రైల్వే మంత్రిత్వ శాఖ
మనుషులను చట్టవిరుద్ధంగా తరలించే యత్నం రక్సౌల్‌లో భగ్నం... నలుగురు మైనర్ బాలికలకు ఆపరేషన్ ఏఏహెచ్‌టీలో భాగంగా అభయం
* నేపాల్ మూలాలున్న మైనర్లను
సత్యాగ్రహ్ ఎక్స్‌ప్రెస్‌లో నుంచి రక్షించిన
ఆర్‌పీఎఫ్-జీఆర్‌పీ-ఎస్ఎస్‌బీ-చైల్డ్‌లైన్-ఎన్‌జీవో బృందం...
దొంగ వ్యాపారి నిర్బంధం... ఎఫ్ఐఆర్ దాఖలు
* ఉద్యోగం ఇప్పిస్తామని, కుటుంబానికి సాయపడతామని తప్పుడు వాగ్దానాలతో బాధితులకు ఎర... బాలల సంక్షేమ అధికారులకు వారి అప్పగింత
ఆపరేషన్ ఏఏహెచ్‌టీలో 2024-25లో 929 మంది బాధితులకు
అభయప్రదానం..274 మంది దొంగవ్యాపారుల అరెస్టు
Posted On:
16 MAY 2025 2:44PM by PIB Hyderabad
నలుగురు మైనర్ బాలికలను చట్టవిరుద్ధంగా తరలించాలని యత్నిస్తుండగా ఈ నెల 13న ఉదయం రక్సౌల్ రైల్వే స్టేషన్‌లో ఆ బాలికలను రైల్వే సంరక్షక దళం (ఆర్‌పీఎఫ్) కాపాడింది. విషయం తెలిసిన వెనువెంటనే చాలా సమన్వయంతో చేపట్టిన ఈ ఆపరేషన్ బాలల భద్రతకు, మనుషులు చట్టవిరుద్ధ తరలింపును అడ్డుకొనేందుకు ఆర్‌పీఎఫ్ కృతనిశ్చయంతో కట్టుబడి ఉందని పునరుద్ఘాటించింది.
ఇలా చిన్న పిల్లలను చట్టం కళ్లు కప్పి ఎక్కడికో తీసుకుపోతున్నారంటూ నిఘా వర్గాల సమాచారం సకాలంలో అందడంతోనే, రక్సౌల్ పోస్టులో విధినిర్వహణలో నిమగ్నమై ఉన్న ఆర్‌పీఎఫ్ బృందం నడుం బిగించి రంగంలోకి దిగింది. ఎస్ఎస్‌బీ యాంటి-హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిటు, రక్సౌల్ రైల్వే చైల్డ్‌లైను, ‘‘ప్రయాస్ జూవినైల్ ఎయిడ్ సెంటర్’’ అనే ఎన్‌జీవోలతో జీఆర్‌పీ రక్సౌల్ సమన్వయాన్ని నెలకొల్పుకొని, సత్యాగ్రహ్ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 15273 రక్సౌల్-ఆనంద్ విహార్ సర్వీసు)ను మధ్యలో నిలిపివేసి మరీ నలుగురు బాలికలను రక్షించింది. ఆ బాలికల వయసు 13 ఏళ్ల నుంచి 17 ఏళ్ల మధ్య ఉంటుంది.
ఉద్యోగాలు ఇప్పిస్తాం, గోరఖ్‌పూర్‌లో కనపడకుండా పోయిన మీ బంధువు ఆచూకీని కనిపెట్టడంలో సాయపడతాం అంటూ మాయమాటలు చెప్పి చిన్న పిల్లల్ని నేపాల్ నుంచి చట్టవిరుద్ధంగా తరలిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ పిల్లలు ఎక్కడికి వెళ్లిందీ వారి కుటుంబాలు ఎరుగవు. సరిహద్దు ప్రాంతాల బాలలకు కల్ల బొల్లి కబుర్లు చెప్పి, వారిని బుట్టలో వేసుకుని ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లడానికి దొంగవ్యాపారులు సర్వ సాధారణంగా ఇలాంటి ఎత్తుగడల్నే అనుసరిస్తూ ఉంటారు.
వివిధ ఏజెన్సీలు కలిసికట్టుగా బృందంగా ఏర్పడి అప్రమత్తమై, వేగంగా ప్రతిస్పందించడంతో బాలికల్ని వెంటబెట్టుకుపోతున్న దొంగవ్యాపారిని ఉన్నపళంగా అరెస్టు చేయడం సాధ్యపడింది. ఆ పిల్లలను తక్షణ సంరక్షణ నిమిత్తం బాలల సంరక్షణాధికారులకు అప్పగించగలిగారు. ఆరోపణలున్న వ్యక్తి మీద భారతీయ న్యాయ సంహిత, జూవినైల్ జస్టిస్ (కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్) యాక్టు, చైల్డ్ అండ్ అడోలెసెంట్ లేబర్ (ప్రొహిబిషన్-రెగ్యులేషన్) యాక్టు-1986లలో దీనికి వర్తించే నిబంధనలతో ఓ ఎఫ్ఐఆర్‌ను దాఖలు చేశారు.
‘‘ఇది మనుషులను అక్రమంగా తరలించుకుపోయే బెడద సమాజాన్ని ఇంకా వెంటాడుతూనే ఉంది అని గుర్తుచేసే ఒక నిష్ఠుర వ్యవహారం’’ అని ఆర్‌పీఎఫ్ డైరెక్టర్ జనరల్ శ్రీ మనోజ్ యాదవ అన్నారు. ‘‘అయితే మా పోరాటం ససేమిరా ఆగదు. భారతీయ రైల్వేల్లో ప్రయాణించే వారు జాగరూకంగా నడుచుకొంటూ ఉండాలి. మీరు కనబరచే అప్రమత్తత మరొకరి ప్రాణాలను కాపాడగలుగుతుంది. ఏ సంగతి అయినా అనుమానాస్పదంగానో, అసాధారణంగానో ఉందని మీకనిపిస్తే, దానిని 139 దృష్టికి తీసుకురండి. మీరు చూపే చొరవ దోపిడీ బారి నుంచి రక్షించి బాధితులకు స్వేచ్ఛను ప్రసాదించవచ్చు’’ అంటూ ఆయన హితవు పలికారు.
సఫలమైన ఈ రక్షణ కార్యం రైల్వే నెట్‌వర్క్‌ను వాడుకుంటూ మనుషులను అక్రమంగా తరలించడాన్ని ఎదురొడ్డి నిలిచేందుకు ఆర్‌పీఎఫ్ అమలుచేస్తున్న పలు కార్యక్రమాల్లో ముఖ్యమైంది అయిన ఆపరేషన్ ఏఏహెచ్‌టీ (యాక్షన్ అగైనెస్ట్ హ్యూమన్ ట్రాఫికింగ్)లో ఓ భాగం. ఆపరేషన్ ఏఏహెచ్‌టీలో భాగంగా, ఒక్క 2024-25లోనే 929 మంది బాధితులను కాపాడారు. వీరిలో 874 మంది చిన్నారులు (50 మంది బాలికలతోపాటు 824 మంది బాలురు) ఉన్నారు. ఈ సందర్భాల్లో 274 మంది దొంగవ్యాపారులను అరెస్టు చేశారు. రక్షణ సంబంధిత ప్రయత్నాలను మరింత తీవ్రతరం చేసే ఉద్దేశంతో భారతీయ రైల్వేల నెట్‌వర్క్ వ్యాప్తంగా యాంటి-ట్రాఫికింగ్ యూనిట్లను (ఏహెచ్‌టీయూస్) ఏర్పాటు చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది. ఒక ముఖ్య ఘట్టంలో భాగంగా, ఆర్‌పీఎఫ్ 2024లో జాతీయ మహిళా సంఘం (ఎన్‌సీడబ్ల్యూ)తో ఓ లాంఛనప్రాయ సమన్వయాన్ని కూడా నెలకొల్పుకొంది. ఫలితంగా దీని అంతర -ఏజెన్సీ సహకారం, బాధితులకు అండగా నిలిచే యంత్రాంగం.. వీటి పరిధి పెరిగింది.
నిరంతర నిఘా, వ్యూహాత్మక భాగస్వామ్యాలు, సాముదాయిక చైతన్య ప్రబోధక కార్యక్రమాలను చేపడుతూ రైల్వేలకు సంబంధించిన ఆవరణల్లో మనుషుల చట్టవిరుద్ధ తరలింపు ముప్పు చోటుచేసుకోకుండా ఆర్‌పీఎఫ్ ఒక కీలక పాత్రను పోషిస్తూ వస్తోంది...ఈ క్రమంలో, మన పసివాళ్లను కంటికి రెప్పలా కాపాడుతూ, ప్రతి చిన్న పిల్లవాడు, ప్రతి బాలిక ఆత్మగౌరవాన్ని నిలబెడుతోంది.
***
(Release ID: 2129306)