• అభివృద్ధి చెందిన వ్యవసాయం, పురోగామి సాగు పద్ధతులు,
ప్రగతిశీల రైతుల నవకల్పనలు..ఇవి అభివృద్ధి చెందిన భారత్‌కు
అత్యవసరం: శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్

• వ్యవసాయ శాఖ, ఐసీఏఆర్‌లు నిర్వహించే ఈ కార్యక్రమంతో
దేశ రైతుల చెంతకు చేరుకోనున్న పరిశోధన- సాంకేతికత ఫలాలు

• ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పమైన ‘ల్యాబ్ టు ల్యాండ్’ను నెరవేర్చే దిశలో
ఓ ప్రభావవంతమైన నిర్ణయమిది: శ్రీ చౌహాన్

• ఈ ప్రచార ఉద్యమాన్నిఏటా ఖరీఫ్, రబీ.. ఈ రెండు పంటకాలాల్లో
నాట్లకు ముందు నిర్వహించనున్నాం: కేంద్ర మంత్రి శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్

Posted On: 19 MAY 2025 4:18PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా ‘‘వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్’’ (అభివృద్ధి చెందిన వ్యవసాయ సంకల్ప ప్రచారోద్యమం)ను మే 29 నుంచి మొదలుపెట్టి జూన్ 12 వరకు అమలుచేయనున్నట్లు తెలియజేయడానికి కేంద్ర వ్యవసాయ,రైతుల సంక్షేమం- గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీలో గల జాతీయ ప్రసార మాధ్యమాల కేంద్రం (నేషనల్ మీడియా సెంటర్)లో ఒక విలేకరుల సమావేశాన్ని ఈ రోజు ఏర్పాటు చేశారు. మంత్రి ఆ సమావేశంలో ప్రసంగించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ‘అభివృద్ధి చెందిన భారత్’ దార్శనికతను చురుకుగా అమలుచేస్తున్నామనీ, ఈ లక్ష్యాన్ని సాధించడానికి అభివృద్ధి చెందిన వ్యవసాయం, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, రైతుల సమృద్ధి సాధన అనే ఒక బలమైన పునాదిని వేయడం ఎంతైనా అవసరమన్నారు. భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముకగా ఉంటోందని, వ్యవసాయం దేశ జనాభాలో దాదాపుగా సగం మందికి బతుకుతెరువును సమకూర్చడం ఒక్కటే కాకుండా దేశ ఆహార భద్రతకు ఆధారంగా కూడా నిలుస్తోందని ఆయన అన్నారు.

వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖ ప్రధాన ఉద్దేశం దేశంలోని 145 కోట్ల మంది ప్రజలకు ఆహార భద్రతను సమకూరుస్తూనే, పోషకాహారం లభించేటట్లు హామీని ఇవ్వడం, రైతుల ఆదాయాన్ని మెరుగుపరచడంతోపాటు రాబోయే తరాల వారి కోసం ప్రాకృతిక వనరులను సంరక్షించడం కూడా అని మంత్రి స్పష్టం చేశారు. ఈ లక్ష్యాలను సాధించడానికి, మంత్రిత్వ శాఖ ఆరు అంశాల వ్యూహాన్ని నిర్దేశించింది: అవి.. ఉత్పత్తిని పెంచడం, ఉత్పత్తి ఖర్చులను తగ్గించడం, ఉత్పత్తికి సరి అయిన ధర లభించేటట్టు చూడడం, ప్రకృతి విపత్తుల వల్ల ఎదురయ్యే నష్టాలకు పరిహారాన్ని చెల్లించడం, విలువ జోడింపు-ఆహార శుద్ధి ప్రకియలను అనుసరించేటట్లు చూస్తూ పంటల వివిధీకరణను ప్రోత్సహించడంతోపాటుగా ప్రాకృతిక- సేంద్రియ వ్యవసాయాన్ని విస్తరించే దిశలో ఆలోచనలను ప్రోత్సహించడం.

భారత్ ఈ సంవత్సరంలో రికార్డు స్థాయిలో వ్యావసాయిక ఉత్పత్తిని సాధించిందని శ్రీ చౌహాన్ ప్రధానంగా చెప్పారు. ఖరీఫ్ ‌కాలంలో బియ్యం ఉత్పత్తి 1206.79 లక్షల మెట్రిక్ టన్నులు, గోధుమల ఉత్పత్తి 1154.30 లక్షల మెట్రిక్ టన్నులు ఉండగా, ఖరీఫ్ మొక్కజొన్న ఉత్పత్తి 248.11 లక్షల మెట్రిక్ టన్నులు, వేరుసెనగ ఉత్పత్తి 104.26 లక్షల మెట్రిక్ టన్నులు, సోయాబీన్ ఉత్పత్తి 151.32 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉంది. ఇవి ఇప్పటివరకు చూస్తే, అత్యధిక స్థాయి గణాంకాలు. ఇవి ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని సూచిస్తున్నాయి. భారత్‌ను ‘‘ప్రపంచానికి ఆహార బుట్ట’’గా తీర్చిదిద్దాలన్న దార్శనికతతో, దీర్ఘకాలం నిల్వ ఉంటూ, మిగులు ఉత్పత్తికి ప్రోత్సాహాన్ని అందిస్తూ అంతర్జాతీయ ఆహార సహకారాన్ని ఈ ప్రచార ఉద్యమం బలపరచ దలుస్తోంది.

‘‘వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్’’ ఐసీఏఆర్‌కు చెందిన 113 పరిశోధన సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు, ప్రగతిశీల కర్షకులు, ఫార్మర్-ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లు (ఎఫ్‌పీఓలు).. వీటన్నింటి ప్రయత్నాలను సంఘటితం చేస్తుంది. ఈ సహకారపూర్వక వైఖరి ఉద్దేశమల్లా వాస్తవ కాల వ్యావసాయిక అవసరాలతో వైజ్ఞానిక పరిశోధనను సంధానపరచడమే.  ఆహార ధాన్యాల మొత్తం ఉత్పత్తి 2023-24లో 3157.74 లక్షల టన్నుల నుంచి 2025-25 లో 3309.18 లక్షల టన్నులకు పెరిగిందని మంత్రి తెలిపారు. దీనికి అదనంగా, కాయధాన్యాల ఉత్పత్తి 221.71 లక్షల టన్నుల నుంచి 230.22 లక్షల టన్నులకు చేరుకోగా, నూనెగింజల ఉత్పాదన 384 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 416 లక్షల మెట్రిక్ టన్నులకు చేరింది.

ఈ ప్రచార ఉద్యమాన్ని ఖరీఫ్, రబీ.. ఈ రెండు పంటకాలాల కన్నా ముందుగా ఏటా మొదలుపెడతారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు ఇటీవల పాల్గొన్న ఒక ఖరీఫ్ సమావేశంలో క్షేత్ర స్థాయిలో వ్యవసాయ పరిశోధన ఫలితాల అమలును దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాలని తీర్మానించారు. ప్రస్తుతం, సుమారు 16,000 మంది వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిశోధనలో నిమగ్నమయ్యారు.  వారి కృషి తాలూకు ఫలితాలు నేరుగా రైతుల అందుబాటులోకి రావడంతోపాటు రైతులకు ఉపయోగకరంగా ఉండేలా చూడాలనేది ఈ కార్యక్రమం ఉద్దేశం.

ఈ కార్యక్రమంలో భాగంగా, ఒక్కొక్క బృందంలోనూ కనీసం నలుగురు చొప్పున ఉండే మొత్తం 2,170 నిపుణుల బృందాలు ఈ నెల 29 మొదలు జూన్ 12 మధ్య కాలంలో 723 జిల్లాల్లో 65,000కు పైగా గ్రామాలను సందర్శిస్తాయి. ఈ బృందాల్లో వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు, ప్రభుత్వ విభాగాలు, ప్రగతిశీల రైతులు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌పీఓ)లకు చెందిన సిబ్బంది కూడా ఉంటారు. వారు రోజూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కార్యక్రమాలను నిర్వహిస్తూ రైతులతో నేరుగా సంప్రదింపులు జరుపుతారు. ఈ బృందాలు స్థానికంగా వ్యవసాయ-వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అక్కడి నేలల్లో పోషక పదార్థాలు ఎలా ఉన్నాయి, నీటి లభ్యత ఎలా ఉంది, వర్షపాతం ఎంత మేరకు ఉంటోంది.. ఇవి మదింపు చేస్తాయి. వారు భూ స్వస్థత కార్డులను పరిశీలించి, ఏయే పంటలను వేయాలి, అధిక దిగుబడినిచ్చే విత్తన రకాలు, నాట్లను ఏ పద్ధతిలో వేయాలి,  ఎరువుల వినియోగంలో సమతూకం పాటించడం, పంటను తక్కువ ఖర్చులో ఎలా పండించాలి, భూ స్వస్థతను మెరుగుపరచడానికి ఏయే చర్యలు చేపట్టాలి.. ఇవన్నిటినీ సిఫారసు చేస్తారు.

ఈ ప్రచార ఉద్యమాన్ని రెండు విధాలైన మాటామంతీ రూపంలో అమలు చేయదలచారు. రైతులు వారికి ఎదురైన సవాళ్లను వెల్లడిస్తారు. ప్రశ్నలు వేస్తారు. చీడలు సోకడం వంటి క్షేత్రస్థాయి సమస్యలను ప్రస్తావిస్తారు. వీటి ఆధారంగా భావి పరిశోధన ఎలా సాగాలో కొలిక్కి వస్తుంది. 731 కృషి విజ్ఞాన కేంద్రాలు (కేవీకే), ఐసీఏఆర్ శాస్త్రవేత్తల ఉమ్మడి శక్తిని ఈ కార్యక్రమం వినియోగించుకొంటుంది. ఈ విధంగా విజ్ఞానశాస్త్రం, సాగు సంబంధ పురోగతి చెట్టపట్టాల్ వేసుకొంటాయి. ఒక కోటీ ముప్ఫయ్ లక్షల మందికి పైగా కిసాన్లు ప్రత్యక్షంగా దీనిలో భాగస్వాములు అవుతారన్న అంచనా ఉంది. ఇంత పెద్ద ఎత్తున జరగనున్న ఈ వినూత్నమైన, అన్ని వర్గాలను కలుపుకొని పోయే కార్యక్రమం మన దేశంలో వ్యావసాయిక మార్పు, చైతన్యాలకు ఒక కొత్త దిశను చూపనుంది.‌

 

***‌


(Release ID: 2129780) Visitor Counter : 2