WAVES BANNER 2025
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

యానిమే పురోగమనం: అంతర్జాతీయ కథన వ్యూహాలు... పరిశ్రమ వృద్ధిపై వేవ్స్‌-2025 వేదికగా నిపుణుల విశదీకరణ

· ప్రపంచంలో మరెక్కడా సాధ్యంకాని ‘బోల్డ్ మోడల్స్‌’ రూపొందించగల ప్రత్యేక సామర్థ్యం భారత్‌కు ఉంది: జెరెమీ లిమ్, ‘జీఎఫ్‌ఆర్‌’ ఫండ్

· తెరవెనుక దార్శనికులు: ‘వేవ్స్‌-2025’ సినిమాటిక్‌ యూనివర్స్‌లో ‘వీఎఫ్‌ఎక్స్‌’ భవిష్యత్తుపై ‘ఫైర్‌సైడ్ చాట్’ అంచనాలు

· ‘వీఎఫ్‌ఎక్స్‌’ పరిశ్రమలో భారత్‌ అగ్రశక్తిగా ఎదుగుతుంది.. వేవ్స్‌ అందుకు ఎనలేని తోడ్పాటునిస్తుంది

 Posted On: 01 MAY 2025 9:39PM |   Location: PIB Hyderabad

వరల్డ్ ఆడియో విజువల్ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్-2025 (వేవ్స్‌) తొలి కార్యక్రమం  ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రారంభమైన నేపథ్యంలో మొదటి రోజున భారత్‌లోని శక్తిమంతమైన ‘ఏవీజీజీ’ రంగాన్ని లోతుగా పరిశీలించే అవగాహనతో కూడిన బ్రేక్అవుట్ సెషన్లను నిర్వహించారు.

ఇందులో భాగంగా “యానిమే అసెండింగ్‌: అన్‌లాకింగ్ గ్లోబల్ పొటెన్షియల్ ఇన్ స్టోరీటెల్లింగ్, ఫ్యాన్‌డమ్ అండ్‌ ఇండస్ట్రీ గ్రోత్” పేరిట నిర్వహించిన పరిణామశీల సంక్షిప్త చర్చాగోష్ఠి (బ్రేకవుట్‌ సెషన్‌)లో జపాన్‌, భారత్‌ యానిమేషన్‌ పరిశ్రమలోని పలువురు ప్రసిద్ధులు ఒకే వేదికపై చేరారు. ఈ సందర్భంగా భారత్‌లో సామర్థ్య వికాసంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ యానిమే పరిణామం, భావోద్వేగ ప్రాధాన్యం, ప్రపంచ పథంపై ఉన్నతస్థాయి చర్చలు సాగాయి.

ఈ చర్చాగోష్ఠికి ‘ఫిక్కీ ఏవీజీసీ-ఎక్స్‌ఆర్‌ ఫోరమ్‌’ చైర్‌పర్సన్‌ శ్రీ ముంజాల్‌ ష్రాఫ్‌ సంచాలకుడుగా వ్యవహించారు. ఈ విశిష్ట బృందంలో నోంటెట్రా డైరెక్టర్, సీఈవో శ్రీ మకోతా టెజ్కా;  జపాన్‌లోని ‘ది యానిమే టైమ్స్’ కంపెనీ చైర్మన్‌ శ్రీ హిడియో కట్సుమాటా; జపాన్‌లోని బ్లూ రైట్స్ సీఈవో శ్రీ మకోటో కిమురా; రీ ఎంటర్‌టైన్‌మెంట్ కో. లిమిటెడ్ సీఈవో అండ్‌ ప్రెసిడెంట్ శ్రీ అట్సువో నకయామా, జియోస్టార్‌లోని కిడ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్‌ ఇన్ఫోటైన్‌మెంట్ బిజినెస్ హెడ్ శ్రీమతి అనూ సిక్కా వంటి ప్రముఖులున్నారు.

భారతీయ భాషలు, ప్రేక్షకులపై ప్రపంచం మరింతగా దృష్టి సారిస్తుండటాన్ని శ్రీ హిడియో కట్సుమాటా ప్రస్తావించారు. సామాజిక భాగస్వామ్యం, సాంస్కృతిక ఏకీకరణ ప్రాధాన్యాన్ని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. “స్థానిక ప్రేక్షకులతో సంధానానికి వీలుగా జపనీస్ యానిమేషన్‌ను భారతీయ సంప్రదాయాలతో మేళవించే మార్గాలను మేం అన్వేషిస్తున్నాం” అని ఈ సందర్భంగా తెలిపారు.

జపాన్‌లో యానిమే ఆర్థిక ప్రభావంపై శ్రీ అట్సువో నకయామా లోతైన అవగాహన కల్పించడంతోపాటు వినియోగదారు పాత్రకుగల ప్రాధాన్యాన్ని స్పష్టం చేశారు. జపనీస్ యానిమేషన్‌కు భారత్‌ ఒక వర్ధమాన మార్కెట్‌గా ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అదే సమయంలో రెండు దేశాల మధ్య సాంస్కృతిక, వాణిజ్య సంబంధాల పెంపులో వినోద వ్యాపారానికిగల సామర్థ్యాన్ని వివరించారు.

యానిమే మూలాల గురించి శ్రీ మకోటో టెజ్కా వివరణాత్మక ప్రదర్శన ఇచ్చారు. ఈ సందర్భంగా జపనీస్ యానిమేషన్ మూలాలు మాంగా సంస్కృతిలో లోతుగా పాతుకుపోయి ఉన్నాయని స్పష్టం చేశారు.

శ్రీమతి అనూ సిక్కా మాట్లాడుతూ- యువ వీక్షకుల నాడిని చక్కగా పసిగట్టడానికి భారత్‌లో చేపట్టిన విస్తృత పరిశోధనను ప్రముఖంగా ప్రస్తావించారు. “జపనీస్ సారాంశంతో సాంస్కృతిక ఔచిత్యం-భావోద్వేగ సంబంధం భారతీయ బాలల్లో యానిమేపై పెరుగుతున్న ఆదరణకు దోహదం చేశాయి” అని ఆమె వివరించారు. అలాగే వీక్షక ధోరణులపై నిర్వహించిన ప్రవర్తనా విశ్లేషణ ప్రోగ్రామింగ్ నిర్ణయాలను గణనీయంగా ప్రభావితం చేసిందన్నారు.

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో యానిమే కళకు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని, అది చూపుతున్న ప్రభావాన్ని శ్రీ మకోటో కిమురా స్పష్టంగా వివరించారు.

మరోవైపు “ది న్యూ ఆర్కేడ్: వీసీస్‌ పెర్స్పెక్టివ్ ఆన్ గేమింగ్స్ న్యూ ఫ్రాంటియర్” పేరిట నిర్వహించిన అవగాహనాత్మక సంక్షిప్త చర్చాగోష్ఠికి యోలోగ్రామ్‌ స్టైల్‌ సీఈవో ఆదిత్య మణి సంధానకర్తగా వ్యవహరించారు. భారత గేమింగ్ రంగంలో ఉత్తేజకర ఆవిష్కరణలు, అవకాశాలపై బృంద సభ్యులు లోతుగా చర్చించారు. ఈ మేరకు విశిష్ట వెంచర్ క్యాపిటలిస్టు (వీసీ)లతో కూడిన ఈ బృందం గేమింగ్ పరిశ్రమలోని కీలక ధోరణులు, సవాళ్లు, అవకాశాలపై కూలంకంషంగా విశ్లేషించింది. ఇందులో బిట్‌క్రాఫ్ట్ వెంచర్‌ భాగస్వామి అనుజ్ టాండన్, జెటాపుల్ట్ వ్యవస్థాపకుడు శరణ్ తులసియాని, ఇన్‌ఫ్లెక్షన్ పాయింట్ వెంచర్స్ వ్యవస్థాపకుడు-సీఈవో వినయ్ బన్సల్, క్రాఫ్టన్ ఇండియా కార్పొరేట్ డెవలప్‌మెంట్ లీడ్ నిహాన్ష్ భట్, జీఎఫ్‌ఆర్ ఫండ్‌లో ప్రిన్సిపల్ జెరెమీ లిమ్ సభ్యులుగా ఉన్నారు.

కథకుల దేశంగా ప్రపంచంలో భారత్‌కుగల ప్రత్యేక స్థానాన్ని ఈ బృందం నిర్ద్వంద్వంగా స్పష్టం చేసింది. ఘనమైన భారత సాంస్కృతిక కథన సంప్రదాయం ఇంటరాక్టివ్ మీడియాలోకి అధికంగా ప్రవహిస్తోంది. గేమింగ్, సినిమాలు, డిజిటల్ ఫ్యాషన్‌తో మాత్రమేగాక ప్రధాన స్రవంతి మీడియాతోనూ మమేకం అవుతన్నదని వారు విస్పష్టంగా వివరించారు. భారతీయ గేమింగ్ స్టూడియోలు ఇందులో గణనీయ పాత్రధారులుగా రూపొందుతున్నాయని గుర్తుచేశారు.

ప్రపంచంలో మరెక్కడా సాధ్యంకాని ‘బోల్డ్ మోడల్స్‌’ రూపొందించగల ప్రత్యేక సామర్థ్యం భారత్‌కు ఉందని జెరెమీ లిమ్ ప్రముఖంగా ప్రస్తావించారు. వర్ధమాన మార్కెట్లలో విజయం దిశగా స్ధానికీకరణ పాత్రపై ఈ చర్చాగోష్ఠి ప్రధానంగా దృష్టి సారించింది. అంతేకాకుండా అంతర్జాతీయ నమూనాలు దీనికొక ప్రేరణ కాగలవంటూ, స్థానిక ఆలోచన ధోరణులు, వినియోగదారుల వ్యవహారశైలికి అనుగుణంగా గేమింగ్ అనుభవాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.
ఇక 2025కు సంబంధించి కృత్రిమ మేధ (ఏఐ) ప్రభావం పెరుగుతుండటాన్ని ప్రస్తావించింది. ‘గేమ్‌ప్లే’ వ్యక్తిగతీకరణ, వినియోగదారు పరస్పర ప్రతిస్పందన మెరుగుదలలో సంలీన కథాగమనంలో ఏఐ కీలక పాత్ర పోషించనుంది.
ఆధునిక చలనచిత్ర రంగంలో ‘వీఎఫ్‌ఎక్స్‌’ కీలక పాత్రను, కథా వివరణ ప్రక్రియ భవిష్యత్తును నిర్దేశించగల అవకాశాల అన్వేషణకు ‘వీఎఫ్‌ఎక్స్‌’పై నిర్వహించిన చర్చాగోష్ఠి ప్రయత్నించింది. ఫ్రేమ్‌స్టోర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ అఖౌరి పి.సిన్హా ఈ గోష్ఠికి సంధానకర్తగా వ్యవహరించారు. ఈ బృందంలో ‘డీఎన్ఈజీ’ వీఎఫ్‌ఎక్స్‌ సూపర్‌వైజర్‌ శ్రీ జయకర్ ఆరుద్ర, ఇండిపెండెంఎట్‌  విఎఫ్‌ఎక్స్‌ సూపర్‌వైజర్‌ శ్రీ సందీప్ కమల్, బాహుబలితోపాటు 2.0కు పనిచేసి ప్రశంలందుకున్న శ్రీ శ్రీనివాస్ మోహన్ వంటి ప్రసిద్ధులు సభ్యులుగా ఉన్నారు.  సినిమా కథనాలను వీఎఫ్‌ఎక్స్‌ ఎలా విప్లవాత్మకం చేయగలదో వారు విశదీకరించారు.
ఈ మేరకు వీఎఫ్‌ఎక్స్‌-ప్రాధాన్య చిత్ర నిర్మాణంలో సృజనాత్మక డిమాండ్లను నెరవేర్చే దిశగా పరిశోధన-రూపకల్పన ప్రాధాన్యాన్ని శ్రీ జయకర్ ఆరుద్ర వివరించారు. “ఇది కేవలం దృశ్యాలకు పరిమితం కాదు... ఇది కథా సమగ్రతకు సంబంధించినది” అని ఆయన వ్యాఖ్యానించారు. “వీఎఫ్‌ఎక్స్‌ పరిశ్రమలో అగ్రశక్తిగా రూపొందడానికి భారత్‌ సిద్ధంగా ఉంది. ‘వేవ్స్‌’ వంటి గొప్ప కార్యక్రమం ఈ దిశగా మన దేశం ముందడుగు వేయడంలో ఎనలేని తోడ్పానిస్తుంది” అన్నారు.
శ్రీ శ్రీనివాస్‌ మోహన్‌ మాట్లాడుతూ- “సాంకేతికత ఒక మేలిమలుపు... వివేచనాత్మకంగా అన్వయిస్తే అన్ని పరిమితులనూ బద్దలు కొట్టడానికి, ప్రపంచ స్థాయి దృశ్యీకరణ సృష్టికి అది దోహదం చేస్తుంది”  అని వివరించారు.

అధిక నాణ్యతగల వీఎఫ్‌ఎక్స్‌ ఉపకరణాల అందుబాటు, లభ్యత పెరుగుతుండటం వల్ల  నైపుణ్యావిష్కరణకు ఇకపై అవి అవరోధాలు కాబోవని శ్రీ సందీప్‌ కమల్ చర్చగోష్ఠిలో స్పష్టం చేశారు. “నాణ్యత, గడువు రెండు పరిమితులనూ అధిగమించడంలో విస్పష్ట దృక్కోణం మనను ముందుకు నడిపిస్తుంది” అని ఆయన వ్యాఖ్యానించారు.
యానిమే, వీఎఫ్‌ఎక్స్‌, గేమింగ్ వంటివి ప్రపంచవ్యాప్తంగా శక్తిమంతమైన సాంస్కృతిక-వాణిజ్య శక్తులుగా రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలో ఈ సంక్షిప్త చర్చాగోష్ఠులు నిర్దిష్ట అంశాలపై దృష్టి సారిస్తూ ఆశావాదం, లోతైన సహకారాత్మక భావనలకు ప్రతీకగా నిలిచాయి. ఈ రంగాల్లో భారత్‌ అసాధారణ సామర్థ్యం ప్రదర్శించగలదు. ‘వేవ్స్‌’ వాస్తవిక స్ఫూర్తికి అనుగుణంగా ఆవిష్కరణ, కథా వివరణ వైభవాన్ని సంక్షిప్త చర్చాగోష్ఠులు ప్రస్ఫుటం చేశాయి.

 

***


Release ID: (Release ID: 2126321)   |   Visitor Counter: 13