కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
వడగాడ్పుల నుంచి శ్రామికులు, కార్మికుల రక్షణ కోసం తక్షణ చర్యలు
• రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు, కేంద్రపాలిత ప్రాంత అధికారులకు కేంద్రం సూచన
Posted On:
22 APR 2025 5:02PM by PIB Hyderabad
వివిధ రంగాల్లో పనిచేస్తున్న శ్రామికులు, కార్మికులపై అతి వేడిమితో కూడిన గాలుల ప్రభావం పడకుండా ఆ ప్రభావాన్ని తగ్గించే దిశగా పటిష్ఠ చర్యలు తీసుకోవాల్సిందిగా అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ సూచనలు చేసింది.
ఈ విషయంలో యాజమాన్య సంస్థలు, నిర్మాణ రంగ కంపెనీలు, పరిశ్రమలు తగిన చర్యలను తీసుకొని తీరాలంటూ వాటికి ఆదేశాలు ఇవ్వాలని రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు, కేంద్రపాలిత ప్రాంత అధికారులకు రాసిన ఒక లేఖలో కార్మిక, ఉపాధి శాఖ కార్యదర్శి సూచించారు.
పని వేళల్లో మార్పుచేర్పులు చేయడం, పని ప్రదేశాల్లో తాగునీటి సదుపాయాలను సమృద్ధిగా కల్పించడం, గాలి వీచే, చల్లదనాన్ని అందించే పరికరాల్ని సమకూర్చడం, విశ్రాంతికంటూ కొన్ని స్థలాల్ని ప్రత్యేకించడం, తరచు ఆరోగ్య తనిఖీలు నిర్వహిస్తుండడం, భవననిర్మాణ రంగ శ్రామికుల వంటి వర్గాలకు అత్యవసర సందర్భాల్లో ఐస్ ప్యాకులను, వేడిగాడ్పుల బారిన పడి అస్వస్థతకు లోనైతే ఉపశమనకారకాలను అందజేయడం సహా వివిధ చొరవలు తీసుకొంటూ, సమన్వయంతో ముందుకు పోవాలని... ఇలా అనేక సలహాలను ఈ లేఖలో పొందుపరిచారు.
పనులను కొంత నెమ్మదిగా పూర్తి చేయాల్సిందిగాను, శ్రామికులకు అనువుగా ఉండేలా నిర్దిష్ట కాల సూచికలను నిర్ధారించాల్సిందిగాను, విపరీతమైన వేడిమి ఉండే వేళల్లో ఇద్దరు ఒక జట్టుగా పనిచేసేందుకు వెసులుబాటును ఇవ్వడం, భూగర్భ గనులలో గాలి ప్రసరణకు సరైన వ్యవస్థను కల్పించడం వంటి చొరవలు సైతం తీసుకోవాలంటూ గనులు, ఫ్యాక్టరీల యాజమాన్యాలకు ఈ లేఖలో కొన్ని మార్గదర్శకాల్ని పేర్కొన్నారు. కార్ఖానాలు, గనులకు తోడు భవన నిర్మాణ రంగంలో, ఇటుకల బట్టీల్లో పనులు చేసే వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలనీ, నిప్పులు చెరిగే మండుటెండల్లో కార్మికులు తమను తాము కాపాడుకొనే పద్ధతులను తెలుసుకొనేందుకు వీలుగా వారిని ఉద్దేశించి చైతన్య శిబిరాల్ని నిర్వహించడం, లేబర్ చౌకుల్లో పోస్టర్ల ద్వారా, బ్యానర్ల ద్వారా హెచ్చరికలు చేయడం వంటివాటిని పెద్ద ఎత్తున చేపట్టాల్సిన అవసరం ఎంతయినా ఉందని లేఖలో స్పష్టం చేశారు.
***
(Release ID: 2123631)
Visitor Counter : 7