రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

పాకిస్థాన్‌ కవ్వింపు చర్యలు విఫలం: సముచిత రీతిలో తిప్పికొట్టిన భారత్‌

నాడు పోస్టు చేయడమైనది: 08 MAY 2025 2:34PM by PIB Hyderabad

ఆపరేషన్‌ సిందూర్‌ గురించి వివరించేందుకు 2025 మే 7న భారత్‌ విలేకరుల సమావేశం నిర్వహించింది. ఉగ్రవాద దుశ్చర్యలపై నిర్దిష్ట లక్ష్యంతో, సమతూకంతో, ఉద్రిక్తతలకు తావివ్వని రీతిలో ప్రతిస్పందించినట్లు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా పాకిస్థాన్‌ సైనిక స్థావరాలను తాము లక్ష్యం చేసుకోలేదని నిర్దిష్టంగా వివరించింది. అయితే, భారత్‌లోని సైనిక స్థావరాలపై దాడికి పాల్పడితే దీటైన రీతిలో తిప్పికొట్టడం తథ్యమని పునరుద్ఘాటించింది. ఉత్తర, పశ్చిమ భారత ప్రాంతాల్లోని అనేక సైనిక స్థావరాలు లక్ష్యంగా ఈ నెల 7వ తేదీ రాత్రి పాకిస్థాన్‌ దాడికి యత్నించిందని పేర్కొంది. ఈ మేరకు అవంతిపుర, శ్రీనగర్, జమ్ము, పఠాన్‌కోట్, అమృత్‌సర్, కపుర్తల, జలంధర్, లూథియానా, ఆదంపూర్, భటిండా, చండీగఢ్, నాల్, ఫలోడి, ఉత్తర్‌లాయ్‌, భుజ్‌ సహా అనేక సైనిక లక్ష్యాలపై డ్రోన్‌లు, క్షిపణులుప్రయోగించిందని తెలిపింది. అయితే, సమీకృత కౌంటర్‌ ‘యుఎఎస్‌’ గ్రిడ్‌, గగనతల రక్షణ వ్యవస్థల సాయంతో వాటిని మార్గమధ్యంలోనే నేలకూల్చినట్లు వివరించింది. పాకిస్థాన్‌ సదరు దాడులకు పాల్పడిందని నిరూపించే ఆధారాల కోసం అది ప్రయోగించిన ఆయుధ శకలాలను పలు ప్రదేశాల నుంచి సేకరిస్తున్నట్లు తెలిపింది.

ఈ నేపథ్యంలో నేటి ఉదయం భారత సాయుధ దళాలు పాకిస్థాన్‌లోని అనేక ప్రదేశాల్లో వైమానిక రక్షణ రాడార్లు, వ్యవస్థలు లక్ష్యంగా దాడి చేశాయి. ఆ మేరకు పాక్‌ కవ్వింపులకు సముచిత రీతిలో భారత్‌ దీటుగా ప్రతిస్పందించింది. తదనుగుణంగా లాహోర్‌లోని వైమానిక రక్షణ వ్యవస్థను ధ్వంసం చేశామని నిర్ధారించింది. జమ్ము కాశ్మీర్‌లోని కుప్వారా, బారాముల్లా, ఉరీ, పూంచ్, మెంధార్, రాజౌరి సెక్టార్ల పరిధిలోని ప్రాంతాల్లో ఎలాంటి కవ్వింపు చర్యలు లేకపోయినా పాక్‌ సైనికులు మాత్రం నియంత్రణ రేఖ వెంబడి మోర్టార్లు, భారీ ఆయుధ సామగ్రితో కాల్పులు ముమ్మరం చేశారు. ఈ దుశ్చర్య ఫలితంగా ముగ్గురు మహిళలు, ఐదుగురు బాలలు సహా 16 మంది అమాయక పౌరులు మరణించారని తెలిపింది. పర్యవసానంగా పాకిస్థాన్‌ను నిలువరించేందుకు తాము కూడా దీటుగా స్పందించక తప్పలేదని భారత్‌ స్పష్టం చేసింది. ఉద్రికత్తలకు తావివ్వరాదన్న విధానాన్ని పాకిస్థాన్‌ సైన్యం పాటించినపుడే భారత సాయుధ దళాలు కూడా తమ నిబద్ధతను చాటుకుంటాయని పునరుద్ఘాటించింది.

 

***


(రిలీజ్ ఐడి: 2127755) సందర్శకుల సూచీ సంఖ్య : : 91
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Odia , English , Urdu , Marathi , Nepali , हिन्दी , Bengali , Assamese , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam