సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
వేవ్స్-2025లో ‘ఈశాన్య భారతంలో సినిమాకు సవాళ్లు, అవకాశాలు’ అంశంపై చర్చలో పాల్గొన్న అస్సామీ సినీ దర్శకులు, నటులు
ఈశాన్య ప్రాంతం ప్రతిభకు నిలయం: జాహ్ను బారువా
సినిమాను మరింత మెరుగ్గా మార్కెట్ చేసుకోవడం కోసం అస్సాంకు ఓటీటీ వేదికలు అవసరం: జతిన్ బోరా
మన భాషలకు శతాబ్దాల మౌఖిక చరిత్ర ఉంది: ఐమీ బారువా
Posted On:
01 MAY 2025 8:36PM
|
Location:
PIB Hyderabad
ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్‌లో జరుగుతున్న ప్రపంచ దృశ్య, శ్రవణ వినోద సదస్సు (వేవ్స్)- 2025లో భాగంగా ‘ఈశాన్య భారతంలో సినిమాకు సవాళ్లు, అవకాశాలు’ అనే అంశంపై నిపుణుల బృందంతో చర్చను నిర్వహించారు. ఈశాన్య భారత సినీ రంగంలో ఇదొక కీలక ఘట్టంగా నిలవనుంది. ఆ ప్రాంతంలో సినీ రంగానికి చెందిన ప్రముఖులు ఒక్కచోటికొచ్చి, స్థానిక సినీ రంగాన్ని మరింత ప్రభావవంతంగా తీర్చిదిద్దగల మార్గాలపై ఈ సదస్సులో చర్చించారు.
జహ్ను బారువా, జతిన్ బోరా, రవి శర్మ, ఐమీ బారువా, హౌబం పబన్ కుమార్, డొమినిక్ సంగ్మా వంటి ప్రఖ్యాత సినీ దర్శకులు, నటులు ఈ బృందంలో ఉన్నారు. వీరంతా ఈశాన్య రాష్ట్రాల్లో సినీ రంగాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు.
చిత్ర నిర్మాణ మౌలిక సదుపాయాలు తగినంతగా లేకపోవడం, భాషాపరమైన అవరోధాలు, పరిమితమైన మార్కెట్ అవకాశాలు, సంస్థాగత మద్దతు లేకపోవడం సహా ఈ ప్రాంతంలో దర్శక నిర్మాతలు ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను ఈ సందర్భంగా చర్చించారు. ఇన్ని అవరోధాలున్నప్పటికీ, సినీ ఆవిష్కరణలకూ సాంస్కృతిక కథనానికీ ఈశాన్య ప్రాంతంలో విస్తృతమైన అవకాశాలున్నాయని చర్చలో పాల్గొన్న నిపుణులు ఏకగ్రీవంగా అంగీకరించారు.
ఈశాన్య ప్రాంతం ప్రతిభకు నిలయమని, ఈ ప్రాంత దర్శకులు అద్భుతమైన సినిమాలు రూపొందిస్తున్నారని ప్రముఖ దర్శకుడు జాహ్ను బారువా వ్యాఖ్యానించారు. సామాజిక- సాంస్కృతిక విశేషాలు ఈ ప్రాంతంలో సమృద్ధిగా ఉన్నాయన్నారు. లెక్కలేనన్ని కథలు ఇక్కడ మరుగున పడి ఉన్నాయన్నారు. ఈశాన్య ప్రాంత సినీరంగానికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని, ఎంతోమంది యువ ప్రతిభావంతులు పుట్టుకొస్తున్నారని ఆయన చెప్పారు.
ఈశాన్య ప్రాంత సినిమాలు అక్కడికే పరిమితమవుతున్నాయని, ఆ భౌగోళిక హద్దులను దాటి వెళ్లలేకపోతున్నాయని అస్సాంకు చెందిన ప్రముఖ నటుడు జతిన్ బోరా ప్రస్తావించారు. డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ ఆవశ్యకతపై ఆయన మాట్లాడుతూ, సినిమాలను బాగా మార్కెట్ చేసుకోవడానికి అస్సాంకు ఓటీటీ వేదికలు అవసరమన్నారు. ప్రాంతీయ సినిమాలు ప్రేక్షకులకు విస్తృతంగా చేరువయ్యేలా ఓటీటీ వేదికల ఏర్పాటుకు ప్రభుత్వం సహకరించాలని కోరారు. ప్రాంతీయ చలనచిత్ర రంగానికి చేయూతనిచ్చేలా దీర్ఘకాలిక విధానాలను అభివృద్ధి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. బలమైన డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ లేకపోతే, అత్యుత్తమ చిత్రాలు కూడా రాష్ట్రాన్ని దాటి విస్తరించడానికి ఇబ్బందులు ఎదుర్కొంటాయన్నారు.
సృజన రంగానికి సంబంధించి ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాల్లో వ్యవస్థాగత పెట్టుబడుల తక్షణ ఆవశ్యకతపై రవిశర్మ మాట్లాడారు. ప్రాంతీయ చలనచిత్ర పరిశ్రమ ఎదుగుదలకు ఆర్థిక చేయూత, మార్కెటింగ్ మౌలిక సదుపాయాలు కీలకమైనవనీ.. అందమైన, విశేషమైన కథలు ఈశాన్య రాష్ట్రాల్లో లక్షలాదిగా ఉన్నాయని ఆయన అన్నారు.
భాషాపరమైన వైవిధ్యాన్ని పరిరక్షించడంలో సినిమా అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని నటి, దర్శకురాలు ఐమీ బారువా అన్నారు. “మన భాషలకు శతాబ్దాల మౌఖిక చరిత్ర ఉంది. వాటిని రక్షించి ప్రోత్సహించడానికి సినిమా ఒక శక్తిమంతమైన మాధ్యమం” అని ఆమె అన్నారు.
ఈ ప్రాంతంలో క్షేత్రస్థాయిలో సినీ నిర్మాణానికి సంబంధించి దర్శకులు హాబమ్ పబన్ కుమార్, డొమినిక్ సంగ్మా పలు సూచనలు చేశారు. చేయూతనిచ్చేలా క్రమబద్ధమైన వ్యవస్థలు లేకుండానే ఎంతోమంది కథకులు ఈ రంగంలో కృషి చేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు.
విధానపరమైన సంస్కరణలు, ప్రాంతీయ సహకారం, సాంప్రదాయక అవరోధాలను అధిగమించేలా ఓటీటీ వేదికల వ్యూహాత్మక వినియోగం కోసం బృంద చర్చలో పాల్గొన్న నిపుణులు పిలుపునిస్తూ ఈ సదస్సును ఆశాజనకంగా ముగించారు. ఈశాన్య ప్రాంత సినిమాను గుర్తించి, దాని అభ్యున్నతి దిశగా ఈ రంగంలోని భాగస్వాములు, ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు పెట్టుబడిదారులు, జాతీయ స్టూడియోలు కలిసి రావాలని వారు కోరారు.
***
Release ID:
(Release ID: 2126251)
| Visitor Counter:
12