WAVES BANNER 2025
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

‘‘విచిత్ర పరిస్థితులకు ఎదురొడ్డి నిలుస్తూ, ఒక కొత్త కథ తాలూకు స్క్రీన్‌ప్లేను రాయడం’’: మీడియా- వినోద రంగంలో ధైర్య, సాహసాలు, దృఢత్వం.. వీటిని ఓ ఉత్సవంగా జరుపుతున్న వేవ్స్ 2025


* క్రీడల్లో సమాన అవకాశాలు దక్కాలని వాదించిన ఫుట్‌బాల్ మాజీ క్రీడాకారిణి...ఈ జర్మన్ మహిళ ప్రపంచ చాంపియన్ కూడా

* అసమానతలను ఎదిరిస్తూ, నిష్పక్షపాత ప్రాతినిధ్యాన్ని ప్రోత్సహించడంలో
సామాజిక మాధ్యమాల శక్తిని ఎలుగెత్తి చాటిన బియాంకా బాల్టీ

* మహిళల అభిప్రాయాలను బలపరచడంలో, సినిమా రంగంలో మూస ధోరణులను తెగనాడడంలో
ప్రసార మాధ్యమాల పాత్రను ప్రధానంగా ప్రస్తావించిన రోనా-లీ శిమోన్

 Posted On: 01 MAY 2025 8:45PM |   Location: PIB Hyderabad

‘‘విచిత్ర పరిస్థితులకు ఎదురొడ్డి నిలుస్తూ, ఒక కొత్త కథ తాలూకు స్క్రీన్‌ప్లేను రాయడం’’ అంశంపై బృంద చర్చ కార్యక్రమాన్ని వేవ్స్ 2025 ప్రపంచ శిఖరాగ్ర సదస్సులో భాగంగా గురువారం నిర్వహించారు. దీనిలో ముగ్గురు ప్రేరణమూర్తులు వక్తలుగా పాలుపంచుకున్నారు. వారు... రోనా-లీ శిమోన్, బియాంకా బాల్టీ,  ఎరియన్ హింగ్‌స్ట్.  వీరిలో రోనా-లీ శిమోన్ ప్రముఖ ఇజ్రాయెల్ నటి. పోరాటం ప్రధాన ఇతివృత్తంగా సాగిన ఫౌదా వంటి నాటకాల్లో ఈమె శక్తిమంతమైన పాత్రలను పోషించి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. బియాంకా బాల్టీ ప్రపంచ ప్రఖ్యాత ఇటలీ మాడల్. ఈమె కేన్సర్ వ్యాధి బారిన పడి కోలుకున్నారు. ఎరియన్ హింగ్‌స్ట్. జర్మనీ ఫుట్‌బాల్ జట్టు మాజీ క్రీడాకారిణి, ప్రపంచ ఛాంపియన్. ఈ ముగ్గురు మహిళలూ తమ తమ రంగాల్లో రాణిస్తూనే, ఇటు వ్యక్తిగత జీవనంలోనూ, అటు వృత్తి జీవనంలోనూ తమకెదురైన సవాళ్లతో పోరాడి తమదే పైచేయని నిరూపించారు.    

సవాళ్లకు జడిసి వెనుకడుగు వేయడానికి బదులు, వాటిని ఎదగడానికి ఒక అవకాశంగా ఒడిసిపట్టుకుని మరీ జీవనంలో ఒక కొత్త బాటను వేసుకున్నారు ఈ వక్తలు. కఠిన అనుభవాలను బలంగా మార్చుకుని, తమ జీవన యాత్ర ఇతరులకు ప్రేరణను అందించేదిగా మలచిన మనుషులను ఒక చోటుకు చేర్చి పండుగ చేసుకోవడం వేవ్స్ 2025 ఉద్దేశాల్లో ఒకటి. ఇది ఎలాంటి వేదిక అంటే, ధైర్యం-సాహసం-మార్పు-నాయకత్వం, మరీ ముఖ్యంగా సమాజంలో బాధలను అధిగమించి లేదా కఠిన పరిస్థితులను మెట్లుగా చేసుకుని ఉన్నత స్థాయిలకు చేరుకొనే వారిని సన్మానించే వేదిక ఇది.

కార్యక్రమంలో ఎరియన్ హింగ్‌స్ట్ పురుషాధిక్య క్రీడ అయిన ఫుట్‌బాల్‌లో ఓ వృత్తినిపుణురాలైన క్రీడాకారిణిగా తన జీవన యాత్రతో ముడిపడిన అంశాలను వెల్లడించారు. ఆమె ఒక ప్రపంచ ఛాంపియన్‌గా పేరు తెచ్చుకోవడానికి ఆడ-మగ పక్షపాతాన్ని జయించిన విషయాన్ని గురించి మాట్లాడుతూ, క్రీడల్లో నిష్పక్షపాతాన్ని, సమానత్వాన్ని ప్రోత్సహించేందుకు ప్రస్తుతం తాను తన వాణిని ఎలా వినిపిస్తున్నదీ వివరించారు. పురుషులతో పోలిస్తే మహిళలు ఆడే ఫుట్‌బాల్‌కు ప్రసార మాధ్యమాల్లో కవరేజితోపాటు తగిన వేదికలు కొరవడుతున్నాయని ఆమె విచారం వ్యక్తం చేశారు. క్రీడాకారిణులకు అవకాశాలతోపాటు గుర్తింపు సైతం సమానంగా లభించాల్సిన అవసరం ఎంతయినా ఉందని ఆమె అన్నారు.
ప్రపంచ స్థాయి గుర్తింపును తెచ్చుకున్న మాడల్, క్యాన్సర్‌‌తో పోరాటం జరిపి కోలుకున్న బియాంకా బాల్టీ ధీరత్వాన్ని గురించి, వ్యాధి బారిన పడి నయమైన తరువాత మళ్లీ వృత్తిజీవనంలోకి అడుగుపెట్టడాన్ని గురించిన తన శక్తిమంతమైన గాథను తెలియజేశారు. మాడలింగ్ పరిశ్రమలో వేతనం రీత్యా ఆడవారికి, మగవారికి మధ్య తేడా ఉంటోందని, మహిళా మాడల్స్‌కు తరచు అదే వృత్తిలో ఉన్న పురుషుల కంటే తక్కువ వేతనాన్నే చెల్లిస్తున్నారన్నారు. ప్రసార మాధ్యమాల్లో పురుషులు ఇప్పటికీ  అధిక ప్రభావాన్ని కలిగి ఉన్నారు అని ఆమె చెప్పారు. మార్పును తీసుకు రావడంలోనే ప్రసార మాధ్యమాల సిసలైన శక్తి ఇమిడి ఉందని బియాంకా స్పష్టం చేశారు.  సామాజిక మాధ్యమాలు, ముఖ్యంగా మహిళల కోసం, తెరమరుగున ఉండిపోయిన వర్గాల వాణిని బిగ్గరగా వినిపించడంలో, అసమానతను ప్రశ్నించడంలో, న్యాయమైన ప్రాతినిధ్యం పక్షం వహించడంలో సహాయకారి కావచ్చు కదా అని ఆమె అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమం కొనసాగిన క్రమంలో, రోనా-లీ శిమోన్ తన వంతుగా కథకులకు తమ కథనాలను మార్చండని చెప్పే, ప్రజలను ఏకతాటి మీదకు చేర్చాలని సూచించే వేదికే వేవ్స్ అని తెలిపారు. చలనచిత్ర రంగంలో కొత్త అవకాశాలను సృష్టించడానికి ఏకతాటి మీదకు రావడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలని ఆమె స్పష్టం చేశారు.  మహిళలు ధైర్యంగా ఉంటూ ఒకరికి మరొకరు చేదోడువాదోడుగా నిలిచి, మార్పు కోసం ప్రయత్నించడంలో నిర్భయంగా దూసుకువెళ్లాలని వారిని రోనా-లీ ప్రోత్సహించారు. మహిళలకు వారి ఆలోచనలను, వారివైన ముద్ర కలిగిఉండే కథలను వెల్లడించడానికి అవసరమైన శక్తిని వారికి ఇవ్వడం ద్వారా ఈ ఉద్యమంలో సామాజిక మాధ్యమాలు ఒక కీలక భూమికను పోషిస్తున్నాయని కూడా ఆమె చెప్పారు. తెర మీద తన బలమైన, చైతన్యశీల పాత్రలకు పేరు తెచ్చుకున్న రోనా-లీ వినోద పరిశ్రమలో మూస ధోరణులను అదే పనిగా బద్దలుకొడుతున్నారు. బలం, మనం చేసే పనులు, అవగాహన.. వీటిని సదరు వ్యక్తి ఆడ మనిషా, లేక మగ మనిషా అనే అంశాన్ని లెక్కలోకి తీసుకుని నిర్వచించజాలమని ఆమె నిరూపించారు.  

కార్యక్రమంలో మాట్లాడిన ప్రతి ఒక్క వక్తీ కూడా వ్యక్తిగత, లేదా వృత్తిపర బాధలను ఎదుర్కొన్న వారూ, మరి వాటికి మారుపేరుగా మారిపోయేందుకు బదులుగా, వారు ఆ నిరాశాభరిత క్షణాలను తమవైన సొంత గాథలను తిరగరాయడానికి ఉపయోగించుకున్న వారే. సవాళ్లతో ‘సై’ అంటూ  తలపడి, ఆ సవాళ్లను మార్పునకు, స్ఫూర్తికి ఓ వేదికగా మారుస్తున్న మనుషులను ఆహ్వానించి వారిని సత్కరించడం... వేవ్స్ 2025 సరైన అర్థం ఇదే.

 

 

***


Release ID: (Release ID: 2126322)   |   Visitor Counter: 16