సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
"హద్దుల్లేని అభీష్టాలు: అలనాటి మేటి చిత్రాలకు పునర్ వైభవం"- వేవ్స్ 2025లో విస్తృత చర్చలు
* క్లాసిక్ సినిమాలు వినోదం కంటే ఎక్కువ - అవి మన సాంస్కృతిక గుర్తింపు, వారసత్వానికి ప్రతిబింబం: ప్రకాష్ మగ్దుమ్
* పునరుద్ధరణకు గణనీయమైన డబ్బు, సమయం, నైపుణ్యం కలిగిన వనరులు అవసరం: షెహజాద్ సిప్పీ
* కొత్త కంటెంట్ వెల్లువెత్తుతున్నా, ఆనాటి మేలిమి చిత్రాలను కాపాడుకోవడానికి పరిశ్రమ కృషి చేయాలి: కమల్ జ్ఞాన్ చందాని
Posted On:
03 MAY 2025 6:18PM
|
Location:
PIB Hyderabad
వేవ్స్ 2025 లో "బియాండ్ నోస్టాల్జియా: ది బిజినెస్ ఆఫ్ రిస్టోర్డ్ క్లాసిక్స్" అనే అంశంపై అంతర్ దృష్టిగల ప్యానెల్ చర్చతో భారతీయ సినిమా కేంద్ర బిందువుగా నిలిచింది. ప్రఖ్యాత చలనచిత్ర వాణిజ్య విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ నిపుణుల పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమం సమకాలీన ప్రేక్షకులకు ఆణిముత్యాల్లాంటి పురాతన సినిమాలను పునరుద్ధరించాల్సిన ప్రాముఖ్యత, సవాళ్లు, భవిష్యత్తుపై చర్చించడానికి పరిశ్రమ ప్రముఖులను ఒకచోట చేర్చింది.
డిజిటల్ ప్లాట్ ఫామ్ ల్లో క్లాసిక్ లను అందుబాటులో ఉంచాల్సిన అవసరాన్ని తెలియజెబుతూ ఫిల్మ్ ఎగ్జిబిషన్, పంపిణీ విభాగాల్లో కీలక వ్యక్తి అయిన కమల్ జ్ఞాన్ చందానీ ఈ చర్చను ప్రారంభించారు. "తక్షణమే అందుబాటులో ఉండకపోవడం వల్ల మన సినిమాలు చాలా వరకు ప్రజల జ్ఞాపకాల నుంచి అదృశ్యమవుతాయి క్లాసిక్ లను మళ్లీ చూడాలనుకుంటున్నామని ప్రేక్షకులు నిరంతరం మాకు చెబుతూ ఉంటారు" అని ఆయన పేర్కొన్నారు. కొత్త కంటెంట్ వెల్లువెత్తుతున్నప్పటికీ పాతకాలపు సినిమాలను కాపాడుకోవడానికి మనమంతా కృషి చేయాలని చెప్పారు.
చిత్రనిర్మాణ పరిణామం, కథ చెప్పడంలో మునుపటి దశాబ్దాల ప్రత్యేకతలను అద్భుత చిత్రాల వారసత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న షెహజాద్ సిప్పీమైన ప్రతిబింబించారు. "ఆ సమయంలో చలనచిత్ర నిర్మాణం ఒక భిన్నమైన కళ. నేటి ప్రేక్షకులు ఆనాటి సినిమాలను ఆస్వాదించడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. కానీ వాటి పునరుద్ధరణకు గణనీయ స్థాయిలో డబ్బు, సమయం, నైపుణ్యం కలిగిన వనరులు అవసరమవుతాయి" అని ఆయన అన్నారు.
చిత్ర నిర్మాత, నటుడు జాకీ భగ్నానీ మాట్లాడుతూ.. ప్రేక్షకుల ప్రాధాన్యతల్లో వచ్చిన అనూహ్య మార్పులను ప్రస్తావించారు. "ప్రజల సమయం విలువైనది. వారు నాణ్యమైన కంటెంట్ ను కోరుకుంటారు. తీసే చిత్రం ఏదైనా సరే, విశేష స్థాయిలో, కాలానుగుణంగా, అప్పటి అభిరుచులకు తగ్గట్టు ఉంటుంది. అప్పుడా, ఇప్పుడా అని కాదు, మేమెప్పుడూ మా ఉత్తమమైనదాన్ని ఇవ్వడానికే ప్రయత్నిస్తాం " అని ఆయన పేర్కొన్నారు.
విధాన, వారసత్వ అంశాలను ప్రస్తావిస్తూ... భారత సినిమా వారసత్వాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై అహ్మదాబాద్ పీఐబీ & సీబీసీ అదనపు డైరెక్టర్ జనరల్ ప్రకాష్ మగ్దుమ్ స్పష్టత నిచ్చే ప్రయత్నం చేశారు. "భారతీయులకు సినిమా వ్యామోహం చాలా ఎక్కువ. పాత తరం వాళ్ళు నేటి యువత మాయాజాలాన్ని మెచ్చుకుంటూండగా.. యువతరం తాము విన్న క్లాసిక్ లను ఆస్వాదించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. చలనచిత్ర పునరుద్ధరణ అనేది ఎంతోమంది చేతులు కలిపితే కానీ సాధ్యమయ్యేది కాదు. కానీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మేం వాస్తవికతకు దగ్గరగా సాగుతున్నాం" అని ఆయన వివరించారు.
అద్భుత సినీ సంపదను పరిరక్షించడం, డిజిటలైజ్ చేయడం, పునరుద్ధరించడం లక్ష్యంగా భారత ప్రభుత్వం నేతృత్వంలోని ప్రతిష్టాత్మక జాతీయ చలనచిత్ర వారసత్వ మిషన్ గురించి ఆయన మరింత వివరించారు. "క్లాసిక్ సినిమాలు వినోదం కంటే ఎక్కువ-అవి మనందరి సాంస్కృతిక గుర్తింపు, వారసత్వానికి ప్రతిబింబాలు. ముఖ్యంగా ఫిల్మ్ రీళ్లను పాడుచేసే ఉష్ణోగ్రత, తేమ వంటి అంశాల వల్ల డిజిటల్ డేటా సంరక్షణ క్లిష్టతరంగా మారింది. అయినప్పటికీ, ఈ బాధ్యతను అత్యవసరంగా, అంకితభావంతో నెరవేర్చాలి" అని శ్రీ మగ్దుమ్ పేర్కొన్నారు.
పునరుద్ధరించే క్లాసిక్ లు కేవలం గత కాలపు జ్ఞాపకాలు మాత్రమే కాదు.. సంస్కృతి, భావోద్వేగం, వారసత్వాలను ప్రతిబింబించే శక్తిమంతమైన వాహకాలని ప్యానెల్ స్పష్టంగా తెలియజెప్పింది. పునరుద్ధరణ పనులు ఊపందుకుంటున్న కొద్దీ, భారతదేశపు సినిమా వారసత్వం రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తూ ఉండేలా చూడటానికి సాంకేతికత, అభిరుచి, విధానాల కలయిక కీలకమని స్పష్టమవుతోంది.
Release ID:
2126729
| Visitor Counter:
17