ప్రధాన మంత్రి కార్యాలయం
మే 1,2 తేదీల్లో మహారాష్ట్ర, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రధాని పర్యటన
* ముంబయిలో జరిగే వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సదస్సు (వేవ్స్)ను ప్రారంభించనున్న ప్రధాని
* 25 దేశాల మంత్రులు పాల్గొంటున్న గ్లోబల్ మీడియా డైలాగ్‌కు భారత్ ఆతిథ్యం
* కేరళలోని వింజింజం ఇంటర్నేషనల్ డీప్‌వాటర్ మల్టీపర్పస్ సీపోర్ట్‌ను జాతికి అంకితం చేయనున్న పీఎం
* ఇది భారత్‌లో మొట్టమొదటి కంటెయినర్ ట్రాన్స్‌షిప్మెంట్ పోర్టు
* అమరావతిలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ఇప్పటికే పూర్తయిన వాటిని ప్రారంభించి జాతికి అంకితం చేయనున్న ప్రధాని: ఈ ప్రాజెక్టుల మొత్తం విలువ రూ.58,000 కోట్లు
* ఈ ప్రాంతంలో రవాణా సదుపాయాలను మెరుగుపరిచేలా వివిధ రోడ్డు, రైలు ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం
Posted On:
30 APR 2025 1:00PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు, ఎల్లుండి మహారాష్ట్ర, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. మే 1న ఉదయం 10.30 గం.లకు ముంబయిలో వరల్డ్ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సదస్సు (వేవ్స్)ను ప్రారంభిస్తారు.
అనంతరం అక్కడి నుంచి కేరళ బయలుదేరి వెళతారు. మే 2న ఉదయం 10.30 గంటలకు విజింజం ఇంటర్నేషనల్ డీప్‌వాటర్ మల్టీపర్పస్ సీ పోర్టును జాతికి అంకితం చేస్తారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు.
అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్‌కు బయలుదేరి వెళతారు. సాయంత్రం దాదాపు 3.30 గంటలకు అమరావతిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. పనులు పూర్తయిన వాటిని ప్రారంభించి, జాతికి అంకితం చేస్తారు. ఈ పనుల మొత్తం విలువ రూ.58,000 కోట్లు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.
మహారాష్ట్రలో పీఎం
మొట్టమొదటిసారిగా భారత్‌లో నిర్వహిస్తున్న వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సదస్సు అయిన వేవ్స్-2025ను ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్లో ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ‘‘కనెక్టింగ్ క్రియేటర్స్, కనెక్టింగ్ కంట్రీస్’’ అనే ట్యాగ్‌లైన్‌తో నాలుగు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ సదస్సు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆవిష్కర్తలు, అంకురసంస్థలు, పరిశ్రమలో దిగ్గజాలు, విధాన రూపకర్తలను ఒకే చోటుకి తీసుకొస్తుంది. తద్వారా భారత్‌ను మీడియా, వినోద, డిజిటల్ ఆవిష్కరణల రంగంలో అంతర్జాతీయ కేంద్రంగా నిలబెట్టడానికి సిద్ధంగా ఉంది.
సృజనాత్మకత, సాంకేతికత, ప్రతిభను ఉపయోగించుకొని ఉజ్వలమైన భవిష్యత్తును రూపొందించాలనే ప్రధాని ఆకాంక్షకు అనుగుణంగా ఫిలిం, ఓటీటీ, గేమింగ్, కామిక్స్, డిజిటల్ మీడియా, ఏఐ, ఏవీజీసీ-ఎక్స్‌ఆర్, బ్రాడ్‌కాస్టింగ్, నూతన సాంకేతికతలను వేవ్స్ ఏకీకృతం చేస్తుంది. తద్వారా భారత మీడియా, వినోద రంగ శక్తిని సమగ్రంగా ప్రదర్శిస్తుంది. 2029 నాటికి 50 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను సాధించి, అంతర్జాతీయ వినోద ఆర్థికరంగంలో భారత్ ప్రభావాన్ని విస్తరించడమే వేవ్స్ లక్ష్యంగా నిర్దేశించుకుంది.
వేవ్స్ 2025లో భాగంగా మొట్టమొదటి గ్లోబ్ మీడియా డైలాగ్ (జీఎండీ)కి భారత్ ఆతిథ్యమిస్తోంది. దీనిలో 25 దేశాలకు చెందిన మంత్రులు పాల్గొంటున్నారు. ఇది అంతర్జాతీయ మీడియా, వినోద రంగంతో ఉన్న భాగస్వామ్యంలో భారత్ సాధించిన విజయాన్ని సూచిస్తుంది. ఈ సదస్సులో 6,100 మందికి పైగా కొనుగోలుదారులు, 5,200 మంది వ్యాపారులు, 2,100 ప్రాజెక్టులతో గ్లోబల్ ఈ-మార్కెట్ ప్లేస్ వేవ్స్ బజార్‌ను సైతం ఏర్పాటు చేశారు. స్థానికంగా, అంతర్జాతీయంగా కొనుగోలుదారులు, అమ్మకందారులను అనుసంధానించి నెట్వర్క్, వ్యాపారాన్ని విస్తరించుకొనే అవకాశాలను కల్పించడమే దీని లక్ష్యం.
అలాగే క్రియేటోస్పియర్‌ను ప్రధానమంత్రి సందర్శిస్తారు. ఇక్కడ 32 మంది క్రియేటర్లతో సంభాషిస్తారు. ఏడాది కిందట ప్రారంభించిన క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ పోటీల్లో లక్ష మందికి పైగానే పాల్గొనగా, వీళ్లు విజేతలుగా నిలిచారు. అలాగే భారత్ పెవిలియన్‌ను కూడా ప్రధాని సందర్శిస్తారు.
వేవ్స్ 2025లో 90కి పైగా దేశాల నుంచి 10,000 మందికిపైగా ప్రతినిధులు, 1,000 మంది క్రియేటర్లు, 300కి పైగా సంస్థలు, 350కి పైగా అంకురసంస్థలు పాల్గొంటున్నాయి. ఈ సదస్సులో బ్రాడ్‌కాస్టింగ్, ఇన్ఫోటైన్మెంట్, ఏవీజీసీ-ఎక్స్‌ఆర్, సినిమాలు, డిజిటల్ మీడియాతో సహా వివిధ రంగాలకు సంబంధించి 42 ప్లీనరీ సెషన్లు, 39 బ్రేకవుట్ సెషన్లు, 32 మాస్టర్ క్లాసులు జరుగుతాయి.
కేరళలో పీఎం
రూ.8,900 కోట్ల విలువైన విజింజం ఇంటర్నేషనల్ డీప్ వాటర్ మల్టీపర్పస్ సీపోర్టును ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. ఇది దేశంలోనే మొట్టమొదటి కంటెయినర్ ట్రాన్స్‌షిప్మెంట్ పోర్టు. వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా దేశ సముద్ర వాణిజ్య రంగంలో వస్తున్న గుణాత్మక పురోగతులను ఈ పోర్టు సూచిస్తుంది.
వ్యూహాత్మక ప్రాధాన్యం ఉన్న విజింజం పోర్టును కీలకమైన ప్రాజెక్టుగా గుర్తించారు. ఇది అంతర్జాతీయ వాణిజ్యంలో భారత్ స్థానాన్ని బలోపేతం చేస్తూ, దేశ సరకు రవాణా సామర్థ్యాలను విస్తరిస్తుంది. అలాగే కార్గో ట్రాన్స్‌షిప్మెంట్ కోసం విదేశీ నౌకాశ్రయాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. దాదాపు 20 మీటర్ల లోతులో సహజంగా ఏర్పడిన అఖాతంతో పాటు ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే నౌకా వాణిజ్య మార్గాల్లో ఒకదానికి చేరువగా ఉండటంతో ఈ నౌకాశ్రయం అంతర్జాతీయ వాణిజ్యంలో భారత్ స్థానాన్ని బలోపేతం చేస్తుంది.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానమంత్రి:
అమరావతిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. ఇప్పటికే పూర్తయిన వాటిని ప్రారంభించడం, జాతికి అంకితం చేస్తారు. ఈ ప్రాజెక్టుల మొత్తం విలువ రూ. 58,000 కోట్లు.
దేశవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో మౌలిక వసతులు, రవాణా సదుపాయాలను మెరుగుపరచాలనే తన సంకల్పానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో 7 జాతీయ రహదారుల ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. వీటిలో వివిధ సెక్షన్లలో జాతీయ రహదారులను విస్తరణ, రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, సబ్‌వేల నిర్మాణం తదితరమైనవి ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు రహదారి భద్రతను పెంపొందిస్తాయి. ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయి. తిరుపతి, శ్రీకాళహస్తి, మాలకొండ, ఉదయగిరి కొండ తదితర ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలకు రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తుంది.
రవాణా సదుపాయాలు, సామర్థ్యాలను విస్తరిసంచే లక్ష్యంతో చేపట్టిన జాతీయ రైల్వే ప్రాజెక్టులను ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. బుగ్గానిపల్లి సిమెంట్ నగర్ నుంచి పాణ్యం స్టేషన్ వరకు చేపట్టిన డబ్లింగ్ రైల్వే పనులు రాయలసీమ, అమరామతి మధ్య రహదారి అనుసంధానాన్ని మెరుగుపరుస్తాయి. న్యూ వెస్ట్ బ్లాక్ హట్ క్యాబిన్, విజయవాడ స్టేషన్ల మధ్య మూడో రైల్వే లైనును ఏర్పాటు చేస్తాయి.
అలాగే ఆరు జాతీయ రహదారుల ప్రాజెక్టులు, ఒక రైల్వే ప్రాజెక్టుకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. వీటిలో జాతీయ రహదారుల్లోని వివిధ సెక్షన్లలో విస్తరణ పనులు, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం, హాఫ్ క్లోవర్ లీఫ్ రోడ్ ఓవర్ బ్రిడ్జి ఉన్నాయి. ఇవి రవాణా సౌకర్యాలను, అంతర్రాష్ట్ర ప్రయాణాన్ని సౌలభ్యాన్ని మెరుగుపరుస్తాయి. ట్రాఫిక్ రద్దీని తగ్గించి సరకు రవాణా సామర్థ్యాన్ని పెంపొందిస్తాయి. గుంతకల్లు వెస్ట్, మల్లప్ప గేట్ స్టేషన్ల మధ్య సరకు రవాణా చేసే రైళ్లను బైపాస్ చేసే లక్ష్యంతో రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జి నిర్మాణాన్ని ప్రారంభిస్తారు. ఇది గుంతకల్లు జంక్షన్ వద్ద రైళ్ల రద్దీని తగ్గిస్తుంది.
రూ.11,420 కోట్లతో నిర్మించనున్న శాసనసభ, హైకోర్టు, సచివాలయం, ఇతర పరిపాలనా భవనాలకు శంకుస్థాపన చేస్తారు. వీటిలో 5,200 కుటుంబాల కోసం నిర్మిస్తున్న గృహ సముదాయం కూడా భాగంగా ఉంది. అలాగే రూ.17,400 కోట్ల విలువైన పట్టణ మౌలిక సదుపాయాలు, వరద నియంత్రణ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. వీటిలో 320 కి.మీ.ల పొడవైన భూగర్భ సౌకర్యాలు, వరద నిర్వహణా వ్యవస్థలతో సహా అంతర్జాతీయ స్థాయి రవాణా ప్రాజెక్టులు ఉన్నాయి. రాజధాని అమరావతిలో సెంట్రల్ మీడియన్స్, సైకిల్ ట్రాకులు, ఏకీకృత వసతులతో కూడిన1,281 కి.మీ.ల పొడవైన రోడ్లు కూడా వీటిలో భాగంగా ఉన్నాయి. ఈ భూసమీకరణ పథకం మౌలిక వసతుల కల్పనా ప్రాజెక్టుల విలువ రూ.20,400 కోట్ల పైమాటే.
ఆంధ్రప్రదేశ్‌లోని నాగాయలంకలో రూ.1,460 కోట్లతో నిర్మిస్తున్న మిస్సైల్ టెస్ట్ రేంజ్‌కు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. దీనిలో ప్రయోగ కేంద్రం, సాంకేతిక పరికరాలు, దేశీయ రాడార్లు, టెలిమెట్రీ, ఎలక్ట్రో- ఆప్టికల్ వ్యవస్థలు ఉన్నాయి. ఇవి దేశీయ రక్షణ సన్నద్ధతను పెంపొందిస్తాయి.
విశాఖపట్నంలోని మధురవాడలో పీఎం ఏక్తా మాల్‌కు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. జాతీయ సమైక్యతను ప్రోత్సహించడం, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి మద్ధతు ఇవ్వడం, వన్ డిస్ట్రిక్ట్-వన్ ప్రొడక్ట్‌కు ప్రచారం కల్పించడం, ఉద్యోగావకాశాల కల్పన, గ్రామీణ కళాకారులకు చేయూత అందించడం, దేశీయ ఉత్పత్తులకు మార్కెట్ పెంచడమే దీని లక్ష్యం.
***
(Release ID: 2125583)
Visitor Counter : 6
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam