ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కేరళలో రూ. 8,800 కోట్లతో నిర్మించిన విజింజామ్ అంతర్జాతీయ ఓడరేవును జాతికి అంకితం చేసిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ


కేరళలోని విజింజామ్ అంతర్జాతీయ డీప్ వాటర్ మల్టీపర్పస్ సీ పోర్ట్ భారత సముద్ర మౌలిక సదుపాయాల రంగంలో విశేషమైన పురోగతి: ప్రధాని

నేడు భగవాన్ ఆది శంకరాచార్య జయంతి.. ఆయన కేరళ నుంచి వచ్చి దేశంలోని వివిధ ప్రాంతాల్లో మఠాలను స్థాపించి దేశాన్ని జాగరూకం చేశారు.. ఈ శుభసందర్భంగా ఆయనకు నివాళి: ప్రధాని

వికసిత భారత్ దిశగా భారత తీర రాష్ట్రాలు, మన రేవు నగరాలు కీలక అభివృద్ధి కేంద్రాలవుతాయి: ప్రధాని

సాగరమాల ప్రాజెక్టు కింద రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కేంద్రం పోర్టు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసి వాటి మధ్య అనుసంధానాన్ని పెంచింది: ప్రధాని

ప్రధానమంత్రి గతిశక్తి కింద జల మార్గాలు, రైల్వేలు, హైవేలు, వాయు మార్గాల అంతర్గత అనుసంధానం వేగంగా మెరుగుపడుతోంది: ప్రధాని

గత పదేళ్లలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం కింద పెట్టుబడులు మన ఓడరేవులను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నతీకరించడమే కాక, భవిష్యత్ సన్నద్ధంగా తీర్చిదిద్దాయి: ప్రధాని

పోప్ ఫ్రాన్సిస్ సేవా దృక్పథాన్ని ప్రపంచం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది: ప్రధాని

Posted On: 02 MAY 2025 1:16PM by PIB Hyderabad

కేరళలోని తిరువనంతపురంలో రూ.8,800 కోట్ల విలువైన విజింజామ్ అంతర్జాతీయ డీప్ వాటర్ మల్టీపర్పస్ ఓడరేవును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు జాతికి అంకితం చేశారు. భగవాన్ ఆదిశంకరాచార్య జయంతి శుభ సందర్భంగా సభనుద్దేశించి మాట్లాడుతూ, మూడేళ్ల కిందట సెప్టెంబరులో ఆదిశంకరాచార్యుల పవిత్ర జన్మస్థలాన్ని సందర్శించే భాగ్యం తనకు లభించిందని గుర్తు చేసుకున్నారు. తన పార్లమెంటరీ నియోజకవర్గమైన కాశీలోని విశ్వనాథ్ ధామ్ కాంప్లెక్సులో ఆదిశంకరాచార్యుల భారీ విగ్రహం ఏర్పాటు పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆది శంకరాచార్యుల అపారమైన ఆధ్యాత్మిక జ్ఞానానికీ బోధనలకూ గౌరవంగా ఈ విగ్రహ స్థాపనను ఆయన అభివర్ణించారు. ఉత్తరాఖండ్‌లోని పవిత్ర కేదారనాథ్ ధామ్‌లో ఆది శంకరాచార్యుల దివ్య విగ్రహాన్ని ఆవిష్కరించే అదృష్టం కూడా తనకు దక్కిందన్నారు. ఈరోజుకు మరో ప్రత్యేకత ఉందని, కేదారనాథ్ ఆలయ ద్వారాలు భక్తుల కోసం తెరచుకునే విశేష దినమని తెలిపారు. కేరళకు చెందిన ఆదిశంకరాచార్యులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో మఠాలను స్థాపించి దేశాన్ని జాగరూకం చేశారని ప్రధానమంత్రి మోదీ గుర్తు చేశారు. ఆయన కృషి వల్ల ఏకీకృతమైన, ఆధ్యాత్మిక చేతన గల భారత్‌కు పునాదులు పడ్డాయని ఆయన స్పష్టం చేశారు.

ఓవైపు అపారమైన అవకాశాలను అందించే విస్తారమైన సముద్రం, మరోవైపు అబ్బురపరిచే ప్రకృతి సౌందర్యం ఈ వైభవాన్ని మరింత పెంచుతున్నాయని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. వీటన్నింటి నడుమా ఇప్పుడు విజింజామ్ డీప్ వాటర్ సీ పోర్ట్ నవయుగ అభివృద్ధికి సంకేతంగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఈ ఘనత సాధించినందుకు కేరళ ప్రజలతోపాటు యావద్దేశానికి ఆయన అభినందనలు తెలిపారు.

విజింజామ్ డీప్ వాటర్ సీ పోర్టును రూ. 8,800 కోట్లతో అభివృద్ధి చేశామని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ట్రాన్స్‌షిప్‌మెంట్ కేంద్రంగా ఉన్న ఓడరేవు సామర్థ్యం మున్ముందు మూడు రెట్లు పెరుగుతుందని, తద్వారా ప్రపంచంలోని కొన్ని అతిపెద్ద సరుకు రవాణా నౌకలు సజావుగా రావడానికి వీలు కలుగుతుందని తెలిపారు. గతంలో దేశ ట్రాన్స్‌షిప్మెంట్ కార్యకలాపాల్లో 75% విదేశీ ఓడరేవుల్లోనే జరిగేవని, దాంతో దేశం గణనీయంగా ఆదాయాన్ని కోల్పోయిందని ఆయన చెప్పారు. ఈ పరిస్థితి మారుబోతోందన్నారు. భారతదేశ ధనం ఇప్పుడు దేశానికే ఉపయోగపడుతుందని, ఒకప్పుడు దేశం నుంచి తరలిపోయిన నిధులు ఇకపై కేరళ, విజింజామ్ ప్రజలకు కొత్త ఆర్థిక అవకాశాలను అందిస్తాయని ఆయన స్పష్టం చేశారు.  

 

  వలస పాలన కంటే ముందు, భారత్‌లో శతాబ్దాల పాటు సమృద్ధి విలసిల్లిందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఒక దశలో  ప్రపంచ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో భారత్ ప్రధాన వాటాను కలిగి ఉందని ఆయన చెప్పారు. ఆ కాలంలో భారత్ నౌకావాణిజ్య సత్తా, భారత్ ఓడరేవు నగరాల్లో ఆర్థిక కార్యకలాపాలు దేశాన్ని ఇతర దేశాలకు భిన్నంగా నిలిపాయని ప్రధాని స్పష్టం చేశారు. ఈ నౌకావాణిజ్య శక్తిలోనూ, ఆర్థిక వృద్ధిలోనూ కేరళ ఒక ముఖ్య పాత్రను పోషించిందని ఆయన చెబుతూ, నౌకావాణిజ్యంలో కేరళది చరిత్రాత్మక భూమిక అన్నారు. అరేబియా సముద్రం గుండా అనేక దేశాలతో భారత్ వాణిజ్య సంబంధాలు కొనసాగించిందని ఆయన తెలిపారు. కేరళ నుంచి నౌకలు వివిధ దేశాలకు సరుకును రవాణా చేసేవి, దీంతో ఈ రాష్ట్రం ప్రపంచ వాణిజ్యంలో ఒక కీలక కూడలిగా ఎదిగింది అని ఆయన అన్నారు.

‘‘ప్రస్తుతం, కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శక్తి తాలూకు ఈ మార్గాన్ని మరింత తీర్చిదిద్దచడానికి కట్టుబడి ఉంది’’ అని ఆయన అన్నారు. మన దేశ సముద్ర తీర రాష్ట్రాలు, ఓడరేవు నగరాలు ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారత్‌) లక్ష్య సాధనకు కీలక కేంద్రాలుగా మారతాయని ఆయన స్పష్టం చేశారు.  

‘‘మౌలిక సదుపాయాలు, వ్యాపార నిర్వహణలో సౌలభ్యం... ఈ రెండిటిని కలిసికట్టుగా ప్రోత్సహించినప్పడు ఓడరేవులు ప్రధాన పాత్రను పోషించే ఆర్థిక వ్యవస్థ తన పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకొనే స్థితికి చేరుకుంటుంది’’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. గత పది సంవత్సరాలకు పైగా  భారత ప్రభుత్వం అనుసరిస్తున్న ఓడరేవులు-జలమార్గాల సంబంధిత విధానానికి ఇదే అంశం నమూనాగా నిలిచింది అని ఆయన చెప్పారు.

పారిశ్రామిక కార్యకలాపాలు, రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి దిశగా ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోందని ప్రధాని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ‘సాగర్‌మాల ప్రాజెక్టు’లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఓడరేవులకు సంబంధించిన మౌలిక సదుపాయాల స్థాయిని పెంచిందని, ఓడరేవులతో ముడిపడిన సంధాన సదుపాయాలను బలోపేతం చేసిందని ఆయన వివరించారు.  ‘పీఎం గతిశక్తి’లో భాగంగా నిరంతరాయ సంధానాన్ని సమకూర్చే ఉద్దేశంతో జలమార్గాలు, రైలుమార్గాలు, హైవేలు, వాయుమార్గాలను శరవేగంగా ఏకీకృతం చేస్తున్నామని ఆయన అన్నారు. వ్యాపార నిర్వహణలో సౌలభ్యాన్ని సమకూర్చడానికి చేసిన ఈ సంస్కరణలతో ఓడరేవులు, మౌలికసదుపాయాల రంగాల్లోకి పెట్టుబడులు మరింత పెరిగాయని ప్రధాని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం భారతీయ నావికులకు సంబంధించిన నియమనిబంధనలను కూడా సవరించిందని, దీంతో గొప్ప ఫలితాలు లభించాయని ప్రధానమంత్రి తెలిపారు. 2014లో భారతీయ నావికుల సంఖ్య 1.25 లక్షల కంటే తక్కువే, ఇవాళ ఈ సంఖ్య 3.25 లక్షలకు మించింది అని ఆయన చెప్పారు. నావికుల సంఖ్య పరంగా చూస్తే ప్రస్తుతం ప్రపంచంలోని అగ్రగామి మూడు దేశాల సరసన భారత్ చేరిందని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

ఒక దశాబ్ద కాలం కిందట, ఓడరేవులలో నౌకలు చాలా కాలం పాటు వేచి ఉండాల్సివచ్చి ఇబ్బందులు ఎదుర్కొన్నాయని, ముఖ్యంగా సరకును దింపడానికి ఎక్కువ సమయం పట్టేదని శ్రీ మోదీ అన్నారు. ఈ జాప్యంతో వాణిజ్య సంస్థలపైన, పరిశ్రమలపైన, మొత్తంమీద ఆర్థికవ్యవస్థ పైన ప్రభావం పడేది అని ఆయన తెలిపారు. ప్రస్తుతం స్థితిలో మార్పు వచ్చిందని, గత పది సంవత్సరాల్లో భారత్‌లోని ప్రధాన ఓడరేవుల్లో టర్నరౌండ్ సమయం 30 శాతం తగ్గిందని, దీంతో కార్యనిర్వహణ సామర్థ్యం మెరుగైందన్నారు. ఓడరేవుల సామర్థ్యం పెరిగినందువల్ల భారత్ ప్రస్తుతం తక్కువ సమయంలో ఎక్కువ సరకును హ్యాండిల్ చేయగలుగుతోందని, ఇది దేశ ఆధునిక వస్తు రవాణా వ్యవస్థ (లాజిస్టిక్స్‌) సామర్ధ్యంతో పాటు వాణిజ్య సామర్ధ్యాన్ని కూడా బలోపేతం చేస్తోందని ఆయన వివరించారు.  

‘‘దశాబ్దాల తరబడి కనబరుస్తూవచ్చిన దూరదర్శిత్వం, ప్రయత్నాల ఫలితమే నౌకావాణిజ్య రంగంలో భారత్‌కు దక్కిన విజయం’’ అని ప్రధాని స్పష్టంచేశారు. గత పది సంవత్సరాల్లో భారత్ ఓడరేవుల సామర్థ్యాన్ని రెట్టింపు చేసిందని, జాతీయ జలమార్గాలను ఎనిమిదింతలు విస్తరించిందని ఆయన చెప్పారు.  

ప్రస్తుతం మన దేశంలోని రెండు ఓడరేవులు ప్రపంచ స్థాయిలో అగ్రగామి 30 ఓడరేవుల్లో స్థానం సంపాదించాయని ప్రధానమంత్రి తెలిపారు.  లాజిస్టిక్స్ పనితీరు సూచీలో ఇండియా స్థానం కూడా మెరుగుపడిందని ఆయన అన్నారు. దీనికి తోడు, భారత్ ఇప్పుడు ప్రపంచంలో నౌకానిర్మాణంలో అగ్రగామి 20 దేశాల సరసన నిలిచిందని గుర్తుచేశారు. దేశంలో మౌలిక సదుపాయాల వ్యవస్థను పటిష్ఠపరచిన తరువాత, ఇక ప్రపంచ వాణిజ్యంలో భారత్ వ్యూహాత్మక స్థితిపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని ప్రధాని అన్నారు. నౌకావాణిజ్యంలో అమృత్ కాల దార్శనికతను అవలంబించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇది ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారత్) లక్ష్యాన్ని సాధించడానికి అనుసరించాల్సిన నౌకావాణిజ్య వ్యూహ రూపురేఖలను వివరిస్తుంది.  ఈ సందర్భంగా ప్రధాని జి-20 శిఖరాగ్ర సదస్సును గుర్తు చేసుకున్నారు. ‘భారత, మధ్య ప్రాచ్య, ఐరోపా ఆర్థిక నడవా’ను (ఇండియా- మిడిల్ ఈస్ట్-ఎకనామిక్ కారిడార్‌) ఏర్పాటు చేయడానికి జి-20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా అనేక ప్రధాన దేశాలతో భారత్ కలసి పనిచేసింది. ఈ కారిడార్‌లో కేరళ పోషించిన పాత్ర కీలకమైందని ప్రధాని అన్నారు. ఈ కార్యక్రమం కేరళ రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తుందని స్పష్టం చేశారు.    

 

 భారత సముద్ర రంగ పరిశ్రమను కొత్త శిఖరాలకు చేర్చడంలో ప్రైవేటు రంగం పోషిస్తోన్న కీలక పాత్రను ప్రధానంగా ప్రస్తావించిన మోదీ ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యం కింద గత పదేళ్లలో వేలాది కోట్ల పెట్టుబడులు వచ్చాయని అన్నారు. ఈ భాగస్వామ్య కారణంగా భారత ఓడరేవులను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దటంతో పాటు భవిష్యత్తుకు సిద్ధంగా తయారయ్యాయని అన్నారు. ప్రైవేటు రంగ భాగస్వామ్యం ఆవిష్కరణలు, సామర్థ్యాన్ని పెంచిందని పేర్కొన్నారు.

కొచ్చిలో నౌకానిర్మాణం, మరమ్మతు క్లస్టర్ ఏర్పాటు దిశగా భారత్ ముందడుగు వేస్తోందని మోదీ తెలిపారు. ఈ క్లస్టర్ నిర్మాణం పూర్తైతే అనేక నూతన ఉపాధి అవకాశాలు లభిస్తాయని.. కేరళలోని స్థానికులు, యువత వృద్ధి చెందేందుకు ఒక వేదిక లభిస్తుందని పేర్కొన్నారు. నౌకా నిర్మాణ సామర్థ్యాలను పెంచుకునేందుకు దేశం ఇప్పుడు ప్రతిష్టాత్మక లక్ష్యాలను నిర్దేశించుకుంటోందని అన్నారు. భారత్‌లోనే పెద్ద నౌకల నిర్మాణం జరిగేలా ప్రోత్సహించేందుకు ఈ సంవత్సరం కేంద్ర బడ్జెట్ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టిందని.. ఇది తయారీ రంగానికి భారీ వృద్ధిని అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమం ఎంఎస్ఎమ్ఈలకు ప్రత్యక్ష ప్రయోజనాలను కలిగిస్తుందని.. దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఉపాధి, వ్యవస్థాపక అవకాశాలను సృష్టిస్తుందని ప్రధానంగా పేర్కొన్నారు.

"మౌలిక సదుపాయాల నిర్మాణం జరిగినప్పుడు, వాణిజ్యం విస్తరించినప్పుడు, సామాన్య ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చినప్పుడు నిజమైన అభివృద్ధి జరుగుతుంది" అని ప్రధాని వ్యాఖ్యానించారు. గత 10 సంవత్సరాల్లో కేరళ నౌకాశ్రయ మౌలిక సదుపాయాలలో మాత్రమే కాకుండా రహదారులు, రైల్వేలు, విమానాశ్రయాలలో కూడా వేగవంతమైన పురోగతిని చూసిందని పేర్కొన్నారు. ఏళ్ల తరబడి నిలిచిపోయిన కొల్లం బైపాస్, అలప్పుజ బైపాస్ వంటి ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం చేపడుతోందన్నారు. కేరళకు ఆధునిక వందే భారత్ రైళ్లను అందించామని.. రవాణా మార్గాలు, అనుసంధానాన్ని మరింత బలోపేతం చేశామని వివరించారు.

కేరళ అభివృద్ధి దేశ సమగ్ర వృద్ధికి దోహదం చేస్తుందనే సూత్రాన్ని భారత ప్రభుత్వం గట్టిగా విశ్వసిస్తోందని ప్రధాన మంత్రి అన్నారు. సహకార సమాఖ్య స్ఫూర్తితో ప్రభుత్వం పనిచేస్తోందని.. గత దశాబ్దకాలంగా కీలకమైన సామాజిక అంశాల్లో కేరళ పురోగతిని సాధించేలా చూసుకుందని వ్యాఖ్యానించారు. జల్ జీవన్ మిషన్, ఉజ్వల యోజన, ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి సూర్యగర్‌ ఉచిత విద్యుత్ పథకంతో సహా రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం చేకూర్చిన అనేక కార్యక్రమాలను ఆయన పేర్కొన్నారు.

మత్య్సకారుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని తెలిపిన ప్రధాని.. నీలి విప్లవం, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద కేరళకు వందల కోట్ల విలువైన ప్రాజెక్టులు మంజూరయ్యాయని గుర్తు చేశారు. పొన్నాని, పుతియప్పతో సహా ఫిషింగ్ హార్బర్ల ఆధునికీకరణను ఆయన ప్రస్తావించారు. కేరళలోని వేలాది మంది మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డులు ఇచ్చామని, తద్వారా వారికి వందల కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందుతోందన్నారు.

కేరళ ఎల్లప్పుడూ సామరస్యం, సహనానికి పుట్టినిల్లు అని ప్రధానంగా పేర్కొన్న మోదీ.. శతాబ్దాల క్రితం, ప్రపంచంలోని పురాతన చర్చిలలో ఒకటైన సెయింట్ థామస్ చర్చిని ఇక్కడ స్థాపించారని గుర్తు చేశారు. కొద్ది రోజుల క్రితం పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూయడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను కలచివేసిందని అన్నారు. ఆయన అంతిమయాత్రలో భారత్‌ తరఫున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరై నివాళులు అర్పించారని తెలిపారు. పవిత్ర ప్రాంతమైన కేరళలో ఈ దుర్ఘటనకు సంబంధించి శోకసంద్రంలో ఉన్న వారందరి గురించి మాట్లాడిన ఆయన ఈ విషయంలో సంతాపం తెలియజేస్తున్నట్లు తెలిపారు.

పోప్ ఫ్రాన్సిస్‌ సేవా స్ఫూర్తితో ఉండేవారని, క్రైస్తవ సంప్రదాయాల్లో సమ్మిళితత్వం తీసుకురావటానికి ఎంతో కృషి చేశారని వ్యాఖ్యానించిన మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. ఆయన సేవలను ప్రపంచం ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుందని అన్నారు. పోప్ ఫ్రాన్సిస్‌ను కలిసే అవకాశం లభించినందుకు కృతజ్ఞతగా ఉన్నట్లు తెలిపిన ఆయన.. తన వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు. ఆయన నుంచి తనకు ప్రత్యేక ఆప్యాయత లభించిందని.. మానవత్వం, సేవ, శాంతి విషయంలో వారిద్దరి మధ్య జరిగిన సంభాషణలు తనకు స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి హాజరైన వారందరికీ శుభాకాంక్షలు తెలిపిన మోదీ.. ప్రపంచ సముద్ర రంగ వాణిజ్యానికి ప్రధాన కేంద్రంగా కేరళ మారాలని, ఇది వేలాది కొత్త ఉద్యోగాల సృష్టికి దారితీస్తుందని పేర్కొన్నారు. ఈ లక్ష్యం సాధించే దిశలో ముందుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోన్న కేంద్ర ప్రభుత్వ నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారు. కేరళ ప్రజల సామర్థ్యాలపై విశ్వాసం వ్యక్తం చేసిన ఆయన.. "భారత సముద్ర రంగం కొత్త శిఖరాలకు చేరుకుంటుంది" అని వ్యాఖ్యానించారు.

ఈ కార్యక్రమానికి కేరళ గవర్నర్ శ్రీ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్, కేరళ ముఖ్యమంత్రి శ్రీ పినరయి విజయన్, కేంద్రమంత్రులు శ్రీ సురేష్ ప్రభు, శ్రీ జార్జ్ కురియన్ తదితరులు హాజరయ్యారు.


నేపథ్యం


రూ. 8,800 కోట్ల విలువైన  విజింజామ్  ఇంటర్నేషనల్ డీప్వాటర్ మల్టీపర్పస్ నౌకాశ్రయం దేశంలోనే మొట్టమొదటి కంటైనర్ రవాణాకు ప్రత్యేకించిన నౌకాశ్రయం. వికసిత్‌ భారత్ దార్శనికతలో భాగంగా భారత సముద్ర రంగంలో జరుగుతోన్న పరివర్తనాత్మక పురోగతిని ఇది తెలియజేస్తోంది.

వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన  విజింజామ్   నౌకాశ్రయాన్ని ఒక కీలక ప్రాధాన్య ప్రాజెక్టుగా గుర్తించారు. ఇది ప్రపంచ వాణిజ్యంలో భారత్‌ స్థానాన్ని బలోపేతం చేయటానికి, రవాణా సామర్థ్యాన్ని పెంచడానికి, కార్గో ట్రాన్స్‌షిప్మెంట్ విషయంలో విదేశీ ఓడరేవులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి దోహదం చేస్తుంది. దీని లోతు దాదాపు 20 మీటర్ల లోతు. ఇది ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే సముద్ర వాణిజ్య మార్గాల్లో ఒకదానికి సమీపంలో ఉంది. ఇది ప్రపంచ వాణిజ్యంలో భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుంది.

 

 

***

MJPS/SR


(Release ID: 2126317) Visitor Counter : 20