సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
‘వేవ్స్-2025’: సాంకేతికత.. చట్టం.. అవగాహన ముప్పేటగా పైరసీపై సమష్టి కార్యాచరణకు నిపుణుల పిలుపు
· బృంద చర్చలో ఆర్థిక నష్టాలు.. సైబర్ నేరాల ముప్పు.. అవగాహన-అమలు సహిత పరిష్కారాలపై ప్రధానంగా దృష్టి సారించిన నిపుణులు · ప్రభావశీల పైరసీ నిరోధక చర్యల అమలుతో చట్టబద్ధ వీడియో సేవల వినియోగదారుల సంఖ్య 25 శాతం పెరుగుతుందని స్పష్టీకరణ
Posted On:
03 MAY 2025 2:51PM by PIB Hyderabad
వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్-2025 (వేవ్స్)లో “పైరసీ: సేఫ్‌గార్డింగ్ కంటెంటె త్రూ టెక్నాలజీ” ఇతివృత్తంగా బృంద గోష్ఠి నిర్వహించారు. డిజిటల్ కంటెంట్ ఆర్థిక వ్యవస్థను పీడిస్తున్న అత్యంత కీలక సమస్యలలో పైరసీ ఒకటి. ఈ బెడద నిరోధంపై చర్చించేందుకు మీడియా, చట్టం, సైబర్ భద్రత రంగాల ప్రపంచ అగ్రశ్రేణి నిపుణుల బృందాన్ని ఈ వేదిక ఏక తాటిపైకి తెచ్చింది. ‘ఐపి హౌస్’లో వైస్ ప్రెసిడెంట్-ఆసియా పసిఫిక్ అధిపతి నీల్ గేన్ ఈ గోష్ఠికి సంధానకర్తగా వ్యవహరించారు. పైరసీ ఇక ఎంతమాత్రం ఉపేక్షించదగిన స్వల్ప సమస్య కాదని ఈ సందర్భంగా నిపుణులు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఆ మేరకు దీన్ని సమన్వయ సహిత బహుకోణీయ ప్రతిస్పందన అవశ్యమైన ప్రధాన స్రవంతి ముప్పుగా పరిగణించాలని వారు ముక్తకంఠంతో స్పష్టం చేశారు.
విచ్చలవిడి పైరసీ ఫలితంగా పరిశ్రమకు ఆర్థికంగా వాటిల్లే నష్టం పరిమాణాన్ని ‘మీడియా పార్టనర్స్ ఆసియా’ మేనేజింగ్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వివేక్ కౌటో ఈ సందర్భంగా అంచనా వేశారు. ఈ మేరకు “ఆన్‌లైన్ పైరసీ వల్ల 2025-2029 మధ్య పరిశ్రమకు 10 శాతానికిపైగా ఆదాయ నష్టం తప్పదని భావిస్తున్నాం” అని స్పష్టం చేశారు. “అయితే, ప్రభావశీల పైరసీ నిరోధక చర్యల అమలుతో చట్టబద్ధ వీడియో సేవల వినియోగదారుల సంఖ్య 25 శాతందాకా పెరుగుతుంది. దీంతోపాటు కంటెంట్పై పెట్టుబడి 0.5 బిలియన్ డాలర్ల మేర పెరగడానికి దోహదం చేస్తుంది. తద్వారా 2029 నాటికి పరిశ్రమ మొత్తం విలువ 3.8 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుతుంది” అని ఆయన విశదీకరించారు. ముఖ్యంగా భారత డిజిటల్ వీడియో ఆర్థిక వ్యవస్థ పరిమాణం దృష్ట్యా పైరసీపై చర్చను రక్షణకు పరిమితం చేయకుండా అరికట్టే సామర్థ్యం వైపు మళ్లించాల్సి ఉందని పరిశ్రమ భాగస్వాములకు ఆయన సూచించారు.
డిజిటల్ పైరసీ, సైబర్ నేరాల మధ్యగల సంబంధం గురించి ‘ఐఎస్‌బి ఇనిస్టిట్యూట్ ఆఫ్ డేటా సైన్స్’ అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ శ్రుతి మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. “పైరసీలో తరచూ ట్రోజన్లు, రాన్సమ్‌వేర్, స్పైవేర్ వంటి హానికర ఉపకరణాలు అంతర్భాగంగా ఉంటాయి. వీటికి 18–24 ఏళ్ల మధ్య వయస్కులైన యువ వినియోగదారులు ఎక్కువగా బలయ్యే ముప్పు ఉంటుంది” అని ఆమె వివరించారు. అందువల్ల సమగ్ర ప్రజాచైతన్య, అవగాహన కార్యక్రమాల నిర్వహణ అవసరమని పిలుపునిచ్చారు. ఆ మేరకు పైరసీ ఆటకట్టించే చర్యలు అవగాహన సహిత వినియోగదారులతో మొదలు కావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ‘ఐఎస్‌బి’ జూలై 9–10 తేదీలలో సీబీఐ, ఇంటర్‌పోల్ సహకారంతో ‘డిజిటల్ పైరసీ సమ్మిట్’ నిర్వహించనున్నదని ఆమె ప్రకటించారు.
క్రీడా రంగంలో పైరసీ నిరోధక కార్యకలాపాలు, విధానాల గురించి ‘డిఎజడ్‌ఎన్’ పైరసీ నిరోధక కార్యకలాపాల అధిపతి అనురాగ్ కశ్యప్ తన ప్రసంగంలో వివరించారు. “మూడు ‘డి’లకు ప్రాధాన్యంతో మా త్రిముఖ వ్యూహం రూపుదిద్దుకుంది. ఇందులో ‘డిటెక్షన్, డిజ్రప్షన్, డిటరెన్స్’ (పసిగట్టడం, విచ్ఛిన్నం, నిరోధం) అంతర్భాగం ఉంటాయి. ఏదైనా ఈవెంట్ ప్రత్యక్ష ప్రసారం కావడానికి ముందుగానే ఈ వ్యూహాన్ని మేం అమలు చేస్తాం” అని ఆయన విశదీకరించారు. లీక్‌లను పసిగట్టే ప్రక్రియలో అదృశ్య వాటర్‌మార్కింగ్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు.
జియో హాట్‌స్టార్‌లో న్యాయ వ్యవహారాల విభాగాధిపతి అనిల్ లాలే మాట్లాడుతూ- చట్టాల పటిష్ఠ అమలు ప్రాధాన్యాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. “పైరసీకి పాల్పడేవారిపై న్యాయ విచారణ అతిపెద్ద అవరోధం. లీక్‌ల మూలాన్ని గుర్తించి, వాటి సమాంతర ప్రసారాన్నిఅడ్డుకునేలా చట్ట వ్యవస్థ చర్యలుండాలి” అని ఆయన అన్నారు. ఆ మేరకు నిరోధమన్నది ప్రతిస్పందనలా కాకుండా ముందస్తు చర్యగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.
‘ఆనంద్ అండ్ ఆనంద్ అసోసియేట్స్’ ప్రతినిధి ప్రవీణ్ ఆనంద్ ప్రసంగిస్తూ- సాంకేతిక పరిజ్ఞానంతోపాటు న్యాయ సంస్కరణల ద్వారానే పరిష్కారం సాధ్యమని స్పష్టం చేశారు. “సాంకేతికత రీత్యా ఏఐ, బ్లాక్‌చెయిన్, వాటర్‌మార్కింగ్ వంటి ఉపకరణాలు చాలా ముఖ్యం. అంతేగాక మెటల్ డిటెక్టర్ల వంటి చర్యల ద్వారా మనం ‘క్యామ్‌కార్డింగ్’ను అడ్డుకోవాలి. అలాగే నిరోధ భయం సృష్టించడంలో చట్టబద్ధ సత్వర చర్యలు అత్యంత కీలకం” అని ఆయన వివరించారు.
డిజిటల్ కంటెంట్ భవిష్యత్తును రక్షించాలంటే సాంకేతికత, చట్టం, అమలు సంస్థలతోపాటు ప్రజాచైతన్యం సమష్టిగా కృషిచేసే ‘ఏకీకృత శక్తి’ అవసరాన్ని నిపుణుల బృందం స్పష్టం చేసింది. మీడియా-వినోద పరిశ్రమకుగల అత్యంత సంక్లిష్ట సవాళ్ల పరిష్కారంలో కార్యాచరణాత్మక వ్యూహాలు ప్రధానంగా వేవ్స్-2025 ఇటువంటి చర్చాగోష్ఠులకు ప్రాముఖ్యమిస్తుంది.
***
(Release ID: 2126538)
|