సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
‘ఎవిజిసి-ఎక్స్ఆర్’లో ప్రపంచ దృక్కోణాన్ని ఆవిష్కరించిన భారత్: పరిశ్రమ అగ్రగాములతో ‘ఐఐసిటి’ వ్యూహాత్మక భాగస్వామ్యానికి శ్రీకారం
· మీడియా-సంలీన సాంకేతికతలకు ప్రపంచ కూడలిగా భారత్‌ను రూపొందించే దిశగా వివిధ భాగస్వామ్యాలను ప్రారంభించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On:
03 MAY 2025 2:36PM by PIB Hyderabad
వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్-2025 (వేవ్స్)లో మూడో రోజున ఓ కీలక కార్యక్రమంలో భాగంగా ‘ఎవిజిసి-ఎక్స్ఆర్’ రంగంలో ప్రపంచంలోని అగ్రగాములతో అధిక ప్రభావశీల భాగస్వామ్యాలకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ (ఐఐసిటి) శ్రీకారం చుట్టింది. మీడియా-వినోదం, సంలీన సాంకేతికతలలో ప్రపంచ కూడలిగా భారత్ స్థానాన్ని మరింత పటిష్ఠం చేయడమే ఈ సహకారాత్మక భాగస్వామ్యాల లక్ష్యం.
ఈ మేరకు కేంద్ర సమాచార-ప్రసారశాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ ఈ విభిన్న వ్యూహాత్మక భాగస్వామ్యాలను విశిష్ట రీతిలో ప్రారంభించారు. మీడియా-వినోద రంగంలో ప్రపంచ అగ్రగామిగా ఎదగగల సామర్థ్యం భారత్‌కు ఉందని ఆయన స్పష్టం చేశారు. తదనుగుణంగా దేశంలోని ‘ఐఐటి’, ‘ఐఐఎం’లు సాంకేతికత, నిర్వాహక విద్యలో ప్రామాణికత సాధించిన తరహాలో ‘ఐఐసిటి’ కూడా తనదైన రంగంలో ఓ ప్రసిద్ధ సంస్థగా రూపాంతరీకరణ వైపు పయనిస్తోందని చెప్పారు.
ఈ అంశంపై చర్చాగోష్ఠి సందర్భంగా- ‘ఐఐసిటి’ ప్రతినిధులు, పరిశ్రమ అగ్రగామి భాగస్వాములు ఈ వేదికపై ‘ఎల్‌ఒఐ‘ (ఆసక్తి వ్యక్తీకరణ లేఖలు) మార్పిడి చేసుకున్నారు. దేశంలో ‘ఎవిజిసి-ఎక్స్ఆర్’ వ్యవస్థ పురోగమనానికి ఉద్దేశించిన దీర్ఘకాలిక సహకార కృషి శ్రీకారం చుట్టుకోవడానికి ఇదొక ప్రతీకగా మారింది. ఈ మేరకు జియోస్టార్, అడోబ్, గూగుల్, యూట్యూబ్, మెటా వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు సహా ప్రపంచ అగ్రగామి పరిశ్రమాధిపతులు ఈ సంతకాల ప్రక్రియలో పాలుపంచుకున్నారు.
యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఫిల్మ్, ఎక్స్ టెండెడ్ రియాలిటీ విభాగాలన్నిటా విద్య, పరిశోధన-ఆవిష్కరణల పెంపు లక్ష్యంగా ఈ భాగస్వామ్యాలు రూపుదిద్దుకున్నాయి. సృజనాత్మక, డిజిటల్ మీడియా రంగంలో విజయవంతమైన భారత ‘ఐటీ’ నమూనా అనుసరణ, భవిష్యత్ వృద్ధి కోసం సుస్థిరావరణ వ్యవస్థ రూపకల్పన దీని ధ్యేయాలు.
సమాచార-ప్రసార శాఖ సహాయమంత్రి డాక్టర్ ఎల్.మురుగన్, కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ శ్రీ ధీరేంద్ర ఓజా కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వ ఏకీకృత మద్దతును వీరి హాజరు ప్రస్ఫుటం చేసింది.
***
(Release ID: 2126565)
|