ప్రధాన మంత్రి కార్యాలయం
ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతిలో రూ.58,000 కోట్లకుపైగా విలువైన అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన.. ప్రారంభోత్సవం
· “నేడు ప్రారంభించిన ఈ అభివృద్ధి పనులు మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంతోపాటు ఆంధ్రప్రదేశ్ వృద్ధిని వేగిరపరుస్తాయి”
· “ఈ అమరావతి గడ్డ సంప్రదాయంతో ముడిపడిన ప్రగతికి ప్రతీక”
· “వికసిత ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ గారి స్వప్నం... ఆ మేరకు సమష్టి కృషితో అమరావతిని, రాష్ట్రాన్ని వికసిత భారత్‌కు వృద్ధి చోదకంగా మారుద్దాం”
· “శరవేగంగా మౌలిక సదుపాయాల ఆధునికీకరణ సాగుతున్న దేశాల్లో నేడు భారత్ ఒకటిగా ఉంది”
· “పేదలు.. రైతులు.. యువత.. నారీశక్తి మూల స్తంభాలుగా వికసిత భారత్ రూపుదిద్దుకుంటుంది”
· “నాగాయలంకలో నిర్మించే ‘నవదుర్గ పరీక్షా వేదిక’ దుర్గామాత తరహాలో దేశ రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుంది... దీనిపై మన శాస్త్రవేత్తలతోపాటు రాష్ట్ర ప్రజలకు నా అభినందనలు”
Posted On:
02 MAY 2025 6:44PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతిలో రూ.58,000 కోట్లకుపైగా విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేసి, మరికొన్నిటికి శంకుస్థాపన చేశారు. ఇవాళ పవిత్ర అమరావతి గడ్డపై నిల్చున్న తన మనో నేత్రంతో వీక్షిస్తున్నది ఒక నగరాన్ని మాత్రమే కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఆ మేరకు ఒక స్వప్న సాకారాన్ని... ఓ కొత్త అమరావతిని.. సరికొత్త ఆంధ్రను దర్శిస్తున్నానని అభివర్ణించారు. “సంప్రదాయంతో ముడిపడిన పురోగమనానికి అమరావతిగడ్డ ఒక ప్రతీక. బౌద్ధ వారసత్వమైన శాంతితోపాటు వికసిత భారత్‌ను రూపుదిద్దే శక్తిని కూడా ఈ నేల అక్కున చేర్చుకుంటుంది” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఈ రోజు పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయడాన్ని ప్రస్తావిస్తూ- ఇవి కేవలం కాంక్రీట్ నిర్మాణాలు కాదన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆకాంక్షలకు, భారత అభివృద్ధి దృక్పథానికి బలమైన పునాదులని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా వీరభద్ర స్వామి, అమరలింగేశ్వర స్వామి, తిరుపతి వేంకటేశ్వర స్వామిని స్మరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్‌లకూ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇతిహాసాల ప్రకారం అమరావతి ఇంద్రలోక రాజధాని కాగా, ఇప్పుడది ఆంధ్రప్రదేశ్ రాజధాని అని శ్రీ మోదీ గుర్తుచేశారు. ఈ పరిణామం యాదృచ్చికం కాదని, ప్రగతి పథంలో భారత్ పయనాన్ని బలోపేతం చేసే ‘స్వర్ణాంధ్ర’ సృష్టికి సానుకూల సంకేతమని స్పష్టం చేశారు. ‘స్వర్ణాంధ్ర’ దృక్కోణానికి అమరావతి శక్తినిస్తుందని, పురోగమనంతోపాటు ప్రగతిశీల రూపాంతరీకరణకు దీన్నొక కూడలిగా మారుస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలుగులో మాట్లాడుతూ- “అమరావతి కేవలం ఓ నగరం కాదు.. అదొక శక్తి. ఆంధ్రప్రదేశ్‌ను ఆధునిక, అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చే సామర్థ్యం దీనికుంది” అని వివరించారు.
ఆంధ్రప్రదేశ్ యువత కలలు సాకారం చేయగల నగరంగా అమరావతిని అభివర్ణిస్తూ- భవిష్యత్తులో ఇది సమాచార సాంకేతికత, కృత్రిమ మేధ, పరిశుభ్ర ఇంధనం, కాలుష్యరహిత పరిశ్రమలు, విద్య, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో ప్రముఖ నగరంగా రూపుదిద్దుకోగలదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ రంగాలలో వృద్ధిని వేగిరపరచేందుకు తగిన మౌలిక సదుపాయాల సత్వర కల్పనలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర పూర్తి మద్దతిస్తోందని తెలిపారు.
భవిష్యత్ సాంకేతికతలను ముందుగానే పసిగట్టి, వాటిని వేగంగా అనుసరించడంలో శ్రీ చంద్రబాబు నాయుడు కుశాగ్రబుద్ధిని శ్రీ మోదీ ప్రశంసించారు. ఈ ప్రజా రాజధానికి శంకుస్థాపన చేసే అవకాశం 2015లో తనకు లభించిందని గుర్తుచేస్తూ- కొన్నేల్లుగా ఈ నగరాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సమగ్ర మద్దతునిచ్చిందని చెప్పారు. ఈ మేరకు ప్రాథమిక మౌలిక సదుపాయాల కల్పన దిశగా అవసరమైన చర్యలన్నీ చేపట్టిందని పేర్కొన్నారు. శ్రీ నాయుడు నాయకత్వాన రాష్ట్రంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం అభివృద్ధి కృషిని వేగవంతం చేసిందని కొనియాడారు. నేటి నిర్మాణ కార్యకలాపాల్లో హైకోర్టు, శాసనసభ, సచివాలయం, రాజ్ భవన్ వంటి కీలక వ్యవస్థలకు ప్రాధాన్యమిస్తున్నదని ప్రముఖంగా ప్రస్తావించారు.
“వికసిత ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ గారి స్వప్నం” అని గుర్తుచేస్తూ- ఆ మేరకు సమష్టి కృషితో అమరావతిని, రాష్ట్రాన్ని వికసిత భారత్‌కు వృద్ధి చోదకంగా మారుద్దామని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని ఉద్దేశించి తెలుగులో మాట్లాడుతూ- ఇది మనందరి బాధ్యత... మనమంతా కలిసికట్టుగా నిర్వర్తించాల్సిన కర్తవ్యం” అన్నారు.
గడచిన దశాబ్దం నుంచీ భౌతిక, డిజిటల్, సామాజిక మౌలిక సదుపాయాల కల్పనపై భారత్ విస్తృతంగా దృష్టి సారించిందని శ్రీ మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. తదనుగుణంగా నేడు శరవేగంగా మౌలిక సదుపాయాల ఆధునికీరణ సాగుతున్న ప్రపంచ దేశాల్లో ఒకటిగా ఉందని చెప్పారు. ఈ పురోగమనం ద్వారా ఆంధ్రప్రదేశ్ కూడా గణనీయ ప్రయోజనం పొందుతోందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా రూ.వేల కోట్ల విలువైన రహదారి, రైల్వే ప్రాజెక్టులు రాష్ట్రానికి కేటాయించిన నేపథ్యంలో ప్రగతి వేగం పుంజుకుంటున్నదని వివరించారు. “ఆంధ్రప్రదేశ్ ఇప్పుడో నవ్యానుసంధాన యుగంలో పయనిస్తోంది. తద్వారా జిల్లా నుంచి జిల్లాకు సంబంధాలు మెరుగుపడుతూ పొరుగు రాష్ట్రాలతో సంధానం కూడా మెరుగవుతుంది” అన్నారు. దీంతో రైతులకు మరింత పెద్ద మార్కెట్ల సౌలభ్యం కలుగుతుందని, రవాణా సామర్థ్యం పెరగడంతో పరిశ్రమలకూ ప్రయోజనం చేకూరుతుందని వివరించారు. పర్యాటక, తీర్థయాత్ర రంగాలు కూడా ఊపందుకుంటాయని, కీలక ఆధ్యాత్మిక ప్రదేశాలు మరింత అందుబాటులోకి వస్తాయని శ్రీ మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ సందర్భంగా రేణిగుంట-నాయుడుపేట రహదారిని ఉదాహరిస్తూ- ఇది తిరుపతి వెంకన్న దర్శన సౌలభ్యాన్ని మరింత చేరువ చేస్తుందని చెప్పారు. ఆ మేరకు భక్తులు చాలా స్వల్ప సమయంలోనే శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోగలరని ఆయన పేర్కొన్నారు.
వేగంగా వృద్ధిచెందిన దేశాలు తమ రైల్వే నెట్‌వర్క్‌లకు అత్యధిక ప్రాముఖ్యం ఇస్తున్నాయని ప్రధానమంత్రి గుర్తుచేశారు. మన దేశంలోనూ గత దశాబ్దం రైల్వేలకు ప్రగతిశీల రూపాంతరీకరణ కాలమని అభివర్ణించారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోనూ రైల్వేల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో నిధులు కేటాయించిందని వివరించారు. ఈ మేరకు 2009-2014 మధ్య ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడిగా రైల్వే బడ్జెట్‌లో రూ.900 కోట్లకన్నా తక్కువ కేటాయించగా, నేడు ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే రూ.9,000 కోట్లకుపైగా- అంటే... కేటాయింపులు పది రెట్లు పెరిగినట్లు ప్రధానమంత్రి స్పష్టం చేశారు. “రైల్వే బడ్జెట్ పెంపుతో ఆంధ్రప్రదేశ్‌లో రైల్వేల విద్యుదీకరణ 100 శాతం పూర్తయింది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రం గుండా ఇప్పుడు 8 జతల ఆధునిక వందే భారత్ రైళ్లతోపాటు ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్లే అమృత్ భారత్ రైలు కూడా నడుస్తున్నాయని తెలిపారు. గడచిన పదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 750కిపైగా రైలు ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మితమైనట్లు చెప్పారు. అంతేకాకుండా రాష్ట్రంలోని 70కిపైగా రైల్వే స్టేషన్లను ‘అమృత్ భారత్ స్టేషన్’ పథకం కింద ఆధునికీకరిస్తున్నామని, ప్రయాణికులకు అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని ప్రధాని వెల్లడించారు.
మౌలిక సదుపాయాల అభివృద్ధి బహుగుణ ప్రభావాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ- తయారీ రంగంపై దాని ప్రత్యక్ష ప్రభావాన్ని వివరించారు. సిమెంటు, ఉక్కు వంటి ముడిపదార్ధాల రవాణాతోపాటు రవాణా సేవల వంటి రంగాలు భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ద్వారా గణనీయ ప్రయోజనం పొందుతాయన్నారు. అలాగే బహుళ రంగ పరిశ్రమలు బలోపేతం కాగలవని శ్రీ మోదీ పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల కల్పన దేశ యువతకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరుస్తుందని, మరిన్ని ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని చెప్పారు. ఈ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కొనసాగింపు ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోనూ వేలాదిగా యువతకు కొత్త ఉద్యోగావకాశాలు అందివస్తున్నాయని ఆయన గుర్తుచేశారు.
“పేదలు, రైతులు, యువత, మహిళా సాధికారత అనే నాలుగు మూల స్తంభాల పునాదిపైనే వికసిత భారత్ ఆధారపడి ఉంది” అంటూ లోగడ ఎర్రకోట పైనుంచి తన ప్రసంగంలో ప్రస్తావించడాన్ని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. ఈ నాలుగు స్తంభాలూ తమ ప్రభుత్వ విధానాలకు కేంద్రకంగా ఉన్నాయని, రైతు సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్నామని ఆయన వివరించారు. రైతులపై ఆర్థిక భారం తగ్గింపులో భాగంగా గత పదేళ్లలో వారికి సరసమైన ధరతో ఎరువులు సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.12 లక్షల కోట్లు ఖర్చు చేసిందని ఆయన గుర్తుచేశారు. వ్యవసాయ ఉత్పాదకత పెంపు లక్ష్యంగా వేలాది కొత్త, ఆధునిక విత్తన రకాలను పంపిణీ చేశామని చెప్పారు. ప్రధానమంత్రి పంటల బీమా పథకం కింద రాష్ట్రంలో రూ.5,500 కోట్ల విలువైన రైతుల అభ్యర్థనలను పరిష్కరించినట్లు వెల్లడించారు. దీంతోపాటు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రాష్ట్రంలోని లక్షలాది రైతుల ఖాతాలకు రూ.17,500 కోట్లకుపైగా నేరుగా బదిలీ చేశామని తెలిపారు. తద్వారా వారి జీవనోపాధికి కూడా ఆర్థిక సహాయం అందుతుందని ఆయన అన్నారు.
దేశవ్యాప్తంగా నీటిపారుదల ప్రాజెక్టుల విస్తరణ వేగంగా సాగుతున్నదని, నదుల అనుసంధాన కార్యక్రమాల ప్రారంభంతోపాటు ప్రతి కమతానికీ నీరందుతూ రైతులకు నీటి కొరత లేకుండా చేశామని శ్రీ మోదీ వివరించారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో పోలవరం ప్రాజెక్టు పనులు ఊపందుకున్నాయని, దీనిద్వారా తమ జీవితాల్లో ప్రగతిశీల మార్పు రాగలదని లక్షలాదిగా ప్రజలు ఆశాభావంతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తిచేయడంలో తమ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి మద్దతిస్తుందన్న హామీని పునరుద్ఘాటించారు.
దేశాన్ని అంతరిక్ష శక్తిగా రూపొందించడంలో దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించిందని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. శ్రీహరికోట నుంచి ప్రారంభమైన ప్రతి ప్రయోగం లక్షలాది భారతీయుల హృదయాలు ఉప్పొంగేలా చేస్తున్నదని పేర్కొన్నారు. అలాగే అంతరిక్ష పరిశోధనల వైపు దేశ యువతరాన్ని ప్రేరేపిస్తుందని చెప్పారు. భారత రక్షణ రంగంలో ఒక భారీ పరిణామాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ మేరకు కొత్త రక్షణ వ్యవస్థ శ్రీకారం చుట్టుకున్నదని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ‘డిఆర్‌డిఒ’ కొత్త క్షిపణి పరీక్షా కేంద్రానికి పునాది పడిందని గుర్తుచేస్తూ- ఈ దిశగా నాగాయలంకలోని ‘నవదుర్గ పరీక్షా కేంద్రం’ దేవ రక్షణ సామర్థ్యాన్ని బహుగుణంగా పెంచుతుందన్నారు. దుర్గామాత దివ్య శక్తి నుంచి ఇది సంపూర్ణ బలం సంతరించుకోగలదని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. ఈ కీలక ఘట్టం సాకారం కావడంపై శాస్త్రవేత్తలతోపాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు.
"భారత్ బలం ఆయుధ శక్తిలో కాకుండా దాని ఐక్యతలో ఉంది” అని ప్రధానమంత్రి అభివర్ణించారు. దేశవ్యాప్తంగా నగరాల్లో ఏర్పాటవు ‘ఏక్తా మాల్స్’ ద్వారా ఈ ఐక్యతా స్ఫూర్తి మరింత బలోపేతం అవుతున్నదని పేర్కొన్నారు. విశాఖపట్నం త్వరలోనే తనదైన ‘ఏక్తా మాల్’ను సొంతం చేసుకుంటుందని, దేశవ్యాప్తంగాగల చేతివృత్తులవారు, హస్త కళాకారులు తమ ఉత్పత్తులను ఇక ఒకే వేదికపై ప్రదర్శిస్తారని ఆయన ప్రకటించారు. ఈ మాల్స్ సుసంపన్న భారతీయ వైవిధ్యంతో ప్రజలను అనుసంధానిస్తూ స్థానిక ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దోహదం చేస్తాయన్నారు. తద్వారా “ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్” దార్శనికతను బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు.
ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్ 21) నేపథ్యంలో పదో వార్షిక వేడకలను ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహిస్తామని, దీనికి తాను కూడా హాజరవుతానని ప్రధానమంత్రి ప్రకటించారు. రాబోయే 50 రోజుల్లో యోగాపై మరిన్ని కార్యకలాపాలు చేపట్టి ప్రపంచ రికార్డు సృష్టించాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో కలలు కనేవారికి లేదా వాటిని సాకారం చేసుకోగల యువతకు కొరత లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రం నేడు సరైన మార్గంలో ముందడుగు వేస్తూ, సముచిత వృద్ధి వేగాన్ని సంతరించుకున్నదనే విశ్వాసం తనకుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రగతిని వేగిరపరచడంలో సుస్థిర వేగం ప్రాధాన్యాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ దిశగా అంకితభావంతో మద్దతుకు హామీ ఇస్తూ, ఈ కృషిలో ప్రజలతో భుజం కలిపి నడుస్తానంటూ ప్రధాని తన ప్రసంగం ముగించారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ సయ్యద్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎన్.చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
నేపథ్యం
దేశవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాల కల్పన, అనుసంధానానికి భరోసాపై తన నిబద్ధత మేరకు ఆంధ్రప్రదేశ్‌లో 7 జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రధానమంత్రి ఇవాళ ప్రారంభించారు. వీటిలో వివిధ జాతీయ రహదారుల విభాగాల విస్తరణ, రోడ్ ఓవర్ బ్రిడ్జి, సబ్‌వే నిర్మాణం వంటి పనులున్నాయి. ఇవన్నీ రహదారి భద్రతకు తోడ్పడటంతోపాటు ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తాయి. అలాగే తిరుపతి, శ్రీకాళహస్తి, మాలకొండ, ఉదయగిరి కోట వంటి ఆధ్యాత్మిక, చారిత్రక పర్యాటక ప్రదేశాలకు నిరంతర సంధానం కల్పిస్తాయి.
అనుసంధానం, సామర్థ్యం పెంపు లక్ష్యంగా రూపొందిన రైల్వే ప్రాజెక్టులను ప్రధానమంత్రి ఈ సందర్భంగా దేశానికి అంకితం చేశారు. వీటిలో బుగ్గనపల్లె సిమెంట్ నగర్-పాణ్యం స్టేషన్ల మధ్య రైలు మార్గం డబ్లింగ్, రాయలసీమ-అమరావతి మధ్య అనుసంధానం పెంపు, న్యూ వెస్ట్ బ్లాక్ హట్ క్యాబిన్-విజయవాడ స్టేషన్ల మధ్య మూడో రైలు మార్గం నిర్మాణం వంటివి ఉన్నాయి.
ఇక 6 జాతీయ రహదారి ప్రాజెక్టులు, ఒక రైల్వే ప్రాజెక్టుకు ప్రధాని శంకుస్థాపన చేశారు. వీటిలో జాతీయ రహదారులలోని వివిధ విభాగాల విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం, హాఫ్ క్లోవర్ లీఫ్, రోడ్ ఓవర్ బ్రిడ్జి వంటి పనులు అంతర్భాగంగా ఉన్నాయి. వీటితో అనుసంధానం మెరుగుపడి, అంతర్రాష్ట్ర ప్రయాణ సమయంతోపాటు రద్దీ తగ్గుతుంది. మొత్తంమీద రవాణా సామర్థ్యం ఇనుమడిస్తుంది. సరకు రవాణా రైళ్ల దారిమళ్లింపు, గుంతకల్లు జంక్షన్ వద్ద రద్దీ తగ్గింపు లక్ష్యంగా గుంతకల్లు వెస్ట్-మల్లప్ప గేట్ స్టేషన్ల మధ్య రైల్ ఓవర్ రైల్ నిర్మాణం కూడా వీటిలో ఉంది.
అమరావతిలో రూ.11,240 కోట్లకుపైగా విలువైన శాసనసభ, హైకోర్టు, సచివాలయం, ఇతర పరిపాలన భవనాలు సహా 5,200 కుటుంబాలకు గృహ వసతి కల్పించే బహుళ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. అలాగే రూ.17,400 కోట్లకుపైగా విలువైన భూగర్భ సదుపాయాలు, అత్యాధునిక వరద నిర్వహణ వ్యవస్థలతో కూడిన 320 కిలోమీటర్ల అంతర్జాతీయ స్థాయి రవాణా నెట్‌వర్క్‌గల ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, వరద ఉపశమన ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. అలాగే ల్యాండ్ పూలింగ్ స్కీమ్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, రాజధాని అమరావతి అంతటా సెంట్రల్ మీడియన్లు, సైకిల్ ట్రాక్‌లు, సమీకృత సదుపాయాల 1,281 కిలోమీటర్ల పొడవైన రోడ్లు వంటి పనులను రూ.20,400 కోట్లకుపైగా నిధులతో చేపడతారు.
ఆంధ్రప్రదేశ్‌లోని నాగాయలంక వద్ద దాదాపు రూ.1,460 కోట్లతో క్షిపణి పరీక్ష కేంద్రం నిర్మాణానికి కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. ఇందులో ఒక ప్రయోగ కేంద్రం, సాంకేతిక పరికరాల సదుపాయాలు, దేశ రక్షణ సంసిద్ధతను ఇనుమడింపజేసే స్వదేశీ రాడార్లు, టెలిమెట్రీ సహా ఎలక్ట్రో-ఆప్టికల్ వ్యవస్థలు ఉంటాయి.
విశాఖపట్నంలోని మధురవాడలో ‘పిఎం ఏక్తా మాల్’కు ప్రధాని శంకుస్థాపన చేశారు. జాతీయ సమైక్యతను పెంపు, ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి మద్దతు, ‘ఒక జిల్లా- ఒక ఉత్పత్తి’ పథకానికి ప్రోత్సాహం, ఉపాధి అవకాశాల సృష్టి, గ్రామీణ కళాకారులకు సాధికారత స్వదేశీ ఉత్పత్తులకు మార్కెట్ సౌలభ్యం పెంపు లక్ష్యాలుగా దీనికి రూపకల్పన చేశారు.
*****
MJPS/SR/SKS
(Release ID: 2126369)
Visitor Counter : 35
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam