సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
“అంతర్జాతీయ స్థాయికి భారత దేశీయ క్రీడలు” — భారత క్రీడా వారసత్వ ఘనతను చాటేలా విశ్వవ్యాప్తం చేయాలని వేవ్స్-2025లో పిలుపు
దేశీయమైన ఆటలు కేవలం శారీరక పోటీలు మాత్రమే కాదు, మన సమాజం, సంప్రదాయాలు, అస్తిత్వంలో అవి అంతర్భాగం: ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ
క్షేత్రస్థాయిలో ప్రతిభను ప్రోత్సహించడం, భారత క్రీడా రంగ భవితను తీర్చిదిద్దే దిశగా ‘ఖేలో ఇండియా’ కార్యక్రమం ఓ విప్లవాత్మక శక్తి: రక్షా నిఖిల్ ఖడ్సే
Posted On:
04 MAY 2025 2:50PM
|
Location:
PIB Hyderabad
ముంబయిలో సాగుతున్న వేవ్స్‌లో నిన్న (మే 3న) ఉత్సాహభరితంగా, అర్థవంతంగా నిర్వహించిన నిపుణుల చర్చలో దేశీయ క్రీడల ఘనమైన వారసత్వం, భారత్‌లో క్షేత్రస్థాయి నుంచి అంతర్జాతీయ రంగానికి ఎదుగుతున్న వాటి ప్రస్థానంపై ప్రధానంగా దృష్టి సారించారు. ‘దేశీయ క్రీడలు: భారత్ నుంచి అంతర్జాతీయ స్థాయికి’ శీర్షికన ఈ సదస్సు నిర్వహించారు. ముఖ్య స్థానాల్లో ఉన్న విధాన నిర్ణేతలు, ప్రముఖ క్రీడాకారులు, ఔత్సాహిక క్రీడాకారులు, ఆలోచనాపరులందరినీ ఒక్కచోట చేర్చిన ఈ కార్యక్రమంలో- వారంతా ఒకే ఉమ్మడి లక్ష్యాన్ని ప్రకటించారు. అంతర్జాతీయ గుర్తింపును, విజయాన్ని సాధించే దిశగా భారత దేశీయ క్రీడలు దూసుకుపోయేలా చూడడమే అందరి లక్ష్యం.
ప్రధానోపన్యాసం చేసిన ఒడిశా ముఖ్యమంత్రి శ్రీ మోహన్ చరణ్ మాఝీ భారత్‌లో దేశీయ క్రీడల దృఢమైన సాంస్కృతిక మూలాలను విశేషంగా వివరించారు. “ఈ ఆటలు శారీరక పోటీలు మాత్రమే కాదు.. మన సమాజం, సంస్కృతులు, అస్తిత్వంలో అవి అంతర్భాగం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. భారత్‌ను అంతర్జాతీయ క్రీడా శక్తి కేంద్రంగా నిలిపే దిశగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. శక్తిమంతమైన గిరిజన సమాజాలకు నిలయమైన ఒడిశా ఈ పురాతనమైన ఆటలెన్నింటినో కాపాడుకుని క్రీడా కేంద్రంగా ఎదుగుతోందని శ్రీ మాఝి ఉద్ఘాటించారు. “గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభను ప్రోత్సహించడానికి, ప్రతిభావంతుడైన ప్రతి క్రీడాకారుడూ సత్తా చాటేలా ఓ వేదికను అందించడానికి మేం కట్టుబడి ఉన్నాం’’ అన్నారు.
కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా శాఖల సహాయ మంత్రి శ్రీమతి రక్షా నిఖిల్ ఖడ్సే మాట్లాడుతూ.. ఈ ముఖ్యమైన అంశంపై అర్థవంతమైన చర్చను ముందుకు తెచ్చిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి, వేవ్స్ వేదికకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. “భారత్ ఇప్పటికే యోగాకు అంతర్జాతీయ ప్రతినిధిగా నిలిచింది. ఇప్పుడు ఖోఖో, కబడ్డీ వంటి మన సాంప్రదాయక క్రీడలను సగర్వంగా అంతర్జాతీయ స్థాయిలో నిలుపుతున్నాం. క్షేత్రస్థాయి ప్రతిభను ప్రోత్సహించడంలో, భారతీయ క్రీడల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఖేలో ఇండియా కార్యక్రమం విప్లవాత్మక శక్తిగా మారుతోంది” అని ఆమె వ్యాఖ్యానించారు. క్రీడలు శారీరక దారుఢ్యాన్ని పెంచడమే కాకుండా.. సంబంధాలను బలోపేతం చేస్తాయని, దేశ సాంస్కృతిక వారసత్వాన్ని చాటుతూ ఐక్యతను పెంపొందిస్తాయని చెప్పారు.
క్రీడా విపణిగా నిలిచేలా భారత్‌కు విస్తృతమైన అవకాశాలు, సామర్థ్యం ఉన్నాయని ప్రో కబడ్డీ లీగ్ లీగ్ కమిషనర్ అనుపమ్ గోస్వామి అన్నారు. “ఎన్నో భావోద్వేగాలు, సాంస్కృతిక విలువలు ఉన్న దేశీయ క్రీడలను ప్రోత్సహించడం ద్వారా మనం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి” అని ఆయన పేర్కొన్నారు.
కబడ్డీ జీవితాలను మార్చిన తీరును ఇరాన్‌కు చెందిన దిగ్గజ ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్) క్రీడాకారుడు ఫజెల్ అట్రాచలి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. “పీకేఎల్‌కు ధన్యవాదాలు. కబడ్డీ ప్రొఫెషనల్ క్రీడగా మారింది. ఆటగాళ్లకు పేరు ప్రఖ్యాతులను, ఆర్థిక భద్రతను అందిస్తోంది” ఫజెల్ సంతోషం వ్యక్తం చేశారు.
ప్రపంచవ్యాప్తం చేయడం, వ్యాప్తి కోసం ఆధునిక మార్గాలను వినియోగించుకోవడం ప్రధానమైన అంశాలని ఇంగ్లిష్ క్రికెట్ బోర్డు రెగ్యులేటరీ చైర్‌పర్సన్ నిక్ కోవార్డ్ స్పష్టం చేశారు. “సాంప్రదాయక క్రీడలు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాలంటే ఇ-స్పోర్ట్స్ సహా డిజిటల్ వేదిలను అందిపుచ్చుకోవాలి” అని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఖోఖో సమాఖ్య అధ్యక్షుడు సుధాన్షు మిట్టల్ మాట్లాడుతూ.. ప్రస్తుతం 55 దేశాలలో ఖోఖో ఆడుతున్నారని, ఈ ఏడాది చివరి నాటికి 90కి పైగా దేశాలను చేరుకోవాలనే లక్ష్యంతో ఉన్నామని వెల్లడించారు. “మన దేశీయ క్రీడలు విశిష్టమైనవి. వ్యూహం, ఓర్పు, స్ఫూర్తి వాటికి చాలా అవసరం. ప్రపంచవ్యాప్తంగా వాటికి అద్భుతమైన ఆకర్షణ ఉంది. అయితే వాటికి ప్రభుత్వ చేయూత, బ్రాండింగ్, దౌత్యపరమైన మద్దతు అవసరం” అని ఆయన పేర్కొన్నారు.
సాంకేతిక పరిజ్ఞానమే గేమ్ చేంజర్ అవుతుందని ఫ్యాన్‌కోడ్ వ్యవస్థాపకుడు యానిక్ కోలాకో వ్యాఖ్యానించారు. “అందుబాటులో ఉండడం, భాగస్వామ్యం కీలకమైనవి. సరైన టెక్నాలజీతో అభిమానులతో మరింత బలమైన సంబంధాలను ఏర్పరచుకోవచ్చు, భారతీయ క్రీడలను అంతర్జాతీయ స్థాయిలో నిలపొచ్చు’’ అని ఆయన అన్నారు.
ఈ సదస్సుకు మంత్రముగ్ధ్ సంధానకర్తగా వ్యవహరించారు. విభిన్న అభిప్రాయాలనూ భవిష్యత్ వ్యూహాలను కలుపుతూ చర్చను అద్భుతంగా నడిపించారు.
***
Release ID:
(Release ID: 2126877)
| Visitor Counter:
6