సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
                    
                    
                         వేవ్స్ 2025: జానపదాన్ని జీవన సంప్రదాయంగా అభివర్ణించిన స్పాటిఫై హౌస్ సమావేశం సమకాలీన సాంస్కృతిక రంగంలో జానపద సారాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చిన ప్యానెలిస్టులు
                    
                    
                        
                    
                 
                
                
                    
                         Posted On: 
                            03 MAY 2025 3:34PM
                        |
          Location: 
            PIB Hyderabad
                    
                 
                
                
                
                
                ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతున్న మొదటి వేవ్ సమ్మిట్ 2025 మూడో రోజు కార్యక్రమాల్లో భాగంగా స్పాటిఫై హౌస్: ఎవల్యూషన్ ఆఫ్ ఫోక్ మ్యూజిక్ ఇన్ ఇండియా అనే శీర్షికతో అర్థవంతమైన చర్చా సమావేశం జరిగింది. ‘వేవ్స్ కల్చరల్స్ అండ్ కన్సర్ట్స్’ విభాగంలో నిర్వహించిన ఈ సమావేశంలో, జానపద జీవన సంప్రదాయంపై జరిగిన చర్చలో భారత జానపద సంగీత, సాంస్కృతిక రంగాలకు చెందిన ప్రముఖులంతా వారి  అభిప్రాయాలను పంచుకున్నారు.
ప్రముఖ కథకులు, వ్యాఖ్యాత రోషన్ అబ్బాస్ ఈ చర్చకు సమన్వయ కర్తగా వ్యవహరించారు. ఈ ప్యానెల్‌లో ప్రముఖ గేయ రచయిత, సిబిఎఫ్‌సి చైర్‌పర్సన్ ప్రసూన్ జోషి, జానపద గాయని మాలిని అవస్థి, సంగీత స్వరకర్త నందేష్ ఉమాప్, గాయకులు, స్వరకర్త పాపోన్, ప్రఖ్యాత ప్రదర్శనకారిణి ఇలా అరుణ్ ఉన్నారు.
భారతీయ జానపద సంగీతం ఒక సజీవ, సామూహిక సంప్రదాయంగా అభివృద్ధి చెందుతున్న విధానాన్ని ప్యానెలిస్ట్ లు  చర్చించారు. జానపదం గతానికి సంబంధించిన జ్ఞాపకం కాదని, నిత్యజీవితంతో ముడిపడిన, తరతరాలుగా సంక్రమిస్తున్న వారసత్వ ఆస్తి అని వారు అంగీకరించారు. "జీవితాన్ని స్పృశించే అనుభూతి"గా, మానవుల సమష్టితత్వ అనుభవాలను అద్భుతంగా వ్యక్తీకరించే గొప్ప సాధనంగా జానపదాన్ని ప్రసూన్ జోషి అభివర్ణించారు.
జానపద సంగీతాన్ని ప్రధాన సంగీత స్రవంతిలోకి తీసుకురావడానికి అవసరమైన ప్రయత్నాల గురించి ప్రధానంగా చర్చించారు. ఇలాంటి పెద్ద సాంస్కృతిక కథనాల్లో జానపదాన్ని చేర్చినందుకు ప్యానెలిస్టులు స్పాటిఫై వంటి వేదికలను, వేవ్స్ వంటి కార్యక్రమాలను ప్రత్యేకంగా ప్రశంసించారు. జానపదాన్ని "ఓపెన్ యూనివర్సిటీ"గా అభివర్ణించిన నందేష్ ఉమాప్, జానపదంలోని సమ్మిళితత్వం, ప్రజాస్వామ్య స్వభావాన్ని ప్రధానంగా ప్రస్తావించారు.
జానపద సంగీతంతో తన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్న పాపోన్, సెర్బియాలో ఆలపించిన అస్సామీ జానపద గీతాలకు ప్రేక్షకులంతా లేచి నిలబడి చప్పట్లతో అభినందించిన క్షణం ఎప్పటికీ మరిచిపోలేనన్నారు. ప్రామాణికతతో ఆలపించినప్పుడు భారతీయ జానపదాలు ప్రపంచవ్యాప్తంగా ఎలా ప్రతిధ్వనిస్తాయో ఆయన వివరించారు. అరుణ్, మాలిని అవస్థిలు మాట్లాడుతూ జానపద సంగీత మూలాలు సమాజంలో, భావోద్వేగాలలో ఉన్నాయనే భావాన్ని ప్రతిధ్వనించారు.
"మీలో మిమ్మల్ని మీరు వెతుక్కున్నప్పుడు, మీరు కవిత్వం రాస్తారు. మిమ్మల్ని మీరు మీలో చేర్చుకున్నప్పుడు, మీరు జానపదాన్ని రాస్తారు." అని ప్రసూన్ జోషి వ్యాఖ్యానించారు. ఈ ప్రకటన చర్చల సారాంశాన్ని చక్కగా తెలియజేసింది, జానపదాన్ని సమష్టి గుర్తింపుతో ముడిపడిన ఒక శైలిగా, దానిలో జీవించే వారు నిరంతరం పునర్నిర్మించేదిగా ఇది వివరించింది.
ప్రతి రాష్ట్రం ఒక ప్రత్యేకమైన సంగీత శైలిని అందించడం ద్వారా భారతీయ జానపద సంప్రదాయాల్లో కనిపించే విస్తారమైన వైవిధ్యాన్ని ప్యానెల్ ప్రధానంగా ప్రస్తావించింది. ఈ వైవిధ్యాన్ని పెంపొందించడానికి వ్యవస్థాగత మద్దతు కోసం వారు పిలుపునిచ్చారు అలాగే సంప్రదాయిక కళారూపాలను ముందుకు నడిపిస్తున్న వేవ్స్ వంటి వేదికలను ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని వారు ప్రశంసించారు.
ఈ చర్చలో ఆవిష్కరణల అవసరాన్ని కూడా ప్రస్తావించారు. జానపద సారాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉన్నప్పటికీ, దాని రూపాన్ని కొత్త తరాలకు తెలిసేలా అభివృద్ధి చేయాలని ప్యానెలిస్టులు స్పష్టం చేశారు. సాంస్కృతిక మూలాలకు కట్టుబడి ఉంటూనే, సమకాలీన ప్రేక్షకులను ఆకట్టునేలా ఉండే సృజనాత్మక పునర్నిర్మాణాలను వారు ప్రోత్సహించారు.
ఈ సమావేశంలో భాగంగా యాదృచ్ఛిక సంగీత సందర్భాలు కూడా ప్రేక్షకులను అలరించాయి. పలువురు ప్యానెలిస్టులు యాదృచ్ఛికంగా తమ గాన మాధుర్యంతో జానపద స్ఫూర్తికి ప్రాణం పోశారు. ప్రేక్షకులు వాస్తవికమైన, లీనమయ్యే ఆ అనుభవాన్ని ఆస్వాదించారు.
శ్రోతలు, సంస్థలు, క్రియేటర్స్ అంతా భారత జానపద వారసత్వానికి అండగా నిలవాలన్న ఏకగ్రీవ పిలుపుతో సమావేశాన్ని ముగించారు. జానపదాలను సంరక్షించడమే కాకుండా వాటిని సెలబ్రేట్ చేస్తూ, విస్తృత ప్రాచుర్యం కల్పించాలని ప్యానెలిస్టులు కోరారు.
 
ఎప్పటికప్పుడు అధికారిక అప్‌డేట్స్ కోసం మమ్మల్ని అనుసరించండి: 
ఎక్స్ పై : 
https://x.com/WAVESummitIndia
https://x.com/MIB_India
https://x.com/PIB_India
https://x.com/PIBmumbai
ఇన్‌స్టాగ్రామ్ పై: 

https://www.instagram.com/wavesummitindia
https://www.instagram.com/mib_india
https://www.instagram.com/pibindia
 
***
                
                
                
                
                
                
                
                
                    
                        
                            Release ID:
                            (Release ID: 2126876)
                              |   Visitor Counter:
                            19