సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
‘వేవ్స్-2025’ చర్చాగోష్ఠులలో క్రీడలు.. సాంకేతిక రంగాల్లో ఆవిష్కరణలపై పరిశీలన
· వేవ్స్-2025లో సౌదీ అరేబియా ‘ఇ-స్పోర్ట్స్ యాంబిషన్స్’పై నిశిత దృష్టి · దార్శనికత.. పెట్టుబడి..ఆవిష్కరణలతో సౌదీ గేమింగ్ రంగం వృద్ధి · నేటి మీ కిట్‌లో హెల్మెట్ వంటి మీడియా-సాంకేతికతలు అవశ్యం: వేవ్స్-2025లో రవిశాస్త్రి స్పష్టీకరణ”
Posted On:
02 MAY 2025 8:27PM by PIB Hyderabad
ముంబయిలో నిర్వహిస్తున్న వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్-2025 (వేవ్స్)లో రెండో రోజున క్రీడలు, ఇ-స్పోర్ట్స్ భవిష్యత్తుపై రెండు దార్శనిక చర్చలు సాగాయి. వీటిలో ప్రధానంగా మీడియా, సాంకేతికత, కథా వివరణ రంగాల్లో ప్రపంచ భాగస్వామ్యం ఎలా పునర్నిర్మితం కానుందనే అంశంపై దృష్టి సారించారు.
గేమింగ్ విప్లవం: భవిష్యత్తు దిశగా సాహసిక దృక్కోణం
ఈ కార్యక్రమంలో భాగంగా “బిల్డింగ్ ఎ గ్లోబల్ పవర్‌హౌస్: సౌదీ అరేబియా గేమింగ్ అండ్ ఇ-స్పోర్ట్స్ విజన్” పేరిట ప్రభావశీల సంక్షిప్త చర్చాగోష్ఠి నిర్వహించారు. ఈ సందర్భంగా సౌదీ ఇ-స్పోర్ట్స్ ఫెడరేషన్ చైర్మన్ గౌరవనీయ ఫైజల్ బిన్ బందర్ బిన్ సుల్తాన్ అల్ సౌద్ ప్రసంగించారు. అంతర్జాతీయ గ్లోబల్ ఇ-స్పోర్ట్స్ రంగాన్ని పునర్నిర్వచించే విధంగా తాము రూపొందించిన విస్తృత ప్రణాళికలను ఆయన ప్రదర్శించారు. ఈ గోష్ఠికి సంధానకర్తగా వ్యవహరించిన ‘జెట్‌సింథెసిస్’ సంస్థ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ గిరీష్ మీనన్ మాట్లాడుతూ- సౌదీ ప్రభుత్వ యువ కేంద్రక విధానాలు, వ్యూహాత్మక పెట్టుబడులు, ప్రపంచ భాగస్వామ్యాలు ఆ దేశాన్ని గేమింగ్, ఇ-స్పోర్ట్స్ ఆవిష్కరణల వర్ధమాన కూడలిగా రూపొందిస్తున్న తీరును వివరించారు.
జనాభాలో 67శాతానికిపైగా గేమర్‌లుగా గుర్తింపు పొందిన నేపథ్యంలో దీర్ఘకాలిక సుస్థిరత దిశగా రూపొందించిన ప్రత్యేక వ్యవస్థకు సౌదీ అరేబియా చేయూతనిస్తోంది. ఇందులో భాగంగా ‘గేమర్స్ వితౌట్ బోర్డర్స్’ వంటి వినూత్న కార్యక్రమాల నుంచి ఇ-స్పోర్ట్స్ వరల్డ్ కప్కు ఆతిథ్యం దాకా అంతర్జాతీయ పోటీ ప్రపంచంలో సౌదీ ముందంజ వేసింది.
ఈ దృక్కోణానికి సౌదీ ఇ-స్పోర్ట్స్ అకాడమీ మూలస్తంభంగా నిలిచింది. ఇది యువ నిపుణుల కోసం అర్థవంతమైన ఉపాధి మార్గాలను సృష్టిస్తుంది. ఈ మేరకు ‘శిక్షణ, కార్యక్రమాల రూపకల్పన, గేమ్ డెవలప్‌మెంట్’ వంటి వివిధ రంగాలలో శిక్షణనిస్తుంది. అంతేకాకుండా కంటెంట్ సృష్టికర్తల సంఖ్యలో వృద్ధికి అకాడమీ కృషి ఎంతగానో మద్దతిస్తోంది. సామాజిక భాగస్వామ్యం, ఇతర దేశాల సహకారంతో సమగ్ర, సుసాధ్య పరిశ్రమగా ఎదగడానికి ప్రోత్సాహమిస్తున్నాయి.
ఈ సందర్భంగా గౌరవనీయ ఫైజల్ మాట్లాడుతూ- సౌదీ అరేబియా లక్ష్యం టోర్నమెంట్లకు అతీతమైనదని స్పష్టం చేశారు. “అవకాశాల సృష్టి, తగిన వాతావరణ వ్యవస్థ రూపకల్పనకు సంబంధించిందని. అలాగే ఏదైనా దేశం వనరులు, దృక్కోణం, ప్రతిభను ఒకే తాటిపైకి తెచ్చినపుడు అద్భుతాలు సాధ్యమని ఇది స్పష్టం చేస్తుంది” అన్నారు. ఈ చర్చాగోష్ఠి సారాంశాన్ని బట్టి, సౌదీ విధానం రాబోయే దశాబ్దంలో ప్రపంచ గేమింగ్ ధోరణులను చక్కగా రూపుదిద్దగలదు.
క్రీడారంగం రూపాంతరీకరణ: మీడియా.. సాంకేతికత.. మానవ సంబంధాలు
ఈ కార్యక్రమానికి ముందు “స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆంత్రప్రెన్యూర్‌షిప్ అండ్ మీడియా- ది రియల్ స్టెమ్” అంశంపై క్రీడావరణంలోని గళాలన్నిటికీ ఒక గతిశీల బృందం ఒకే వేదికపైకి చేర్చింది. ఈ గోష్ఠికి నిర్మాత-పారిశ్రామికవేత్త ధీర్ మోమయా సంధానకర్తగా వ్యవహరించగా, క్రికెట్ దిగ్గజం రవిశాస్త్రితోపాటు ప్రశాంత్ ఖన్నా (జియోస్టార్), నుల్లా సర్కార్ (కాస్మోస్), విక్రాంత్ ముదలియార్ (డ్రీమ్ స్పోర్ట్స్), ధవళ్ పోండా (టాటా కమ్యూనికేషన్స్) వంటి ప్రముఖులు చర్చలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాధ్యమాలు, సాంకేతికతల ఫలితంగా క్రికెట్ రూపాంతరీకరణ చెందిన తీరుపై తన ఆలోచనలను ఇతర బృంద సభ్యులతో రవిశాస్త్రి పంచుకున్నారు. “మీడియా, సాంకేతికత నేటి మీ కిట్‌లో హెల్మెట్ లాంటివి - అవి చాలా అవసరం కూడా” అని ఆయన వ్యాఖ్యానించారు. అభిమానులతో బంధం, అథ్లెట్ బ్రాండింగ్ పెరిగిన విధానాన్ని వివరిస్తూ- క్రీడాకారుడిగా స్వీయ ప్రయాణాన్ని ‘ఓ కెరటం’గా అభివర్ణించారు. ఇది వ్యక్తిగత ఎదుగుదలకే కాకుండా విస్తృత క్రీడా పరిణామాలకు ప్రతీకగా పేర్కొన్నారు.
‘ఇమ్మర్సివ్ ఫీడ్స్ ఫాంటసీ గేమింగ్, ఏఐ ఆధారిత కంటెంట్ వ్యక్తిగతీకరణ వంటి సాంకేతిక పురోగమనం తదితరాలను క్రీడలతో అభిమానులను అనుసంధానించే ఉపకరణాలుగా బృంద సభ్యులు వివరించారు. ముఖ్యంగా ‘ఫాంటసీ’ వేదికలు కేవలం వీక్షక స్థాయి నుంచి చురుగ్గా పాల్గొనేవారుగా అభిమానులను మార్చిన తీరును విక్రాంత్ ముదలియార్ స్పష్టం చేశారు. సంకేత భాషా వ్యాఖ్యానంతోపాటు వ్యక్తిగతీకరించిన విజువల్ ఫీడ్‌ల వంటి జోడింపు ఉపకరణాల గురించి ప్రశాంత్ ఖన్నా ప్రముఖంగా ప్రస్తావించారు.
కథన ప్రాముఖ్యం గురించి నుల్లా సర్కార్ మాట్లాడుతూ- “అభిమానులు కేవలం గణాంకాలను పట్టించుకోరు- వారు ప్రజా నాడిని అనుసరిస్తారు” అని స్పష్టం చేశారు. ధవళ్ పోండా దీన్ని మరింత విశదీకరిస్తూ- సాంకేతికత నేడు కోరింది చూడగల అనుభవాన్ని ఇస్తుండటంతో క్రీడల ప్రత్యక్ష ప్రసారం ప్రపంచ కంటెంట్ వినియోగ కేంద్రకంగా రూపొందిన తీరును ఉదాహరించారు.
చివరగా- క్రీడలు, సాంకేతికత, మీడియా భవిష్యత్ అవకాశాలు అపారం.. ఈ దిశగా మనం ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నాం” అని శాస్త్రి ఆశావాదం వెలిబుచ్చడంతో చర్చాగోష్ఠి సమాప్తమైంది.
***
(Release ID: 2126531)
|